కానీ మనస్సుకి శాంతి చిక్కడంలేదు. అసలే దరిద్రుడు. పరమ నిర్భాగ్యుడు. పూటకి తికానా లేనివాడు. ఆకలితో దహించబడుతున్నాడు. ఎటుచూసినా మిఠాయి దుకాణాలు అయినా అందవు. ఆ స్థితి! లేచి ప్రారంభించింది. ఏ గోడపై ఎటుచూచినా ఆ ప్రభువు వాక్యాలే.
తూర్పుదిక్కుగా పెద్దపటం.... అందంగా ఆయిల్ పెయింట్ తో తన మిత్రుడు దక్షిణామూర్తి గీచియిచ్చిన శిలువ వేయబడిన స్వామి....
క్రిందే ఆయన మాటలు! నేనే జీవితాన్ని! నేనే మార్గాన్ని! నేనే సత్యాన్ని నన్ను నమ్ము.
"ప్రభూ! నా జీవానివి నీవు. నా జీవన ప్రదాతవు నీవు. మతానికి దూరంగా మమతకి సమానంగా తెగలకి అందకుండా అన్నిటికి నీవే వున్నావు. మానవులు సృష్టించుకున్న ఈ అజ్ఞానమయిన విషవలయంలో నన్ను చిక్కుకోనీకు. నా మార్గానికి మార్గదర్శకుడివీ, సహయాత్రికుడివీ నీవే! అంధకారమయమైన ఈ జీవితపు బాటలో దారి తెలీక గమనం తెలియక పయనిస్తున్న నాకు వెలుగును ప్రసాదించు ప్రభూ! దారి తప్పకుండా సరియైన మార్గంలో నిన్ను చేరుకునే మార్గంచూపు.... లింగ జ్ఞానాతీతమైన కుల మతాతీతమైన నీ సన్నిధిని చేరుకోనివ్వు. సత్యమే నీవు.... నీ మార్గమే సత్యమయింది.... నీవే సత్యానివి.... అంతే ప్రభూ యింకేమీ అవసరంలేదు."
ఆగకుండా ప్రవహిస్తున్న అశ్రుధారలు చారలు చారలుగా చెక్కిలి మీదుగా ప్రవహించి స్కర్ట్ ని తడిపేస్తున్నాయి. కన్నీటిని తుడుచుకుని చూచింది. నిత్యం నిర్మలంగా వెలుగుతున్న ఆయన్ని చూడలేక తల తిప్పింది.
ఎదురుగా కుడివేపు గోడపై బంగారు రంగులో మిల మిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఆయన స్వాంతన వాక్యాలు ప్రఖ్యాత ఆర్టిస్టూ నిర్మల హృదయుడూ అయిన మిత్రుడు గీచియిచ్చిన అతని వర్క్స్ తననెంతగా ఓదార్చుతున్నాయి.
"మీరు అడగటమే తరువాయి అన్నీ ఇచ్చేస్తాను. నీ దివ్యదర్శనానికి తలుపు తట్టండి. వెంటనే మీ బంటులా తలుపు తెరుస్తాను. నా కోసమయి మాతృ వాత్సల్యంతో, పితృ వాత్సల్యంతో, పుత్రవాత్సల్యంతో వెదకండి. ఎక్కడయినా కనిపిస్తాను."
మోకాళ్ళపై వంగి కూర్చుని చేతులు జోడించి నెమ్మదిగా ప్రార్ధించడం ప్రారంభించింది.
"అడుగుతూ ఉన్నాను ప్రభూ! నాకు మనశ్శాంతిని ప్రసాదించు. జీవన ప్రాంగణంలో ప్రవేశించిన కొన్ని క్షణాలకి అతని సన్నిధి సిద్ధించింది. అది పెరుగుతూ నన్ను పెంచింది. ప్రేమగా ఎందుకో ఎవ్వరూ తెలీకుండా నా ప్రేమలతను కొనలు తెంచి పారేశారు. కానీ వేరుబలంగా పాదుకొని ఉండడంతో అది తిరిగిసాగి పుష్పిస్తుంది. కానీ ఆ కుసుమాలు ఆ దేవుడి పూజకి పనికిరావట ప్రభూ. ఒకరి పూజకై అంకితమయినదాన్ని మరొకటి ఇవ్వలేను. అందుకే నీవే అందుకో ప్రభూ! నీవు నాటిన లతని, నీవు పెంచిన లతని నీవు పోషించిన లతని__నీకై నీవు పుష్పించేట్టు చేసిన లతని పూచినపూలు నీవికానీ ప్రభూ! ఈ పూలురాలి నిలబడి వాడిపోకముందే మట్టిలోబడి దుమ్ముకొట్టుకోకముందే నీవు గ్రహించు ప్రభూ! నీ చరణాలపై బడి పూజాకుసుమాలుగా శోభిల్లటంకంటే ఈ జీవన కుసుమానికి కావలిసింది ఏమీలేదు. అంతకన్నా కోర్కెలేదు.
