"నాతో మీకు పని ఏమిటి?"
"అదంతా తీరిగ్గా మాట్లాడుకుందాం మనం!"
కొద్ది క్షణాలు ఆలోచించాడు దినకర్. తర్వాత నిదానంగా అన్నాడు. "అయితే సరే!" మనసులో కలిగిన సంతోషాన్ని బయటపడనివ్వలేదు అతను.
ఇంక మిస్టరీ విడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది.
తను ఎవరో, వీళ్ళెవరో తెలిసిపోతుంది ఇంక కాస్త వ్యవధిలో.
"గుడ్! తెలివైన నిర్ణయం తీసుకున్నావ్!" అన్నాడు లైన్లో అవతలవైపు ఉన్న వ్యక్తి.
రిసీవర్ క్రేడిల్ మీద పెట్టేశాడు దినకర్. సర్వర్ టెలిఫోన్ తీసుకెళ్ళిపోయాడు.
వామనరావు వైపు చూసి అన్నాడు దినకర్. "నువ్విక్కడే వుండు! నేను అర్జెంట్ పనిమీద వెళుతున్నాను."
"పదహారొందల ఎనభై రూపాయలిచ్చేవరకు నిన్ను వదలను" తోకంబడి నారాయణ అన్నట్లు వెంట నడిచాడు వామనరావు.
ఎర్రటోపీ పెట్టుకున్న మనిషి కంటి కొసలలోనుంచి దినకర్ కదలికలు కనిపెడుతూనే వున్నాడు.
అతని ముందు నిలబడ్డాడు దినకర్.
"మీబాస్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది" అన్నాడు.
"తెలుసు ఏమిటి నీ నిర్ణయం?" అన్నాడు టోపీ వాలా.
"నేను మీతో కలిసి వస్తాను."
టోపీవాలా ముఖంలో నవ్వు కనబడింది.
"పద!" అంటూ లేచి నిలబడ్డాడు.
"ఆ మిగిలిన వాళ్ళని కూడా రమ్మను."
"ఎందుకు?"
"వాళ్ళు ఇక్కడే వుండి మంకీ బిజినెస్ ఏదన్నా చేస్తారేమోనని నా అనుమానం! వాళ్ళందరూ వస్తేనేగానీ నేను రాను."
బుర్ర గోక్కొని వెళ్ళి చారలచొక్కావాడితో మాట్లాడాడు టోపీ వాలా.
చారల చొక్కావాడు లేచి నిలబడి మిగిలిన వాళ్ళకు సైగ చేశాడు.
ఆ అరడజనుమంది, దినకర్, వామనరావూ బయటికి వచ్చారు.
పది అడుగులు వేసి ఆగాడు దినకర్.
ఆ ఆరుమందీ సందేహంగా ఆగారు.
"ఏం లేదు! మనం హోటల్లో కలబడి కొట్టుకుంటుంటే పాపం తక్కిన వాళ్ళకి కూడా దెబ్బలు తగులుతాయి కదా! అందుకని మిమ్మల్నందర్నీ బయటికి లాక్కొచ్చాను" అన్నాడు దినకర్.
టోపీవాలా అలర్టుగా అయిపోయి "అంటే?" అన్నాడు పంది మూలుగుతున్నట్లు.
వింటున్న వృద్దుడు వామనరావు గట్టిగా నవ్వాడు.
"ఇంకా అర్ధం కాలేదా?" అని మళ్ళీ నవ్వి దినకర్ వైపు తిరిగి అన్నాడు "నేను ఇంతమంది మూర్ఖులని ఒకే రోజున ఒకే చోట ఎప్పుడూ చూడలేదు."
అవునన్నట్లు తల పంకించాడు దినకర్.
టోపీవాలా చటుక్కున హిప్ పాకెట్ లోంచి రివాల్వర్ బయటికి తీశాడు.
రివాల్వర్ వైపు చూస్తూ అన్నాడు దినకర్.
"ఇది అన్యాయం! నీ దగ్గర రివాల్వర్ ఉంది! నా దగ్గర లేదు! ఇది ఈక్వల్ ఫైట్ కాదు!"
"కాకపోవచ్చు! కానీ నేనెప్పుడూ ఇట్లాగే గెలుస్తుంటా" అని నవ్వాడు టోపీవాలా.
మెరుపు వేగంతో చేతిని ముందుకు చాచి టోపీవాలా చేతిని అందుకుని మెలిపెట్టి రివాల్వర్ లాక్కున్నాడు దినకర్. తర్వాత దాన్ని తన హిప్ పాకెట్ లో పెట్టుకున్నాడు. ఇదంతా కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయింది.
"మీరంతా స్ట్రీట్ ఫైటర్స్, అవునా?" అన్నాడు దినకర్ టోపీ వాలాతో. "నేనూ మీలాగే స్ట్రీట్ ఫైటర్నే! అయినా మేం ఎంతగా పోట్లాడుకున్న చితకబాదుకున్నా కొన్ని రూల్సు పాటిస్తాం."
"స్ట్రీట్ ఫైటింగ్ లో రూల్సా?" అన్నాడు టోపీవాలా దేభ్యంలాగా.
"అవును స్ట్రీట్ ఫైటింగులో కూడా కొన్ని రూల్సు వుంటాయి. వుదాహరణకి...ఫైటింగులో ఇట్లా కొట్టకూడదు!" అని మోకాలు ఎత్తి టోపీవాలాగాడి టెస్టికిల్స్ మీద బలంగా కొట్టాడు దినకర్.
