ఆమెని ఉరడించడం చాలా కష్టమయింది తనకు. ఎంతో ప్రయత్నం మీద ఆమెకి నచ్చ చెప్పి సూట్ కేస్ సర్దుకుని వచ్చేసింది తను.
రావాలి కదా! తప్పదు! ఇతను తనకి తాళి గట్టిన భర్త.
కానీ అదంతా ఇతనితో ఎలా చెబుతుంది?
ఎయిర్ పోర్టుకి వెళ్ళగానే సౌమ్యకి ముందుగా కనబడింది ఉజ్వల.
ఉజ్వలని చూసి చూడగానే సౌమ్య మొహం వాడిపోయింది. సౌమ్యని అంటి ముట్టనట్టుగా పలకరించింది ఉజ్వల.
విమానం మెట్లు ఎక్కుతున్నప్పుడు, టేకాఫ్ తరువాత విమానం గాల్లోకి లేస్తున్నప్పుడు కూడా అనిపించింది సౌమ్యకి.
అమ్మ చెప్పినట్లు తను ఇతనితో రాకుండా వుంటే బాగుండేనా?
ఎంతో లోకం చూసింది అమ్మ. సాధరణంగా ఆమె అంచనాలు తప్పుకావు.
అయినా అంచనా వెయ్యదానికేం ఉంది ఇందులో! ముంజేతికి ఉన్న కంకణాన్ని చూసుకోవడానికి అద్దం కావాలా? ఓ రెండ్రోజులు పరిచయం వుంటే చాలు, ఈ శశికాంత్ మనస్తత్వం కనిపెట్టేయ్యవచ్చు. ఎవరైనా కూడా!
రెండే రోజులు! అంతే! చాలు!
మొదటిసారి చూసినప్పుడు అతను ఒక గ్రీకు గాడ్ అని భ్రమ కలుగుతుంది. ఎవరికైనా సరే! చాలా గొప్ప మనిషనుకుంటారు. సినిమా హీరో అనుకుంటారు ఆడపిల్లలు. అతని ఠీవి అతని సాహసం-
ఒకరోజంతా కంటిన్యూ అవుతుంది ఆ భ్రమ!
కానీ మర్నాటికి తొలిగిపోతుంది అది!
మర్నాటికి తెలిసిపోతుంది అతని నిజ స్వరూపం!
అతనికి ఉన్నది ఆత్మవిశ్వాసం కాదు- అహంభావం, అహంకారం అని! నేను! నేను! నేను! అది తప్ప మరోమాట తెలియదు అతనికి!
అతనిది సాహసం కాదు. అది మొండితనం , మూర్ఖత్వం అని కూడా తెలిసిపోతుంది.
అతనిలోని ఈ లక్షణాలన్నీ బయట పడిపోవడానికి ఇరవై నాలుగు గంటలు చాలు!
కానీ ఆ ఇరవై నాలుగు గంటల వ్యవధి కూడా దొరకలేదు తనకి. అన్ని సంఘటనలూ అతి వేగంతో జరిగిపోయాయి. జరిగినదంతా తలుచుకుంటే ఎబ్బెట్టుగా, అసహజంగా అనిపిస్తోంది ఇప్పుడు.
అపుడు మొదటిసారిగా అనిపించింది సౌమ్యకి అలా అనిపించగానే తన ఉహకి తనే ఉలిక్కిపడింది సౌమ్య.
అసలు తను పెళ్ళాడింది మామూలు మనిషేనా? లేక ఈ శశికాంత్ మానసిక రుగ్మత ఏదన్నా.........
ఏమో!
వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి గడిచిన రోజులు.
అతనితో తన పరిచయం....తన మెడలో అతను తాళి కట్టెయ్యడం- తండ్రి పోయిన దుఃఖంతో ఉన్న తనతో శోభనం గురించి చర్చించడం..........
శోభనం!
ఎవరైనా అడుగుతారా అలా? వద్దని నిరాకరించినప్పుడు ఎవరైనా కోపగించుకుంటారా? అలాంటి మనుషులు అసలు వుంటారా?
ఎందుకు వుండరు? ఉంటారు అలాంటి మనుషులు కూడా. కన్న కూతురితో కామం తీర్చుకునే కసాయి మనుషులూ ముదుసళ్ళ మీద అత్యాచారాలు చేసేవాళ్ళు , హింసలో థ్రిల్ అనుభావించేవాళ్ళు..........
అబ్ నార్మల్ గా, అన్ నాచురల్ గా ప్రవర్తించేవాళ్ళు ఎంతమందో ఉంటారు. పేపర్లలో చదువుతాం అలాంటి వాళ్ళ గురించి, ఎవరో చెప్పుకుంటుంటే వింటాం. రేర్ గా చూస్తే చూస్తాం కూడా అలాంటి వాళ్ళని.
కానీ...కానీ తను - అలాంటి వ్యక్తిని పెళ్ళాడిందా?
అస్పష్టమైన భయంతో ఆమె వెన్ను కలదరించింది. ఓరగా శశికాంత్ వైపు చూసింది.
ఏదో ఆలోచిస్తున్నాడు అతను!
ఏదో ఆలోచిస్తూ ఉంటాడు?
అతని గుండె స్టిరియో ఫోనిక్ ఎఫెక్ట్ తో "నేను నేను నేను నేను" అని శబ్దం చేస్తూ కొట్టుకుంటున్నట్లు భ్రాంతి కలిగింది సౌమ్యకి. అంతే. బహుశా మరో ఆలోచన రాకపోవచ్చు అతనికి!
ఏం చెయ్యాలి ఇప్పుడు?
అప్రయత్నంగానే ఆమె చెయ్యి గుండెమీదికి పోయింది.
ఆ చేతికి చల్లగా తగిలింది మంగళసూత్రం. అతను తన భర్త! తను ఏం చెయ్యడం ఇప్పుడింక?
ఆమె అలా ఆలోచనల్లో ఉండగానే బాంబే వచ్చేసింది. సౌమ్య అన్యమనస్కంగా ఒక పక్కగా నిలబడి వుంటే, శశికాంత్ లగేజ్ తిసుకోచ్చేశాడు. అతనికి యాక్టివ్ గా హెల్ప్ చేస్తుంది ఉజ్వల.
సన్ అండ్ శాండ్ హొటల్ కి వెళ్ళారు.
ఆ పరిసరాలన్నీ మసకమసగ్గా కనబడుతున్నాయి. సౌమ్యకి తను మామూలు పరిస్థితుల్లో భర్తతో కలిసి హనీమూన్ కి వచ్చి వుంటే కళ్ళు విప్పార్చుకుని ఇవన్ని చూస్తూ ఎంజాయ్ చేసి ఉండేది.