"లేదు."
"చూడు.... జింఖానా మోడిఫికేషన్ రహస్యంగా జరగాలి. ఇంపార్టెంట్ వర్కర్స్, ఇంపార్టెంట్ ఆఫీషియల్స్ కి తప్ప మనం ఏం చేస్తున్నామో ఎవరికీ తెలీగూడదు...." అంటూ లిఖితవేపు చూశాడు భానోజీరావు.
ఆ మాట వెనక భావాన్ని అర్ధం చేసుకుంది లిఖిత.
మరక్కడ వుండాలనిపించలేదు.
మళ్ళీ వెంటనే ప్రశ్న వేశాడు భానోజీరావు.
"ఆ తారా గ్రూప్ కి ఫోన్ చేసి, ఆ మానేజర్ ని రేపు రమ్మన్నానని చెప్పు. ఈసారి ఏడ్స్ వెరైటీగా ప్లాన్ చేద్దాం."
ఒక్క క్షణం నిశ్శబ్దం.
"కెన్ ఐ టేక్ లీవ్...." నిలబడటానికి ప్రయత్నిస్తూ అంది లిఖిత.
"ఒన్ మినిట్" అని మధువైపు చూస్తూ-
"స్టేట్ లో అక్కడక్కడ కొన్ని కార్ల కంపెనీలు లేస్తున్నట్లు మనకు సమాచారం వస్తోంది... అవునా..." అని లిఖితవేపు తలతిప్పి-
"వాటి డిటైల్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మనకు చాలా అవసరమని నేననుకుంటున్నాను. రైవల్ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్టు కన్నా మన ప్రోడక్టు సక్సెస్ కావాలంటే ఈ పద్దతి మంచిది. అందుచేత ఈ బాధ్యతను లిఖిత మీద పెడుతున్నాను. ఈ బాధ్యతను లిఖిత ఏక్సెప్టు చేసి, మన సంస్థ అభివృద్దికి కృషి చేస్తుందని నమ్ముతున్నాను-" చెప్పడం ఆపాడు భానోజీరావు.
తండ్రి ముఖంవేపు నిరాలోచనతో చూసిందామె.
కాదంటుందా? అవునంటుందా?
మధుకుమార్ కి కూడా భానోజీరావు వూహ అందలేదు.
తనిచ్చిన 'ఇన్ ఫర్ మేషన్' ఆధారంగా లిఖితను ఇంటెలిజెన్స్ నుంచి తప్పిస్తాడని అనుకున్నాడు మధు.
కానీ అలా జరగలేదు.
తండ్రి తనను పరోక్షంగా వెక్కిరిస్తాడని తెలుసు లిఖితకు.
ఏ ముందు చూపుతో భానోజీరావు ఈ పధకం వేశాడో ఆలోచిస్తోంది లిఖిత.
లిఖిత అవుననలేదు.... కాదనలేదు.... లేచి నిలబడింది.
మధుకుమార్ మనసులో ఉత్సాహంగా ఉన్నాడు- ఇక్కడ నుంచి లిఖిత కొన్నాళ్ళ పాటైనా దూరంగా వుంటున్నందుకు.
ఈలోపలే తను చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి.
మరి రెండు నిమిషాల్లో ఆ గదిలోంచి బయటకొచ్చింది.
లిఫ్ట్ దిగి, విసురుగా పార్కింగ్ లో కొచ్చి తన కారు తీసుకుంది.
మరుక్షణంలో ఆమె సికింద్రాబాద్ మెయిన్ రోడ్ మీద వుంది.
లిఖిత బయటకెళ్ళగానే-
మధుకుమార్ వేపు చూస్తూ-
"ఓ.కె. నౌ యూ కెన్ గో."
భానోజీరావుతో ఏదో ఏకాంతంగా మాట్లాడాలనుకున్న మధుకుమార్ ఆయనలా అనడంతో విధిలేక బయటకొచ్చేశాడు.
భానోజీరావు ఆలోచనలో పడ్డాడు.
లిఖిత సమస్యను ఎలా పరిష్కరించగలడు.... ఆమెను విశాఖకే పంపించాలని తీసుకున్న తన నిర్ణయం సరైనదేనా?
తప్పు చేశాడేమో?
వికాస్ అనుకున్నది సాధించగలడా? సాధిస్తే!
లిఖిత వికాస్ పట్ల ఇంకా ఆకర్షణ పెంచుకుంటే!
వికాస్ ఏమీ సాధించలేడు తను బ్రతికుండగా.
వికాస్ ని రోడ్డుమీదే ఉంచడం తన ధ్యేయం.
అప్పుడు లిఖితతో భ్రమలన్నీ తొలగిపోతాయి.
అప్పుడు లిఖితకు తన తండ్రికున్న శక్తంటే ఏమిటో తెలుస్తుంది.
ఆ ఆలోచన రావడంతో శాంతపడ్డాడు భానోజీరావు.
అతని పెదవులమీద చిరుమందహాసం కదలాడింది క్షణకాలం.
* * * * *
ఇంటికొచ్చిన లిఖిత ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి.
వికాస్ తోనైనా చెప్పని విషయాన్ని, తన తండ్రితో తను ఎలా చెప్పగలిగింది?
ఆశ్చర్యంగా వుంది లిఖితకు, వికాస్ మీద తనకు వుందా?
