"మీకు చాలా ఆలస్యం అయిపోయింది. మీకు చాలా శ్రమ అయింది నానించి ఇంక ఫవరాలేదు నాకు. మీరు వెళ్ళండి. రెండు దాటిపోయింది, పోనీ ఇక్కడ పడుకుంటారా? మంచం వేయిస్తాను. ఇంత రాత్రి ఏం వెడతారు?" అనడిగింది అరుణ.
"అబ్బే అక్కరలేదు ఇంటికివెళ్ళిపోతాను. ఉదయంవస్తాను. ఈ విషయం గురించి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం మరి నే వెడతాను మీ రింక ఈ సంగతి ఏమీ ఆలోచించకండి నిద్రమాత్రం వేసుకుని నిద్రపొండి."
"థాంక్స్:'థాంక్స్' అన్నమాట చాలా చిన్నదిమీరు నాకు చేసిన మహోపకారానికి కృతజ్ఞత చెప్పేమాట లేదు. "చేతులు జోడించి నమస్కారం చేస్తూ అంది అరుణ. "దయచేసి రేపు వస్తారు గదూ?"
రమేష్ వెళ్ళబోతుంటే మణి వెంట సుబ్బారావు హడావిడిగా వచ్చాడు. "ఏం జరిగిందండీ?" అంటూ మణి ఎప్పుడెళ్ళి పిలుచుకు వచ్చాడో అరుణ చూడనేలేదు.
"అరే ఈ అర్దరాత్రి మిమ్మల్నిలేపు కొచ్చాడా మణి?" నొచ్చుకుంటూ అంది అరుణ.
"నాకేమిటో గాభరా వేసిందండి. మీ రిప్పుడూ ఇలా లేరు. ఉన్నపాటున మీకేం జబ్బు చేసిందో నా కర్ధం కాలేదు. జీపుల్లో వెళ్ళి సైకిలు మీద ఈయనవెంట ఎందుకొచ్చారో ఏమిటో అంతా గాభరా అనిపించి వెళ్ళి పిలిచాను." మణి వివరించాడు.
"ఫరవాలేదులెండి, ఓ పూట నిద్రలేకపోతే అసలింతకీ ఏం జరిగింది?" సుబ్బారావు ఆదుర్దాగా అడుగుతూ, రమేష్ ఎవరన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు.
రమేష్ వెళ్ళబోతున్నవాడల్లా ఆగి, మళ్ళీ వచ్చి కూర్చుని అరుణ తరపున జరిగినదంతా వివరించాడు. సుబ్బారావు మొహంలో కలవరపాటు కనిపించింది.
"నేననుకుంటూనే ఉన్నాను. ఏదో జరుగుతుందని, ఆ ప్రెసిడెంట్ అంతతేలిగ్గా వదలడని నేను చెప్పలేదా మీకు? తప్పకుండా ఇది వాడిపనే." విన్న వెంటనే అన్నాడు సుబ్బారావు.
ప్రెసిడెంట్ పేరు వినగానే అరుణ దిగ్గునా తల ఎత్తింది. అంత వరకు ఆ ఆలోచనే రాలేదు అరుణకి. జరిగింది ఇప్పటికి అర్ధమయింది.
"ఇది అతని పనే అంటారా?" సందేహిస్తూ నెమ్మదిగా అడిగింది.
"ఇంకా మీకు సందేహమా? ఇంత ధైర్యం చెయ్యడానికి ఇంకెవరికి ఈ ఊళ్ళో దమ్ములున్నాయి? అయినా, మీరు ఎవరికే అవకాశం చేశారని కక్ష కడతారు?"
"అవును నామీద కసి తీర్చుకోవడానికి ఈ మార్గం అవలంబించాడన్న మాట మరి..... మరి..... ఆ జీపు అవి ఎవరివి? ఆ ముగ్గురు ఎవరై ఉంటారు?"