నీ మందిరద్వారంవద్ద నిలువబడి తలుపు తట్టుతున్నాను ప్రభూ! నా మనస్సులో శాంతిద్వారాన్ని తెరువుముందు. నిలబడలేక మనస్సులో నిర్మలమయిన చిత్తంలో సదాబాధతో నిన్ను కొలువలేక వేగలేకుండా ఉన్నాను.
అతన్ని విడిచి వుండలేను. విడువకుండా ఉండలేను. దగ్గరగా వెళ్ళలేను. దగ్గరికి వెళ్ళే మార్గం ఆనలేదు. దూరంగా నిలిచే తెరువూలేదు. అగ్నికి సమీపంగా ఉన్న వెన్నని కరుగకుండా ఉండమంటే అది లీలా సాధ్యం ప్రభూ!
శాంతిని దయచేయమని అడుగుతున్నాను. ఆలోచనల్ని నశింపచేయమని అడుగుతున్నాను. నీ భవన ప్రాంగణానికి వచ్చి ద్వారంముందు నిల్చుని శాంతినిలయానికి దారి చూపమని తలుపు తడుతూ అడుగుతున్నాను. తెరు ప్రభూ తలుపులు తెరు. నా నిర్మలమయిన మనస్సులో అశాంతి నెలకొనకుండా ఉండేట్టు శాంతిద్వారాన్ని తెరు ప్రభూ!
వెతుకుతున్నాను.... అనుక్షణం వెతుకుతున్నాను ప్రభూ! కాని దొరకడంలేదు. చిత్తానికి శాంతిలేదు. తనువుకి మాత్రం బంధం వుంది.
ఏ సంబంధమూలేని అనుబంధాన్ని ముడివేసిన నీవు దాన్ని శాశ్వతం చేయకుండా మధ్యలో తెగకుండా ముడి వూడకుండా చేయటమేమిటి ప్రభూ!
అతనితో తిరిగి సన్నిహితం ఎందుకు తెచ్చావు? ఎందుకిలా వేధిస్తున్నావు? ధర్మసమ్మతం కాదని తెలిసీ దానిని వదిలించుకోవాలని, నిశ్చయించుకుని ప్రయత్నిస్తున్నా. యింకా మనసుకి జీవితంపై లాలనత ఎందుకు తగ్గటంలేదు ప్రభూ! ప్రభూ.... ప్రభూ.... జవాబుని అడుగుతున్నాను కావాలి. మార్గాన్ని వెదుకుతున్నాను దొరకాలి. తలుపుని తడుతున్నాను తెరవాలి. మార్గాన్ని వెదుకుతున్నాను దొరకాలి. తలుపును తడుతున్నాను తెరవాలి. నీవేనా అల్పజీవితానికి జ్యోతివి. సత్యానివి. నాకు దారిచూపాలి.... చూపలేవా! చూపరాదా! దయరాదా.
అలాగే శిలువను కళ్ళకద్దుకుంటూ కన్నీటితో తడుపుతూ బిగ్గరగా ఏడుస్తూ క్రీస్తుపటంముందు కూలబడి పోయింది.
26
కనకదుర్గ దర్శనానికై రెండు మెట్లు ఎక్కుతూ అడిగాడు వేణు. "విరజా! ఇంతకు పూర్వం యెప్పుడయినా కలకత్తా కాళిని చూశావా!"
నవ్వుతూ అంది "ఉహూ! బొంబాయి చేరాక కాన్వెంటులో చేరి డిగ్రీ తీసుకునేవరకూ దాదర్ పరిసర ప్రాంతాల్ని దాటి ఎరుగను. కాన్వెంటు తప్పితే యిల్లు అంతే వేణూ! ఇక ఇక్కడకు వచ్చాక దారిలో చూసినవి కాక బయలుదేరి దేశాన్ని చూడటం ఇదే మొదలు. ఈ ప్రాంతాలు అన్నీ మన ప్రాంతానికి విభిన్నంగా వున్నాయి. ఇక్కడ భాష, కల్చర్ వేషం ఆహార వ్యవహారాలూ అన్నీ మనకు సరికొత్తగా వింతగా కనిపిస్తున్నాయి.
