Previous Page Next Page 
మోహిత పేజి 36

 

    ఆటో మెయిన్  సర్కిల్ దగ్గర  ఆపాడు. ఆ సమయంలో కెళ్ళీబడ్డీ క్లోజ్ చేసి వుంది.

 

    "ఇల్లెక్కడో కనుక్కో?" చెప్పాడు చంద్రప్ప.

 

    ఇందు నందిగామ గానీ, లేదా మైసూరుగానీ వెళుతుందని వూహించిన చంద్రప్ప నందిగామ వెళ్ళి ముందు ఎంక్వయిరీ చేశాడు. అక్కడనుంచి వెళ్ళిపోయిందని తెల్సుకుని, మైసూరు వచ్చాడతను.

 

    ఎలాగయినా ఇందును చేజిక్కించుకోవాలి...... కసిగా అనుకున్నాడతను.

 

    ..... కాలనీ సందుల్లోకి వెళ్లిన ఆ ఆటోడ్రైవర్ అయిదునిమిషాల్లో శ్రీమహాలక్ష్మి ఇంటికొచ్చాడు. ఆ ఇంటికి తాళంవేసి వుండడంతో, అతనికేం చెయ్యాలో పాలుపోలేదు.

 

    బీడీ కాలుస్తూ ఇంటిముందు నుంచుని శ్రీమహాలక్ష్మి కోసం ఎదురు చూడసాగాడు.

 

    
                                          *    *    *

 

    ఇందూతో..... బజారుకెళ్ళి మాట్లాడుకుంటూ జంక్షన్ దగ్గరికొచ్చిన శ్రీమహాలక్ష్మి దూరంగా ఆటోపక్కన నుంచున్న  చంద్రప్పని వెంటనే గుర్తుపట్టింది.

 

    ఇందూకూడా వెంటనే చంద్రప్పని చూసింది.

 

    "అక్కా....." భయంగా శ్రీమహాలక్ష్మిని పిల్చి, చంద్రప్పని చూపెట్టింది.

 

    ప్రమాదాన్ని పసికట్టిన శ్రీమహాలక్ష్మి 'రా' అంటూ షాపింగ్ కాంప్లెక్స్ వేపు నడిచింది.

 

    అకస్మాత్తుగా తల వెనక్కి తిప్పి చూసిన చంద్రప్ప షాపింగ్ కాంప్లెక్స్ లో కెళుతున్న ఇందు కనిపించగానే ముందుకు పరిగెత్తాడు.

 

                                         *    *    *

 

    రాత్రి పదకొండు గంటలు.....

 

    రాజేంద్రకుమార్, ఆ వెనక పదిమంది అనుచరులు గెస్ట్ హౌస్ దగ్గర కొచ్చారు.

 

    రాజేంద్రకుమార్ గబగబా డోర్  తెరిచి, లోనకెళ్ళి లైట్ వేసి, నలువేపులా చూశాడు.

 

    బెడ్ రూమ్ లో సూట్ కేస్, ఆ పక్కన చిందర వందరగా దుస్తులు.

 

    "నో డౌట్...... వాళ్ళిక్కడే వున్నారు....." అరుచుకుంటూ బైటకొచ్చి-

 

    "ఏయ్..... వాళ్ళిక్కడే ఎక్కడో వుంటారు..... కొండగుహలు. ఆ ట్రైబల్ విలేజీల్లోనో, ఎక్కడో దాక్కుని వుంటారు...... వెతకండి..... క్విక్....." తను జలపాతం వేపు నడిచాడు.

 

    రాజేంద్రకుమార్ బాగా తెలియడంవల్ల నిక్కీ అరవలేదు.

 

    జలపాతానికి కొంచెం దూరంలో వున్న కొండమీద కూర్చుని డ్రింక్ బాటిల్ని తీసుకుని, సిప్ చేస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు రాజేంద్రకుమార్.

 

    అరగంట గడిచింది.... గంట గడిచింది..... రెండు గంటలు గడిచాయి.......

 

    "కొండ గుహలు, వ్యూలూ, గుట్టలూ అన్నీ వెతికాం..... సార్..... ఎక్కడా కన్పించలేదు....." అయిదుగురు వెనక్కివచ్చి చెప్పారు.

 

    "సిద్ధరామయ్య ఎక్కడ?" అడిగాడు రాజేంద్రకుమార్.

 

    "ట్రైబల్ విలేజ్ కి వెళ్ళాడు సార్....." ఆ మాట చెపుతున్నంతలోనే అతను మిగతా అనుచరుల్తో పరుగు పరుగున వచ్చాడు.

 

    "సార్.... వెళ్ళెక్కడున్నారో  తెల్సిపోయింది....." అన్నాడు వగరుస్తూ.

 

    "ఎక్కడ....?"

 

    "జలపాతానికి వెనకనున్న గిరిజన గ్రామంలో....."

 

    "ఆర్యూ ష్యూర్...."    

