చాలా సింబాలిక్ గా ఉంది!" అంది శృతి నిట్టూరుస్తూ.
"గోడార్డ్ పిక్చరేమన్నా చూశావా? సింబాలిజమ్ అదీ అంటున్నావ్?" అన్నాడు శ్రీరాం తేలిగ్గా తీసేస్తో.
"వదిలెయ్ దాన్ని పాపం!"
"వదిలేస్తే పైకి ఎగిరి హడావిడి చేస్తుంది" అన్నాడు శ్రీరాం. అతనికి శృతి మాటల అంతరార్ధం ఇంకా అర్ధం కాలేదు.
"పాపం! అది రోజూ కొంచెం దూరం నడిచివెళ్ళి, తరవాత ఎగిరిపోయే రూటు ఇదేనేమో! మనమే దాని దారికి అడ్డంగా కూర్చుని ఇబ్బంది కలిగిస్తున్నామేమో!" అంది శృతి.
ఎలెక్ట్రిసిటీ ప్రవహిస్తున్న సన్నటి తీగెతో తనని పట్టినట్లు ఉలిక్కిపడి, తీక్షణంగా చూశాడు శ్రీరాం.
"కొన్ని విషయాల్లో జోక్ చేసినా, జోక్యం చేసుకున్నా నాకు నచ్చదు!" అన్నాడు తీవ్రంగా.
"సారీ!" అంది శృతి.
కొద్ది క్షణాల మౌనం తర్వాత మళ్ళీ శృతే మాట్లాడింది.
"ప్రతిమని ప్రాక్టీస్ చెయ్యొద్దన్నావుట ఎందుకు?"
సీరియస్ గా చూశాడు శ్రీరాం.
"నాకు ఇష్టంలేదు దట్సాల్!" అలా చెపుతున్నప్పుడు అతని గొంతులో అహం ధ్వనించింది.
"అదే! ఎందుకూ అని అడుగుతున్నాను?"
శ్రీరాం వెంటనే మాట మార్చేశాడు. "కొంచెం బెండకాయ కూర వేసుకో శృతీ!"
"వద్దు! ఆ కాలీఫ్లవర్ ఇలా అందించు."
"బెండకాయ ఎందుకు వద్దు? కాలీఫ్లవర్ ఎందుకు కావాలీ?"
"బెండకాయ నాకు ఇష్టం లేదు."
"దేర్ యూ ఆర్!" అన్నాడు శ్రీరాం విజయగర్వంతో. "నీకు బెండకాయ ఇష్టం లేదు. కాలీఫ్లవర్ ఇష్టం అవునా? అలాగే ప్రతి మనిషికీ ఇష్టాయిష్టాలు ఉంటాయి. ప్రతిమ ప్రాక్టీసు చెయ్యడం నాకు ఇష్టం లేదు!"
"పాయింటే!" అంది శృతి వ్యంగ్యంగా. "కానీ శ్రీరాం! జీవితాలని - అందులోనూ చదువుకున్న ఆడపిల్ల జీవితాన్ని, బెండకాయలతోనూ, దొండకయలతోనూ సమానంగా భావించడం కరెక్టే అని నువ్వనుకుంటే, వెల్! నేను చెప్పేదేమీ లేదు. నీ సంస్కారానికి నా జోహార్లు!" అంది. ఆమె గొంతులో కోపం ధ్వనిస్తూంది. జడ్జీగారమ్మాయి శృతి. అధికారానికి మొదటినుంచీ అలవాటు పడింది. అందుకే ఎవరన్నా జంకదు.
"వెధవది! ఈ ఇంట్లో ఆడవాళ్ళ మెజారిటీ ఎక్కువైపోయింది!" అన్నాడు శ్రీరాం విసుగ్గా.
"అవును! అయినా తమాషా చూశావా? మెజారిటీ మాదే అయినా అది సైలెంట్ మెజారిటీనే! ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళుంటే నేనొక్కదాన్నే నిర్భయంగా, స్పష్టంగా మాట్లాడుతున్నాను. అలాగే ఆడవాళ్ళందరూ ఎలా ఆడిస్తే అలా ఆడేవాళ్ళు కాకుండా ఖచ్చితంగా మాట్లాడగలిగితే...."
"ముందు భోజనాలు కానివ్వండర్రా!" అంది సరస్వతి కలగజేసుకుని, అందరినీ జాయింటుగా కోప్పడుతూ. వాదనలోకి దిగితే శ్రీరాం పేట్రేగిపోతాడే కానీ ఎప్పుడూ తగ్గడని ఆమెకి బాగా తెలుసు.
భోజనాలు పూర్తయ్యాయి.
