దినకర్!
తన దినకర్!
అతన్ని చూడగానే తఃన గదిలోనూ, తన మనసులోనూ కూడా ఆవరించివున్న చిమ్మ చీకటి క్షణంలో పారిపోయినట్లనిపించింది.
ఒక్క ఉదుటున మంచంమీదనుంచి లేచింది నిశాంత. ఒక్క అంగలో దినకర్ ని సమీపించింది, గాఢంగా వాటేసుకుంది అతన్ని.
దినకర్! నా దినకర్! నువ్వు మళ్ళీ నాకు కనబడవేమోనని ఎంత దిగులుపడిపోయానో తెలుసా?" అంది గద్గదికంగా.
"నిశాంతా! మై డార్లింగ్!" అన్నాడు దినకర్ నెమ్మదిగా.
హఠాత్తుగా అతనిమీద అలక వచ్చేసింది నిశాంతకి.
"ఎందుకు నన్ను అలా వదిలేసి పారిపోయావు? నువ్వు నాకు దూరమయితే నేను ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నానో నీకు తెలియదా?" అంది పదునుగా.
"నేను దొరికితే చాలు! ఉరిశిక్ష వేయించేటట్లు ఉన్నాడు ఆ ఇన్ స్పెక్టర్! మరి పారిపోక ఏం చేయాలి?" అన్నాడు దినకర్.
"నువ్వు చేయని నేరానికి శిక్ష ఎలా పడుతుంది? న్యాయం అంత గుడ్డిగా వుంటుందా? నేను నమ్మను...." అంది నిశాంత.
"అందుకనే అంటున్నాను నిశాంతా! నీకు నీ సబ్జెక్టులో చాలా మెరిట్ ఉంది! నీకు ప్రపంచంలో ఎవరికీ లేనంత అందం వుంది! ఎవ్వరికీ వుండనంత మంచితనం కూడా వుంది. కానీ నిశాంతా...."
చురుగ్గా చూసింది నిశాంత.
"ఊ! కానీ...?"
"కానీ నీకు లోకజ్ఞానం మాత్రం బొత్తిగా లేదు. యూ ఆర్ ఏ స్వీట్ లిటిల్ సెంటిమెంటల్ ఫూల్! అంతే! అవునా?"
"అవును! అందుకే ఏ సెంటిమెంట్లూ లేని నీతో ప్రేమలో పడిపోయాను" అంది నిశాంత చురుగ్గా.
"నీతో వచ్చిన చిక్కే ఇది!" అన్నాడు దినకర్ నవ్వుతూ. "ప్రేమ డైలాగులు వల్లించబోతే, నేను డాక్టర్ని, నాకిలాంటివన్నీ గిట్టవు అంటావు. పోనీ మనకెందుకులే అని పెద్దమనిషి తరహాగా మాట్లాడబోతే, నీకు సెంటిమెంట్లు లేవు, చట్టుబండలు లేవు అని మళ్ళీ నువ్వే నిలదీస్తావు!"
"అంటే ఏమిటి? నేను అర్ధం పర్ధం లేకుండా మాట్లాడే మనిషివా" అంది నిశాంత కోపంగా ఆమె అప్పటిదాకా అనుభవించిన టెన్షనూ మనసుకోతా అంతా అతనిపట్ల సున్నితమయిన కోపం రూపంలో రిలీజ్ అయిపోతున్నాయి.
ఆమె కోపం చూస్తే అతనికి నవ్వొస్తోంది. ధనస్సులావంపు తిరిగిన ఆమె కనుబొమలవైపు చూస్తూ సరదాగా అన్నాడు.
"అల్లెతాడు లేని వింటితో వేస్తుందిరా చూపుల బాణాలు, ఏ రక్కసి దగ్గర నేర్పిందో ఈ విద్య, ఇలా తీస్తుంది నా ప్రాణాలు"
అని మళ్ళీ అన్నాడు.
"ఈ కవిత్వం నా సొంతం కాదనుకో! అరబ్బీ మురబ్బాలలోనుంచి దొంగిలించా"
"చూడబోతే నీకా విద్య కొత్తది కానట్లుంది" అంది నిశాంత వ్యంగ్యంగా. "అయినా నీతో నాకెందుకుగానీ, చూడు మిస్టర్! ఇంక నీ దారిన నువ్వు వెళ్ళిపో! ఎవర్ని గురించీ ఏమీ ఆలోచిస్తూ కూచోకు! లేకపోతే మళ్ళీ ఆ ఇన్ స్పెక్టర్ వచ్చి అరెస్టు చేయగలడు!"
వెంటనే ఒక చెయ్యి గుండెమీద పెట్టుకుని, మరో చేత్తో ఆకాశం వైపు చూపిస్తూ అన్నాడు దినకర్.
"అల్లానైనా ధిక్కరిస్తా,
ముల్లానైనా ధిక్కరిస్తా,
ఓ పిల్లా నీకు నా సలాం,
నా రాతి గుండె నీకు గులాం
అన్నాడు కవి. నేను కూడా డిటో అని మనవి చేసున్నాను."
వద్దనుకున్నా నవ్వు వచ్చింది నిశాంతకి. గిరుక్కున వెనక్కి తిరిగి అతన్ని గట్టిగా కావలించుకుంది.
హఠాత్తుగా బోర్లా పడుకుని దిండుని కావలించుకోవడంతో మెలకువ వచ్చేసింది నిశాంతకి.
అంటే.....
దినకర్ రావడం...అరబ్బీ మురబ్బాలు వల్లించడం...
అంతా కలేనా?
కళ్ళలో నీళ్ళు నిండాయి నిశాంతకి.
ఎక్కడున్నాడు దినకర్? ఎక్కడ ఉండి ఉంటాడు అసలు?