 

    "ఒక గుడిసెలో మోహిత, ఆ కుర్రాడు పడుకున్నారు. వాళ్ళకు కాపలాగా, కొంతమంది కొండకుర్ర్రాళ్ళు ఆ గుడిసెముందు పడుకున్నారు. దీపం వెలుగులో కిటికీలోంచి మోహిత ముఖాన్ని గుర్తుపట్టాను....." చెప్పాడు సిద్ధరామయ్య.

 

    "పెట్రోలు డబ్బా తీసుకోండి...... మొత్తం గుడిసెలన్నిట్నీ తగలెట్టేయ్యండి..... ఆ కుర్రాడు ఆ మంటల్లో మాది మసైపోవాలి. మోహిత  మాత్రం చావాకూడదు..... పట్టుకుని నా దగ్గరకు తీసుకురండి..... దానిని చివరిసారిగా కసిగా అనుభవించి శవంగా చేశాక...... పోలీసులకు నేనే ఫోన్ చేస్తాను....." డ్రింక్ ను గడగడా తాగుతూ క్రోథంగా అన్నాడు రాజేంద్రకుమార్.

 

    "అలాగే సార్....." అనుచర గణం వెనక్కి తిరిగారు.

 


                                           *    *    *

 

    బాగా అలసిపోవడం వల్ల మోహితకు నిద్రపట్టేసింది.

 

    మైత్రేయకి నిద్ర రావడంలేదు. నులక మంచమ్మీద లేచి కూర్చుని సిగరెట్  తీసి వెలిగించాడు. పొగ పీలుస్తూ లాంతరు వెలుగులో అమాయకంగా కన్పిస్తున్న మోహిత ముఖంవేపు చూస్తున్నాడు.

 

    "A MANLIKEA TRAIN AND WOMEN LIKE THE WORLD" ఎప్పుడో  మోహిత చెప్పిన వాక్యం అతనికి గుర్తుకొచ్చింది. దీని అర్థం ఏమిటి? మోహితను అడగాలి.

 

    అకస్మాత్తుగా అతనికి ఇందు జ్ఞాపకానికొచ్చింది.

 

    ఆమె తనని మొదటిసారి పెట్టుకున్న ముద్దు గుర్తుకొచ్చింది. తనకోసం అందర్నీ వదులుకోని వచ్చి దారుణంగా దగా పడిపోయిన ఆమె జీవితానికి తను న్యాయం చెయ్యగలడా?

 

    ఎంత తెలివైన నిందితుడైనా, చట్టానికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోక తప్పదు.

 

    మోహితకు సహకరించినందుకు తనక్కూడా జైలుశిక్ష పడుతుందా? తర్వాత....

 

    ఆ తర్వాత ఏం  జరుగుతుందో? అనూహ్యంగా వుంది మైత్రేయకి.

 

    ప్రతి నేరస్తుడూ, చిట్టచివర కన్నీళ్ళతోనే ఓదార్పు పొందుతాడు. ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకొచ్చింది.

 

    తను నేరస్థుడా.....? మోహిత పట్ల ఆకర్షణకు లోనై నేరస్థుడయ్యాడా?

 

    ఇందు ఇప్పుడెక్కడుంది?

 

    హైదరాబాద్ లోనేనా....!

 

     ఒక్కసారి ఆమెకు ఫోన్ చెయ్యాలి.....

 

    ... చేతిలోని సిగరెట్ ని పెదవులకు చేర్చి, కాల్చబోయిన క్షణంలో ముక్కుపుటాలకు సోకినా వాసనకు ఉలిక్కిపడ్డాడు మైత్రేయ.

 

    పెట్రోలు వాసన.

 

    అతనొక్కసారి లేచి, వెదురు కిటికీలోంచి బయటకు చూశాడు. ఎవరో వ్యక్తులు డబ్బాలతో పెట్రోల్ని గుడిసెల మీద జల్లుతున్న దృశ్యం.

 

    ప్రమాదాన్ని పదికట్టిన మైత్రేయ గబుక్కున కిందకు వంగి మోహితను తట్టి లేపాడు. ఆమె కళ్లిప్పింది.

 

    "ఏంటి?" అడిగింది ఆమె కంగారుగా.

 

    "డేంజర్..... రాజేంద్రకుమార్ మనుషులు....." రహస్యంగా చెప్పాడు.

 

    ఆ మాట వింటూనే గబుక్కున లేచి, అటూ ఇటూ చూసి గుడిసెలోంచి బయటకు రాబోయేటంతలోనే.....

 

    గుడిసెలు ఒక్కసారిగా అంటుకున్నాయి. గిరిజనులు ఒక్కసారిగా హాహాకారాలు చేయడం, కేకలు వేస్తూ పరుగులు తీయడం...... చీకట్లో అంతా గందరగోళం.

