Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 35


    
    "ఎందుకని రెండేళ్ళ తర్వాత?" అన్నాడు నూటపదకొండు.
    
    "అప్పటికి మా చదువైపోతుంది."
    
    "అయితే అప్పటిదాకా మిమ్మల్ని కూలర్ లో పెడతా!" అన్నాడు పోలీసు ఆనందంగా.
    
    "కూలరంటే?"
    
    "కూలరంటే? జైలు."
    
    "మీకిది ధర్మం కాదు" అన్నాడతను.
    
    "డూటీ డూటీనే" అన్నాడు కానిస్టేబుల్.
    
    "ఇవి చేతులు కావు. కాళ్ళనుకోండి" అన్నాడతను.
    
    "నేనేం ఎర్రెదవనా, చేతుల్ని కాళ్ళనుకోవడానికి" అన్నాడు నూటపదకొండు కోపంగా.
    
    "పోనీ కాళ్ళే పట్టేసుకుంటున్నా" అన్నాడతను.
    
    "నాకాళ్ళు నువ్వు పట్టడమెందుకూ? రోజూ మాలిష్ చేయించుకుని ఒళ్ళు పట్టించుకుంటా - ఫ్రీగా" అన్నాడు కానిస్టేబుల్ నూటపదకొండు.
    
    "ఫ్రీగా" అని పోలీస్ కానిస్టేబుల్ అనగానే హఠాత్తుగా తరుణోపాయం తట్టిందతనికి. తారకమంత్రం గుర్తొచ్చినట్లయ్యింది.
    
    పర్సు తీశాడతను. నిండు గర్భిణిలా భారంగా నోట్లతో నిండి వుందా పర్సు.
    
    ఆ పర్సుని చూడగానే చింతాకుల్లా చిన్నవిగా వున్న పోలీసుగారి కళ్ళు చిత్రంగా మెరిశాయి.
    
    "రూటు తెలుసుకున్నావ్!" అన్నాడు మెచ్చుకోలుగా.
    
    "అవును" అని ఓ వంద రూపాయిలు తీసిచ్చాడతను.    
    
    మళ్ళీ పోలీసు మొహం మాడిపోయినట్లయ్యింది. వంద నోటుని అతని మొహంమీద గిరాటేసి.
    
    "రాంగ్ రూట్లో కెళుతున్నావ్?" అన్నాడు కఠినంగా.
    
    "ఏంచేయాలో మీరే చెప్పండి" అన్నాడతను డీలాపడిపోయి.
    
    "ఆపర్సు మొత్తం ఇచ్చెయ్యి. జేబులో చిల్లరేమన్నా ఉంటే అది కూడా....." అన్నాడు నూటపదకొండు.
    
    కెవ్వుమని కేక పెట్టాడతను "అది ఆర్నెల్ల సంపాదన" అన్నాడు దిగులుగా.
    
    "కావచ్చు..... అది నా ఒక్కరోజు సంపాదన" అన్నాడు పోలీసు గడుగ్గాయిలా.
    
    "నేనివ్వను"
    
    "నేను అరెస్ట్ చేస్తా"
    
    "నేను నిజమేమిటో మీ బాస్ కి చెబుతా" అన్నాడతను స్వాతంత్ర్యయోధుడిలా.
    
    "మాబాస్ వీరభద్రం నేనెంత చెబితే అంత" అన్నాడు పోలీసు కానిస్టేబుల్ గర్వంగా.
    
    ఆ పేరు వినగానే గుండె ఆగిపోయినట్లయ్యింది సితారకి. "వీరభద్రమా?" అంది.
    
    "అవును" అన్నాడు పోలీసుగారు.
    
    జెయ్ చంద్రవైపు తిరిగింది సితార......"పోలీసుగారు అడిగిందేదో వారి మొహాన కొట్టేయి" అంది హడావిడిగా.
    
    "వారు అడుగుతున్నది దారుణమైన రేటు!" అన్నాడతను.
    
    "పోనీ! వారి పాపాన వారే పోతారు" అందామె.
    
    "వారిని దేవుడు కూడా క్షమించడు"
    
    "వారు వచ్చే జన్మలో నల్లిగానో, పిల్లిగానో పుడతారు" అంది సితార.
    
    "వారు నేరుగా రౌరవాది నరకాలకు పోతారు" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "ఆగండి" అని గట్టిగా అరిచాడు పోలీసు. "అడ్డమైన శాపనార్దాలూ పెడుతూ యింకా వారూ వీరని మర్యాదెందుకూ?" అన్నాడు.
    
    "అవును! ఎందుకూ?" అని "వీడు రౌరవాది నరకాలకు పోక తప్పదు" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "తధాస్తు" అంది సితార.
    
    పోలీసుపళ్ళు పటపటకొరికాడు.
    
    "నన్ను యిన్ని మాటలన్నందుకు మిమ్మల్నేం చేసినా పాపం లేదు" అన్నాడు.
    
    "పర్సు ఇచ్చేస్తున్నాగా!" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "పర్సులాక్కుని మరీ జైల్లో పెట్టిస్తా"
    
    అతను ఎంతకైనా సమర్ధుడని అర్ధం కాగానే హఠాత్తుగా పోలీసు గారి కాళ్ళుపట్టుకుని అన్నాడు జెయ్ చంద్ర.
    
    "వసుదేవుడంతటి వాడికి తప్పలేదు" అన్నాడు అలవాటు చొప్పున.    

    "ఏమిటి?"
    
    "గాడిదకాళ్ళు పట్టుకోవడం"
    
    "మీఇద్దరికీ ఆజన్మాంతర కారాగారవాస శిక్ష విధించేట్లు చేస్తా" అన్నాడు పోలీసు ఉగ్రనరసింహంలా.
    
    "మరి మా పెళ్ళి?"
    
    "పెళ్ళీ పెటాకులూ, శోభనం, పురుళ్ళూ, పుణ్యాలూ అన్నీ జైల్లోనే"
    
    "అందుకు లా ఒప్పుకోదు" అనబోయాడు జెయ్ చంద్ర.
    
    అతని చేతిని గట్టిగా గిల్లింది సితార. "అతనడిగిందేదో అతనికిచ్చెయ్. వీళ్ళ బాసు వీరభద్రం అంటే సొయానా మా బావ"
    
    "అయితే?"
    
    "అయితే ఏమిటి? మా బావ పోలీస్ ఇన్స్ పెక్టరు. ఇతగాడు మనల్ని బ్రోతల్ కేసు కింద బుక్ చేసి బావ దగ్గరికి తీసుకెళ్తే బావ వూరుకుంటాడా?"
    
    "అవును! నిజమే" అన్నాడు జెయ్ చంద్ర.
    
    ఆ తర్వాత అతను పోలీసు కానిస్టేబుల్ వైపు తిరిగి "ఇంద! ఈ పర్సు తీసుకోండి. ఈ జేబులో అర్ధరూపాయి, ఈ జేబులో రూపాయిన్నరావున్నాయి. అవి కూడా తీసుకుని అఘోరించండి. ఇంకా కావాలంటే ఈ జేబులే తీసుకోండి మమ్మల్ని వదిలెయ్యండి" అన్నాడు.
    
    "ఖాళీజేబులు నాకు సయించవు. వెళ్ళిరండి పెళ్ళికి పిలుస్తారుగా!" అన్నాడు పోలీసు హుషారుగా.
    
    "అలాగే! మీ శ్రాద్దానికి మమ్మల్ని మర్చిపోకండి" అన్నాడు జెయ్ చంద్ర కొంత దూరం దాటాక.

 Previous Page Next Page