జగన్మాతవే కరుణామయి రాలివే! నీ సంతానాన్ని కష్ట నిష్టూరాలకి లోనుజేశాక వారి కష్టనిష్టూరాలిని చూసే బాధ్యత మాత్రం నీది కాదా? అవి నీవి కావా? వారి మొర ఆలకించటం మాత్రం నీ బాధ్యత కాదా తల్లీ! పాలించటం మాత్రమేనా తల్లీ నీవంతు?
మాకు ఎందుకీ బాధలు, మేమంత? మా ప్రాణమెంత? మా ఆశలెంత? ఆశయాలెంత. అల్ప జీవులం మరి. మాకెందుకింత వ్యాసంగాన్ని వ్యాపకాన్ని కలిగించి వేదిస్తున్నావ్ తల్లీ!"
కన్నీరు తుడుచుకుని మళ్ళీ ఆమె ముఖంలోకి చూసింది. పండు ముత్తయిదువులా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నది జగన్మాత! ముఖాన రూపాయ కాసంత బొట్టు నిర్మలంగా వెలుగుతోంది. శాంతించిన మనసుతో బయటికి వచ్చారు కుంకుమార్చన ముగించుకుని. బయట ఆలయ ప్రాంగణంలో కూర్చుంటూ ఓ కొబ్బరి ముక్క అందించాడు అతను. కొబ్బరి ముక్క అందుకుని పొట్లం విప్పి కుంకుమ తీసుకుని ముఖాన బొట్టు పెట్టుకుని ముక్కని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది.
ఆశ్చర్యంగా తన కేసి చూస్తున్న అతన్ని చూసి నవ్వుతూ అంది.
"ఆశ్చర్య పడుతున్నావేం వేణు! ఇకముందు ప్రతిరోజూ తప్పక కుంకుమ పెట్టుకుంటాను! సర్వ మంగళకి ప్రీతీ పాత్రమైన ఈ కుంకుమని మంగళకరంగా ధరించింది. స్త్రీత్వానికి పరిపూర్ణతలేదని యిప్పుడే తెలిసింది. ఏ స్త్రీ అయినా సరే కుంకుమ ధరిస్తేనే అందం. చందం అలంకారం! అది అలా అని ఎవ్వరనీ నిర్బంధించలేం లే! కానీ ఆచరిస్తే మంచిదని నాకనిపిస్తోంది. ఇప్పుడు ముక్కు కుట్టించుకుంటే బాధ అవుతుందేమో కానీ లేకుంటే అమ్మవారిలా ముక్కెర పెట్టుకోవాలనిపిస్తోంది. కనీసం ముక్కుపుడుక అయినా పెట్టుకోవాలని ఆశ కలుగుతోంది. ముక్కు కుట్టించుకోనా! డాక్టరువి నీ సలహా ఏమిటి? మీ ఆవిడలా నిండుగా మెట్టు పెట్టుకుని కలకలలాడుతూ గలగలలాడే గాజుల్ని చేతుల నిండుగా తొడుక్కుంటాను. ముక్కుపుడక పెట్టుకుంటాను.
మగవారిలాగా ఒక చేతికి వాచీ మరో చేయి బోసిగా ఏం బావుంటుంది! ఎందుకని పెద్దలు ఈ పసుపూ కుంకుమను గాజులు సృష్టించారో కానీ అందానికీ ఆరోగ్యానికి పరిపూర్నత్వాల్ని సిద్ధింపజేస్తాయ్ అని...."
అతనేమీ జవాబు చెప్పక ముందే చేతికి వున్న వాచీ విడచి పక్కనే బాష్ లో పెడుతూ అంది. "దీన్ని యిక్కడే అమ్మేసి ఏదైనా టైమ్ పీసు కొనుక్కొని వెడదాం. మొండిగా గాజులు లేకుండా వుండటం ఏమీ నచ్చటం లేదు నాకు__"
"నీ యిష్టం దేవతా! దేవతలకి దేవతలంటే ఎంత యిష్టమో యిప్పుడే తెలిసింది నాకు. ఆమె నిన్ను తనలా తయారు చేసుకుంటోంది. నేను అప్పుడే చెప్పానా లేదా? విరజా నీవు ఏమవుతానోనని, ఆమె తన ప్రభావం చూపకుండా వదలదు. ఎవరిపైనయినా సరే! అందుకే నాకు ఆమె సన్నిధిలో నిలబడాలంటే భయం విరజా!
నవ్వింది జగన్మాతలాగే!
