"ఫోటో నా దగ్గర లేదు సార్."
"ఇప్పుడే ఆ ఫోటో పంపుతాను. నీ ఫోన్ కోస వెయిట్ చేస్తుంటాను. క్విక్" విసుగ్గా ఫోన్ పెట్టేసి, ఎదురుగా నిలబడిన వ్యక్తివైపు చూశాడు రాజేంద్రకుమార్.
* * *
మరో గంట తర్వాత......
ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు రాజేంద్రకుమార్.
"సార్! ఫోటో లోని వ్యక్తి, రూమ్ లో దిగిన వ్యక్తుల్లో ఒకరని, ఆమె పక్కన ముప్పైఏళ్ళ యువకుడున్నాడని, హోటల్ మేనేజర్ చెప్పాడు. రిజిష్టర్లో పేరు "సుమ" అని రాసుంది సార్."
"నో డౌట్! వాళ్లు అక్కడినుంచి ఫారెస్ట్ లోని గెస్ట్ హౌస్ కే వెళ్ళుంటారు. ఆ ఫారెస్ట్ లో మరో కంటివాడికి తెలీకుండా వాళ్ళను మర్డర్ చేసేయ్యాలి" కోపంగా అంటూ ఎదురుగా నుంచున్న వ్యక్తులవైపు చూస్తూ-
"మనం వెంటనే పాలార్ రివర్ గెస్ట్ హౌస్ వెళ్ళాలి. కారు రెడీ చెయ్యాలి" చెప్పాడు.
మరో అరగంట తర్వాత మూడు అంబాసిడర్ కార్లు అడవికేసి బయలు దేరాయి.
మరో అరగంట తర్వాత మూడు అంబాసిడర్ కార్లు అడవికేసి బయలుదేరాయి.
* * *
బస్టాండ్ లో దిగిన ఇందు ఆటో ఎక్కింది. ఆ ఆటో ఛామరాజ్ మొహల్లా చేరడానికి పావుగంట పట్టింది.
ఆ సమయంలో శ్రీమహాలక్ష్మి ఇంట్లోనే దిగులుగా కూర్చుంది. భర్త చనిపోయిన విషాదంలోంచి ఆమె ఇంకా తేరుకోలేదు.
"రా అమ్మా..... రా! ఎక్కడికెళ్ళిపోయావ్? వెళ్ళేముందు ఒక్కమాట చెప్పినా బావుండేది కదా" నెమ్మదిగా అందామె.
జరిగిదంతా చెప్పింది ఇందు.
"ఆ పోలీస్ యెదవని బతకనివ్వగూడదు..... నా మొగుడ్ని చంపినా ఆడ్ని నేను చంపుతాను" కసిగా అంది శ్రీమహలక్ష్మి.
మైత్రేయని కలవడం, నందిగామ వెళ్ళడం, తండ్రి ఇంట్లోకి రానివ్వక పోవడం, అంతా నెమ్మదిగా చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఇందు.
నీకు నేనున్నాను బిడ్డా...... మీ బావ ఎక్కుడున్నా మీ ఇద్దర్నీ కలిపే బాధ్యత నాది..... బాధపడకు.... ఇలాంటి సమయంలో మనిషి నిబ్బరంగా వుండాలి....." తల నిమురుతూ అక్కున చేర్చుకుంది శ్రీమహలక్ష్మి.
"నావల్ల నీకెంతో అన్యాయం జరిగింది కదూ?" అంది ఇందు.
"నువ్వేం చేశావు..... ఆ రాక్షసుడి చేతిలో బంగారంలాంటి నీ బతుకు బుగ్గిపాలైపోయింది. నా మొగుడు నీకు మంచి చేయబోయి చనిపోయాడు. మనసుల్లో మిగిలేది మంచీ, చెడు మాత్రమే! నా తలరాతకు భగవంతుడు కారణమవుతాడు కానీ నువ్వెలా కారణం అవుతావమ్మా? వాటిగురించి ఆలోచించి, మనసు పాడుచేసుకోకు. లోనకెళ్ళి స్నానం చెయ్" ఏ ఉద్వేగమూ లేకుండా అంది శ్రీమహాలక్ష్మి.
సుఖాల, దుఃఖాల మధ్య సరిహద్దుని చెరిపేసి మానవత్వంతో వుండే మనుషులు అరుదుగా వుంటారు. అలాంటి అసలైన వ్యక్తిత్వాన్ని శ్రీమహాలక్ష్మిలో చూసిన ఇదు కళ్ళంట రెండు కన్నీళ్ళొచ్చాయి.
* * *
హొగినకల్ ఫాల్స్ కి దగ్గర్లో వున్న గెస్ట్ హౌస్.
మెయిన్ గేట్ తెరచుకుని లోనికొచ్చిన మోహిత కాళ్ళను చుట్టేసింది డాబర్ మాన్ కుక్క 'నిక్కీ.
"ఏయ్ నిక్కీ బెంగపెట్టుకున్నావా? వచ్చేశానుగా" అంటూ దాని తోకను నిమురుతూ లోనికి నడిచింది మోహిత.
