Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 34

 

    "అది కాదండీ!...." అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుతూ పానకాలు , తలవంచుకునే.
    "మరి?......"
    నేను మిమ్మల్నే నమ్ముకున్నాను ఇన్నాళ్ళు. మీరు తప్ప నాకెవ్వరూ దిక్కులేదు. నన్ను కోపడ్డా, మండలించినా , బుజ్జగించినా అంతా మీరే..." దుఖంతో మాట్లాడలేక , జేబులో రుమాలు కోసం చూసి దొరక్కపోతే బుష్ కోటుతోనే కళ్ళు తుడుచుకున్నాడు పానకాలు.
    "అరెరే! ఏడుస్తున్నావెందుకయ్యా? చెప్పానుగా నాకు నీమీద కోపం లేదని. పైగా నువ్వంటే నాకు జాలి....."
    "నాకు తెలుసు సార్! అందుకనే మిమ్మల్ని వేడుకుంటున్నాను జన్మ జన్మలకి మీ ఇంటి ముందు కుక్కలా పడుంటాను. ఒక్క సహాయం చేయండి ప్లీజ్!" అన్నాడు.
    "ఏం మాటలివి పానకాలూ! నీకేం కావాలో చెప్పు" అన్నాడు జగన్నాధరావుగారు. ఎప్పుడూ ఏమీ అడగని పానకాలు ఇంత ఇదిగా కాళ్ళ మీద పడి బతిమాలడంతో , అయన మనసు ద్రవించిపోయింది. "నాకేదైనా మంచి ఉద్యోగం వేయించండి. నా భార్యకీ, లోకానికి అందరికీ లోకువై పోతున్నాను. నా భార్య సంపాదన తింటూ బతకాలంటే నాకు సిగ్గుగా ఉంది" అన్నాడు తలవంచుకునే.
    "అట్లాగేలే! ఏదో ఒకటి చూద్దాం" అన్నారాయన. "వీలైనంత త్వరలో చూడాలి సార్!" అన్నాడు పానకాలు. "డోంట్ వర్రీ! చెప్పావుగా!" అంటూ ఫోన్ వొస్తే లోపలికెళ్ళి పోయారాయన.
    తెలికపడ్డ హృదయంతో ఆఫీసు గదిలో కొచ్చి కూర్చున్నాడు పానకాలు.
    అతడు అడిగిన వేళా విశేషమో, లేక జగన్నాధరావుగారి మంచి హృదయమో గానీ "ఇండియన్ మెటల్ వర్క్స్' కంపనీలో ఒక మేనేజర్ ఉద్యోగం ఖాళీగా వుందన్న వార్త తెలిసింది జగన్నాధరావుగారికి. లంచాలు కుమ్మరించడం, పెద్ద పెద్ద రికమెండేషన్లు తెచ్చుకోవడం చాతకాకపోతే గుమస్తా వుద్యోగం కూడా దొరకని ఈ రోజుల్లో జగన్నాధరావుగారి పట్ల వున్న గౌరవంతో , అయన మాట మీద ఆ మేనేజర్ ఉద్యోగాన్ని పానకాలుకి ఇచ్చారు. నెలకి అయిదారు వేలు జీతం, కారూ క్వార్టర్స్ అన్నీ వున్న ఆ ఉద్యోగం సంగతి వినగానే సంతోషం పట్టలేకపోయాడు పానకాలు. కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ జగన్నాధరావుగారి కాళ్ళ మీద పడ్డాడు. "నా పేరు నిలబెట్టు బాబూ! బుద్దిగా ఉద్యోగం చేసుకో! అప్పుడప్పుడు కనిపిస్తూ వుండు" అంటూ అన్ని విషయాలు వివరించి చెప్పాడు జగన్నాధరావు గారు.
    ఆ రోజు భోజనం దగ్గర కూర్చుని తన ఉద్యోగం సంగతి ఝాన్సీతో చెప్పాడు. కనీసం పౌరుషంతోటైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించినందుకు అభినందించింది ఝాన్సీ.
    మర్నాడే చార్జి తీసుకున్నాడు పానకాలు. అతని భాషనీ, పర్సనాలిటీనీ చూసి 'ఇతనా జగన్నాధరావుగారి కాండిడేటు! అని ఆశ్చర్యపోయారు మిగతా మేనేజర్లు.
    తన కోసం కేటాయించిన కారు తీసుకున్నాడు పానకాలు. వారం తిరక్కుండా 'క్వార్టర్స్' కి వెళ్ళిపోయారు.
    "మీరు ఆఫీసుకు వెళుతూ వెళుతూ నన్ను బ్యాంక్ దగ్గర దింపి వెళ్ళండి" అంది ఝాన్సీ.
    'అహు....కుదరదు . నీ దారిన నువ్వెళ్ళు" అన్నాడు పానకాలు.
    "నేను వెళతాను. కానీ అది నీకే చిన్నతనం. మీరేదో మాములు ఉద్యోగం చేస్తున్నారనుకుంటారు అందరూ......."అంది అతి మాములుగా మాట్లాడుతూ ఝాన్సీ.
    పానకాలు ఒక్క క్షణం ఆలోచించాడు. ఝాన్సీ మీద ప్రేమ లేకపోయినా నలుగురిలో గొప్ప కోసం సరేనన్నాడు. తను ఆఫీసులో దిగిపోయి కారుని ఝాన్సీకి పంపేడు. ఝాన్సీ నవ్వుకుంది.
    నెల తిరగ్గానే జీతం తెచ్చి ఝాన్సీకి చూపించాడు. అతని చేతిలో ఒక వంద రూపాయలుంచి తక్కినవి తీసి తన పర్సులో పెట్టుకుంది. "అదేమిటి? అంతా నువ్వే తీసేసుకున్నావ్?" అరిచాడు పానకాలు.
    "బియ్యం , పప్పులూ, ఉప్పులూ అన్నీ ఎక్కడి నుంచోస్తాయి? ఖర్చులు పోను మిగిలితే మీకే ఇస్తాను లెండి....." అంది నిర్భయంగా. మాట్లాడలేకపోయాడు పానకాలు తన బలహీనతకి తనే నవ్వుకున్నాడు అసహ్యించుకున్నాడు.
    ఆఫీసులో తనంటే అందరూ వణుకుతారు. తనని చూస్తూనే పరుగెడుతారు. కానీ భార్య మాత్రం ఖాతరుచెయ్యడం లేదు. తనమాటే నెగ్గించుకుంటుంది. తన ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తోంది. చేల్లిలి పెళ్ళి కుదిరిందని అక్కయ్య ఉత్తరం రాస్తే పదివేలు నగదూ, నాలుగు పట్టు చీరెలూ, రెండు తులాల బంగారమూ అంతా పంపించింది. ఇదేమిటి అని అడిగితే "అంతా నా సంపాదనలోంచి ఇచ్చాను అంతే మీ కనవరం" అంది విసుకున్నాడు పానకాలు. కొత్తలన్నంత కోపం వస్తుంది. మళ్ళీ తిరిగి కొడుతుందేమోనన్న భయంతో ఊరుకుంటున్నాడు. నిద్దర పోతున్నప్పుడు మెల్లగా సిగరెట్టుతో బుగ్గల మీదా, గుండెల మీదా వాతలు పెట్టాలనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళాలంటే భయం. మళ్ళీ తనూ వాత పెడితే? తన కోరిక తీరక బెంగతో కృంగిపోతున్నాడు పానకాలు.

 Previous Page Next Page