Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 34


    "మర్చిపోయాను సార్! మధు మీ ఇంట్లో వుండటం లేదట?"

 

    "మా ఇంట్లో ఏమిటి..... ఈ ఊళ్ళోనే వుండడం లేదు కదా? మీకు తెలీదా?"

 

    "తెలీదు సార్!" అమాయకంగా అన్నాడు రవి.

 

    "వైజాగ్ లో బిజినెస్ చేసే గొడవలో వున్నాడు. ఏభైవేలడిగితే నేనే యిచ్చాను."

 

    "ఏం బిజినెస్ సార్?"

 

    "తాళాల బిజినెస్ కాదనుకుంటా..... అడగలేదోయ్" అని చెప్పి-

 

    "అప్పుడు మొఘల్ చక్రవర్తుల్లో బాబరు వెండితాళాలు......" అంటూ ఏదో చెప్పబోతుండగా-

 

    "మిగతాది రేపు క్లాస్ రూమ్ లో వింటాం సార్" అంటూ అందరూ క్యాంటీన్ లోంచి బయటికొచ్చేశారు-

 

    తాళాల్నీ, కప్పల్నీ నమ్మొచ్చుగానీ, ఈ కుర్రాళ్ళని మనం నమ్మలేము... అని అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు మైదానం నారాయణ.

 

    "నాకంతా అర్థమైపోయింది! ఆ మధుగాడు అన్విత కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నాడని" కోపంగా అన్నాడు రవి.

 

    "మనం ఏం చేద్దాం?" అడిగాడు రమణ.

 

    "ఎట్టి పరిస్థితిల్లోనూ అన్విత వాడికి దక్కకూడదు" సిగరెట్ ప్యాకెట్ లోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ అన్నాడు రవి.

 

    అన్విత రూపం కళ్ళముందు కదలాడుతుంటే, రవికి పిచ్చెక్కి పోతున్నట్టుగా వుంది.

 

    "అన్వితకు వాడంటే ఇష్టంలా వుందిరా" అన్నాడు బుచ్చిబాబు.

 

    "ఇష్టమైతే వాడ్ని పెళ్ళి చేసుకుంటుందా?" రవి ఆలోచనల్లో వికృత్వం చోటు చేసుకుంటోంది.

 

    నేటి యువతరంలో లవ్ లంటే డేటింగ్ అనే ఆలోచన రూపుదిద్దు కొన్నప్పుడే హ్యూమన్ వాల్యూస్ సన్నగిల్లాయి.

 

    ఎన్ని దుర్మార్గాలు చేసినా లగ్జరీ లైఫ్ అనేది గోల్.

 

    అర్థరాత్రి వరకూ క్లబ్స్ లో గడపడం, చిత్తుగా అమ్మాయిలతో డాన్స్ లు చెయ్యడం, చీకట్లో కోర్కెలు తీర్చుకోవడం......

 

    'యవ్వనంలోనే అనుభవించాలి' అన్న సిద్ధాంతానికి ప్రాణం లేని కరెన్సీ కాగితం వెలవెలబోతోంది.

 

    మొన్నటికి మొన్న ఢిల్లీలో మోడల్ జస్సికా మరణం ఖరీదు ఒక పెగ్గు విస్కీ.

 

    సడన్ గా రివాల్వర్ తీసి కాల్చేసిన పొలిటీషియన్ కొడుకు విస్కీకి వెయ్యి రూపాయలు వెలకట్టాడు. నిజానికది విస్కీకి కట్టిన ఖరీదా....? స్త్రీ శీలానికి కట్టిన ఖరీదా?

 

    'అన్వితను ఎక్కడ పడగొట్టాలో అక్కడ పడగొడతాను' అనుకున్నాడు రవి ఆలోచిస్తూ.

 

    రవి ఒక వర్గపు ధనిక విలాస యువతరానికి ప్రతినిధి.

 

    ఆ ప్రాతినిధ్యంలోని అరాచకత్వమే సమాజంలో హింసకు కారణమవుతోంది.

 


                                           *    *    *

 

    శివాజీ పాలెంలో ఫోన్ తో సహా ప్లాట్ దొరికింది మధుకి. ఫోన్ చేయడంతో మైదానం నారాయణ ఏలూరులోని సామన్లను, ఫర్నీచర్ ను ట్రాన్స్ పోర్టు లారీలో విశాఖకు పంపించాడు. సర్దుకోవడానికి ఒకరోజు పట్టింది మధు, సుల్తాన్ కు.

 

    "రవితేజకు నీ కేసు అప్పగించాక, నేనో వారం రోజులు ఏలూరు వెళ్లొస్తాను..... షాపు దగ్గర మంచి అసిస్టెంట్ ను పెట్టి వస్తాను" అన్నాడు సుల్తాన్.


                                           *    *    *

 

    అయిదోరోజు ఉదయం పదకొండు గంటలకు డిటెక్టివ్ ఏజెన్సీలో రవితేజ ఎదురుగా వున్నారు మధు, సుల్తాన్ లు.

