కొద్ది క్షణాలపాటు ఆలోచించి తర్వాత మెకానిక్ వైపు హీనంగా చూస్తూ అంది వైశాలి "చెప్పు! ఇంకా ఎన్ని పాపాలు చేయాలి నేను?"
నవ్వి "ఎన్నో అక్కర్లేదు! ఒక్కటే!" అని చెప్పడం మొదలెట్టాడు మెకానిక్.
* * *
దినకర్ తోబాటు గుంటలో ఉండిపోయిన వృద్దుడు వామనరావుకి ఊపిరాడ్డం లేదు. గాలి పీలిస్తే ముక్కులోకి దుమ్ము పోతోంది. నోరు తెరిస్తే నోట్లోకి దుమ్ము పోతోంది. ఉక్కిరి బిక్కిరవుతూ కీచుగొంతుతో అన్నాడు వామనరావు.
"మనకి పొయ్యే టైం దగ్గర పడిందనుకుంటాను. ఇంకా ఎక్కువసేపు బతికి ఉండడం కష్టం!"
గుంట మీద వున్న బల్ల చెక్కని పైకి ఎత్తెయ్యడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు దినకర్. కానీ బల్ల చెక్కమీద రెండు మూడు అడుగుల మంధన మట్టీ, రాళ్ళూ, దూలాలు అవీ పడిపోయి వుండడం వల్ల ఆ బరువుకి చెక్క ఒక్క అంగుళం మేర కూడా కదలటం లేదు.
అంతలోనే -
బుల్ డోజర్ ఆ గుంట దగ్గరికొచ్చేస్తున్న శబ్దం వినబడింది.
"గోవిందా! గోవిందా!" అన్నాడు వామనరావు. తుది క్షణాల్లో భగవంతుడిని తలుచుకుంటున్నట్లు.
దినకర్ మాట్లాడకుండా చెక్కని పైకి నెట్టెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
బుల్ డోజర్ గుంటని సమీపించింది. దాని కదలికకి అక్కడి నేలంతా అదురుతూ భూకంపం వచ్చినట్లు అనిపిస్తోంది.
వామనరావు, దినకర్ ఊపిరి బిగపట్టారు.
బుల్ డోజర్ ముందు భాగాన ఒక పొరలాంటిది ఉంది. అది అడ్డం వస్తున్న మట్టి కుప్పలన్నీ, రాళ్ళనీ ముందుకు తోసేసుకుంటూ పోతోంది. అలా చెయ్యడం వల్ల ఎత్తుగా వున్న స్థలాల్లోని మట్టి అంతా పల్లంగా వున్న స్థలాల్లో పడి ఆ ప్రదేశమంతా సమతలంగా అయిపోతోంది.
గుంట దగ్గరికి వచ్చేసింది బుల్ డోజర్. దాని ముందు వున్న బ్రహ్మాండమైన పొరలాంటిది అక్కడి కుప్పకూలిపోయిన వామనరావు ఇంటి తాలూకు మట్టినీ, రాళ్ళనీ తోసేసుకుంటూ ముందుకుపోయి పదిహేను గజాల అవతల ఉన్న పల్లంలోకి తోసేసింది.
ఇప్పుడు అక్కడి నేలంతా ఎత్తు పల్లాలేమీ లేకుండా సమతలమైపోయింది.
బల్ల చెక్కమీద వున్న మట్టినంతా బుల్ డోజర్ తోసెయ్యడంలో బల్ల చెక్కమీద బరువు తగ్గింది. బుల్ డోజర్ చెక్కమీద నుంచి వెళుతున్నప్పుడు ఆ బరువుకి చెక్క రెండు చోట్ల చిట్లింది. కానీ పూర్తిగా విరగలేదు.
