Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 34

 

    కార్తిక్ సౌమ్యని గురించి అలా వక్రంగా చెబుతుంటే , అతనివైపు చూడలేదు ఉజ్వల, కళ్ళార్పకుండా శశికాంత్ వైపే చూస్తోంది.

 

    కార్తిక్ మాటలు వింటున్నంత సేపూ బిగుసుకుపోయాడు శశికాంత్, తరువాత సర్దుకుని......

 

    "నువ్వెవరివో నీకు తెలుసునా కార్తిక్?" అన్నాడు విసురుగా.

 

    ఇబ్బందిగా కదిలాడు కార్తిక్. "నేనా! నేను నీ కజిన్ ని! నీ శ్రేయోభిలాషిని! అలా అడుగుతావెం?"

 

    "బుల్ షిట్! అదేమీ కాదు! నువ్వొక డర్టీ రోగ్ వి! కార్తిక్! గెట్ లాస్ట్!"

 

    "శశీ....." అని ఏదో సంజాయిషీ చెప్పబోయాడు.

 

    నిప్పులు కురిపిస్తూ చూశాడు శశికాంత్. "ఐ సేడ్ గెట్ అవుట్!"

 

    సపోర్ట్ కోసం అన్నట్లు ఉజ్వల వైపు చూశాడు కార్తిక్. సానుభూతిగా చూసి, 'ఇప్పటికి వెళ్ళిపో!" అన్నట్లు సైగ చేసింది ఉజ్వల.

 

    అవమానాన్ని దిగమింగి వెళ్ళిపోయాడు కార్తిక్.

 

    "పులిష్ బగర్!" అన్నాడు శశికాంత్ గొణుగుతున్నట్లు.

 

    "కార్తిక్ చిన్నప్పటినుంచి అంతే కదా! మనసుకి ఏది తోస్తే అది మాట్లాడేయడం! అంతే! ఎదుటివాళ్ళు బాధపదతారేమో అని చెప్పదలుచుకున్నది చెప్పడం మానేయ్యాడు" అంది ఉజ్వల. కార్తిక్  ని పోగుడుతున్నట్లో, తిడుతున్నట్లో తెలియకుండా.

 

    మౌనంగా సిగరెట్ అంటించి గట్టిగా దమ్ము పీల్చాడు శశికాంత్. నుదురు చిట్లించి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి, తరువాత అన్నాడు.

 

    "ఉజ్వాలా! విల్ యూ డూ మీ ఏ ఫేవర్!"

 

    "చెప్పు శశీ!"

 

    "ఆ ట్రావేలింగ్ ఏజన్సీకి వెళ్ళు. నువ్వు ఇంకో రెండు టికెట్స్ బుక్ చెయ్యి. బాంబే ఫ్లయిట్ కి! నేనూ, సౌమ్యా కూడా ఫ్లయిట్ లోనే వస్తాం."

 

    సన్నగా నవుతూ అంది ఉజ్వలా- "ఏం? మనసు మార్చుకున్నావెందుకు? కేరవాన్ లో నీ మిసెస్ తో ఫస్ట్ నైట్ అది ఇది అన్నావుగా?"

 

    "ఇప్పుడింక ఆ మూడ్ పోయింది ఉజ్వలా! ఒక మంచి సూట్ కేస్ కూడా కావాలి నాకు. నా సూట్ కేస్ మొన్న ప్రయాణంలో పోయింది. అలాగే, సూట్ కేసులో నా బట్టలు కొన్ని సర్దించాలి.

 

    ఇంట్లో మనిమనిషి చంద్రిక వుంటుంది. నా బట్టలేక్కడుంటాయో తనకి తెలుసు. తరువాత...." అని మరో క్షణం అలోచించి "బాంబే సన్ అండ్ శాండ్ " కి రింగ్ చెయ్. రెండు సూట్స్ బుక్ చెయ్. నికొకటి, మాకొకటి....... అన్ని గుర్తుంటాయా? యూ హావ్ టు రష్! ఎక్కువ టైం లేదు. నేను వెళ్ళి సౌమ్యని తీసుకు వస్తాను" అన్నాడు లేచి నిలబడుతూ.

 

    పనులు చెప్పి చేయిన్చుకోగల చాకచక్యం ఉంది అతనికి. ఆ విషయంలో అతనికి కొత్తా పాతా అని, అడా, మగా అని లేదు.

 

    "లివ్ ఎవ్విరిథింగ్ టుమి" అంది ఉజ్వల చాలా కన్ఫిడెంట్ గా.

 

    బయటకు వచ్చి కారెక్కాడు శశికాంత్. కొద్ది నిమిషాల తరువాత కారు సౌమ్య ఇంటిముందు ఆగింది. అసహనంగా హరన్ మోగించాడు. ఎవరో పెద్దమనిషి బయటకు వచ్చాడు.

 

    "సౌమ్యని పిలవండి" అన్నాడు శశికాంత్ ముక్తసరిగా.

 

    "సౌమ్యా లేదండి! ఎక్కడికో వెళ్ళింది!" అన్నాడాయన.

 

    "ఎక్కడికి వెళ్ళింది?" అని గొణుక్కుంటూ కారు లాక్ చేసి ఇంట్లోకి నడిచాడు శశికాంత్.