"అబ్ బ్....." అని బాధతో కొంకర్లు పోతూ కేక కూడా పూర్తి చెయ్యలేక నేలమీద ఒరిగిపోయాడు టోపీవాలా.
తర్వాత చారలచొక్కా వైపు తిరిగాడు దినకర్.
"స్ట్రీట్ ఫైటింగులో ఇలా కూడా చెయ్యకూడదు" అని కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలు రెండూ చాకుల్లా నిగిడించి వాడి కళ్ళల్లో గుచ్చాడు.
కళ్ళు పోలేదు గానీ కళ్ళుపోయినంత పనైంది చారల చొక్కా గాడికి. తనుగుడ్డి వాడయి పోయానేమోనన్న భయంతో బెంబేలెత్తిపోయి చావుకేకలాంటి కేక పెట్టాడు.
జెర్కిన్ వేసుకుని పొడుగాటి జుట్టుతో ఉన్న మూడోవాడివైపు తిరిగాడు దినకర్. "స్ట్రీట్ ఫైటింగులో ఏమేం చెయ్యకూడదో చెప్పాను కదా. ఇంకా ఏమేం చేయొచ్చో చెబుతాను. దమ్ముంటే ఇలా కొట్టొచ్చు సుబ్బరంగా" అని కుడి పిడికిలి బిగించి వాడి గడ్డం కింద కొట్టాడు.
హిప్పీగాడి ముందు పన్నొకటి గాల్లోకి ఎగిరింది.
ఆ తర్వాత ఇంకో రౌడీ వైపు తిరిగాడు దినకర్. "ఇట్లా కూడా కొట్టొచ్చు!" అని ఎడం మోచేత్తో వాడి డొక్కలో పొడిచాడు.
కడుపు రెండు చేతులతో పట్టుకుని గిలగిల్లాడుతూ మోకాళ్ళమీద కూర్చుండిపోయాడు వాడు.
మిగిలిన గూండాలు కళ్ళప్పగించి ఇదంతా చూస్తూ నిలబడి వున్నారు వాళ్ళలో ఒకడు గొరిల్లాలా ఇంతెత్తున ఉన్నాడు.
వాళ్ళవైపు తిరిగాడు దినకర్.
"వెల్! మీరిద్దరూ మిగిలారన్నమాట! ఇప్పుడు మీకు స్ట్రీట్ ఫైటింగ్ తాలూకు రూల్సన్నీ బాగా అర్ధం అయినట్లేనా?"
భయంగా తల ఊపారిద్దరూ.
ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు దినకర్.
"మరి మీరేమో ఇద్దరున్నారు. నేనేమో ఒక్కడ్నే అయిపోయాను. అందుకని మీ ఇద్దరిలో ఒకళ్ళు నాతో ఫైట్ చేయొచ్చు. రెందోవాళ్ళు వెళ్ళిపోవచ్చు. తేల్చుకోండి! ఎవరుంటారు? ఎవరెళ్ళిపోతారు?" అన్నాడు.
ఆ మాటలు పూర్తికాకముందే గూండా గాళ్లిద్దరూ వెనక్కి తిరిగి మహాభారత సీరియల్లో అర్జునుడు వదిలిన బాణంలాగా దూసుకుపోయాడు.
వాళ్ళ వెంటపడి తరిమి మళ్ళీ ఇద్దరినీ పట్టుకున్నాడు దినకర్.
"మీలో ఒకళ్ళనే నేను పారిపొమ్మంది. ఇద్దరూ పారిపోవడం రూల్సుకి వ్యతిరేకం." అని ఒకడి మెడ దగ్గర నరాన్ని నొక్కాడు.
వాడు దూదిబొమ్మలా కిందపడిపోయాడు.
ఇదంతా చూస్తున్న గొరిల్లా లాంటివాడు గజగజలాడుతూ నిలబడ్డాడు.
"భళి భళీ! చివరిలో మనిద్దరికీ కుదిరిందన్నమాట జోడీ! ఫైటింగ్ కి రెడీనా?" అన్నాడు దినకర్ గొరిల్లా వాడితో.
"వద్దు వదిలెయ్ వెళ్ళిపోతా!" అన్నాడు గొరిల్లా.
"అలా అంటే ఎలా? రూల్స్ కి వ్యతిరేకం!" అని వాడిని కాలర్ దగ్గర పట్టుకుని బలంగా పైకెత్తాడు దినకర్. హిప్ పాకెట్ లోంచి రివాల్వర్ తీశాడు. తర్వాత వామనరావు వైపు తిరిగి "దీన్ని కాల్చెయ్యనా?" అన్నాడు ఏదో జంతువు గురించి మాట్లాడుతున్నంత ఇదిగా.
వామనరావు ఆలోచించినట్లు అభినయించి "వద్దు! కాలిస్తే దీని మెదడంతా నీ షర్టుమీద చిందుతుంది" అన్నాడు.
"దీనికి అసలు మెదడు ఉంటుందనుకోను" అన్నాడు దినకర్.
"దీనికి మెదడు లేకపోయినా రక్తం వుంటుందిగా! చిక్కగా వుంటుంది రక్తం! బంకలా అతుక్కుంటుంది" అన్నాడు వామనరావు.