"ప్రాంతీయ అభిమానం అలా అనిపిస్తుంది విరజా! తుంగభద్ర నీళ్ళు తాగుతూ హంద్రీనదిలో సాయంకాలం గడిపే నీకు కృష్ణమ్మ నీళ్ళు నచ్చవేమో! అయినా ఈ ఈ దుర్గమ్మ శక్తి చాలా గొప్పది విరజా! ఎలాంటి వారిపైన అయినా తన ముద్రని వేయకుండా వదలదు. నిన్నేం చేస్తుందో మరి?"
చిరునవ్వు నవ్వుతూ అంది. "నీకా భయం అక్కర లేదు. వేణూ! అసలు నాలో ఆ భయమేలేదు. నాకు అన్యమత సాంప్రదాయాలన్నీ తెలుసు. హిందూ మతాన్ని గురించి కానీ ముస్లిం మతాన్ని గురించికాని ఆయా సామాన్య వ్యక్తులకంటే చాలా ఎక్కువే తెలుసు. నాపై ఏనాడో ఆదిశక్తి తన ప్రభావాన్ని ముద్రించింది. ఇక ఈ దుర్గమ్మ ఏం చేస్తుంది!"
"ఏమో మరి చూడు అనుభవించు నీకు తెలుస్తుంది"
మరేమీ జవాబు చెప్పలేదు. నిశ్శబ్దంగా కొండపైకి చేరుకున్నారు. అంత ఎత్తునుంచి విజయవాడ నగరం భూమాత జడ కుప్పెలా కనిపిస్తోంది. టికెట్టు కొనుక్కుని కొబ్బరికాయ కుంకుమ తీసుకుని లోపలకు వెళ్ళారిద్దరూ.
కనకదుర్గకు ఎదురుగా నిల్చుని జోడుగా నమస్కరించారిద్దరు. మెరుస్తున్న వజ్రపు ముక్కుపుడక మీదుగా ఇద్దర్నీ చూచి నవ్వింది జగన్మాత.
బెంగాలీ యువతిలా తెల్లని చీరను కట్టుకుని అచ్చు ఓ బ్రాహ్మణ యువతిలా నిల్చుంది ఆమె.
"జగన్మాతా, అనంతమయిన ఈ సృష్టిలో స్త్రీకి స్వాతంత్ర్యం యిచ్చికూడా యింత ప్రాధాన్యతని ప్రసాదించి కూడా ఆమె మనసుకు కళ్ళెం బిగించావెందుకు?"
స్వాతంత్ర్యం వుండీ లేనట్టుగా యెప్పుడూ పరిస్థితులకి లొంగిపోయి మనస్సుని చంపుకోవటం తప్ప మరేమీ చేయలేని స్థితిని ఎందుకు కలిగించావు? చెప్పమ్మా?
నాకు నీ మౌనం అర్ధంకావటంలేదు. నన్ను చూచి నీవు చిరునవ్వు ఎందుకు నవ్వుతున్నావో అసలే అర్ధం కావటంలేదు, నేనూ ఆడదాన్నే__కోపంవస్తుంది చెప్పు__
నాకు నీ సమాధానం కావాలి. శాంతిని అన్వేషిస్తూ నీ దగ్గరికి వచ్చేవారికి మనసుల్లో నిప్పులు జల్లుతున్నట్టున్నావే నీవు. నా గుండె చల్లబడి నాలుగురోజులు కాలేదు. తిరిగి ఎందుకు జ్వలింపజేస్తున్నావమ్మా!
నా ప్రక్కనే నిలబడ్డ నీ వేణుని నా వాడనుకుని గర్వించటం తప్ప నేనేమీ చేయలేక పోతున్నాను. అదయినా మనసుని దాటిరానివ్వలేదు. మనసు విప్పలేక విప్పకుండా వుండలేక నన్ను నేను హింసించుకోవటం! ఇలా ఎన్నాళ్ళు తల్లి?
అందని వస్తువుపై ఆశ కల్పించటం ఎందుకు, ఆశ పడుతున్నారని మరీ అందకుండా చేసి అవహేళన చేయటం ఎందుకు? మనస్సుని సృష్టించిన యాంతవు. దీని చర్యకు మాత్రం కారకురాలివి కాదా, బాధ్యత నీది కాదా?