"ఎక్స్యూజ్ మీ నేవెడతాను. వెళ్ళాలిరోగి ఎవరయినా రోగం నయం చేయడం నా ధర్మం, వ్యక్తిగత కక్షలు ఎలా ఉన్నా, నా దగ్గరికి రోగిగా వచ్చిన వారిని కాదనలేను నేను అలా అయితే ఇక్కడికి రావడం అనవసరం నేను. "నెమ్మదిగా అంది అరుణ, బాగ్ చేత్తో పట్టుకుంటూ.
"పదండి, మీ వెనకాల మేమూ వస్తాము, మళ్ళీ ఇందులో ఏం తిరకాసు ఉందో? నమ్మలేం ఆ మనిషిని" ముందు లాంతరు చూపిస్తూ వెడుతున్నవాళ్ళకి వినిపించకుండా నెమ్మదిగా అన్నాడు సుబ్బారావు.
"అవును ఊరి పెద్దగారికి జబ్బు చేస్తే చూసినట్టూ ఉంటుంది మీకు సాయంగా ఉన్నట్టూ ఉంటుంది. ఇంతకీ ఆ మహాత్ముని ఒకసారి కళ్ళారా దర్శిస్తే గాని ఇంటికెళ్ళినా నాకు నిద్రపట్టదు" చమత్కారంగా అన్నాడు రమేష్.
అరుణ వెళ్ళేసరికి రెడ్డిగారి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. అరుణని చూస్తూనే ఏడుస్తూ, ఆయన భార్యగోలపెడుతూ జరిగిందంతా చెప్పుకొచ్చింది.
రెడ్డిగారికి వాంతులు విరోచనాలు అర్ధరాత్రే ప్రారంభించినట్లుంది. మామూలుగా లేచి పెరట్లోకి వెళ్ళాడనుకుంది రెడ్డిభార్య నిద్దర్లో పెరట్లోకి వెళ్ళిన ప్రెసిడెంట్ మళ్ళీ లోపలికి రాకుండానే వెంట వెంటనే నాలుగయిదువాంతులు, విరోచనాలు అయి ఉంటాయి. పాయిఖానా దాకా ఆ గుర్తులన్నీ ఉన్నాయి. వరండాదాకావచ్చి కాళ్ళుచేతులు తేలిపోతూంటే అక్కడ పడిపోయి ఉంటాడు. నోట మాట రాలేదో, ఒకవేళ పిలిచినా నిద్దర్లో ఉన్న ఎవరికీ వినిపించలేదో తెలియదు. ఆ వరండాలో పంచెలోనే మళ్ళీ విరోచనాలయ్యాయి.
వాంతులమధ్య పడి ఉన్నారు రెడ్డిగారు. తరవాత ఎప్పుడో నిద్దుర లేచిన ఆయన భార్య పక్కమీద భర్త లేకపోవడం చూసి పెరట్లోకి వెళ్ళిన ఆయన ఇంతసేపు ఏం చేస్తున్నారని గబగబ వచ్చి చూసేసరికి రెడ్డిగారు ఆ వరండాలో చలనరహితంగా పడి ఉన్నారు. ఆవిడ గోలపెట్టి అందర్ని లేపి, రెడ్డిగారిని లోపలికి తీసుకొచ్చి డాక్టరుకోసం పంపింది.
తనుఏదన్నా చేసే స్థితిదాటిపోయిందని అరుణకి తెలిసాక ఇంజక్షనిచ్చి సెలెన్ ఎక్కించడానికి ప్రయత్నిస్తే ఎక్కలేదు. నాడి అందలేదు. కళ్ళు తెరుచుకుని చూస్తున్న ఆయనలో చలనం లేదు. ఇంకో అయిదు నిమిషాలకి ప్రాణంపోతుందనగా అతను కాస్త కదిలాడు మరో ఇంజక్షన్ ఇచ్చింది అరుణ. కాస్త కళ్ళు ఇటూ, అటూ తిప్పాడు. అతని కళ్ళు అరుణ మీద నిలిచిపోయాయి. ఆ క్షణంలో అతని మొహంలో కనిపించిన భావం ఎవరు వర్ణించలేరు.
పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్న వ్యక్తి చూపది. ఏ చెయ్యి అయితే తను నరకబోయాడో ఆ చెయ్యే తనకి ప్రాణభిక్ష పెట్టడానికి ప్రయత్నించడం చూసిన వ్యక్తిచూపు అది. అరుణకి ఆ చూపు అర్ధం అయింది.