ఏ కారణం వల్లనైనా బుల్ డోజర్ ఆ స్పాట్ లో కొద్ది క్షణాలు ఆగడం గానీ లేదా ఆ టైంలో బల్ల చెక్క విరిగి బుల్ డోజర్ చక్రాలు అక్కడ దిగబడడంగానీ జరిగితే గుంటలో వున్న దివాకర్, వామనరావుకి ప్రాణాపాయం జరిగిపోయి ఉండేదే.
కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు.
బుల్ డోజర్ ఆ పాయింట్ ని దాటగానే ఒడుపుగా బల్ల చెక్కని పైకి నెట్టేశాడు దినకర్. స్ప్రింగులా లేచి నిలబడి వృద్దుడయిన వామనరావుకి చెయ్యి ఆసరా అందించాడు.
"పద! పరిగెత్తు!" అన్నాడు దినకర్.
"కీళ్ళవాతం! నడవడం కూడా కష్టమే!" అన్నాడు వామనరావు.
అంతదూరం వెళ్ళిన బుల్ డోజర్ ఆగి సెకండ్ ట్రిప్పుకోసం వెనక్కి తిరిగింది.
దాన్తో కీళ్ళవాతం సంగతి మరిచిపోయాడు వామనరావు. దినకర్ తో కలిసి పరిగెత్తడం మొదలెట్టాడు.
అలా అయిదు నిమిషాలపాటు పరిగెత్తాక ఆయాసం తీర్చుకోవడం కోసం ఆగారిద్దరూ. వాళ్ళిప్పుడు ఒక తారురోడ్డుమీద వున్నారు.
"ఇదిగో ఇంక నువ్వెళ్ళిపో!" అన్నాడు దినకర్ వామనరావుతో.
"నువ్వెక్కడికి వెళుతున్నావ్?"
"ఆ హోటల్ దగ్గరికే!"
"మరి నా సంగతేమిటి?"
"నీ సంగతా?"
"అవును! ఆ సేటు వచ్చి నా ఇల్లు కూలగొట్టే ముందు కనీసం చెంబూ తప్పేలా అన్నా బయటపడేసి ఉండేవాడు. అవన్నా దక్కి వుండేవి నాకు. నువ్వు లంకలో హనుమంతుడు దూరినట్లు నా కొంపలో దూరావు. అంతా సర్వనాశనమైపోయింది. అందుకుగానూ నువ్వు నాకు నష్టపరిహారం ఇచ్చుకోవాలి!" అని గుణించి "పదహారొందల ఎనభై అవుతుంది. ఆ మొత్తం కక్కేదాకా కదలను వదలను" అన్నాడు.
"అయితే నీ ఖర్మ! రా!" అని హోటల్ వైపు దారి తీశాడు దినకర్.
అర్దరాత్రి దాటినా ఆ హోటల్ కస్టమర్స్ తో నిండి ఇంకా కోలాహలంగా వుంది.
వామనరవుతో కలిసి హోటల్ లోకి అడుగుపెట్టాడు దినకర్.
అతను లోపలికి రాగానే అప్పటిదాకా వినబడుతున్న నవ్వులూ, కేకలూ ఆగిపోయాయి. చీమ చిటుక్కుమంటే వినబడేటంత నిశ్శబ్దం ఆవరించింది. అందరూ అచేతనంగా అయిపోయి దయ్యాలని చూసినట్లు చూడడం మొదలుపెట్టారు వాళ్ళని.
"వీడింకా చావలేదా?" అన్నాడు ఎర్రటోపీ పెట్టుకున్న ఒక వ్యక్తి మరొకడితో గుసగుసగా.
ఆ రెండోవాడు మాట్లాడకుండా కప్పలా కళ్ళుపెట్టుకుని చూస్తున్నాడు దినకర్ వైపు.
సింహంలా నడుస్తూ వచ్చి ఖాళీగా వున్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు దినకర్. అతని పక్కనే నక్షత్రకుడిలా కూర్చున్నాడు వామనరావు.
సర్వరు భయం భయంగా వచ్చి మంచినీళ్ళ గ్లాసులు పెట్టాడు వాళ్ళముందు. తర్వాత గబగబా లోపలికి వెళ్ళిపోయాడు.
