"ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్రిసిటీ పొదుపుమీద దేశ ప్రజలకు సందేశం యిస్తున్నాడు. వైట్ హౌస్ నుంచి డైరెక్ట్ రిలే అవుతోంది. ఆ ప్రోగ్రామ్ గంట. ప్రోగ్రాం పూర్తయిపోయింది.
దేశ ప్రజలంతా మర్నాటి నుంచి పొదుపును పాటిస్తారని అనుకున్నాడాయన. కానీ ఎవరూ పాటించలేదు. ఎందుకో వూహించగలరా?" తల తిప్పకుండానే ప్రశ్నించాడు ప్రైవేట్ డిటెక్టివ్ రవితేజ.
ఒక్కక్షణం అన్విత ఆలోచనలో పడింది.
"చెప్పలేరా?"
"అవును" అంది అన్విత.
"ఆ టైమ్ లో అక్కడి దూరదర్శన్ ఆఫీసులో కరెంటు లేదు..." నవ్వొచ్చింది అనేఇతకు.
"జోకా?" అంది అన్విత.
"నిజమండీ" అన్నాడు రవితేజ.
"టర్నర్ స్క్రూ వుందా?" అడిగాడతను- ఆమెను అక్కడ్నుంచి పంపించెయ్యాలన్న ఉద్దేశ్యంతో.
"తెస్తాను" అంటూ కిందకెళ్ళింది అన్విత.
సరిగ్గా అదే సమయంలో-
తన జేబులో వున్న పాకెట్టును తీసి, కోటు బటన్స్ లా వున్న మూడు మైక్రోఫోన్ బగ్స్ లోంచి ఒక బగ్ తీసి, స్తంభం వెనుక ఫిక్స్ చేశాడు వేగంగా. దానిలో వుండే అతిచిన్న సెల్ మూలంగా అది రెండు నెలల పాటు సెన్సిటివ్ మైక్రోఫోన్ లా పనిచేస్తుంది. ఆ గదిలో ఉద్భవించే అతి చిన్న శబ్దానికి కూడా అది రియాక్టయి శబ్దాల్ని రిసీవ్ చేసుకుని రవితేజ దగ్గరుండే రిసీవింగ్ ప్లేయర్ ని యాక్టివేట్ చేస్తుంది.
ఆ ప్లేస్ ఆ రూమ్ కి సెంటర్లో వుంది. ఎక్కడ్నుంచి మాట్లాడినా కరెక్ట్ గా ఎఇసీవ్ చేసుకునే ప్లేస్- గుండుసూదిలా వున్న స్విచ్ ని నొక్కాడు.
ఇంతలో స్క్రూ డ్రైవర్ తో వచ్చింది అన్విత.
"పదండి ఈ గదిలో పనైపోయింది" అన్నాడు స్క్రూ డ్రైవర్ అందుకుంటూ.
ఆమె అతన్ని అనుసరించింది.
"మీ నాన్నమ్మగారి బెడ్ రూమ్ చూపించండి" అన్నాడు.
విచిత్రంగా అతని ముఖంలోకి చూసి.
"ఆవిడ మా నాన్నమ్మ అని మీకెలా తెల్సు.....?" అని అడిగింది అన్విత.
ఆ ప్రశ్నకు తత్తరపాటుకు లోనయ్యాడు రవితేజ.
"సహజంగా ఆడపిల్లలతో నాన్నమ్మలు, మగపిల్లలతో అమ్మమ్మలు వుంటారు. సైకాలజీ పాయింట్ లెండి" అన్నాడు డిటెక్టివ్.
తనలో రేగిన కంగారుని అణుచుకుంటూ.
ఇద్దరూ మెట్లు దిగారు.
అన్నపూర్ణమ్మ బెడ్ రూమ్ లోకి నడిచింది.
వైర్లన్నీ చెక్ చేసి-
"ఫ్యాన్ వైర్లు బాగా పాడైపోయాయి. మొత్తం వైరింగ్ మారిస్తే మంచిది" అన్నాడు.
"మీరు చేసెయ్యగూడదూ?" అంది అన్విత.
"అలాగే! కానీ ఇప్పుడు కాదు మళ్ళీ వస్తాను. చిన్న వైరుంటే ఇవ్వండి టెంపరరీగా ఎడ్జస్ట్ చేస్తాను" అన్నాడు రవితేజ.
వైరు కోసం వెళ్ళింది అన్విత.
డబుల్ కాట బెడ్ వెనుకున్న గోడకి ఎవరికీ కనిపించకుందా రెండో మైక్రోఫోన్ బగ్ ని ఫిక్స్ చేసి ఆన్ చేశాడు.
