Previous Page Next Page 
విరిజల్లు పేజి 36


    ఆమె పాదాలపై తడిగా అంటుకున్న ఇసుకను తుడుస్తూ అన్నాడు. "యీ ఇంటిలో నాతోపాటు నీవూ వుండాలి విరజా! నీవు లేనిది ఏ జీవితమైనా నాకు అసంతృప్తి. నన్ను అర్ధం చేసుకునేవారులేరు.... సర్వదా నా మాటలకి విపరీతార్థాలు తీసి తనను తను కించపరుచుకుని నన్ను శంకిస్తూ శాంతి అనేది లేకుండా చేస్తోంది సావిత్రి.... ఏమని సముదాయించాలి. ఎలా విడమరచి అర్ధం అయ్యేలా చెప్పాలో నాకు తెలియటం లేదు.... బ్రతికినన్ని రోజులూ నన్ను భాగస్వామినిగా పొందలేకపోయానే అనే బాధ.... పొందని వారితో సుఖం కూడా పొందలేక బాధ.... ఇన్ని బాధలతో ఎలా జీవించను విరజా....
    తలెత్తి ఆమెవైపు సూటిగా చూసి ప్రశ్నించాడు. హఠాత్తుగా అతను అలా ఆమె మ్రాన్పడి అంది. "నీ మనసులోని మాట నా కర్ధమౌతోంది వేణూ! అశక్తులమై అలా కష్టాలుగానీ, నష్టాలుగానీ అనుభవించవలసిన వాళ్ళమే కానీ అన్యాయమని ఎదిరించి నిలిచే హక్కు మనకులేదు. ఈ ప్రపంచ నాటక రంగంలో ప్రేక్షకుడు, దర్శకుడు, రచయిత, సంగీత కర్త రంగాల వారికుడు అన్ని ఆయన వొక్కడే. ఏం మార్చాలన్నా ఏది మార్చినా ఆయన హక్కే. మనదేం లేదు. నీ భార్యను అర్ధం చేసుకో. గుడ్డిగా ఆరాధించటం తప్ప ప్రతిఫలంగా ప్రేమని ఆశించటం తప్ప మరేమీ చేతకాదు కొందరు ఆడవాళ్ళకి. అలాంటివారిని ఆదరించాలి.... అంతేకాని వాళ్ళు తెలియని తనంలో చేసే వాటికి అర్ధాలు కలిపించుకోకూడదు. అక్కడ నీవు చూడవలసింది వారి మనస్సు.... మాటలు కాదు. యిందరి జీవితాలు జీవనాలు దిద్దుతున్నావు. నీ జీవితాన్ని, నీ సుఖాన్ని, నీ యింటిని, నీ యిల్లాల్ని నీకు అనుకూలంగా మార్చుకోలేవా? పోనీ నీవైనా మార్చుకోలేవా?"
    నిట్టూర్చాడు. నిరాశామయమయిన చూపులతో తలెత్తి చూసి ఆమె పాదాన్ని అరచేతితో మృదువుగా రాస్తూ అన్నాడు.
    "సర్వ చక్రవర్తియైన శ్రీనివాసమూర్తి దయచూస్తే చెప్పలేను. మానవ మాత్ర ప్రయత్నంలో నా కుటుంబ జీవితం బాగుపడేట్టు లేదు.... ఆవేకు నాలో శాంతిలేదు__సుఖమూ లేదనుకుంటోంది విరజా! నాకామెపై అనురాగం వుంది. మరదలిగా అభిమానించాను, ప్రేమించగలను భార్యగా కానీ నన్ను అనుక్షణం అనుమానిస్తూ నా మాట ప్రతిదీ బూటకం అనుకుని యెదురుగా అంటూంటే ఆమెకి సమాధానం చెప్పలేక ఆమె సహజత్వానికి ఆమె అమాయకత్వానికి అను మరెందుకయినా సరే ఆమె కర్మకి ఆమెను వదలి జాలిపడటం తప్ప, మరేదీ చెయ్యలేక పోతున్నాను. నీవు తప్ప నన్ను ఎవరూ అర్ధం చేసుకోలేరు విరజా!"
    ఆమె మౌనంగా ఇసుకలో గీతలు గీయసాగింది ఆలోచనా భారంతో.   
    ఒక్కక్షణం ఆగి వ్రేలిని పట్టుకొని అన్నాడు. "ఆలోచన ఎందుకు విరజా! యిప్పుడే కనకదుర్గ యెదురుగా కుంకుమ పెట్టుకున్నావ్, గాజులు ధరించావ్!"
    అతని మాటకు అడ్డొస్తూ అంది. "ఇదేమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావ్? ఆలోచన ఏముంది అవన్నీ. యింతకుముందు భరించాల్సింది తెలియక వేసుకోలేదు. దానిలో ఏముంది?"
    లేత తమలపాకుల్లాంటి ఆమె పాదాన్ని ఇసుకలోకి రాస్తూ అన్నాడు మెల్లగా.
