"రేప్ చేయబడిన కుమారి రేఖ తండ్రి పోలీసు కంప్లెయింట్ యిచ్చారు. మీమీద పాతకక్షతో రాధదేవిగారు యీ పని ఎవరికో డబ్బిచ్చి చేయించారని, ఇందులో ఆమెకొడుకు పాత్రకూడా వుండవచ్చని తమకు గట్టి నమ్మకం వుందని దోషులను పట్టి శిక్షించాలని కోరుతూ కంప్లెయింట్ యిచ్చారు. రాధ మొహం తెల్లగా పాలిపోయింది. "నేను చేయించానా! ఎంత న్యాయం! యిన్ స్పెక్టర్! మీరూ చూశారు రేఖ దుస్థితికి నేనెంత బాధపడ్డానో. అందుకు ఆ రౌడీల గురించి ఆచూకీ యిచ్చింది నేను" అంది ఆందోళనగా. శ్యాం కూడా యీ వ్యవహారం యింతదూరం వెడుతుందని ఎదురుచూడలేదేమో తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు.
"నిజానిజాలు మాకెలా తెలుస్తాయి మేడమ్... ఆ రౌడీల గురించి చెపితే మీ మీద అనుమానం రాకుండా వుంటుందని చెప్పారని ఆయనంటున్నారు. యింతకీ అనుమానితులు అన్నాంగాని మీరే చేశారని అనలేదు కదా? మీరు చెప్పదలచింది మేజిస్ట్రేట్ ముందు చెప్పవచ్చు. అనుమానం నిరాధారమని మీరు తేల్చలేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయించవచ్చు. అనుమానానికి తగిన ఆధారాలు లేవని ఆయననుకుంటే మిమ్మల్ని వదిలేస్తారు.
"ఇంతకీ ఏ ఆధారంతో ఆయన రాధమీద కేసు పెట్టాడు.... ఎవిడెన్సు లేకుండా ఎవరో ఏదో అన్నారని మేజిస్ట్రేట్ ప్రశ్నించే హక్కు వుంటుందా?" రాజారాం అడిగాడు.
నీవెవరన్నట్టు చూశాడు యినస్పెక్టర్.
"ఆయన రాజారాంగారని మా స్నేహితులు, శ్రేయోభిలాషులు" రాధ అతని భావం గుర్తించి అంది.
"సార్... వెంటనే పూర్తి ఎవిడెన్సు లేకపోయినా, అనుమానితులుగా ప్రశ్నించే హక్కు మేజిస్ట్రేట్ కి వుంది. ఆయన ప్రశ్నలకి సమాధానాలు సంతృప్తికరంగా వుంటే విడిచి పెట్టవచ్చు. యిటీజ్ అప్ టు హిమ్... అనుమానాస్పదంగా వుంటే అరెస్ట్ చేసి కోర్టులో కేసు అయేవరకు బెయిల్ మీద విడిచిపెట్టవచ్చు. బెయిల్ యిచ్చేది లేనిది ఎగైన్ యిటీజ్ అప్ టు హిమ్. సాధారణంగా మర్డర్ కేసుల్లో కళ్ళారా చేసినవారిని ఎవరయినా చూస్తే అలాంటివారికి తప్ప మామూలుగా ఇలాంటి కేసులకి బెయిల్ తప్పకుండా యిస్తారు" యిన్ స్పెక్టర్ వివరించాడు. ఆ యిన్ స్పెక్టర్ పాపం కుర్రాడు. రాధాదేవి ఆస్పత్రికి రావడం, రేఖమీద ఎంత సానుభూతి చూపిందో, తమకి ఆ రౌడీల గురించి ఆచూకి యివ్వడం తెలుసు. చదువుకుని, ఉద్యోగం చేసే ఆమెపై అతనికి గౌరవం వుంది. యీ పని ఆమె చేసిందంటే అతనికి ఎంతమాత్రం నమ్మకంలేదు. కాని అతని డ్యూటీ అతను చెయ్యక తప్పదు.
"ఇన్ స్పెక్టర్! మాధవరావుకి నామీద అనుమానం వుంది. యిందుకు శ్యామ్ ది ఏముంది? నేను వస్తాను నన్ను తీసికెళ్ళండి" అంది ఆందోళనగా.
"సారీ మేడమ్, నా డ్యూటీ నన్ను చేయనీండి, పదండి వెడదాం."
రాధ ఆందోళనగా రాజారాంవంక చూసింది. "యిన్ స్పెక్టర్, ఆమె తరపున మాట్లాడడానికి మేము లాయర్ ని ఏర్పాటు చేసుకోవచ్చునా.... రాధా! నేను లాయర్ తో మాట్లాడి తీసుకొస్తాను. అంతవరకు నీవు ఏమీ మాట్లాడకు" అన్నాడు.