"జీపు కేముంది ఏ.బి.డి.ఒ.దో లేక పక్క ఊరిలో ఓ కాంట్రాక్టరున్నాడు. అతడి కో జీపుందివాడు వీడు కావలసినవాళ్ళే వాడితో ఏదోపనుందని, ఓసారి జీపు కావాలని ఉంటాడు. జీపు అది ఉంటే నిజంగానే ఆఫీసరని మీరు నమ్మి వస్తారని పకడ్బందీగా అంతా ఏర్పాటు చేశాడు. డబ్బిచ్చి ఎవరోరౌడీలని కుదిర్చి ఉంటాడు. ఎక్కడా తన పేరు పైకి రాకుండా, వెనకనుండి అంతా జరిపించాడు.
"బాప్ రే: నిజంగా ఇంత కక్ష కడతాడనినేననుకోలేదు. నిజంగా ఎంత ప్రమాదం గడిచింది: ఈయనగనక రాకుండా ఉంటే నేను ఏమయ్యేదానినో" అరుణ గుండెల మీద చెయ్యి వేసుకుంది.
"మీకు...... మీకు కాదు, ఏ స్త్రీకయినా ఇంతకంటే శిక్ష మరొకటి ఉండదు. అందుకే మిమ్మల్ని ఈ శిక్షకి గురిచేసి ఆనందించుదామనుకున్నాడు. కాని, వాడి పాపపుటాలోచన విధి శక్తి ముందు తేలిపోయింది."
రమేష్ కి ప్రెసిడెంట్ గొడవ అది అర్ధం కాక ఆశ్చర్యంగా వింటున్నాడు, ఇద్దరూ మాట్లాడుకుంటూంటే, అది చూసి అరుణ క్లుప్తంగా అంతకు ముందు ప్రెసిడెంట్ కి తన మీద కోపం రావడానికి కారణం అది వివరించింది.
"నిజంగా పంచాయతి ప్రెసిడెంట్లు ఈ గ్రామాలని ఏక ఛత్రాదిపత్యంగా ఏలుతున్నారు. వాళ్ళనిమనం వదలకూడదు. పోలీసులకు రిపోర్టు ఇద్దాం." ఆవేశంగా అన్నాడు రమేష్.
"అవును ఊరుకోను నేను వాడిపని ఎలా పట్టడమో నాకు తెలుసు" క్రోధంగా అంది అరుణ.
సుబ్బారావు లాభం లేదని తల అడ్డంగా తిప్పేశాడు. "ఏమని రిపోర్టు ఇస్తారు పోలీసులకి? ఇదంతా ప్రెసిడెంట్ చేయించినట్టు చెప్పడానికి మీకేం ఆధారముంది? కనీసం జీపు నంబరయినా తెలియదు. ఆ ముగ్గురిని గుర్తయినా పట్టలేరు మీరు. ఏ ఆధారం ఉంది మీకు...... రెడ్డిదోషిని చెప్పడానికి?" అరుణ, రమేష్ మొహాలు చూసుకున్నారు. ప్చ్! లాభంలేదు!" అన్నాడు నిరాశగా రమేష్.
"మనంవాడిని ఏం చెయ్యలేంసరే ఈ గండం ఎలాగో భగవంతుడి దయవల్ల గడిచింది. డాక్టరు గారూ మీరెప్పుడూ రాత్రి బైటికివెళ్ళద్దు, సీరియస్ కేసన్నా ఎంతో బాగా తెలిసినవాళ్ళయితే తప్ప ఇల్లు కదలద్దు. అదయినా వెంట ఎవరినో తీసుకెళ్ళండి. రాత్రిళ్ళు ఎవరు పిలిచినా వచ్చింది ఎవరో చూడకుండా తలుపులుతీయకండి. ఏమో వాడి ప్రయత్నం విఫలమైందని, వాడి పగ చల్లారక ఇంకే విధంగానైనా కసి తీర్చుకోవడానికి చూడచ్చు. మీ జాగ్రత్తలో మీరుండడం మంచిది." సుబ్బారావు అరుణకి బోధించాడు.
అరుణ తల ఊపింది "మళ్ళీనా? మళ్ళీ ఇలాంటిపొరపాటు చేస్తానా?" జీవం లేని నవ్వు నవ్వుతూ అంది.
సుబ్బారావు రమేష్ లేచి నిలుచున్నారు వెళ్ళడానికి, "అన్నట్లు మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదే, ఈ ఊరేనా మీది?" సుబ్బారావు అడిగాడు.