"ప్రణయమూర్తిని చూడగలిగిన మానవుడు ప్రళయమూర్తిని చూడలేడు. నిజం వేణు! ఆమె ముఖంలో కనిపించే గంభీర్యం ముందు నిలువలేరు ఏ స్త్రీ ముందైనా సరే అంతే! ఆవిడ ప్రసన్నంగా వున్నంత కాలమే మీ ఆటలు సాగుతాయి. ఆ ప్రసన్నమయ్యాక మెల్లిగా తప్పుకుని అవతలకి వెళ్ళి మిమ్ములను మీరు రక్షించుకుంటారు. లేకపోతే మీరు ఆగ గలుగుతారా!"
లేనే, క్రిందికి దిగటానికి దారితీస్తూ అన్నాడు. "ఏమైనా విజయవాడకి నీవు రావటంలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైంది. మనిషివి మారావు. మనసూ మార్చుకుంటే అంతేచాలు__"
"నవ్వుతూ అంది అతని వేపు నిశితంగా చూస్తూ "బుద్ధికాదు వేణు! మారటానికి అది మనసు...."
27
కృష్ణానది అభిసారికలా అందమంతా తన నడకల్లో కనిపించేట్టు చూసేవాళ్ళూ, వినేవాళ్ళు మురిసేటట్టు ప్రియ సమాగమానికై అతివేగంగా వెడుతోంది.
సగం పాదాలవరకూ తడిసేట్టు కూర్చుని వ్రేళ్ళతో నీటిని చిందించుకుంటూ గలగల ఆమెకంటే వేగంగా మాట్లాడుతోంది విరజ.
ప్రక్కనే కూర్చుని మృదువైన సంగీతాన్ని సృష్టిస్తున్నాడు వేణు. అతని సంగీతపు నడకకు లయబద్ధంగా తాళానుగుణంగా కాళ్ళు కదిలిస్తోంది విరజ. కృష్ణ కూడా తన బాణికలో ఆ నడకని చూపుతోంది.
పైన సర్వాంతర్యామి అయిన భగవంతుడు ప్రక్కన నిత్య సుహాసిని, మహామంగళకారిణి, నిత్య సోతస్విని, అన్నపూర్ణ, గంభీర అయిన కృష్ణవేణీ ఇటు ప్రక్క అనాఘ్రాతమైన సౌందర్య వాహినీ ప్రకాశవినీల సుదీర్ఘకుంతలా పరిశోభిత సువర్ణచ్చాయా మోహనశరీర అతి నిర్మల సహృదయ పరమ ప్రియ విరజ.... మధ్య వినిర్మలుడు సహృదయుడు నిష్పక్షపాతి సర్వదీనజబంధు హితైషి వాజ్ని వేణు. వీరందరి మధ్య ఆపాత మధురమూ పళుశిత షణిరేతమూ సర్వజన సమ్మతమూ అయిన సంగీతము.... అపర స్వర్గంలా వుంది ఆ సన్నివేశం....
డాన్ని పక్కకు పెట్టి అన్నాడు వేణు. "జీవితమంతా ఇలా గడవాలి. ఇంకేమీవద్దు. ఓ వైపు గలగల పారే యేరు మరోవైపు మనసెరిగిన మగువ తీయని సంగీతం ఆలపించుకుంటూ ఇలా కూర్చోవటంకంటే కావలసిందేముంది విరజా!"
చిత్రంగా అతనివేపు చూస్తూ అంది "ఇంకేమీ లేదా వేణూ!.... ఇలా మాట్లాడుతున్నావేమిటి ఈ రోజు! మానవుడు సుఖపడాలని కోరుకోవటం తప్పుకాకపోవచ్చు. కానీ సుఖమే పరమావధిగా జీవించాలనుకోవడం తప్పుకాదా? ఎందుకు తనీ ప్రపంచంలోకి వచ్చాడు? తన విధి యేమిటి! తను నిర్వర్తించాల్సిందేమిటి? ఇవేవీ తెలుసుకోకుండా ఇలాగే బ్రతకాలనుకోవడం తప్పు వేణూ! ఈ ప్రపంచంలో అణువైనా, చిన్న చీమైనా, ఏదైనా మనిషి అయినా అన్ని ప్రాణులూ తమ ధర్మాన్ని నెరవేర్చకపోతే ఒక అంగుళమయినా ముందుకు సాగలేదు ప్రపంచం. భగవంతుడు కూడా అలాంటి సృష్టిని మెచ్చలేడు. ఇంతకీ నీలోవున్నాడీ ఆర్టిస్టు. అతనూ ఇలా అనిపిస్తోన్నది రచయితకీ ఆర్టిస్టులకీ ఎప్పుడూ ఇదే రోగం. అన్నిటికీ దూరంగా పారిపోవాలంటారు."
