నారాయణరావు అందరివేపూ వెర్రి మొర్రిగా చూస్తూ-
"నేనేం చేశాను?" స్వాతిముత్యంలో కమల్ హాసన్ లా అడిగాడు.
"ఏం చేసావా.....సంధ్య ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానని, నువ్వు భీష్మించుకుని కూర్చోవడం అన్యాయం .....మన ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి, నిన్ను పురికొల్పిన శత్రువు ఎవరు?"
"పురికొల్పడం ఏమిటో....ఈ శత్రువులెవరో.....ఈ ప్రేమ ఏంటో.....నాకంతా కన్ ఫ్యూజింగ్ గా వుంది...." ఏడుపు ముఖంతో అన్నాడు నారాయణరావు.
"నీ వేషాలన్నీ మాకు తెలుసు.....నిజమైన ప్రేమకు నువ్వు హాని చెయ్యడం నీకు సిగ్గుగా అన్పించడం లేదు. మనం అనుకున్న దేవిటి.....నువ్వు చేస్తున్నదేవిటి? నీ బామ్మ ఆస్థి కోసం నువ్వు డ్రామా లాడడం, మీ మేనమామకూతురు సురభి విషయంలో నువ్వు ఊగిసలాట ఆడడం....అన్నీ మాకు తెలుసు....." మోతీ లక్ష్మి అంది కోపంగా.
"అలాగ అడగండి....ఆ లైబ్రేరియన్ విషయం కూడా అడగండి గట్టిగా " సంధ్య అందుకుంది.
"ఇతనిమీదేకాదు.....నీ మీద కూడా ఆరోపణలున్నాయి. లాటరీలో మీ ఇద్దరి పేర్లూ వచ్చినప్పటి డీ మీరు ప్రేమించుకోవాలి.....కానీ ఆమె ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానని అతడు, నేను ప్రేమించననీ- నువ్వూ..... సైడ్ ట్రాక్ పట్టి, టైమ్ వేస్ట్ చేసి, మన ఆశయానికి గుండెల్లో వెన్నుపోటు పొడిచారు....." ఆవేశంగా ప్రసంగించాడు వాసుదేవ్.
"బాబూ నారాయణరావ్.....అమ్మా సంధ్యా.....నాలాంటి వాడు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా ఎందుకు నిలబడ్డాడో ఒక్కసారి మీరు ఆలోచించండి తర తరాల పెద్దరికానికి మీరు ఎదురు నిలిచి...... చరిత్రలో ప్రేమ జంటగా, ఆదర్శ సంపతులుగా నిలుస్తారని.....అయామ్ సారీ టు టెల్ బోత్ ఆఫ్ యూ దట్......"
పరమానందం ఉపన్యాసం చాలా బోరుగా వుంది నారాయణ రావుకీ, సంధ్యకీ.
అంతమంది ఎదుట ఇద్దరూ దోషులుగా నిలబడడం ఏం నచ్చలేదు వాళ్ళిద్దరకూ ప్రెస్టేజ్ పోవడంకన్నా ప్రేమించుకుంటేనే బావుంటుంది కదా.....అనే నిర్ణయానికొచ్చినవాడై నారాయణరావు-
"మైడియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్.....నేనీ క్షణం నుంచీ సంధ్యను చిత్తశుద్దిగా ప్రేమించడానికే నిర్ణయించుకున్నాను...." అని అనగానే విద్యార్దులందరూ సామూహికంగా చప్పట్లు కొట్టారు.
"మరి నీ సంగతేమిటి? సంధ్యను అడిగింది మోతీలక్ష్మి.
కాసేపు తనలో తానే తర్జన భర్జన పడిన సంధ్య చిట్ట చివరకు-
"ఓ.కే.....ఇప్పటివరకూ జరిగిందంతా నేను మరచిపోతున్నాను ఇవాల్టినుంచి నేను నారాయణరావుని ప్రేమిస్తాను....ఆదర్శ ప్రేమికులుగా నిలవడానికి సాయశక్తులా కృషి చేస్తాను" అని హామీ యిచ్చిన మీదట మళ్ళీ విద్యార్దులందరూ సముద్ర తరంగాల్లా చప్పట్లు కొట్టారు.
"ఇప్పుడు మీరుచనిపోయిన ప్రేమజంట దివ్య, డేవిడ్ ల ఆత్మల మీద ప్రమాణం చేయండి" అని వాసుదేవ్ అనగానే ఇద్దరూ ఆ విధంగానే ప్రమాణం చేసి-
"పెద్దలను ఎదిరిస్తాం.....మేం ప్రేమించుకుంటాం.....మేం పెళ్ళి చేసుకుంటాం" అని పెద్ద స్వరాలతో శపథం కూడా చేసేసారు.
పరమానందం ఒకడుగు ముందుకువేసి-
"వెరీగుడ్___ఈ క్షణంకోసమే నేను ఎదురు చూస్తున్నాను___ప్రోగ్రాం ఏమిటో నేను చెపుతాను వినండి. మీరు ఆదర్శ ప్రేమికులుగా అందరికీ తెలియాలి__మీ ప్రేమ గురించి పెద్దవాళ్ళు అందరూ చర్చించుకోవాలి.....రేడియోలు, టీ.వీలు మీ లవ్ ఎఫైర్స్ మీద స్పెషల్ బులెటన్స్ రిలీజ్ చెయ్యాలి-కులమతాల్ని నరనరాల జీర్ణించుకుని, ప్రేమ వివాహాలకు అడ్డంకుగా నిలుస్తున్న పెద్దలను ఎదిరించి మీరు పెళ్ళిచేసుకోవాలి. ఈ పెళ్ళి భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శ వివాహంగా రూపు దిద్దుకోవాలి. గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి......"
