"అసలు మీతో మాట్లాడకూదని, మీ ఇంటికి రాకూడదని ఒట్టు పెట్టుకున్నాను. కానీ......" కానీ ఆమె మాటల్లో చిరుకోపం ధ్వనించింది.
"ఎందుకలా?" అమాయకంగా అడిగాడు అభినవ్.
"ఆ రోజు హరిహరన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఎక్కడికి వెళ్ళి పోయారు సడన్ గా? ఎంత వెతికానో తెలుసా?"
ఆ విషయాన్ని అస్సలు పూర్తిగా మరిచిపోయాడతను.
"సారీ కావ్యా! ఆ రోజు......" ఏదో చెప్పబోయాడతను.
చెప్పనివ్వలేదు కావ్య.
"మీరు అబద్ధాలు చెప్పలేరు. అందుచేత ఎందుకు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించడం? ఆ రోజు నేనెంత బాధపడ్డానో తెలుసా? అలాంటి పని ఇంకెప్పుడూ చేయకండి."
ఏం మాట్లాడకుండా ఆమె పెదాల వైపు చూస్తున్నాడతను.
తన వైపే సూటిగా అభినవ్ చూస్తుండటంతో కావ్య మనసు ఆనందంతో నిండిపోయింది.
"ఏంటలా చూస్తున్నారు?" ఆ మాట ఆమె పెదాల వరకూ వచ్చి ఆగిపోయింది.
నందినికి సంబంధించి డాక్టర్ చెప్పిందంతా చెప్పి-
"రమణ అన్నాయన చూస్తానన్నాడనుకో. నీకు ఎవరైనా తెలిసి వుండొచ్చు కదా. నందినిని కనురెప్పలా చూసే నర్స్ కావాలి. నేనున్నా లేకపోయినా ఫుల్ రెస్పాన్స్ బిలిటీ టేకప్ చేసే మంచి మనిషై వుండాలి" చెప్పాడు అభినవ్.
ఆ మాటలకు నవ్వింది కావ్య.
"ఏం నవ్వుతున్నారు?"
"మీకు నర్సు కావాలా. పెళ్ళాడడానికి అమ్మాయి కావాలా?"
ఆ మాటలకు బిత్తరపోయాడు అభినవ్.
కాసేపయ్యాక "ఏం చేద్దాం? చెప్పండి" అని అడిగాడతను.
"దీనికి పెద్ద ఆలోచన ఎందుకండీ బాబూ! పేపర్లో యాడ్ యిస్తే చాలు. కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్ వస్తాయి. వాటిలోంచి మంచి అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం. ఒకపని అయిపోతుందిగా. ఎలా వుంది ఐడియా?"
"గుడ్ ఐడియా! బాగానే వుంది కానీ , ఇమ్మీడియట్ గా వర్కు జరగాలి"
"రేపు పేపర్లో యాడ్ యిస్తాను. సరేనా? రెండ్రోజుల్లో ఆ గవర్నెస్ ని సెలక్ట్ చేస్తాను. ఫైనల్ గా మీరు చూడండి. ఓ.కే?"
"అలాగే" అన్నాడు అభినవ్ రిలాక్స్ గా.
అప్పటికప్పుడు పెన్ను, కాగితం తీసుకుని యాడ్ మేటర్ రాసి అభినవ్ కి చూపించింది.
గవర్నెస్ కావలెను.
మద్రాసులో నివాసముంటున్న ఒక పేషెంట్ ఆరోగ్య వ్యవహారాలను చూసుకోడానికి అర్హతలు గల నర్స్ లేదా గవర్నెస్ కావలెను. అర్హతలకు సరిపడు వేతనము యివ్వబడును. అభ్యర్థికి తెలుగు భాష వచ్చి వుండవలెను.
రెండు రోజుల్లో నేరుగా కానీ, ఫోను ద్వారా గాని సంప్రదించవలయును. కావ్య, సృజా యాడ్ ఏజెన్సీ మద్రాసు.
ఆ యాడ్ ని అభినవ్ ఓ.కె. అనడంతో అప్పటికప్పుడు ఆ ప్రకటనని తన అసిస్టెంట్ తో అంధ్రప్రభ డైలీ ఆఫీసుకి పంపింది కావ్య.
"ఇప్పుడు మిమ్మల్ని సీరియస్ గా ఓ ప్రశ్న వేస్తాను. జవాబు చెపుతారా?" అసిస్టెంట్ వెళ్ళిపోయాక అడిగింది కావ్య.