భోజనాలు పూర్తి కాగానే శ్రీరాం శృతి కోపం పోగొట్టి ఆమెని మంచి మూడ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఆమె వెనకాతలే తిరగడం మొదలెట్టాడు. శృతి అంటే చెప్పలేనంత అభిమానం అతనికి.
తరవాత ఇద్దరూ సోఫాలో పక్క పక్కన కూర్చుని చిన్నగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ మాట్లాడుతున్నాడు శ్రీరాం. శృతి శాంతం తెచ్చిపెట్టుకుని అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూంది.
తెల్లవారాక-
"రాత్రి ఎంతసేపు మాట్లాడారేమిటి?" అంది ప్రతిమ, సిగరెట్ పీకెలతో నిండిపోయిన యాష్ ట్రేని చూస్తూ.
రోజూ కాల్చే దానికంటే నాలుగురెట్లు సిగరెట్లు కాల్చాడు నిన్న. గుండెని అవమానం కాల్చేస్తూ ఉంటే మరేం చేస్తాడు పాపం! అతను కాల్చిన సిగరెట్ల పొగకంటే, అతని మనసులో రేగుతున్న సెగే ఎక్కువగా ఉంది.
"ప్రతిమా! శ్రీరాంది పూర్తిగా కరెక్టు అని నేను అనను. 'మగాణ్ణి, నేనే సంపాదించి భార్యను పోషించాలి' అన్న అహం అతనిలో స్వతహాగానే ఉంది. దానికి తోడు మీవాళ్ళు అతని పంతాన్ని పెంచారు. మీ నాన్న ఉత్త తల తిక్క మనిషి, ఐ యామ్ సారీ టు సే!" అంది శృతి.
ప్రతిమ నొచ్చుకున్నట్లు చూసింది.
"శ్రీరాం చాలా హర్ట్ అయ్యాడు. ప్రతిమా! అతని స్వాభిమానం మూర్ఖత్వం లెవెల్లో ఉంటుంది. దాన్ని చావు దెబ్బ తీశారు మీవాళ్ళు! అతను కోలుకునే దాకా నువ్వు అడ్జస్టు అయిపో!" అంది శృతి.
* * * * *
ఒక సంవత్సరం గడిచేసరికి ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయింది ప్రతిమ. చదువుకునే రోజుల్లో వూహించుకునేది తను - చదువై పోగానే ఏ హాస్పిటల్లోనో ఉద్యోగం దొరుకుతుంది తనకు. క్రమంగా పెద్ద పెద్ద పొజిషన్లకు పోతుంది. బహుశా వరల్డు హెల్త్ ఆర్గనైజేషన్ లెవెల్ దాకా వెళుతుందేమో కూడా! వైద్య సదుపాయాలు సరిగాలేని ఆఫ్రికన్, ఏషియన్ దేశాల కోసం ప్రణాళికలు తయారు చేస్తుంది. చౌకగా వైద్యం, మందులూ లభించే పద్దతులను గురించి ఆలోచిస్తుంది.
లేదా - ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి, అది ఉధృతంగా పెరిగిపోతే, పెద్ద నర్సింగ్ హోం కట్టించి, డాక్టర్ బి.సి.రాయ్ లాగా, డాక్టర్ శివారెడ్డి లాగా తాను కూడా గొప్ప డాక్టరైపోతుంది. ఏది ఏమైనా రోజులో ఇరవై గంటలు మనుషుల ఆరోగ్యాల్ని బాగు చెయ్యడానికే ఖర్చు పెడుతుంది తను. మెడిసిన్ కి అంకితమైపోతుంది తన జీవితం!
తనకి సంబంధించినంతవరకూ అవన్నీ పిచ్చి వూహలనీ, పగటి కలలనీ గుర్తించి రాజీ పడిపోయింది ప్రతిమ.
వూపిరి తీసుకోవడానికి కూడా వీలు ఉండనంత బిజీ జీవితాన్ని వూహించుకుంది తను!
కానీ దానికి పూర్తి విరుద్దంగా ఉంది ఇప్పుడు జరుగుతున్నది.
బోలెడంత తీరిక! పుష్కలంగా డబ్బు! నౌకర్లు! అటు గిన్నె తీసి ఇటు పెట్టనివ్వని అత్తగారి ఆప్యాయత! వీటన్నిటికీ తోడు ఉద్యోగం చెయ్యకూడదనే ఆంక్ష! అందుకని కాలక్షేపం కోసం మళ్ళీ లిటరేచర్ వైపు మళ్ళింది ప్రతిమ మనసు.
కారు డ్రైవింగ్ నేర్పించాడు శ్రీరాం. కారులో తనే వెళ్ళి కావలసిన పుస్తకాలన్నీ కొనుక్కునేది. మేడ మీది గది అంతా పుస్తకాలతో నిండిపోయింది.