'మనపాప పుణ్యాలకి ఎప్పుడో, ఎక్కడో శిక్ష పడదు, మనంమనంత తెలివైనవారు లేరని విర్రవీగుతాము, మనం చేసే పాపపు పనులు ఎవరి కంట పడలేదని సంతోషపడతాము. కాని, మనకంటే తెలివైనవాడు, మన ప్రతి చర్య అనుక్షణం చూసి గుర్తుంచుకునేవాడు ఒకనాడున్నాడని మనం మరువకూడదు. ఆ దృష్టినించి తప్పించుకుని, శిక్ష పడకుండా తప్పించుకోవడం మనతరం కాదని మన మందరం గుర్తుంచుకోవాలి. ఆ సంగతి మరిచిపోతే, ఆ సంగతి ఏదో విధంగా గుర్తుచేయక మానదు.' తండ్రి తరుచుగా అనే ఆ మాటలు గుర్తుకువచ్చాయి అరుణకి. అరుణవంక చూస్తూండగానే రెడ్డిగారికి కళ్ళు మూసుకుపోయాయి ఏ పోలీసులు శిక్షించకుండానే రెడ్డి శిక్ష పొందాడు. ఏ న్యాయస్థానమూ తీర్పు చెప్పనక్కరలేకుండానే భగవంతుడే తీర్పు చెప్పాడు.
ఏనుగులాంటిరెడ్డిని కొన్ని గంటల్లో పీనుగచేసి వదిలింది విధి. అతడు పోయిన కబురు తెలిసి వెంకు, వీరడు పదో రోజుకి వచ్చారు ప్రెసిడెంట్ భార్య మగదక్షత లేదని కూతురితో రాజీపడి వాళ్ళిద్దరిని ఇంట్లోనే ఉండిపొమ్మంది.
* * *
వర్షాలు కాస్త తగ్గు మొహం పట్టాయి. ఈ ఉపద్రవాలకి అతి వృష్టికి, ఈ ఇబ్బందులకి తోడు వరదలొస్తాయేమోనని భయపడే ప్రజలందరూ కాస్త నిశ్చింతగా నిట్టూర్చారు నిండుగా నిండి ఊరిమీద పడడానికి సిద్దంగా ఉన్న కాలువల ఉధృతం తగ్గుమొహం పట్టింది. అరుణ చెప్పిన ఆరోగ్యసూత్రాలు పాటించి, అనుమానం వచ్చిన వెంటనే డాక్టరు దగ్గిరకి రావడంతో కలరా చావులుతగ్గాయి.
ఊరిప్రెసిడెంట్ గారు చనిపోతే గాని హెల్త్ డిపార్టు మెంటువారికి చురుకు పుట్టలేదు. అప్పుడొచ్చి ఊళ్ళో అందరికి కలరా ఇంజక్షన్లు పొడిచివెళ్ళారు. అదయినా అరుణ నాలుగుసార్లు ఘాటుగా పై అధికారులకి ఉత్తరాలు రాస్తేగాని జరగలేదు. గూడెంలో పరిశుభ్రత విషయంలో తను ఆశించిన మార్పు వచ్చినందుకు నిజంగా సంతోషించింది అరుణ.
పది, పదిహేను రోజులు గడిచిపోయాయి. అరుణ ఏ విషయమూ ఇంటికి రాయలేదు రాస్తే అనవసరంగా వాళ్ళని భయపెట్టడం భయపడి తండ్రితనని వచ్చేయమనడం తప్ప మరో ప్రయోజనం ఉండదని అరుణ ఆ విషయం మరిచిపోవడమే మంచిదని ఊరుకుంది.
* * *
మరునాడు కనిపిస్తానని ఇప్పుడా రావడం? ఈ పదిహేను రోజులనించి రోజూ మీరు వస్తారని ఎదురు చూశాను" పదిగంటల వేళవచ్చిన రమేషుని సాదరంగా ఆహ్వానించింది అరుణ.
"సారీ! వద్దామనుకున్నాగాని, మర్నాడే ఊరికి వెళ్ళి ఈ వేళే వచ్చాను."
"ఆహా! ఇంకా సుబ్బారావు గారితో మీ గురించి అడుగుదామని అనుకుంటున్నాను. ఆ రోజు ఆ హడావిడిలో మీ గురించి ఏమీ తెలుసుకోలేదు. సెలవులమీద ఉన్నారా ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? కుతూహలంగా అడిగింది.
"ఇన్నాళ్ళూ చేశాను. మొన్ననే రిజైన్ ఇచ్చి వచ్చేశాను." నవ్వుతూ అన్నాడు రమేష్ అదే? ఆశ్చర్యంగా అడిగింది అరుణ. "బి.ఎస్ సి అగ్రికల్చర్ పాసయ్ ఏ మూడు నాలుగువందల ఉద్యోగమో చేస్తూ బానిస బ్రతుకు బ్రతికేకంటే స్వంత వ్యవసాయంచేసుకుందామని బుద్దిపుట్టింది.
