రకరకాల అందమైన వాచీలు గాజు కౌంటర్ల కింద కనబడుతున్నాయి.
"ఆ వాచీ చూపించు" అన్నాడు.
డిజిటల్ వాచ్ అది. క్షణక్షణానికి అంకెలు మారిపోతూ, మెరుస్తూ కనబడుతున్నాయి.
"ఎంత?" అని అడగలేదు ముకుందరావు. చేతికి పట్టేసుకున్నాడు.
తోమ్మిదొందలు దాని ఖరీదు.
ఆ పక్కనే ఉన్న బూట్ల షాపులో దూరాడు. అతనికి హుషారుగా ఉంది.
రెండంగుళాల హీల్ ఉన్న నల్లటి ఖరీదైన బూట్లుకొని వేసేసుకున్నాడు.
"నూట డెబ్బయ్యే సార్" అన్నాడు షాపతను. ముకుందరావు బట్టల్ని వాచిని చూసి మర్యాద ఒలకబోసేస్తూ, బూట్లతో బాటు రెండు జతల సాక్సు పెద్ద పాలిష్ డబ్బా, బ్రష్షు, ప్లానేల్ గుడ్డా బూట్లేసుకునే టంగు, పాలిష్ పూసే ఇంకో చిన్న బ్రష్షు, క్రీంసీసా ఇవన్ని అంటగట్టాడు. మాట్లాడకుండా కొన్నాడు ముకుందరావు. సాధరణంగా ఇవన్నీ అంత అవసరమైన వస్తువులు కావు- పాలిషు బ్రషు తప్ప.
కాని ముకుందరావు ఒద్దనే మూడ్ లో లేడు. ఎందుకు ఒద్దనాలో కారణం కనబడటం లేదు. పుష్కలంగా డబ్బుంది. ఖర్చు పెట్టుకోవాలి.
పక్కషాపు కిల్లి కొట్టు.
అందులో డన్ హీల్ సిగరెట్లు కొన్నాడు.
ఆ పక్కనే ఉంది ఖరీదైన బార్.
అందులో ప్రవేశించాడు.
రెండ్రోజులు తర్వాత లావణ్యకి జ్వరం తగ్గింది. జ్వరం తగ్గటంతో బాటు ఆ అమ్మయి మణిక స్థితి కూడా చిత్రంగా మారింది. ఈ మూడు రోజుల్లో ఏమి కొంప ముంచుకు పోయేది జరగలేదు. మహా జరగబోయేది ఏమిటంటే వాడు తన దగ్గర పాతికవేలు వసూలు చేస్తాడు. తను ఇస్తుంది. మళ్ళీ పాతికవేలు అడుగుతాడు ఇస్తుంది.
ఈ లోపల వాడెవడో కనిపెట్టాలి. తను అంత తెలివి తక్కువదెం కాదు.
అందరితో చెప్పి అల్లరి పడిపోవడం మంచిది కాదు. శ్రీహర్షకి మాత్రం చెప్పాలి.
ఎందుకో అతనితో ఇదంతా చెప్పడానికి మొహమాటంగా ఉంది. లెటర్ రాసి పడేస్తే బావుంటుంది. అతను ఎదురుగా లేకపోతే కాయితం మీద అంతా వివరంగా రాయగలదు తను.
శ్రీహర్షకి ఉత్తరం రాయలని అనుకుంటూ ఉండగానే తనకి మళ్ళీ ఒక లెటర్ వచ్చింది.
అసహ్యంగా , కాస్త భయంగా దాన్ని చూస్తూ కవరు విప్పింది లావణ్య.
"మై పూర్ డియర్!
భయపడిపోయి జ్వరం తెచ్చుకున్నావా? ఇంకా భయపడిపోయి గుండె ఆగి చచ్చిపోతావేమోనని మళ్ళీ లెటర్ రాయలేదు. ఇప్పుడు నువ్వు ఓకె గదా! పాయింటు కొద్దామా? ఇంకో రెండు ఫోటోలు పంపుతున్నాను. బహుముచ్చటగా ఉన్నాయి. బాగా చూడు.