దినకర్, ఆ సమయంలో వృద్దుడయిన వామనరావుతో కలిసి సజీవంగా భూస్థాపితం చేయబడిన వాడిలా ఒక గుంటలో చిక్కుకుపోయి ఉన్నాడనీ, మరి కొద్ది క్షణాలలో వంద అడవి దున్నల శక్తిని తనలో ఇముడ్చుకున్న దానిలా ఒక బుల్ డోజరు ఆ ప్రాంతాన్నంతా తొక్కేసి చదును చేసెయ్యడానికి వస్తున్నదనీ ఆమెకి తెలియదు.
* * *
తన ప్రాణానికి ప్రాణం లాంటి తమ్ముడు విక్కీ, తను ఎవరి కోసం ఇన్ని కష్టాలు సహిస్తూ బతుకుతుందో ఆ విక్కీ తనని ఎరగననేసరికి గుండె వెయ్యి ముక్కలయినట్లు అనిపించింది వైశాలికి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గొంతు ఎండిపోయినట్లయింది.
పెదవులు తడి చేసుకుంటూ కష్టంమీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని అంది వైశాలి.
"విక్కీ! విక్కీ డియర్! ఇటు చూడు! నేను! నీ అక్కయ్య వైశాలిని! గుర్తొచ్చానా? ఇంక పద! మన ఇంటికి మనం వెళ్ళిపోదాం."
తన భుజం మీద వున్న వైశాలి చేతిని నెట్టేశాడు విక్కీ, ఇంకొక్క అడుగు వెనక్కి జరిగి ఆమె వైపు తేరిపార చూస్తూ అన్నాడు.
"నువ్వెవరివో నాకు అస్సలు తెలీనే తెలీదు. నువ్వు నా అక్కయ్యవి కానేకాదు."
ఏదో అనుమానం తగిలినట్లు అతనివైపు పరీక్షగా చూసింది వైశాలి. తర్వాత నిదానంగా మెకానిక్ వైపు తిరిగింది.
"చెప్పు! ఏం చేశావ్ నాతమ్ముడిని? ఎందుకిలా అయిపోయాడు వాడు? ఏ మందో మాకో తినిపించావా విక్కీ చేత? చెప్పు! చెప్పవేం?" అంది ఒక్కొక్క అక్షరం ఒత్తొత్తి పలుకుతూ.
సమాధానం చెప్పకుండా కూల్ గా ఆమెవైపు చూశాడు మెకానిక్.
"చెప్పు! చెప్పకపోతే నీగుడ్లు పీకేస్తాను" అంది వైశాలి ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ.
"నీ ఊహ కరెక్ట్!" అన్నాడు మెకానిక్ తాపీగా. "మైండ్ బెండింగ్, డ్రగ్స్, సెడేషన్, హిప్నోసిస్, బ్రెయిన్ వాషింగ్ అన్నీ ఉపయోగించబడ్డాయి విక్కీమీద అందుకే యంత్రంలాగా, రాబోట్ లాగా అయిపోయి నేనేం చెబితే అది చేస్తున్నాడు విక్కీ. అతను తన గతాన్ని, ఐడెంటిటీని పూర్తిగా మర్చిపోయినట్లే ఇంక!"
అక్కడే వున్న ఒక ఫ్లవర్ పాట్ ని చేతుల్లోకి తీసుకుని బలంగా మెకానిక్ మీదికి విసిరేసింది వైశాలి.
కుర్చీలోంచి కదలకుండానే ఒడుపుగా కొద్దిగా పక్కకు జరిగాడు మెకానిక్.
ఫ్లవర్ పాట్ వేగంగా దూసుకెళ్ళి వెనక వున్న గోడకి తగిలి భళ్ళున పగిలిపోయింది.
కిందపడిన పింగాణీ పెంకులవైపు, వైశాలి వైపు మార్చి మార్చి చూశాడు మెకానిక్. తర్వాత చిరునవ్వుతో అన్నాడు.
"అందమయిన ఆడపిల్లలు ప్రియుడిమీదకి పూలచెండ్లు విసిరితే సరసంగానీ, పూలకుండీలే విసరడం అందంగా వుండదు వైశాలీ!"
"నువ్వా....నువ్వు నా ప్రియుడివా?" అంది ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వణికిపోతూ "మిస్టర్ మెకానిక్! ఎందుకిలా నరకం చూపిస్తున్నావు మాకు? ఇన్నాళ్ళనుంచీ నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడానుగా! ఇకనన్నా మమ్మల్ని వదిలెయ్. మా దార్న మేం పోతాం!"
తల పంకిస్తూ అన్నాడు మెకానిక్.
"నీ అందాలని సొంతం చేసుకోకుండా పంపెయ్యడం నాకు బాధగానే వుంటుందనుకో! అయినా సరే జంటిల్మాన్ లాగా నిన్నూ నీ తమ్ముడినీ వదిలేస్తాను. అయితే నువ్వు వెళ్ళిపోయే ముందు నువ్వు చెయ్యవలసిన పని ఇంకొక్కటి వుంటుందనుకుంటాను."
"మళ్ళీ ఇంకో పనా? మాట నిలకడ అంటే ఏమిటో తెలీని మనిషివి నువ్వు" అంది వైశాలి.
"కావచ్చు ప్రస్తుతం ఏ పనైనా చెప్పి చేయించుకోగల పొజిషన్లో నేనున్నాను. నేనేం చెబితే అది చెయ్యవలసిన పరిస్థితిలో నువ్వున్నావు. నీకోసం కాకపోయినా కనీసం నీ తమ్ముడి కోసమన్నా చేసి తీరతావు. అవునా?"