"చెప్పండి."
"నా మీద మీ అభిప్రాయం ఏమిటి?" సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
ఎప్పుడూ లేనిది కావ్య అలా సంకోచం లేకుండా అడగడంతో ఏం చెప్పాలో తెలీక కంగారుపడిపోయాడు అభినవ్.
"అది కాదు బాసూ! నేనంటే నీకు నమ్మకం ఉందా లేదా చెప్పండి."
"మీరేం అడుగుతున్నారో నాకేం అర్థం కావడంలేదు" అమాయకంగా అడిగాడు అభినవ్.
"నేను స్పష్టమైన తెలుగు భాషలోనే అడుగుతున్నాను. తమిళంలో అడగడం లేదు. నాతో మీరు చేతులు కలుపుతారా లేదా?"
"ఏ విషయంలో?" గొంతు తడారిపోయింది అభినవ్ కి.
"మళ్ళీ చెప్పాలా. మీరు ఊ అంటే నేను వచ్చేస్తాను. మనం విడిగా......"
"విడిగా?!"
"విడిగా స్వంతంగా యాడ్ ఏజెన్సీ పెట్టుకుందాం. మీ పెయింటింగ్స్ నే మనం మోడల్స్ గా వాడుకుందాం. ఆర్టిస్టుగా మీకు డబ్బు, బిజినెస్ పరంగా మనకు సక్సస్. మీరు పక్కనుంటే నేనెన్ని వండర్స్ చేస్తానో తెలుసా?"
కావ్య ఇంకేమిటి అడుగుతుందోనని కంగారుపడిపోయిన అభినవ్ ఆ మాటలకు రిలాక్సయిపోయి తలెత్తి ఆమె వైపు చూసి......
"ఆర్ట్ కి సంబంధించి నాక్కొన్ని ఖచ్చితమైన నమ్మకాలున్నాయి. ఆర్ట్ ని బిజినెస్ తో కలపకూడదని, ఏ కాస్మాటిక్ యాడ్ కోసమో నేను పెయింటింగ్ వేయడం నాకు నచ్చని పని. కమర్షియల్ ప్రోడక్ట్స్ కి నేను పెయింటింగ్స్ ని మోడల్స్ గా చెయ్యలేను. ఇప్పటికే హరిహరన్ కి పెయింటింగ్ వేసినందుకే నేను బాధపడుతున్నాను."
అలా అంటున్న అభినవ్ వైపు పిచ్చివాడిని చూసినట్టుగా చూసిందికావ్య.
"బాసూ! తెలుగులో పోతన గురించి విన్నావా నువ్వు. ఆ కాలంలో పోతన తన కవిత్వాన్ని రాజులకు అంకితమివ్వనని పేదరికం అనుభవించాడు. అదే సమయంలో పోతన బావమరిది శ్రీనాధుడు రాజులకే కాదు డబ్బున్న మంత్రులకు కూడా అంకితమిచ్చాడు.
కళలకు గుర్తింపు ఇంట్లో పెట్టి పూజించడం ద్వారా కాదు బాసూ! ఎవరికో ఒకరికి ఇవ్వాలి. అంటే అమ్మాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప చిత్రకారులే తమ పెయింటింగ్స్ ని ఆ కాలంలో కొన్ని లక్షలకు అమ్ముకున్నారు. తమ పెయింటింగ్స్ కి క్రేజీ వుందని తెలిసి వేలం వేసి కోటీశ్వరులయ్యారు.
నీకు తెలుసా రోమ్ లో 1649లో డిగోవేలజ్ క్విజ్ అనే పెయింటర్ అతిగొప్ప పెయింటింగ్ ని వేశాడు. ఆ పెయింటింగ్ అలా కళాభిమానులైన రాజుల చేతుల్లోంచి మారింది. 1970 నవంబర్ 27న లండన్ లోని క్రిస్టీ సెల్స్ రూమ్స్ అనే సంస్థ ఈ పెయింటింగ్ ని వేలం వేస్తే న్యూయార్క్ లోని విల్ట్ న్ స్టిన్ ఆర్ట్ గ్యాలరీ యాజమాన్యం ఇప్పటివరకూ ఎవరూ ఇవ్వని మొత్తానికి ఆ చిత్రాన్ని వేలంలో పాడి కొనుక్కున్నారు. ఎంతకు కొన్నారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావ్. 55,44,000 డాలర్లు. ఆర్యూ బిలీవ్ ఇట్?
అలాగే-