"ఆచౌదరి గారు మా నాన్నగారు నేను ఏదో వచ్చినాలుగు రోజులుండి పోవడం మినహా ఎప్పుడూ చదువుకునేరోజులనించి ఇక్కడలేను" అన్నాడు.
"అదే ఈ ఊరయితే నాకు తెలియనివాళ్ళు ఎవరున్నారు? నిజంగా మీరిలా రావడం ఆమెని రక్షించడానికే ఆ దేవుడు పంపినట్లున్నాడు." సుబ్బారావు కూడా కృతజ్ఞత పూర్వకంగా అన్నాడు.
"నిజంగా దేవుడే నన్ను పంపి ఆమెని రక్షించితే, అలాగే ఆ దేవుడేఉంటే ఆ రెడ్డిగారికి శిక్ష విధించాలి ఏమంటారు?" నవ్వాడు రమేష్.
ఇంకా రమేషు మాటలు నోట్లో వుండగానే ఇద్దరు ముగ్గురు మనుషులు లాంతర్లు పుచ్చుకుని మెట్లెక్కి వచ్చారు. "అమ్మగోరూ డాక్టరమ్మగారూ: బేగి రావాలి మా బాబుకి ఒకటే వాంతులు విరోచనాలు. దబ్బున మిమ్మల్ని తీసుకురమ్మని అమ్మగారు పంపారు" అన్నాడు హడావిడిగా.
"ఎవరు మీరు? ఏ అయ్యగారికి విరోచనాలు" అరుణ అడిగింది.
"ప్రెసిడెంటుగోరికండి." అయ్యగారంటే ప్రెసిడెంట్ గారన్న విషయం తెలియదా అన్నట్టు గట్టిగాదబాయింపుగా అన్నాడొకడు. అర్దరాత్రి కాడనించి విరోచనాలు, వాంతులు అవుతున్నాయండి. తమరు దబ్బునరావాలి.
అరుణ, రమేష్, సుబ్బారావు...... ముగ్గురు మొహాలుచూసుకున్నారు. రమేష్ మొహాన చిన్న చిరునవ్వు తొంగిచూసింది. "దేవుడున్నారు. ఒప్పుకుంటున్నాను" అన్నాడు అర్ధవంతంగా నవ్వుతూ.
"డాక్టరమ్మ గారికి ఒంట్లో బాగులేదు. ఆవిడ ఇప్పుడు రారు." రమేషు ఆలోచిస్తూ నిలుచున్న అరుణ తరపున తనే జవాబిచ్చాడు. "చావనీయండి. వాడికి శాస్తి జరగాలి మీ రెంతమాత్రం వెళ్ళకండి." ఇంగ్లీషులో అరుణతో అన్నాడు.
"అవును వెళ్ళకండి మీరు వాడి తెగులు అణుగుతుంది. వెధవని ఎవరొచ్చి రక్షిస్తారో చూద్దాం వాడిపాపం వాడినే కొట్టింది. చస్తాడు... చావనీయండి." సుబ్బారావు కసిగా ద్వేషంగా అన్నాడు.
"మీరు వెళ్ళండి ఆవిడరారు. రారని చెప్పండి." రమేషు ఆ మనుష్యులతో అన్నాడు మళ్ళీ వాళ్ళు ముగ్గురూ ప్రెసిడెంట్ అంతవారు రమ్మంటే రారని చెపుతున్నారేమిటి అని వింతగా చూశారు.
అరుణ ఆలోచన తెగినట్టు తల ఎత్తి రమేష్, సుబ్బారావు వంక చూసింది.
"కాదు వెడతాను వాడికి...... మనిషి అయి మానవత్వం అన్న మాటకి అర్ధం తెలియని ఆ పశువుకి మానవత్వం అంటే ఏమిటో తెలియచేస్తాను. నా శత్రువుపట్లకూడా నా వృత్తి ధర్మం మరువలేను." స్థిరంగా అంది అరుణ.
"ప్లీజ్ వద్దు మీరింకా సరిగా లేదు అయినా మీ వెర్రిగాక పోతే ఇలాంటి మనుష్యులలో పరివర్తన మీరనుకున్నంత తొందరగా రాదు." రమేషువారించాడు.