నిండా మునిగాక చలి ఏమిటన్నట్టు చూసింది రాధ, "లాయరు ఎందుకు రాజారాం, ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్, ఆ మాత్రం జవాబులు చెప్పగలను. చెయ్యని నేరానికి ఎందుకు భయపడాలి" అంది నిబ్బరంగా.
"అది కాదు, లా పాయింట్లు..."
"సార్... యిప్పుడు కేవలం అనుమానితులా కాదా అనడానికి ఎలిబీ గురించి దాని గురించి అడుగుతారు. మేజిస్ట్రేట్ వీరి జవాబులతో సంతృప్తి పడకపోతే అప్పుడు లాయరుతో మాట్లాడవచ్చు మీరు. పదండి మేడమ్ ఆలస్యం అయింది" యిన్ స్పెక్టర్ కాస్త అసహనంగా అన్నాడు.
"సరే, ఎందుకన్నా మంచిది లాయర్ తో మాట్లాడుతాను, రాధా మీరు వెళ్ళండి, ధైర్యంగా జవాబులు యివ్వు. శ్యామ్ అమ్మకి ధైర్యం చెప్పు" రాధ చీర మార్చుకుని, బ్యాగ్ పట్టుకుని ఇల్లు తాళం పెట్టింది. రాధ, శ్యామ్ పోలీసుజీపులో కూర్చున్నారు.
ఇంటిముందు పోలీసు జీపు రావడం, యిన్ స్పెక్టర్ రావడం చూసి యిరుగు పొరుగు కుతూహలంగా ఏమిటోనని చూశారు. యింటిముందు తచ్చాడారు. రాధ, శ్యామ్ పోలీసుల వెంట జీపులో ఎక్కి కూర్చుని వెడుతుంటే తెల్లబోతూ చూశారు. రాజారాంని అందరూ చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. "ఆ, ఏం లేదు. ఆ రేప్ కేసులో ఎవరో రౌడీలు అనుమానితులు అంటూ రాధ చెప్పిందట. అదేదో అడగడానికి తీసికెళ్తున్నారు. అంటూ యింకేం అడిగే అవకాశం యివ్వకుండా లాయరుని కలవడానికి వెళ్ళిపోయాడు.
20
"రాధాదేవిగారూ! కుమారి రేఖకి జరిగిన మానభంగంలో మీ చెయ్యి వుందని కుమారి రేఖ తండ్రి మీమీద కంప్లెయింట్ యిచ్చారు. యిందుకు మీ సమాధానం ఏమిటి? మేజిస్ట్రేట్ మర్యాదగానే అడిగాడు. రాధాదేవి బాహ్యరూపం, ఆమె మొహంలో కనబడే సంస్కారం చూసి ఆమె చేస్తున్న ఉద్యోగం అన్నీ తెలిసి మర్యాదచూపించి కూర్చోమని కుర్చీ ఆఫర్ చేసి అడిగాడు.
రాధ తొణక్కుండా నిబ్బరంగా చూసింది. "రేఖమీద జరిగిన అత్యాచారంలో నా పాత్ర వుందని ఆయన ఏ ఆధారంతో అన్నాడు? నా పాత్ర ఏ విధంగా వుందన్నారో చెప్పగలరా సార్."
"ఆయనమీద పాతకక్షతో మిమ్మల్ని గురిచేసిన అవమానానికి ప్రతీకారంగా ఆయన కూతురునిలా చేసి పగసాధించి తృప్తిపడాలని మీరే ఎవరిచేతో డబ్బిచ్చి చేయించారని ఆయన అంటున్నారు. దీనికి మీరేం చెప్పగలరు."
"సార్, ఎప్పుడో యిరవైఏళ్లక్రితం ఆయనమీద వున్న కోపం చూపడానికి ఒక అమాయకురాలైన యువతి జీవితాన్ని ఎన్నుకునేటంత కుసంస్కారం నాలో లేదని చెప్పగలగడం తప్ప యింకేం చెప్పలేను, నేననుభవించిన హింస, అవమానం మరో స్త్రీకి కలిగించేటంతటి నీచత్వం నాలోలేదు. రేఖతండ్రి మాధవరావు అనికూడా నాకు తెలియదు. యిరవైఏళ్ల క్రితం అతన్ని విడిచిపెట్టి వచ్చాక మళ్ళీ అతని గురించి తెలుసుకోవాలనికూడా తలచలేదు. నా ధ్యేయం, ఆ ఆశయం, నా గమ్యం అంతా నా కొడుకు మీదే పెట్టుకుని రోజులు గడిపాను. రేఖ ఎవరో తెలిస్తేగదా నేను ఆమెమీద అత్యాచారం చేయించానని చెప్పడానికి?