పాతికవేలు అడిగాను గుర్తుందా? రేపు సాయంత్రం క్లబ్బు కొచ్చినప్పుడు నీ హాండ్ బాగ్ నిండా వందరూపాయల కట్టలేసుకురా నిశ్చింతగా హాండ్ బాగ్ మరిచిపోయి వెళ్ళు. దాన్ని భద్రంగా తీసుకుని దాచి పెట్టుకునే పూచి నాది.
హిచ్ కాక ఈసారి సినిమా తీస్తే హంతకురాలిగా నిన్ను పెట్టుకోవచ్చు డియర్!
బాగా సూటవుతావ్!
హాండ్ బాగ్ మర్చిపోకు. దాన్ని క్లబ్బులో మర్చిపోవడం మర్చిపోకు. ఎక్కడ మర్చిపోతావ్? గేటు దగ్గర్నుంచి పదిగజాలు నడిస్తే దానిమ్మచెట్టు ఉంది చూడు దాని పాదులో. గుర్తుంచుకో."
'ఫోటోగ్రాఫర్'
ఉక్రోషం, దుఃఖం కలిగాయి లావణ్యకి.
వెంటనే లెటర్ పాడ్ తెరిచి శ్రీహర్షకి ఉత్తరం రాసింది. నాలుగు పంక్తులు రాయడానికి నాలుగు కాయితాలు వృధా చెయ్యాల్సి వచ్చింది.
"శ్రీహర్షా!
సారి! నాకూ మొండి పట్టు, అలకా , ముక్కు మీద కోపం అన్నీ ఉన్నాయి. నా చిన్న చిన్న తప్పులు నాకు తెలుసు. అయినా సరిదిద్దుకోలేకపోతున్నాను మరీ గారాభంగా పెంచి కాస్త చెడగొట్టారేమో అమ్మానాన్నా. నేను సరిదిద్దుకోలేకపోయినా , శ్రీహర్షా, నా ఈ చిన్నచిన్న బలహీనతలు మీరు క్షమించండి. ప్లీజ్ మీ లావణ్య మరీ రాక్షసెం కాదు. అలా కనబడుతుంది. అంతే.
శ్రీహర్షా! అసలు విషయం ఏమిటంటే, నేనొక అతి ప్రమాదకర స్థితిలో చిక్కుకున్నాను. గమ్యం తోచటం లేదు. నాన్నా, అమ్మా సింగపూర్ వెళ్ళారని మీకు తెలుసు. అసలు సంగతి చెప్పబోయే ముందు ఒక్క సంగతి స్పష్టం చెయ్యనివ్వండి. నాకు ఈ భయంకర సంఘటనతో ఏ సంబంధమూ లేదు. ఎవరో తెలివిగా నన్ను ఇందులో ఇరికించేశారు. పులిష్ గా ఇరుక్కుపోయానునేను. నన్ను కాపాడండి.
క్లబ్బులో ఆరోజు రోసి అనే అమ్మాయితో ఘర్షణ పడ్డాను. కార్డ్స్ ఆడుతున్నప్పుడు అది మోసం చేస్తుంటే "చంపేస్తాను" అని బెదిరించాను- అందరి ముందూ. అది ఉత్త బెదిరింపే. కాని ఆరోజే టాయిలెట్ లో ఎవరో రోసిని హత్య చేశారు. దగ్గరికెళ్ళి పరీక్షగా చుడబోయాను. తెలియక ఆమె వంటి మీద చెయ్యివేశాను. అంతే! కెమెరా ఫాష్ వెలిగింది. తర్వాత పోస్టులో ఫోటోలు వచ్చాయి నాకు. అందులో రోసి శవం మీదకు వంగి కత్తిని తాకి చూస్తున్న నేనూ! పాతికవేలు ఇవ్వకపోతే ఫోటోలు బయట పెడతా నంటున్నాడెవరో. ఎలా తప్పించుకోవాలో తెలియటం లేదు.
ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా శ్రీహర్షా! ఆరోజు మీ మీద అలిగి నేను క్లబ్బు కెళ్ళి పోయిన రోజు. మీమీద అలిగి నందుకు నాకు మంచి శిక్ష విధించాడు దేవుడు. ఇంకెప్పుడూ అలా చెయ్యను. ఆరోజు రాత్రి మీ ఇంటి దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయాను. నోటితో చెప్పలేక ఉత్తరం రాస్తున్నాను.