మళ్ళీ రెండు నిమిషాల తర్వాత వచ్చాడు సర్వర్. అతని చేతిలో ట్రే వుంది. ఆ ట్రేలో వుంది టెలిఫోన్.
ప్రశ్నార్ధకంగా సర్వరు వైపు చూసి ఫోన్ అందుకున్నాడు దినకర్.
మౌత్ పీస్ మీద కర్చీఫ్ వేసి మాట్లాడుతున్నట్లు అస్పష్టంగా వినబడుతుంది ఒక కంఠస్వరం.
"దినకర్?"
"యస్!"
"ఇనఫ్ ఈజ్ ఇనఫ్! ఈ తమాషాలు ఇంక చాలు! యూ బెటర్ సరెండర్ టూమీ. లొంగిపోవడం నీ ఆరోగ్యానికి మంచిది!" ఊపిరి బిగపట్టాడు దినకర్. తర్వాత నిదానంగా అన్నాడు. "ఎవరూ మాట్లాడుతోంది? పోలీసులా?"
"కాదు పోలీసులకు బాస్ లం!"
"అంటే?"
నవ్వాడు లైన్ లో అవతల వున్న వ్యక్తి.
"లొంగిపోయి నాదగ్గరకొచ్చెయ్! నేనెవరో తెలుస్తుంది!"
"లొంగకపోతే?"
"చెప్పానుగా నీ ఆరోగ్యం మంచిది కాదని! నువ్వు కూచుని వున్న హోటల్లో నా మనుషులు చాలామంది వున్నారు. నీకు ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఎర్రటోపీ పెట్టుకుని ఉన్నాడే! వాడు నా మనిషే! నీకు ఎడంవైపు కూర్చుని బన్ను తింటున్న గొరిల్లాలాగా ఉన్నాడే! వాడు కూడా నా మనిషే! ఆ మూలగా కూర్చుని సిగరెట్ కాలుస్తూ పేపర్ చదువుతున్నాడు చూడు చారలచొక్కా మనిషి వాడూ మావాడే!"
చూశాడు దినకర్. ఆ వ్యక్తి చెప్పిన గుర్తులుగల వాళ్ళందరూ హోటల్లో వున్నారు.
"ఇంకా ఎవరెవరు ఉన్నారు?" అన్నాడు దినకర్ జాగ్రత్తగా.
ఇంకో ముగ్గురి వ్యక్తుల పేర్లు చెప్పాడు ఆ వ్యక్తి.
ఓరకంటితో చూస్తూ వాళ్ళందరూ కూడా అక్కడే వున్నారని తెలుసుకున్నాడు దినకర్.
తర్వాత నిదానంగా అన్నాడు.
"అయితే నేనేం చేయాలి ఇప్పుడు?"
"మా వాళ్ళతో కలిసి నా దగ్గరికి వచ్చేయ్. నీ ప్రాణానికేం హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను."
"ఇప్పటిదాకా నా మీద హత్యా ప్రయత్నాలు చేసింది ఎవరు? నువ్వేనా?"
"అవును నేనే."
"మరి ఇప్పుడు హఠాత్తుగా నా మీద అంత అభిమానం ఎందుకు?"
"నీతో మాకు చాలా పని వుంది. నువ్వు మాకు ప్రాణాలతో దొరకడం చాలా ముఖ్యం. నువ్వు మాకు దొరకని పక్షంలో నిన్ను ప్రాణాలతో ఉండనివ్వం. అటో ఇటో! అంతే! మధ్యమార్గం లేదు. నువ్వు ఇన్నాళ్ళూ దొరకలేదు. అందుకని చంపడానికి చూశాం! ఇప్పుడు నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. లొంగిపోయి ప్రాణాలు దక్కించుకుంటావో! తిరగబడి ప్రాణాలు పోగొట్టుకుంటావో తేల్చుకో"