పావుగంట తర్వాత.....
"నేను జలపాతం దగ్గర స్నానం చేసొస్తాను. నువ్వొస్తావా?" అడిగాడు మైత్రేయ బ్యాగ్ లోంచి టవల్ తీస్తూ.
"నువ్వెళ్ళిరా" చెప్పిందామె.
అతను వెళ్ళిపోయాడు.
* * *
రాజేంద్రకుమార్ గురించి ఆలోచిస్తోంది మోహిత. అతను చనిపోయుంటాడా, బతికుంటాడా?
గన్ లో తూటాలు అయిపోయేవరకూ కాల్చింది తను కానీ ఆ తూటాలు రాజేంద్రకుమార్ కు తగిలాయా? అన్నది సందేహంగా వుందామెకు. కనీసం బలమయిన గాయాలయినా తగిలి వుంటాయి.
బతికితే ఆస్పత్రిలో వుంటాడు. రెండు మూడురోజుల్లో తప్పకుండా అతను, తన మనుషులతో అడవికొస్తాడు.
ప్రస్తుతం అతడు ఏ పరిస్థితిల్లో వున్నాడో తెలుసుకోవాలి.
డైలీ పేపర్ చూస్తూ ఆ విషయం తెలుస్తుంది.
'డైలీ పేపర్ కోసం రోడ్ పాయింట్ కి వెళ్ళాలి' అని అనుకుందామె.
* * *
నలభై నిమిషాల తర్వాత .....
స్నానం చేసి లోనికి రాబోయిన మైత్రేయ వరండాలో కన్పించిన దృశ్యానికి అదిరిపోయాడు.
ఒక గాజుపాత్ర, ఆ పాత్రలో ఎర్రటి ద్రవం. ఆ ఎర్రటి ద్రవాన్ని ఆబగా తాగుతోంది "నిక్కీ'
"ఏంటి..... మోహితా...... ఏమిటిది..... రక్తమా?"
"మనిషి రక్తాన్ని కుక్కను పడుతున్నావా?"
"అవును! మా నిక్కీకి పాలూ, నీళ్ళూ అలవాటు చెయ్యలేదు. గత సంవత్సరంగా మనిషి రక్తాన్నే అలవాటు చేశాను.
ఆమెకు కొంచెం దూరంలో పడున్న ఖాళీ బ్లడ్ బాటిల్స్ వేపు ఆశ్చర్యంగా చూస్తున్నాడతను.
"ఈ బ్లడ్ బాటిల్స్ నీకెలా వచ్చాయి?"
"కొంటాను..... మైసూర్ లోని బ్లడ్ బ్యాంక్ నుంచి."
"ఎందుకు.....?"
"ఆ ప్రశ్నకు మోహిత జవాబు చెప్పలేదు. మైత్రేయ వేపు చూసి నవ్విందామె. ఎందుకో ఆ దృశ్యం మైత్రేయకి వెగటుగా, అసహ్యంగా వుంది. ఆలోచిస్తూ లోనికెళ్ళాడతను.
* * *
కొండల మధ్యలోంచి, గిరిజన గ్రామాల మధ్యలోంచి రోడ్ పాయింట్ కి వెళ్ళి మైసూర్ 'మిత్రాడైలీ' పేపర్ తీసుకుని, మొదటిపేజీ తిరగెయ్యగానే కన్పించిన తన ఫోటోని చూసి షాక్ తింది మోహిత.
పెళ్ళి సమయంలో తీసుకున్న ఫోటో అది. రాజేంద్రకుమార్ పేపర్ వాళ్ళకు అందజేసి వుంటాడనుకుంది.
అక్కడనుంచి, మళ్ళీ ఫారెస్ట్ లోని గెస్టుహౌస్ కి రావడానికి మూడుగంటలు పట్టింది మోహితకు.
పేపర్ లోని వార్తను డిటైల్డ్ గా చదివింది.
కంఠీరవ ఆడిటోరియంలో.....
ఫారెస్ట్ కాంట్రాక్టర్ రాజేంద్రకుమార్ పై కాల్పులు, ఇద్దరి మృతి.
నిన్నరాత్రి కాంట్రాక్టర్ ఆడిటోరియంలో అమెరికాలో స్థిరపడిన మైసూరునర్తకి కుమారి శ్రీప్రద అభినందన సభలో, చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఫారెస్ట్ కాంట్రాక్టర్ రాజేంద్రపై ఇతర శత్రువర్గంగా భావిస్తున్న ఒక మహిళ కాల్చిన కాల్పులలో సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సంఘసేవకుడు జ్ఞానేశ్వర్. నర్తకి శ్రీపద అక్కడికక్కడే మృతిచెందగా, రాజేంద్రకుమార్ భుజాలకు బలమయిన గాయాలు తగిలాయి. ప్రస్తుతం ఆయన నగరంలోని ఒక నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్నాడు.