 

    సౌమ్య తల్లి శారదమ్మ విచారంగా తల వంచుకుని కూర్చుంది ఒక మూల.

 

    "సౌమ్యా ఏది? అన్నాడు శశికాంత్, ఉపోద్ఘాతం ఏమి లేకుండా.

 

    తలెత్తి చూసింది శారదమ్మ. ఎదురుగా వున్నది అల్లుడు అని గ్రహించగానే, "కూర్చోండి" అంది సంబ్రమంగా.

 

    "టైం లేదు. వెళ్ళాలి" అన్నాడు శశికాంత్.

 

    "సౌమ్య ఇప్పుడే ఎక్కడికో వెళ్ళింది - ఒక అరగంటలో వచ్చేస్తానని."

 

    "ఎక్కడికి?"

 

    అన్యమనస్కంగా అంది శారదమ్మ. "ఏదో చెప్పింది బాబూ! నేను సరిగా వినిపించుకోలేదు."

 

    "సరే! సౌమ్య రాగానే నా దగ్గరికి పంపించెయ్యండి."

 

    "ఇలాంటి సమయంలో ....." అని ఏదో చెప్పబోయి, మళ్ళీ మానేసింది శారదమ్మ. అల్లుడి తీవ్రస్వభావం ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది ఆమెకు. అతనికి కోపం తెప్పించడం తన కూతురి కాపరానికి మంచిది కాదు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళింటికి వెళ్ళిపోవలసిన పిల్ల సౌమ్య. జరగవలసిన చెడు అంతా జరిగిపోయాక ఇంక ఈ మంచి రోజు చూడడం , పంపవచ్చా పంపకుడడా అన్న మీమాంసా.....ఇవన్ని ఎండుకు?

    
    ఏది ఎలా జరగవలసి వుంటే అలాగే జరుగుతుంది.

 

    'అర్జెంటుగా ఇవాళే బాంబే వెళ్ళాలి మేం.' అన్నాడు శశికాంత్.

 

    అది వినగానే ఆశ్చర్యం , అనుమానం రెండూ కలిగాయి శారదమ్మకి.

 

    'అదేమిటి? ఇంత హటాత్తుగా ప్రయాణం పెట్టుకున్నరెందుకు?" అని అడిగింది ఆదుర్దాగా.

 

    "నా ప్రయాణాలెప్పుడు అలాగే ఉంటాయి లెండి" అన్నాడు శశికాంత్ వాచ్ చూసుకుంటూ. "వెంటనే వచ్చేయ్యామనండి సౌమ్యని. లేకపోతే ఫ్లయిట్ మిస్సయిపోగలదు."

 

    సౌమ్యని అల్లుడితో బాటు పంపుదామని అప్పటిదాకా మనసులో మెదులుతున్న ఆలోచన హటాత్తుగా మాయమైపోయింది శారదమ్మ మనసులోంచి. ఏదో తెలియని కీడు శంకించి, మౌనంగానే ఆర్తనాదం చేసింది ఆమె హృదయం. "సౌమ్యని నేను పంపను. నా దగ్గరే వుంటుంది నా బిడ్డ! ఎలాగోలా బతుకుతాం మేము ఏం? సౌమ్య నా కడుపులో వున్నప్పుడు నా రక్తం, నా వళ్ళో వున్నప్పుడు నా స్తన్యం తాగి పెరగలెదూ! అలాగే నా ఇంట్లో ఉండి నాతొ బాటు కలోగంజో, పచ్చి గంగో తాగుతుంది. నిలువెల్లా ఖలుడిలా వున్న నీ వెంట మాత్రం నా కూతురిని పంపను. ఏది ఏమైనా సరే!" అని శోకిస్తుంది ఆమె మనసు. పైకి మాత్రం పల్లెత్తు మాట అనలేదు.


    "వెంటనే పంపండి" అని అల్టిమేట్టం ఇచ్చినట్లు చెప్పి చకచకా బయటికి నడిచాడు శశికాంత్.

 

    అతను ఇంటినుంచి ఎయిర్ పోర్టుకి వెళ్ళడానికి టాక్సీ ఎక్కబోతుండగా కంగారుగా వచ్చింది సౌమ్య. ఆమె చేతిలో సూట్ కేసు వుంది. మాట్లాడకుండా టాక్సీ డోర్ తెరిచాడు శశికాంత్.

 

    టాక్సీ ఎక్కి ఒక మూలగా ఒదికి కూర్చుంది సౌమ్య.

 

    వాచ్ చూసుకున్నాడు శశికాంత్. "ఇంకో నిమిషం లేటయితే నేన వెళ్ళిపోయి ఉండేవాడిని" అన్నాడు ముక్తసరిగా.

 

    "అమ్మ చెప్పగానే వచ్చేశాను" అంది సౌమ్య.

 

    కానీ అది నిజం కాదని సౌమ్యకి తెలుసు. తను ఇంటికి రాగానే అమ్మ చెప్పింది. శశికాంత్ వచ్చాడని. అతని ప్రవర్తన తనకు విడ్డురంగా , అనుమానాస్పదంగా తోస్తోందని చెప్పింది అమ్మ. అతనితో తనని పంపను గాక పంపనంది. తనని కావలించుకుని బావురుమని ఏడ్చింది కూడా.

 Previous Page Next Page