 

    అడ్వాన్స్ తీసుకుని రసీదు ఇచ్చాడు.

 

    "మూడు విడతలుగా మీరు ఎమౌంట్ పే చెయ్యాల్సి వుంటుంది. అలాగే మూడు విడతలుగా మీకు డిటైల్ రిపోర్ట్ చేస్తాను...... డైలీ మెసెజెస్ ఎప్పటికప్పుడు మీకు అందుతూనే వుంటాయి..... ఆ మెసేజెస్ మీకు అందాక, మీ రియాక్షన్ ఎలా వుంటే బావుంటుందో సలహా ఇస్తాను. దీనిని కస్టమర్ మూవ్ మెంట్ సర్వీస్ అంటారు. దీనికి ప్రత్యేకంగా మీరు పే చేయాల్సిన అవసరం వుండదు.పెద్ద కేసు కాబట్టి...." చెప్పాడు రవితేజ.

 

    సలహాలు ఇవ్వడం కూడా వ్యాపారమేనన్న మాట అనుకున్నాడు మధు మనసులో.

 

    "అన్విత ఫోటో ఇవ్వండి" అడిగాడు రవితేజ. ఫోటో యిచ్చాడు.

 

    ఆ ఫోటోలోని అన్వితను చూడగానే షాక్  తిన్నాడు రవితేజ.

 

     వాటే బ్యూటీ...... మనసులోనే అనుకున్నాడు.

 

    తలెత్తి మధువైపు చూశాడు.

 

    "ఏంటలా చూస్తున్నారు?" అడిగాడు మధు.

 

    "వెరీగుడ్ సెలక్షన్" అన్నాడు ప్రశంసగా.

 

    "రేపట్నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను..... నలభై ఎనిమిది గంటల తరువాత నుంచి మీకు మెసేజెస్ వస్తుంటాయి" అన్నాడు రవితేజ.


                                          *    *    *

 

    ఫోటోల మధ్య తనకు కన్పించేటట్లుగా ప్రేమ ఫోటోని పెట్టాడు. ఆ దృశ్యం అతనికెంతో నచ్చింది.

 

    ప్రేమ ఫోటో స్నేహానికి గుర్తయితే...

 

    అన్విత ఫోటోలు ప్రేమకు గుర్తు....

 

    ఆరోజు సాయంత్రం సుల్తాన్ ని ట్రైన్ ఎక్కించి, తను లీలామహల్ లోని ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాడు మధు.

 


                                           *    *    *

 

    మర్నాడు ఉదయం సరిగ్గా ఆరుగంటలు.....

 

    లాసన్స్ బే కాలనీలోని ఆ బిల్డింగ్ కు పదిగజాల దూరంలో ఫుట్ పాత్  పక్కన బ్లాక్ అంబాసిడర్ కారు ఆగింది.

 

    డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రవితేజ బ్లాక్ సూటు, హేటులో ఫారినర్ లా వున్నాడు. బీచ్ ఏరియా కావడంవల్ల, ఆ ప్రాంతంలో ఏ కారు, ఎక్కడ ఎంతసేపు ఆగినా, ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా పోలీసులు, కారుదిగి, గోడ పక్కన  నిలబడి లోపలికి చూశాడు.

 

    ఒక సెక్యూరిటీగార్డు, తోటపనివాడు, లోపల యిద్దరు ఆడపని మనుషులు..... అన్విత వాళ్ళ నాన్నమ్మ అన్నపూర్ణమ్మ ఇద్దరే ఆ ఇంట్లో వుంటారని మధు ద్వారా తెలుసు అతనికి.

 

    ఆ ఇంట్లో ఎన్ని గదులున్నాయి...... నాన్నమ్మ, అన్విత ఏఏ గదులు వాడతారు...... ఎక్కువగా తిరిగే ప్రదేశాలేమిటి? ఇష్టాలేమిటి? అభిరుచులేమిటి? మొదట కావల్సిన ఇన్ ఫర్మేషన్ అది.

 

    డిటెక్టివ్ ట్రైనింగ్ లో ఏయే అవసరాల్లో, ఏయే వేషాలు వెయ్యాలో మొదట నేర్పుతారు..... డొమెస్టిక్ డిటెక్షన్ లో టెలిఫోన్ మెకానిక్, కరెంట్ మెకానిక్, లాండ్రీమెన్, కుక్, పోలీస్ మెన్ తదితర వేషాలు వెయ్యొచ్చు.

 

    ఆ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఏ పోల్ నుంచి వుందో చూశాడు.

 

    టెలిఫోన్ బూత్ లోకెళ్ళి ఆ ఇంటి నెంబర్ ఫోన్ చేశాడు.

 

    అన్నపూర్ణమ్మ ఫోన్ లిప్ట్ చేసింది.

 

    "ఎవరయ్యా?"