కాగా ఇటీవల కాలంలో విజయవాడ, శ్రీశైలం, గుంటూరుల్లో జరిగిన ప్రముఖ వ్యక్తుల హత్యలతో సంబంధమున్న వ్యక్తులే ఈ రాజేంద్రకుమార్ పై హత్యాప్రయత్నానికి పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యల వెనక మోహిత అనే మహిళను ప్రధానపాత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆమెకోసం, ఆమెకు సహకరిస్తున్నాడని భావిస్తున్న మైత్రేయ అనే యువకుని కోసం పోలీసులు తీవ్రంగా గాలింపుచర్యలు చేపట్టారు. కాగా నిందితులు అద్దెకు తీసుకున్న అంబాసిడర్ కారుని, ఆ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు హత్యాయత్నం తర్వాత, వారుంటున్న హోటల్ రూమ్ ని ఖాళీ చేసేసి, బస్టాండ్ కి చేరుకున్నారని, అక్కడినుంచి కొల్లెగాళ్ వెళ్ళే బస్సెక్కారని తెల్సింది. దర్యాప్తు జరుగుతోంది.
"రాస్కెల్! తప్పించుకున్నాడు" ఆ వార్త చదివాక అంది మోహిత.
* * *
సాయంత్రం ఆరు దాటింది.....
అడవిలోకి నెమ్మదిగా చీకటి ప్రవేశిస్తోంది.....
గెస్ట్ హౌస్ ఆవరణలో వున్న రాళ్ళ గుట్టలమీద, ఎదురెదురుగా కూర్చున్నా రిద్దరూ.
వాళ్ళిద్దరి మధ్య నిక్కీ....
ఇద్దరి చేతుల్లోను డ్రింక్ గ్లాసులున్నాయి.
"ఇవాళ రాత్రి రాజేంద్రకుమార్ తో సహా, అతని మనుషులు, పోలీసులు మనమీద దాడి చెయ్యొచ్చు" తొట్రుపాటు లేకుండా నెమ్మదిగా డ్రింక్ సిప్ చేస్తూ అంది మోహిత.
"మనం ఎదుర్కోగలమా?"
"అదే ఆలోచిస్తున్నాను."
కాసేపయ్యాక మోహిత లేచి, నిక్కీని గెస్ట్ హౌస్ లోని డ్రాయింగ్ రూమ్ లో పెట్టి లైట్స్ ఆర్పేసి, బయట గొళ్ళెం పెట్టి హేండ్ బ్యాగ్ తో బైటకొచ్చింది.
"పద....."
"ఎక్కడకు.....?"
"ట్రైబల్ విలేజ్ కి వెళదాం. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అని చెప్పానుగా! వాళ్ళు మనకోసం ప్రాణాలిస్తారు" అందామె.
మౌనంగా ఆమెను అనుసరించాడు మైత్రేయ.
అరగంట తర్వాత.....
జలపాతం వెనకనున్న ఒక గిరిజన గ్రామం చేరుకున్నారు వాళ్లిద్దరూ. వంద గుడిసెలు మాత్రమే వున్నాయక్కడ.
గ్రామపెద్ద సాదరంగా ఆహ్వానించాడు ఇద్దర్నీ.
ఏ పరిస్థితుల్లో తను ఇక్కడకు వచ్చిందో తెలియజేసింది మోహిత.
"మీకేం భయంలేదు...... మమ్మల్ని చంపాకగానీ, మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్ళలేరు. కంగారుపడకండి" గ్రామపెద్ద భరోసా యిచ్చాడు. రొట్టె, పాలు యిచ్చాడు. వుండడానికి ఖాళీగుడిసె చూపించాడు.
"మా మనుషులు రాత్రంతా మీకోసం కాపలా కాస్తారు. రేపు మిమ్మల్ని ఎవరికీ తెలీని కొండగుహల్లో దాస్తారు" అంటూ తన గుడిసెవేపు వెళ్ళిపోయాడు గ్రామపెద్ద.
కాసేపు కబుర్లాడుకున్నాక, ఇద్దరూ గుడిసెలో పడుకున్నారు.
* * *
చంద్రప్ప బస్టాండ్ లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కాడు.
"ఛామరాజ్ మొహల్లా కిళ్లీబడ్డీ, శ్రీమహాలక్ష్మి ఇంటికి పోనీ....." ఆ ఆటో డ్రైవర్ చంద్రప్పని వెంటనే గుర్తుపట్టాడు.
శ్రీమహాలక్ష్మి మొగుడు, ఆటో డ్రైవర్ గణేష్ ని చంద్రప్ప చంపడం, ఓ అమ్మాయిని లేవదీసుకుపోవడం, సస్పెండ్ కావడం, అంతా తెల్సు. చంద్రప్ప వల్ల శ్రీమహాలక్ష్మికి ఏదో ముప్పు వాటిల్లబోతోందని గ్రహించిన ఆ ఆటోడ్రైవర్, ఎలాగైనా శ్రీమహాలక్ష్మిని చంద్రప్ప బారినుండి రక్షించాలని ఆలోచిస్తున్నాడు.