మరొకటి హల్లో ఫిక్స్ చేశాడు ఆ ఇద్దరూ చూడకుండా.
"ప్రస్తుతానికి పనైపోయింది ఈసారి లీజర్లీగా వచ్చి అన్నీ సెట్ చేస్తాను" పనిమనిషి ఇచ్చిన టీ తాగుతూ అన్నాడు రవితేజ.
"మిమ్మల్ని బయట ఎవరైనా చూస్తే ఎలక్ట్రిషియన్ అనుకోరు" అంది అన్విత.
"నేనూ అలా అనుకోను" అన్నాడు రవితేజ.
"థాంక్యూ ఫర్ యువర్ టీ" అంటూ వెనుతిరిగి పోర్టికోవరకూ వచ్చాడతను.
"వస్తాను" అంటూ అన్వితవైపు చూసి-
"మీకో చిన్న విషయం చెపుతాను ఏమీ అనుకోరుగదా?" అని అన్నాడు.
"చెప్పండి ఫర్వాలేదు."
"కోపగించుకోనని చెప్పండి."
"అలాగే!"
"అందమైన అమ్మాయిలు అరుదుగా కన్పిస్తారు అవునా?"
"అవును."
"అలాంటి అరుదైన, అందమైన అమ్మాయే మీరు" అంటూ ఆమె రియాక్షన్ కోసం చూడకుండా వెనుదిరిగి-
ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అతనివైపు మందస్మితంతో చూసిందామె.
రవితేజకు అమ్మాయిల్నీ ఎలా ఎట్రాక్ట్ చెయ్యాలో తెల్సు అందుకవసరమైన సైకలాజికల్ నాలెడ్జ్ అతనిలో పుష్కలంగా వుంది.
* * *
తన కారులో ఏర్పాటు చేసిన రిసీవర్ని మధుకి చూపించాడు రవితేజ.
"అక్కడ మీ లవర్ , తదితరులు మాట్లాడుకునే మాటలు ఈ రిసీవరు ద్వారా నాకు విన్పిస్తాయి. నేనెక్కడున్నా వాటిని విని, సెల్ ఫోన్ ద్వారా మీకు చెపుతాను" అంటూ రిసీవర్ ఆన్ చేశాడు.
ఏవో మాటలు మెల్లిగా విన్పిస్తున్నాయి.
వాయిస్ పెంచాడు.
ఇప్పుడు మాటలు స్పష్టంగా విన్పిస్తున్నాయి.
"బేబీ! సాయంత్రం ఈశ్వరుడి గుడికి వెళ్ళాలి.... కారు పంపమని ఫోన్ చేస్తావా?" ఆ గొంతు అన్నపూర్ణమ్మది.
"మాటిమాటికి కారు అడిగితే బావుంటుందా? ఆటోలో వెళ్దాంలే" ఆ గొంతు అన్వితది.
"నీ ఇష్టం."
రెండు నిమిషాలసేపు ఏ మాటలూ విన్పించలేదు.
ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర చప్పుళ్ళు.
"ఎప్పుడైనా ఇంపార్టెంట్ డిస్ కషన్ వుంటే మీకు టేప్ చేసి ఇవ్వబడుతుంది" చెప్పాడు రవితేజ.
"ఇక్కడ ఈశ్వరుడి గుడి ఎక్కడుంది?" అడిగాడు మధు.
"ఎక్కువగా అందరూ వెళ్ళేది..... శంకరమఠంలోని శివుడి గుడికే."
"శంకరమఠం ఎక్కడ?"
చెప్పాడు రవితేజ. కాసేపయ్యాక అతను వెళ్ళిపోయాడు.
భోజనానికి హోటల్ కి వెళ్ళాడు మధు.
* * *
సాయంత్రం ఐదు గంటల ముప్ఫై నిమిషాలు.....
డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర తల దువ్వుకుంటున్నాడు మధు.
ఫోన్ మోగింది.
రిసీవర్ అందుకున్నాడు మధు.
"హలో! నేను తేజని..... అయిదు నిమిషాల క్రితం అన్విత, వాళ్ళ నాన్నమ్మతో కలిసి శంకరమఠానికి బయలుదేరారు."
"అయిదు నిమిషాల క్రితమా? గుడ్..... థాంక్యూ" డబ్బుపొతే పోయింది. వండ్రపుల్ సర్వీస్ దొరికిందని అనుకున్నాడు మధు.
"హౌ డూ ఫీల్ ఏ బౌట్ సర్వీస్...." అడిగాడు రవితేజ.
"వండ్రఫుల్!" అన్నాడు ప్రశంసాపూర్వకంగా మధు.