 

    "ఎలక్ట్రిసిటీ ఆఫీసు నుంచి సడన్ గా వచ్చిన హై ఓల్టేజీవల్ల లైన్స్ పాడైపోయాయమ్మా..... మీరు వెంటనే మెయిన ఆఫ్ చేసెయ్యండి. లైన్స్ బాగయ్యాక మా లైన మెన్ మీ దగ్గరకొచ్చి చెప్పాక మాత్రమే మెయిన్ వెయ్యండి.... లేకపోతే షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది" నమ్మకం కలిగేలా చెప్పాడు రవితేజ.

 

    "అలాగే...." అని తనే స్వయంగా మెయిన స్విచ్ ఆఫ్ చేసింది అన్నపూర్ణమ్మ.

 

    రెండు గంటలు గడిచాయి.

 

    మళ్ళీ ఫోన్ చేశాడు రవితేజ.

 

    "ఉక్కతో చచ్చిపోతున్నాం..... త్వరగా వచ్చి చూడు" అందామె చిరాగ్గా.

 

    "ఇప్పుడే వస్తున్నా" హేట్ కారులో పడేసి, కారులోనే బ్లాక్ డ్రెస్ తీసేసి, కాకీ డ్రెస్ వేసుకున్నాడు ప్రయివేట్ డిటెక్టివ్ రవితేజ.

 

    పదినిమిషాల తరువాత  ఆ ఇంట్లో కి అడుగుపెట్టాడు.

 

    ముఖం కనిపించకుండా, తలవంచుకుని వాళ్ళవైపు ఓరగా చూశాడు.

 

    ఆ సమయంలో అన్నపూర్ణమ్మ, అన్విత డ్రాయింగ్ రూమ్ లో వున్నారు.

 

    "ఎలక్ట్రిసిటి డిపా......" అని అతనింకా మాటలు పూర్తి చేయకుండానే-

 

    "తెలుసు! ముందు ఆ మెయిన్ చూసి, వెంటనే వెయ్యి. నువ్వేనా మాకు ఫోన్ చేసి చెప్పావు" ధాటిగా అడిగింది అన్నపూర్ణమ్మ.

 

    "లేదు! మా లోకల్ ఆఫీసర్....." గొంతు మార్చి అన్నాడు ప్రయివేట్ డిటెక్టివ్ రవితేజ.

 

    "మెయిన్ ఎక్కడుంది?"

 

    "పోర్టికో పక్కన మెట్లు దగ్గర....." అంటూ లేచి, ఎక్కడుందో చూపించింది అన్విత.

 

    గోడలవైపు చూస్తున్నట్టుగా నటిస్తూనే, అన్వితను పరిశీలిస్తున్నాడు అతను.

 

    ఫోటోను చూసి బ్యూటిఫుల్ లేడీ అనుకున్న రవితేజ మనిషిని చూడగానే థ్రిల్ అయిపోయాడు నిజంగానే.

 

    రవితేజను చూడగానే అతనొక ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగిలా అనిపించలేదు అన్వితకు. కాలేజీ స్టూడెంట్ లా అనిపించాడు.

 

    మెయిన్ స్విచ్ ను పరిశీలిస్తూ-

 

    "ఏ ఇల్లు చాలాకాలం ఖాళీగా వుందా?" అడిగాడు రవితేజ.

 

    "అవును."

 

    "వచ్చేది వర్షాకాలం ఓల్డ్ బిల్డింగ్ కదా! మెయిన్ స్విచ్ తో పాటు లోన వైరింగ్ కరెక్ట్ గా వుందో లేదో చూసుకోకపొతే ప్రమాదం. చూస్తానుండండి" అంటూ డ్రాయింగ్ రూమ్ లో కొచ్చాడు రవితేజ.

 

    "ఎక్కువగా మీరు వాడే రూమ్స్ చూడాలి" అంటూ నలువైపులా చూశాడు.

 

    "పైన నా బెడ్ రూమ్" అంది అన్విత కేజువల్ గా.

 

    "చూడొచ్చుకదా?" అన్నాడు నమ్రతగా.

 

    గబగబా మెట్లెక్కుతున్నాడతను.

 

    అతన్ని అనుసరించింది అన్విత.

 

    మామూలు బెడ్ రూమ్స్ కి రెండింతలుందది....... ఎడమవైపు యూఫోమ్ బెడ్, కొంచెం ముందు కేన్ ఉయ్యాల, ఒకవైపు రైటింగ్ టేబుల్, ఇంకో వేపు ఏసీ. రూమ్ కెళ్ళగానే 'రూమ్ స్ప్రే' వాసన ముక్కుపుటాలకు తగిలింది. ఆ వాసన సంపెంగపూల వాసనలా వుంది.

 

    స్విచ్ బోర్డ్ ను ఓపెన్ చేశాడు.

 

    టెస్టర్ తో  టెస్ట్ చేస్తున్నాడు.

 

    అతనివైపే చూస్తోంది అన్విత.

 Previous Page Next Page