కారెక్కి స్టీరింగుముందు కూర్చున్న అతని కళ్ళముందు కోట్లాది రూపాయల ఆస్తి అధికారం మెదులుతున్నాయి.
౦ ౦ ౦
కళాభవన్ అతి తక్కువమంది మాత్రమే విజిటర్స్ ఉన్నారు- రెండువైపులా గోడలకు వేలాడదీసున్న పెయింటింగ్స్ ను దీక్షగా చూస్తున్నారు ముగ్గురూ.
వీర్రాజుకి ఒక పెయింటింగ్ చాలా బాగా నచ్చింది దూరంగా వున్న పోతురాజుని తీసికెళ్ళి ఆ పెయింటింగ్ ని చూపించాడు.
"చాలా బావుంది. కొంగలూ, సూర్యుడూ కింద నుండడం వాటి పైన సముద్రం వుండడం వెరైటీ- ఆట, ఇలాంటి పెయింటింగులకే ఫారిన్ లో కొన్ని లక్షల డబ్బు వస్తుందట" చెప్పాడు పోతురాజు.
"జనరల్ గా సముద్రం కిందభాగంలో వుండి కొండలూ, సూర్యుడూ పైభాగంలో ఉంటాయికదా" తన డౌటుని వ్యక్తం చేశాడు వీర్రాజు.
"ఇండియాలో అలాగే ఉంటాయిరా వెధవా. ఫారిన్ లో అట్నించి మనం ఇక్కడకాళ్ళతో నడుస్తున్నామా, వాళ్ళక్కడ చేతుల్తో నడుస్తారు. ఇంతకీ ఈ పెయింటింగ్ ఖరీదెంతో?" అక్కడెక్కడా దాని రేట్ లేక పోవడంతో కొంచెం దూరంలో సీరియస్ గా నుంచున్న వ్యక్తివైపు చూసి-
"దీని రేటెంతో చెప్తారా" అడిగాడు పోతురాజు.
ఆ వ్యక్తి ఆ పెయింటింగ్ దగ్గరగా వచ్చి, ఆ పెయింటింగ్ వైపు వాళ్ళ మొహాలవైపు సీరియస్ గా చూసి-
"సారీ! ఈ పెయింటింగ్ ను ఎవరోకంగారుగా తిప్పి పెట్టినట్టున్నారు" అని అట్నించియిటు పెట్టాడు.
"నేనప్పుడే అనుకున్నాన్లెండి" పోతురాజు నవ్వబోయాడు.
ఈ పెయింటింగు కాస్ట్ పదివేలు" సీరియస్ గా చెప్పి వెళ్ళిపోయాడా వ్యక్తి.
"ఇది తీసుకుందాం" ఆ ఆర్టిస్టు వెళ్ళిపోయాక అన్నాడు పోతురాజు.
"తీసుకుంటావేం - గొప్ప శ్రీకృష్ణదేవరాయలువి బయలుదేరావ్ గానే ఏదో అనబోయి ఆగిపోయాడు వీర్రాజు.
"తీసుకుందాం...అంటే...కొందామని అర్ధంగా కాదు అలాగే ఇంకో రెండు తలాతోకాలేని
పెయింటింగ్సు సెలక్టు చేశాను. వాటినికూడా తీసికెళదాం."
కొంచెం దూరంలో గోడకున్న ఆ పెయింటింగ్స్ ని చూపించాడు పోతురాజు.
నిజంగా ఆ రెండు పెయింటింగ్స్ కూడా తలా తోకాలేని పెయింటింగ్సే! ఒక పెయింటింగ్ లో ఏనుగు శరీరం మాత్రమే వుంది. తలా, తోకాలేదు. ఇంకో పెయింటింగ్ లో ఒంటె శరీరం మాత్రమే వుంది. తలా, తోకాలేదు.
"ఇపుడు వీటిని తీసికెళ్ళడం యెలా?" అప్పుడే అక్కడకొచ్చిన సేతురాజు అన్నాడు.
