ఆ తర్వాత పార్కు ఎలాంటి స్థితికి చేరుకుందో చూసినవాళ్లకి తెలుసు.
అసలు దేవుళ్ళ పేర్లూ, గొప్పవాళ్ళ పేర్లూ అడ్డమైనవాటికి పెట్టకూడదేమో అన్న భావం కలుగుతుంది యిలాంటివి చూస్తే. బాలాజీ వైన్ షాపు అని పేరు పెడతారు. గౌతమబుద్దా చికెన్ సెంటరంటారు. లాల్ బహదూర్ నగర్ అని పేరు పెడతారు. మళ్ళీ దాన్ని ఎల్బీనగర్ అని పిలుస్తారు. మొత్తానికి పేరు పెట్టిన పర్పస్ మాత్రం ఎప్పుడూ సర్వ్ కాదు.
అలాగే సంజీవయ్య పార్కు ఏమయిందీ?
లవ్ బర్డ్స్ కేంద్రమయింది.
పట్టపగలే పరమ రోత కలిగించే దృశ్యాలు అక్కడ కనబడ్డం మొదలెట్టాయి.
బ్లూ ఫిల్ములు తెచ్చుకుని చూసే సదుపాయం లేనివాళ్ళు సంజీవయ్య పార్కుకెళ్తే చాలు అన్న ప్రతిష్ట వచ్చేసింది ఆ పార్కుకి.
అఫ్ కోర్స్...
సినిమా షూటింగులవల్ల కాస్త గ్లామరుకూడా వచ్చిందనుకోంది.
అలాంటి సంజీవయ్య పార్కుకి......
సితారని రమ్మని రాకపోతే ఆత్మహత్య చేసేసుకుంటానని వార్నింగిచ్చాడు జెయ్ చంద్ర.
ఆడకూతురు ఏం చేస్తుంది మరి?
అందుకని సరిగ్గా మిట్టమధ్యాహ్నం వేళ ఆ పార్కుకి వచ్చేసింది సితార.
ఆమెని అక్కడ చూడగానే ఆర్క్స్ లైట్ లా వెలిగిపోయింది అతని మొహం.
"సితారాడియర్!" అన్నాడు తమకంగా.
కంగారుగా దిక్కులు చూసిందామె.
"అర్జెంటుగా చెప్పెయ్, చెప్పదలుచుకున్న దేమిటో?" అంది గబగబా.
"చెప్పేయగానే వెళ్ళిపోతావా ఏం?"
"మరి ఇక్కడ కాపురం పెడదామా?"
"ఒక్క గంటన్నా నీతో మాట్లాడాలి!"
"అదంతా పెళ్ళయ్యాక"
"ఈలోగా చిన్న ట్రెయిలర్"
"నేనొప్పుకోను"
"అయితే నేను చచ్చిపోతా"
"నీకంటే ముందు నేనేచచ్చిపోతా! అప్పుడింక నాకీ బ్లాక్ మెయిలింగ్ బాధ వుండదు" అంది సితార కోపంగా.
"నువ్వు చచ్చిపోతే నేనూ చచ్చిపోతా" అన్నాడతను.
"ఎందుకు? శుభమా అని పెళ్ళిచేసుకోబోతూ ఈ చావుమాటలు?" అందామె కసురుకుంటూ.
"లేకపోతే వెళ్ళిపోతానంటావేం?"
"మరిక్కడ కాపురం పెట్టన?"
"సరే! ఇలా వాదించుకోవడానికేనా మనం ఇక్కడికొచ్చింది?"
"అనవసరంగా నన్ను రమ్మంది నువ్వేగా!"
"అవును! నీతో మాట్లాడాలని"
"అయితే అర్జెంట్ గా చెప్పెయ్?"
ఒక్క క్షణమాగి తలవిదిలించి నిస్పృహగా అన్నాడతను.
"ఎన్నెన్నో నవలలు చదివా! ఎన్నెన్నో సినిమాలు చూశా! వాటిల్లో దేన్లోనూ హీరోహీరోయిన్ల తొలిసమాగమం యిలా ఎండుకట్టె విరిచినట్లుండడం చూడలేదు"
"అయితే ఇప్పుడేంటంటావ్?" అందామె అతన్ని నిలదీస్తూ.
"కాస్త సరసంగా నవ్వుతూ మాట్లాడరాదూ?"
"సరసంగా నవ్వుతూ మాట్లాడటం నాకలవాటు లేదే!"
"దీనికి అలవాటు కావాలా ఏమిటీ? మనసులో ఇష్టముంటేచాలు..... మాటలు వాటంతటవే వచ్చేస్తాయి."
"మరి నా మనసులో ఇష్టమున్నా మాటలు వాటంతట అవే రావట్లేదుగా?"
"అంటే నీకు నేనంటే ఇష్టమేనా అసలు?"
"ఇష్టంలేకపోతే ఇట్లా వస్తానా?"
"సితార!"
"జెయ్!"
అర్జెంటుగా సితారని గట్టిగా కావలించుకోబోయాడు అతను.
ఈలోగానే.....
రెండుకిలోల బరువున్న ఓ మోటు చెయ్యి అతని భుజం మీద బలంగా పడింది.
ఉలిక్కిపడి తలెత్తి చూశాడతను.
ఎదురుగుండా యముళ్ళా పోలీసు కానిస్టేబుల్ నూటపదకొండు నిలబడి వున్నాడు.
"రౌడీ రాస్కెల్!" అన్నాడు పోలీసు మొరటుగా.
"య్యేయ్! ఏంటిది వదులు?" అన్నాడతను.
'రోమియో జూలియట్" అన్నాడు పోలీసు.
"సంగతేంటో చెప్పకుండా ఎందుకట్లా తిడతావ్?" అన్నాడు జెయ్ చంద్ర.
"అబ్బాయ్-అమ్మాయ్" అన్నాడు పోలీసు.
"అయితే?" అన్నాడతను.
"మిమ్మల్ని అరెస్టు చేస్తున్నా!"
కొయ్యబారిపోయారు జెయ్ చంద్ర, సితార.
"ఎందుకు?" అన్నాడతను అరగంట తర్వాత తేరుకుని.
అప్పటిదాకా పళ్ళు కుట్టుకుంటూ నిలబడ్డ పోలీసు కానిస్టేబుల్ నూటపదకొండు "బ్రోతల్ కేసు" అన్నాడు.
మళ్ళీ జంటగా కొయ్యబారిపోయారు జెయ్ చంద్ర, సితార. "మేమిద్దరం భార్యాభర్తలం" అన్నాడతను.
పోలీసుకానిస్టేబుల్ వికటంగా నవ్వాడు. "నేన్నమ్మను.....భార్యాభర్తలంటే డల్ గా డల్ గా కూర్చుని వుంటారు. పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ చేయరు. పైగా ఈ అమ్మాయి మెడలో తాళి యేది?" అన్నాడు తెలివిగా.
"ఇంకా కట్టలేదు" అన్నాడతను.
"ఎప్పుడు కడతావ్?"
"ఇప్పుడే" అని అతను అనేలోగానే సితార కలగజేసుకుని అంది.
"ఇంకో రెండేళ్ళ తర్వాత"