    "ఆలోచన ఏమీ లేదా? అయితే యింకేం విరజా! యింకేం చెప్పకు పద. ఈరోజునే ఇప్పుడే దుర్గ సాన్నిథ్యంలో కళ్యాణం చేసుకుందాం. ఆమె కుంకుమలో మెరిసిపోతున్న నీ భాలభాగాల కళ్యాణ తిలకం దిద్దనీ."
    బంగారంకంటే చక్కగా శంఖలా మెరిసిపోతున్న నీ గళసీమ నల్ల పూసల సొరుతో ద్విగుణీకృత అందంతో మెరిసిపోయేట్టు చేయనీ."
    కన్నీరు తిరిగింది. బరువుగా కనురెప్పల్ని యెత్తి అతనివేపు ఒక్కక్షణం చూసింది. టపటపమని రాలిన కన్నీరు ఇసుకపైబడి వెంటనే యింకి పోయింది.
    గద్గద స్వరంతో అంది "నాకా యోగ్యత అదృష్టం లేదు వేణూ! నేను నీ ప్రేయసిగా అభిమానురాలిగా పూర్వజన్మలో నీ భార్యగా కాబోయే జన్మలో నీ ఇల్లాలి నవటంకోసమై కోరికతో తపస్సుజేసే భక్తురాలిగా మాత్రమే వుండాలిగానీ, ఈ జన్మకి నిన్ను భర్తగా పొందేయోగం లేదు. అదృష్టంలేని దానికోసమై ఆశించటం తప్పే వేణూ!
    "ఏమిటి తప్పు? ఎందుకు లేదీ యోగ్యత, నన్ను కాదనేవారు ఎవరు? నిన్ను_నిన్ను పెళ్ళిచేసుకుంటే ఆమె ఏమయినా అంటే విడాకులిచ్చేస్తానామెకి. అవసరమయితే నా పై తృకమయిన ఆస్తినంతా వదలి పెడతాను.
    అహరహం అంతరంగం మండుతోంటే ఆజ్యాన్ని వేసి దాన్ని మరీ దగ్ధంచేసే వారితో సుఖభోగాలు అనుభవించే దానికన్నా అమృతం కంటే మించిన చల్లని చూపుతో ప్రేమగా చూచేవారితో బ్రతుకుతూ ఎంత కష్టాన్నయినా వరించటం మంచిది విరజా.
    కనకదుర్గ ఎదురుగా కళ్యాణం చేసుకుందాం _ కాదా శక్తిముందు నిలువలేనంటే రిజిష్టర్ మ్యారేజి చేసుకుందాం."
    "హుఁ.... రిజిష్టర్ మేరేజి అంత సులభంకాదు వేణూ! తొందరపడి పెళ్ళి చేసుకుంటే తర్వాత ఎన్ని చిక్కులొస్తాయో తెలుసా! ఎవర్నయినా లాయర్ ని అడుగు చెబుతాడు. పైగా ఎవరెన్ని అన్నా ఏది ఏమైనా పరవాలేదు. అనుకున్నా చివరికి మనకు కలిగే సంతానం అక్రమ సంతానం క్రిందే లెక్కేస్తారు. కానీ వద్దు వేణూ అంతమాట అనటానికి కూడా నోరు రావటంలేదు. ఈ పెళ్ళి విషయం ఇక ఎత్తవద్దు. ప్రస్తావిస్తే చెబుతున్నా విను. ఎవరయినా మనల్ని కోర్టుకీడిస్తే యిక మనిద్దరం కలిసి కాపురం పెట్టాల్సింది జైల్లోనే. చట్టసమ్మతంకాని జీవితం మనకెందుకు ధర్మసమ్మతమయిన బంధాన్ని కాలదన్ని అధర్మబద్ధంగా జీవించాలని కోరుకోవటం ఎందుకు?"
    ఆవేశం తగ్గని ఆలోచనతో మళ్ళీ అన్నాడు. అలాగే కులంపోనీ, మతంపోనీ చివరికి ప్రాణం పోయినాసరే! నిన్ను భార్యగా పొందితే చాలు_ నీవు నా భార్యవు అన్న ఊహ నిలిస్తేచాలు. నీ యిష్టం చెప్పు విరజా! నన్ను చేసుకోవటం ఇష్టంలేక అలా అంటున్నావా?"    