"జై కిసాన్ లన్న మాట: బాగుంది ఇదంతా 'ఏ పద్మశ్రీ' కొట్టేయడానికో ప్రయత్నం కాదుకదా?"
ఛలోక్తిగా అంది అరుణ. అతను చదువుకున్నవాడని, ఆ ఊళ్ళో తనకు మరో మిత్రుడు దొరికాడని చాలా ఉత్సాహంగా ఉంది అరుణకి.
మాట రమేష్ కి అర్ధం కాక తెల్లబోయిచూశాడు. అర్ధం అయినవెంటనే తనూ నవ్వేశాడు.
"ఆఆ ఆ పద్మశ్రీ ఛాన్సేదో ముందుమీరే! ఆ తరువాతే నాది!" అంతకంటే చలోక్తిగా అన్నాడు.
ఈసారి తెల్లపోవడం అరుణ వంతయింది.
"అలాచూస్తారేమిటి? ఓ స్త్రీఅయి ఉండి స్వసుఖాలని త్యాగం చేసి ఆదర్శం కోసం అష్టకష్టాలు పడి ఈ ఊరి ప్రజలకి యధోచిత సేవచేస్తున్న మీకంటే ముందు నా కొస్తుందా ఆ పద్మశ్రీ.
అరుణ సిగ్గుపడుతూ నవ్వింది. "అరుణాదేవిగారూ! నిజంగా మీ ఆదర్శం కొనియాడదగినది. నిజంగా నేను ఉద్యోగంవదిలేసి ఇలా రావడానికి మీరే కారణం. ఈ ఇన్స్ పిరేషన్ మీ రిచ్చిందే.
"అదేమిటి, నేనేం చేశాను.?"
"అవును మామూలుగా శెలవుమీద వచ్చిన నేను మీ గురించి విన్నాను మీరు చేపట్టిన సత్కార్యం కళ్ళారా చూశాను. మీ పట్టుదలకి కృషికి ముగ్ధుడ్నయ్యాను. తరవాతే నాకీ బుద్దిపుట్టింది. ఇన్నాళ్ళు మా నాన్న స్వంత వ్యవసాయం చేసుకోరా దున్నేవాడిదే భూమి అనే నినాదం వచ్చింది. ఆ భూములు కాస్తా ఊడలాక్కుంటారు. నీవు రాక పోతే అమ్మిపారేస్తాను అని ఎన్నిసార్లు రాసినా, కేవలం ఈ పల్లెటూరిలో ఉండడం ఇష్టం లేకేరాలేదు. ఓర్చి ఓ గ్రామంకోసం మీరు పాటుపడ్డం చూశాక. మగవాడినయి ఉండినా గ్రామం అభివృద్దికి నేనెందుకు పాటు పడకూడదు అనిపించింది. ఓ మూడునాలుగు వందలకిబానిస బ్రతుకు బ్రతుకుతూ, సరి అయిన తిండికేనా నోచుకోని ఆ పట్టణంలో ఏముందని వైరాగ్యం వచ్చింది. అంతే. వెంటనే రిజైన్ ఇచ్చేశాను. నే చదివింది అగ్రికల్చర్ బి.ఎస్ సి కనక ఆధునిక పద్దతులలో వ్యవసాయం చేయాలని సంకల్పం."
"బాగుంది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రమేష్ గారు మీలాంటి యువకులు కొందరన్నా ఇలా ఆలోచిస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. భూములు, పొలాలు ఉన్నవారైనా ఇలా ఆలోచిస్తే మీలాంటి వారందరూ కలిసి పల్లెపట్టున ఉండి పల్లెల అభివృద్దికి పాటు పడితే కొన్నేళ్ళకయినా దేశం బాగుపడుతుంది. గాంధి అన్నట్టు మనదేశం అభివృద్ధి చెందాలంటే ముందు పల్లె అభివృద్ధి చెందాలి. ఉపన్యాసాలు ఇస్తున్నానని నవ్వుతున్నట్టున్నారు."
"అబ్బే లేదు మీ ఉన్నతాశయాలని మెచ్చుకుంటున్నాను. ఆశయాలు ఆదర్శాలు వల్లించడం అందరూ చేస్తున్నారు అని కార్య రూపంలో తెచ్చేవారు ఈ నాటికి ఒకరయినా కనిపించినందుకు సంతోషంగా ఉంది నాకు"
"చాలు ఇంక ఎక్కువ పొగడకండి భరించలేను." నవ్వింది అరుణ.
"రమేషుగారూ నాకు మరో మిత్రులు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు వీలున్నప్పుడల్లా వస్తూ ఉంటారు గదూ?"
"ష్యూర్!" అన్నాడు రమేష్ ఎవరో పేషెంట్లు కాచుకుకూర్చోవడం చూసి లేచాడు వెళ్ళడానికి.
* * *