"యూ కెన్ హేవ్ సోమెనీ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్సెస్..... ఇన్ ఫ్యూచర్.... ఓకే" ఫోన్ కట్ అయింది.
మరుక్షణంలో హీరోహోండా స్టార్ట్ అయింది.
* * *
ఆరుగంటల పదిహేను నిమిషాలు.....
శంకర్ మఠంలోని శివాలయం కళకళలాడుతోంది భక్తులతో.....
అక్కడ అన్విత తనకు కన్పించినా, కన్పించనట్టుగా నటించి, వచ్చేయ్యాలి. అలా వచ్చేస్తేనే ఆమెలో ఆసక్తి పెరుగుతుంది. ముందుగానే అనుకున్నాడు మధు.
మూడుసార్లు ప్రదక్షిణాలు చేసి, తను తెచ్చిన కొబ్బరికాయను, పూలను పూజారికిచ్చి, కళ్ళు మూసుకుని నమస్కరించి నుంచున్నాడు.
కాసేపయ్యాక కళ్ళిప్పాడు.
కొంచెం దూరంలో భక్తుల మధ్య నుంచున్న అన్విత.
ఓరకంట అన్వితను చూసి కళ్ళు తిప్పుకున్నాడు.
అదే సమయంలో అన్విత అతడ్ని చూసి ఆశ్చర్యపోయింది.
ప్రసాదం తీసుకుని, నందీశ్వరుడికి మొక్కి వెనుతిరిగాడు.
అదే సమయంలో పూజారి హారతి ఇస్తున్నాందువల్ల కదలలేక పోయింది అన్విత.
గబగబా హారతి తీసుకుని, భక్తుల మధ్య నుంచి బయటికొచ్చి అటూ ఇటూ చూసి ధ్వజస్తంభం దాటి గుడి బయటికొచ్చింది.
మూడు నిమిషాల క్రితమే హీరోహోండా ఆ రోడ్డు మీద ముందుకు దూసుకుపోయింది.
* * *
పావుగంట తర్వాత రూమ్ కొచ్చి, డోరు తెరుస్తున్నప్పుడు అప్పటికే ఫోన్ మోగుతోంది.
"నేనే.... తేజను..... మీరు బయటికొచ్చి హీరోహోండా స్టార్ట్ చేసి, ముందుకు వెళుతున్న సమయంలోనే మిమ్మల్ని విష్ చెయ్యడానికనుకుంటా అన్విత బయటికొచ్చింది జనం మధ్య వెళ్ళిపోతున్న వెహికల్ వేపు చూసింది.
మిమ్మల్ని పలకరించ లేకపోయాననే నిరాశ స్పష్టంగా ఆమె కళ్ళల్లో కన్పించింది."
తన అంచనా కరెక్ట్ అయినందుకు చాలా తృప్తిగా వుంది మధుకు.
"మీరెక్కడనుండి మాట్లాడుతున్నారు?" అడిగాడతను.
"అది ప్రొఫెషనల్ సీక్రెట్..... చెప్పగూడదు" అన్నాడు తేజ.
"వాళ్ళిప్పుడెక్కడున్నారు?"
"పూర్ణా మార్కెట్ లో అన్నపూర్ణమ్మ గుమ్మడికాయ బేరం ఆడుతోంది. అన్విత క్యారెట్ దుంపల్ని చూస్తోంది" రవితేజ చెప్పాడు.
"ప్రొఫెషనల్ సీక్రెట్ అన్నారు. మరి వాళ్ళెక్కడున్నారో, మీరు అక్కడే వున్నట్టు కదా? మీరు పూర్ణా మార్కెట్ లోనే వాళ్ళకి కొంచెం దూరంలో వున్నట్టు తెలిసిపోయింది కదా" నవ్వుతూ అన్నాడు మధు.
"లేదు. నీది తప్పు- నా దగ్గరున్నా బైనాక్యులస్ హైపవర్..... నేనిప్పుడు వాళ్ళకి చాలా దూరంలో వున్నాను. ఓవర్" సడెన్ గా మెసేజ్ కట్ అయింది.
అంతా థ్రిల్లింగ్ గా వుంది మధుకి.
రాత్రి పదిన్నరకి మళ్ళీ ఫోన్ వచ్చింది.
"అన్వితకు తొమ్మిదిన్నరకు ఫోన్ వచ్చింది. పావుగంటసేపు మాట్లాడింది.
తర్వాత డిన్నర్ చేసింది. ప్రస్తుతం సినిమా చూస్తోంది.
ఆ సినిమా పేరు ది స్టీచ్."