తన తండ్రితో అంత ధీమాగా చెప్పగలిగేంత ప్రేమ.
"నువ్వంటే నాకిష్టం... నిన్ను నేను ప్రేమిస్తున్నాను" అని వికాస్ తో తను చెప్పగానే-?
* * * * *
"నువ్వంటే నాకిష్టం.... నిన్ను నేను ప్రేమిస్తున్నాను" లిఖిత సిగ్గుపడుతూ అంది.
అప్పుడు వాళ్ళిద్దరూ వూరికి దూరంగా వున్నారు. ఎక్కడో కొండల మధ్య పెద్ద ఏరు... ఏరు పక్కన అందంగా తీర్చిదిద్దిన పూలగుడిసె.
"నిజంగా.... ఆ మాట కోసం యుగాలనుంచీ ఎదురుచూస్తున్నాను" అని లిఖితను రెండు చేతుల్తో ఎత్తుకుని ఏరువేపు పరిగెడుతున్నాడు వికాస్-
తెల్లటి వెన్నెల కాసేపు ఆకాశం నుంచి కిందకు దిగి భూమ్మీద విహరిద్దామనుకున్నట్లుగా వుంది ఏరు.
దబ్బుమని ఏట్లో పడేశాడు లిఖితను, ఏట్లో నీళ్ళలో, జారిపోతూ లిఖిత.
"ఏయ్... లిఖీ.... లిఖీ...." ఏటి ఒడ్డున పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయాడు.
నీళ్ళలో మునిగి, ఏటో వెళ్ళిపోయింది లిఖిత.
అలసటగా ఓ బండరాయిమీద కూర్చున్నాడు వికాస్. మెత్తని చేతులు...సంపెంగ పువ్వుల్ని ముద్దగా చేసి, ఆ ముద్దతో చేసినట్లున్న చేతులు... ఆ చేతుల్తో రెండు కళ్ళనూ మూసేసింది లిఖిత.
"ఎలా వుందిప్పుడు..."
"నువ్వు లేకుంటే ఎలా వుంటుంది..." చిలిపిగా ప్రశ్న.
"చీకటి.... కాటుక చీకటి... నల్లని వాల్జడ కళ్ళకు కట్టుకున్నట్టుగా కొబ్బరి నూనె వాసనల మెత్తని చీకటి..."
నవ్వింది లిఖిత.
ఆ నవ్వు అలా కొబ్బరాకుమీద పడిన, కొబ్బరి పువ్వులా...
కొబ్బరి కాయలోసుడులు తిరిగే కొబ్బరి నీళ్ళలా...
ఆ నవ్వు తియ్యగా వుంది... ఆ నవ్వు వెచ్చగా తగిలింది వికాస్ కి.
దగ్గరికి వచ్చినట్టే వచ్చి... దూరంగా వెళ్ళిపోయింది లిఖిత...
ఊరించి, ఊరించి దొరికిపోవాలని సరదా... దారి తెలీక కొండ గుహల్లో చిక్కుకుపోయింది.
సందు సందులూ, మూల మూలలూ తిరిగి, మళ్ళీ బయటికొచ్చేసరికి వికాస్ కనిపించలేదు.
"వికాస్... వికాస్..." ఎవరూ లేని ఆ ఏకాంత ప్రదేశంలో పరుగెడుతోంది... పరుగెడుతోంది.
ఎక్కడా వికాస్ కనిపించడంలేదు.
"వికాస్.... వికాస్.... వికాస్.... వికాస్.... వికాస్.... వికాస్.... వికాస్....
అకస్మాత్తుగా ఆగి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది లిఖిత.
వికాస్ ప్రక్కన ఇంకో అమ్మాయి.
అవును.... ఆ అమ్మాయిని తనెక్కడో చూసింది...
ఎక్కడ... ఎక్కడ... ఎక్కడ... ఎక్కడ...?
* * * * *
చటుక్కున మెలుకువొచ్చింది లిఖితకు.
చుట్టూ చూసింది- ఇంకా తొమ్మిదిన్నర కూడా కాలేదు- టీ.వీ. ప్రోగ్రాం చూస్తూనే అలా మగతగా నిద్రలోకి జారుకుంది.
టీ.వీ.లో వస్తున్న సీరియల్ ఆఖరి దశలో వుంది.
మొట్టమొదట సారి వికాస్ కలలో కొచ్చాడు.
నవ్వుకుంది-
అంతలోనే ఆ అమ్మాయి వికాస్ ప్రక్కనున్న అమ్మాయిని ఊహించడానికి ప్రయత్నించింది.
ఆనంది... ఆనంది...
తన కలలోకి ఆనంది రావడమేమిటి...? చిరాకుపడింది.
ఇప్పుడు వికాస్ ఏం చేస్తుంటాడో... ఫోన్ చేస్తే.
ఆ ఆలోచన రాగానే మూలనున్న ఫోన్ దగ్గరకు నడిచింది లిఖిత.
మొట్టమొదటిసారి వికాస్ కలలో కొచ్చాడు.
టీ.వీ.లో వస్తున్న సీరియల్ ఆఖరి దశలో వుంది.
హైద్రాబాద్ నుంచి లిఖిత ఫోన్ ట్రై చేస్తోంది.
ఇంకో ప్రక్క ఆనంది లోకల్ ఫోన్ ట్రై చేస్తోంది.
అదే సమయంలో-