 

    మోహిత చేయి పట్టుకుని, మైత్రేయ కొండలవేపు పరుగెత్తాడు. ఇద్దరూ  చీకట్లో తుప్పలూ, డొంకల మధ్య నుంచి పరుగెడుతున్నారు. వాళ్లను చూసిన సిద్దరామయ్య గ్యాంగ్ వాళ్లిద్దర్నీ వెంబడించారు.

 

    "మైత్రేయా.... నువ్వు అటువేపు చెట్లలోకి వెళ్లిపో..... నేనిటు వేపు వెళతాను. వాళ్లు ముందుకు వెళ్లిపోయాక మనం వెనక్కి వెళ్లిపోదాం....." చెప్పి కొండల్లోకి మైత్రేయ.

 

    .... మరి కాసేపటికి మనుషులు పరిగెత్తుకొస్తున్న అడుగుల సవ్వడి.

 

    అయిదుగురు దాక్కున్న గుబురుచట్టు వరకూ ఆగి, నలువేపులా పరికిస్తున్నాడు.

 

    మిగతా నలుగురూ తుప్పల్లో వెతుకుతున్నారు.

 

    ......సరిగ్గా అదే సమయంలో మైత్రేయ లేచి నిలబడి వెనకనుంచి ఎగిరి ఆ వ్యక్తి నడుమ్మీద తన్నాడు.

 

    ఆ దెబ్బతో ఆ వ్యక్తి అరుచుకుంటూ దూరంగా పడిపోయాడు. అతని చేతిలోని కత్తి ఎగిరి అల్లంత దూరంలో పడిపోయింది.

 

    ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కత్తిని అందుకుని లేచి, తనవేపు విసురుగా వస్తున్నా ఆ రౌడీ మీద ఝళిపించాడు.

 

    ఇంతలో వెనక నుంచి వచ్చిన మరో రౌడీ, మైత్రేయని పట్టుకోవడానికి ప్రయత్నించగా, పక్కకు సర్రున ఆ కత్తిని దూశాడు. ఆ కత్తి రౌడీ జబ్బలోకి సర్రున దిగింది. చివ్వున రక్తం ఎగజిమ్మింది. ఆ రౌడీ పెడబొబ్బలు పెట్టాడు. ఆ వ్యక్తి కిందపడిపోయాడు.

 

    మిగతా వ్యక్తులు అతనివేపు దూసుకుని వస్తుండగా ముందుకు పరిగెత్తాడు మైత్రేయ.

 

    ఒక వ్యక్తి తనచేతిలోని కత్తిని గురిచూసి, సూటిగా మైత్రేయవైపు విసిరాడు.

 

    అది మైత్రేయ వీపుకి తగిలి కిందపడింది.

 

    మైత్రేయ బాధగా అరిచాడు..... అయినా ఆగకుండా....

 

    చెట్లమధ్యలోంచి పరిగెడుతూనే వున్నాడు. అతని వెనక ఆ నలుగురు వ్యక్తులు ఎండుతాకుల మీద వాళ్ల అడుగుల శబ్దం, ఆ అర్ధరాత్రి నిశ్శబ్ద సమయంలో విచిత్రంగా విన్పిస్తోంది.

 

    ఎంత దూరం పరిగెత్తాడో తెలీదు.

 

    అలసిపోయాడతను. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది.

 

    ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

 

    ఎక్కడా ఆ వ్యక్తుల అలికిడి లేదు. దాహం...... దాహం.....

 

    దూరంగా గిరిజన  తండా.....

 

    గబగబా ఆ తండావేపు నడిచాడు.

 

    ఆ గ్రామమంతా నిర్జనంగా వుంది.

 

    బండరాయి మీద కూర్చుని సేదతీరుతూ అటూ, ఇటూ చూస్తున్నాడు మైత్రేయ.

 


                                        *    *    *    

 

    సరిగ్గా అదే సమయంలో.....

 

    ఎవరో  నడిచివస్తున్న రెండు పాదాల చప్పుడు. వులిక్కిపడి గుడిసెల వైపు చూశాడు.

 

    పరుగు పరుగున వస్తున్నది ఓ గిరిజన యువతి. ఆ యువతి అతనికి బాగా దగ్గరికి వచ్చి.....

 

    "వచ్చావా పట్నం బాబూ.....!" అంది.

 

    ఆమె వనలక్ష్మి.

 

    తను కట్టం గూడేనికి వచ్చాడా! ఆశ్చర్యంగా వుందతనికి.

 

    "కొంచెం మంచినీళ్ళు తెస్తావా?" గబగబా లోనికెళ్ళి లోటాతో నీళ్ళను తెచ్చి అతనికిచ్చింది.

 

    ఆత్రంగా తాగుతున్న అతనివేపు ప్రేమగా చూస్తోందామె.

 

    ఆయాసం తీర్చుకుంటూ నలువేపులా చూశాడు. మనుషులెవరూ గుడిసెల ముందర కనిపించలేదు.

 

    "ఎవరూ కన్పించడం లేదేం.....?" అడిగాడతను.

 Previous Page Next Page