    నిషూరంగా చూస్తూ అంది "ఆ మాట ఎలా అనగలుగుతున్నావ్ వేణూ! అవును నీవు మారిపోతున్నావు_ నా వేణువికావు నీవు. మరెవరో ప్రవేశించారు లేకపోతే నా కయిష్టం అని అడగటం నేను వినకూడని వినరాని మాట_నన్ను_నన్ను అంత క్రిందగా దించివేయకు వేణూ! నాయిష్టం నా మనసు అన్నావు. అది తెలుసుకొని కూడా మళ్ళీ ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతాను వేణు. అయినా చెబుతున్నాను విను. నా ప్రాణమయినా వదలగలను కాని నిన్ను విడిచి ఉండలేను. అది నిజం_ కాని ఈ జన్మకిక భర్త అని సంఘం దృష్టిలో పిలుచుకునే అదృష్టంలేదు. ప్రియునిగా ఆరాధ్యదైవంగా మనసులో నిలిచిన నిన్ను పూజించుకోవటంతప్ప నా జీవితానికి మరో లక్ష్యంలేదు కాని చెబుతున్నాను విను. ఇహముందు ఎప్పుడూ మన వివాహ ప్రసక్తి తేవద్దు. మనకి పెళ్ళయింది పూర్వజన్మలో కాని, వచ్చే జన్మలో కాని_ఇది సంధి జీవితం నాకు_నా యిష్టం నా యిష్టం అంటావెప్పుడూ, నా ఇష్టమంటూ ఒకటి ప్రత్యేకంగా ఎప్పుడూ లేదు. నీ యిష్టమే నా యిష్టం నేనే నీవే నేను.
    అప్పుడయినా ఇప్పుడయినా నీవే నా భర్తవు. సామాన్యులకి పెళ్ళి కావాలి_తాళికావాలి. మనకెందుకు? నేను నీ భార్యని ఈ తుచ్చమైన శరీరంపై నీకు భ్రమలేదు. నీకు తెలుసు. సదా నేను నీ గుండెల్లో నిలిచే ఉన్నాను. ఇక భౌతిక శరీరాలు కలిసి జీవితే ఎంత జీవించకుంటే ఎంత? నీవు ఆ జన్మలో కట్టిన తాళి యింకా యీ జన్మలోనూ వుంది. యీ దేశంలొ ప్రతివ్రత చావదు. భర్త వెనువెంటనే నీడలో వస్తుంది. ఒక్కోసారి విపరీతమైన వెలుగులో ఆ నీడ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన నీడ అనేది లేకుండాపోదు. అది ఎప్పుడూ వుంది. నీడలేని మనిషిలేడు. మనిషిలేని నీడ లేదు. నీవు లేని నేను లేను. నేను లేకుండా నీవు ఉండవు. కానీ దయచేసి మళ్ళీ వివాహపు ప్రసక్తి తేవద్దు. ప్లీజ్_నన్ను క్షమించు_ నా వేణు అవమానానికి అన్యాయానికి అవగుణానికి లోను కాకూడదనే కోరిక తప్పమరేమీ లేదు. నాలో నన్ను నన్ను మరేమీ ప్రశ్నించకు. నా గుండె పగిలిపోతోంది యీ కృష్ణలోనే కలిసిపోదునా. నాకంత కంటే గత్యంతరం కనిపించటంలేదు."
    నల్లని కృష్ణానదిలొ ఆమె కజ్జల జలం జలజలా కలిసి ప్రవహించసాగింది.


                                                         28


    "ఇంకేం బొట్టు పెట్టించారు. కట్టు మార్పించారు అలాగే....అలాగే ఇల్లాలిగా కూడా చేసుకోరాదూ"
    నర్శింగ్ హోం నుంచి వచ్చీ రాకముందే కప్పుని అందిస్తూ అంది.
    టై విప్పబోతున్న వాడల్లా ఆమె ముఖంలోకి చూశాడు. ఆ వదనంలొ అతనికెప్పుడూ అమాయకత, అభిమానం, తెలియనితనం కనిపిస్తూంది. మచ్చుకైనా యీర్ష్యా అసూయ, క్రోధం, క్రౌర్యం కనిపించే ముఖంలో దోషం ఉందో చదివే నేత్రాలలో ఉందో తెలియదు.
    "ఏం అలా చూస్తారు? నేనేం కాని మాటలంటున్నానా_వెంటవేసుకుని తీర్ధయాత్రలు చేసివచ్చారు. క్రైస్తవురాలిని హిందూ స్త్రీగా మార్చారే అలాగే మతం కూడా ఇప్పించరాదూ! మనసే ఇచ్చిన వారికి మమతే దానం చేసిన వారికి మతం ఇప్పించటం ఏమంత కష్టంలెండి?"
    అతనేమీ జవాబు చెప్పకుండా వుండటంతో రెచ్చిపోతూ అంది. కోపంలో అర్ధంలేకుండా మాట్లాడే వారికి అవతలివారు జవాబు చెప్పకపోతే మరీ రెచ్చిపోతారు.
    "ఎందుకు జవాబు చెప్పరు?" అయినా ఇలాంటి వాటికి జవాబు ఎందుకు చెబుతారులెండి? అసలు నేనెవర్ని? మీ మనసు దోచుకున్న దానిని. మీ మనసులో చోటు చేసుకున్న దాన్ని? మనిషికి ఓ భార్య వుండాలని మర్యాద మేరకు మాంగల్యం నా మెడకి బిగించారే కానీ మనసైన మనువు తాళికట్టుకున్నా తలంబ్రాలు పోయకున్నా వేరే వుంది లెండి"

 Previous Page Next Page