అసలే బి.పి మనిషి కావడంతో పరమానందం దబ్ మని కింద పడిపోయాడు. అవసరోపచారాలు చేసాక లేచి నిలబడ్డాడు.
అప్పుడక్కడ ఆయనకెదురుగా మోతీలక్ష్మి, వాసుదేవ్ తప్ప మరెవరూలేరు.
"ఏదీ మన ప్రేమజంట ఏదీ" అడిగాడు పరమానందం.
"ప్రేమించుకోడానికి వెళ్ళిపోయారు" ఆనందంగా జవాబిచ్చారు మోతీలక్ష్మి, వాసుదేవ్.
* * * *
సాంబమూర్తి కళామందిర్లో 'మేడ్ ఫర్ ఈచ్ ఆదర్' కాంటెస్ట్ జరుగుతోంది ఆ కాంటెస్ట్ ఎడ్వర్టెయిజ్ మెంట్ ని పేపర్లో చూసిన నారాయణరావుకి ప్లాష్ లాంటి ఐడియా వచ్చింది.
దాంతో వెంటనే పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి లేడీస్ హాస్టల్ కు ఫోన్ చేశాడు.
లేడీస్ హాస్టల్ వార్డెన్ అప్పలనర్సమాంబ చాలా మంచావిడ ఆవిడ చిన్నప్పుడు ఆవారా సినిమాచూసి ఉత్తేజితురాలై ఎప్పటికైనా ప్రేమ పెళ్ళి చేసుకోవాలని గుంభనంగా అనుకుంది కానీ నలభైఏళ్ళవుతున్నా, ఆమెను ఆ వయసుగ్రూప్ వరుడెవరూ ప్రేమించడానికి ముందుకు రాకపోవడం, ఉందిలే ప్రేమకాలం, ముందు ముందునా అనుకోని బ్రహ్మచారిణిగా వుండిపోయింది.
అలాంటి ఉద్యమం తన యుక్త వయసులో వచ్చుంటే, ఎంత బాగుండేదో అని అనుకున్నదై నారాయణరావు, సంధ్య ప్రేమావిష్కరణకు బేషరతుగా మద్దతు తెలిపేసి హాస్టల్ నుంచి బయటకు ఫోన్ చేసుకోవటానికి సంధ్యకు, బయటినుంచి వచ్చే ఫోన్ కాల్స్ లో ఒక్క నారాయణరావు ఫోన్ కాల్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చేసిందావిడ. ఆ ప్రేమజంట మాట్లాడుకుంటున్నప్పుడు ఏ ఒక్కరున్నూ డిస్ట్రబ్ చేయకూడదనిన్నూ ఒక సర్క్యులర్ కూడా పంపించేసిందావిడ.
నారాయణరావు నుంచి ఫోన్ అనగానే, పరుగు పరుగున వచ్చి రిసీవర్ని అందుకుంది సంధ్య.
"చెప్పు రావ్.....రాత్రంతా ఆలోచిస్తానన్నావ్......ఆలోచించావా మన ప్రేమ జంటను వైజాగ్ అంతా గుర్తించేట్టుగా సెన్సేషనల్ ధాట్ ఆలోచిస్తానన్నావ్....ధాటొచ్చిందా?" అడిగిందామె.
"అదే చెపుతున్నాను.....ఇవాళ సాయంత్రం....నువ్వు సరిగ్గా ఆరుగంటలకు, సాంబమూర్తి కళామందిర్ కు వచ్చేయ్__అకడ నీ కోసం....నేను వెయిట్ చేస్తుంటాను" చెప్పాడు నారాయణరావు.
"సరిగ్గా ఐదూ యాభై అయిదు నిమిషాలకి వచ్చేస్తాను" అంది సంధ్య స్థిరంగా.
* * * *
సాంబమూర్తి కళామందిర్__
వివరాలు కనుక్కోవడానికి ఆఫీసు రూములోకెళ్ళిన నారాయణ రావ్, అక్కడ ప్రోగ్రామ్ ఇన్ చార్జి వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తనలోతానే కుళ్ళికుళ్ళి, కుమిలి కుమిలి పోయాడు అనవసరంగా.
"అప్లికేషన్ లను వారం రోజులకిందే ఫైనలైజ్ చేసేసాం.....చివరి నిమిషంలో వచ్చిన ఎంట్రీలను తీసుకోం" ఆవిడ ఖరాఖండీగా చెప్పేసింది.
ఆవిడ మిస్ డాబా గార్డెన్స్....ఆ విషయం తెల్సుకోవడానికి నారాయణరావుకి ఎక్కువ సమయం పట్టలేదు.
"చూడండి.....మిస్ డాబా గార్డెన్స్.....మీరు ఆ రోజుల్లో మీరుండే డాబా గార్డెన్స్ మిస్ గా సెలక్ట్ కావటం తెలుసు.....అప్పుడే మీరు కాంటెస్ట్ చేసుంటే మిస్ విశాఖా, మిస్ ఆంధ్రా.....తదితరములైన టైటిల్స్ వచ్చుండేవి......కానీ"
"అవునబ్బాయ్......మిస్ డాబా గార్డెన్స్ గా నేను సెలక్టయ్యాక, మిస్టర్ చావులమదుంతో నాకు పెళ్ళయి పోయింది. ఆ తర్వాత నా అందం, బెడ్ రూమ్ కే పరిమితమై పోయింది. లేకపోతే సుచిత్రా సేన్, ఐశ్వర్యారాయ్ ఇలాంటివాళ్ళు నా ముందు బలాదూర్"