"మనసుంటే మార్గం అదే వుంటుంది. మీరు సరిగ్గా పెయింటింగ్స్ దగ్గరే నిలబడింది. అంతా క్షణంలో జరిగిపోవాలి. నేను మిమ్మల్ని రోడ్డుమీద కలుస్తా" అంటూ మేడమెట్లవేపు వెళ్ళి మేడ పైభాగంలో వున్న మెయిన్ స్విచ్ వేపు చూశాడు వీర్రాజు.
నలువేపులా ఒకసారి చూసి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
కళాభవన్ లో ఒక్కసారిగా గందరగోళం ప్రారంభమయింది. అయిదు నిమిషాల తర్వాత ఎలక్ట్రీషియన్ మెయిను స్విచ్ వేశాడు.
అప్పటికే హాల్లో మూడు పెయింటింగ్స్ వేలాడదీసిన గోడ వెల వెలబోతూ తెల్లగా కనిపిస్తోంది.
ఆ పెయింటింగ్స్ ని వేసిన ఆర్టిస్టు "గాయబ్ మాయం" అని అరిచాడు అమృతాంజన్ ఎడ్వర్ట్ జ్ మెంట్లోలా.
౦ ౦ ౦
"ఒరేయ్, బిగ్ బ్రదరూ! ఈ పెయింటింగ్స్ తో మనం-అచ్చు ఆర్టిస్టుల్లాగ వున్నాంరా! దొంగలమంటే, చచ్చినా పోలీసులుకూడా నమ్మరు" ఆనందపడిపోతూ అన్నాడు సేతురాజు.
"ఆ కళాభవన్ వాళ్ళు, పోలీస్ కంప్లయింట్ ఇవ్వకముందే, మనం ఆ హిమకుంద ఇంటికి వెళ్ళిపోవాలి!" ఆటోని పిలుస్తూ అన్నాడు వీర్రాజు.
ముగ్గురూ ఆటో ఎక్కారు. అరగంట తర్వాత ఆటో, బేగంపేట ఏరియాలోని మెథడిస్ట్ అపార్ట్ మెంట్ ముందు ఆగింది.
౦ ౦ ౦
షవర్ బాత్ చేసి, డ్రెస్ చేంజ్ చేసుకుని, డ్రెస్సింగ్ టేబిల్ ముందు తల దువ్వుకుంటోంది హిమకుంద.
కాలింగ్ బెల్ మోగితే ఉలిక్కి పడిందామె.
తన కోసం వచ్చేవారెవరా? అని ఆలోచిస్తోందామె.
"నువ్వెక్కడుంటున్నావో?" అని సాయంత్రం తనని సమర్ద్ అడగడం___
"నేనెక్కడుంటున్నానో నువ్వు కనుక్కుంటే_ నీకో అరుదైన గిఫ్టు ఇస్తానని తననడం హిమకుందకు జ్ఞాపకం వచ్చింది.
"ఏమిటో ఆ అరుదైన గిఫ్టు?" అడిగాడతను.
"కళాకండ్..." అరుస్తూ చెప్పాడు గాలిబాబు.
"నువ్వు నోర్మూసుకో!" వాడ్ని కసురుకొని__
"నా అడ్రస్ కనుక్కోగలవా?" అని అడిగిందామె.
"ఈ సమర్ధు తలచుకుంటే, ఈ ప్రపంచంలో అసాధ్యమైనదేదీ లేదు! నువ్వూహించని టైమ్ లో, నీ అడ్రస్ కనుక్కుని వచ్చి, నువ్విచ్చే గిఫ్టుని తీసుకుంటాను."
"నువ్వెప్పుడోస్తే అప్పుడు....నీకోసం ఆ గిఫ్టు రెడీగా వుంటుంది!" ఆ మాట అంటున్నప్పుడు హిమకుంద బుగ్గలు ఎర్రగా మారడం, సమర్ధు గమనించలేదు.
మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచన్లను కట్టిపెట్టి, దువ్వెనను పడేసి, గబగబా హాల్లోకొచ్చింది హిమకుంద.
డోర్ తెరచి, ఎదురుగా కన్పించిన ముగ్గురు వ్యక్తుల్ని చూడగానే, ఎవరన్నట్టు తల పంకించింది.