నవ్వి అన్నాడు అతను.
"అక్కడే నీకూ, నాకూ అభిప్రాయబేధాలు వచ్చేది. సర్వం కృష్ణార్పణమస్తు అని అనుకుందామనుకుంటాను నేను. దానికి వేరు విధంగా ఆలోచిస్తావు నీవు. నేను అలా జీవించాలనుకున్నా ఎలా జీవించాలనుకున్నా భగవానుని నిర్దేశం లేంది యేదీ సాగదు. శివుని ఆజ్ఞ లేనిది చిన్న చీమ అయినా ఆహారం సంపాదించుకోటానికి అయినా కదలలేదు. అదే ఆయన అనుగ్రహం వుంటే ఆయన శిరస్సుని చేరుకుంటుంది. ఏ కుసుమాల జంటలోనో ఇరుక్కుని....
పిచ్చి విరజా! చీకు చిరాకూ చింతాలేని జీవితాన్ని కోరుకున్నావే గానీ, సోమరి జీవితాన్ని కోరలేదు! మనసంతా ఈ ప్రపంచం అనబడే యంత్రానికి భాగాలం. ఏ భాగం తన పనిని చేయక పోయినా యంత్రం సరిగా నడవదు. సామాన్యమైన మన నేత్రాలకి అది కనిపించకపోవచ్చు. కాని యంత్రకర్త యంత్ర నిర్వాహకుడూ పర్యవేక్షకుడూ అయిన ఆ భగవానుడికి మాత్రం తెలుస్తుందా విషయం...."
జవాబేమీ చెప్పలేదామె. చిన్ననాటినుంచీ అతనితో వాగ్యుద్దాలతో చివరికి మౌనం వహించటంతో తన పని సరి అనుకునే తత్వం ఆమెలో జీర్ణించిపోయింది.
చేతినిండా ఇసుక తీసుకొని ముద్దలు ముద్దలుగా ప్రక్కనే పెడుతోంది. తడి ఆరాక అవి విరిగిపోయి పగిలిపోతున్నాయి. మానవజీవితమూ అంతే? ఆర్ద్రత నశించాక అనార్ద్రమైన దేహం నశించటానికి మొదలు పెడుతుంది.
కాళ్ళను నీటినుంచి లాక్కుని ఒక కాలిని మడిచి పాదం చుట్టూ ఇసుక కప్పసాగింది. చిన్న అమ్మాయిలా గజ్జెన గూడు కట్టడానికి యత్నిస్తూ ఆదుకోవాలని యత్నిస్తున్న ఆమె వైపు చూస్తూ అతనుకూడా కొద్దికొద్దిగా ఇసుకని ఆమెకు సహాయంగా పోయసాగాడు.
పాదంచుట్టూ ఎక్కువగా ఇసుకని పేర్చి గట్టిగా చేతితో దిమ్మిస కొట్టి ఏమాత్రం అది కదలకుండా మెల్లిగా పాదాన్ని ఇవతలికిలాక్కుని చుట్టూ కాంపౌండులా ఇసుక గోడ తయారుచేసి దానికి ఓ ద్వారంలాంటిది కట్టి మధ్య మధ్య తలలోని పూలుని తీసి గార్డెన్ లాగా వేసి అందమైన ఇంటిని తయారు చేసింది.
"ఇదుగో ఈ ఇంట్లో వుండిపో వేణూ! కృష్ణాతీరం ఆమె వేడుకలో నివసిస్తూ సంగీతానికి జతగా నీ సంగీతాన్ని వినిపిస్తూ హాయిగా సెలయేరులా నిశ్శబ్దంగా నెమ్మదిగా జీవితాన్ని నిమిత్తం మాత్రంగా గడుపు...."
చిన్న పిల్లాడిలా నవ్వేస్తూ అన్నాడు.
"ఈ స్థలంలో ఇసుకతో ఇల్లు కట్టడం, అందులో కాపురం చేయటం, నదీగర్భంలో నివసించినట్టే నా కాపురం నట్టేట కలిసేదే_"
"ఎందుకూ? నీవు కోరుతున్నదేగా?"
గోముగా అన్నాడు "మరయితే నేను కోరుకునేది ఇంకా ఒకటుంది. అది ఎవరు తీరుస్తారు."
విస్మయంగా అతనివైపు చూసి అంది "అదేమిటి! ఇంకో కోరికా? అయినా కనకదుర్గ దయ అంటూ వుంటే తీరడానికి కొదవేమిటి? చెప్పు విందాం!"