ఆ మాటకు లిఖితకు బాగా కోపం వచ్చింది.
"ఏదో గొప్ప నేరం చేసినట్టు జరుగుతున్నదిదా.... అని అడగటం నాకేం నచ్చలేదు..." సీరియస్ గా అంది లిఖిత.
"అడుగుతాను.... నా వ్యాపారాన్ని.... నా మేధస్సుతో పెంచిన వ్యాపారాన్ని లక్ష కళ్ళతో రక్షించుకుంటున్న వాడ్ని.... ఈ బిజినెస్ రహస్యాలు బయటకు లీక్ కావడాన్ని నేను సహించలేను. అలా 'లీక్' చేసే ఎవరినైనా.... నేను క్షమించను... నేను తీసుకునే చర్య... చాలా తీవ్రంగా వుంటుందని హెచ్చరించడానికే నిన్ను పిలిపించాను."
ఆ సమయంలో ఆయనలో పూర్తిగా వ్యాపారవేత్త మాత్రమే ఉన్నాడు. వ్యాపారం ఆయనకో వ్యసనం. ఆ వ్యసనానికి అడ్డొచ్చినా వాడు నిలవటం కష్టం.
భానోజీరవు అవసరమైతే దుర్మార్గంగానే కాదు కుత్సితంగానూ ఉండగలడు.
కుత్సితం లేని వ్యాపారం లేదు. కుత్సితం కొంత శాతం ఉన్నా వ్యాపారం సజావుగా నడుస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు కన్పిస్తాయి. కుత్సితమే వ్యాపారం అనుకున్నవాళ్ళు రాత్రికి రాత్రే వూరొదిలి వెళ్ళిపోయిన దృష్టాంతాలెన్నో!!
భానోజీరావు అప్పుడు కూల్ డ్రింకుల్ని మార్కెట్లోకి 'ఇంట్రడ్యూస్' చేస్తున్న సమయం.
ఆ డ్రింక్ మార్కెట్లోకొస్తే నిలదొక్కుకోవడం ఖాయం. కానీ తన యూనిట్ లోనే పనిచేసే ఒక ముఖ్యమైన ఉద్యోగి డబ్బుకాశపడి ఆ కూల్డ్రింక్ ఫార్ములాని, రైవల్ గ్రూపునకు అమ్మాడు!
రైవల్ గ్రూప్ మొదటి విడత బ్యాచీ తయారు చేసేసింది.
భానోజీరావు ఆ విషయం తెల్సుకున్నాడు.
ఆ బ్యాచ్ రాత్రికి రాత్రే విజయవాడ నుంచి రాజమండ్రి బ్రిడ్జి దగ్గర ఎవరో తెలియని దుండగులు దాడి చేశారు.
మూడు జిల్లాల కోసం పంపుతున్న లక్ష సీసాలన్నీ గోదావరి పాలయ్యాయి.
రైవల్ గ్రూపులో కెళ్ళిన వ్యక్తి ఆ మర్నాటి నుంచి కనిపించలేదు. ఏవయ్యాడో తెలీదు. ఇప్పటికీ ఇంటికి రాలేదు. ఎవరేం చేశారో తెలీదు.
రైవల్ గ్రూప్ మాత్రం భానోజీరావు మనుషులే దానికి కారణం అని రహస్యంగా అనుకుంటుంది.
ఆ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భానోజీరావు ఆనందిస్తుంటాడని అతి సన్నిహితులంటారు.
అంతా వ్యాపార రహస్యం. అదో జ్వాలా ద్వీప రహస్యం.
"వ్యాపార రహస్యాన్ని లీక్ చెయ్యడానికి అక్కడ కెళ్ళలేదా..."
ఆ మాటకు తీవ్రంగా ప్రతిస్పందించింది లిఖిత.
"డోన్ట్ ఆర్గ్యూ విత్ మి... మై చైల్డ్ నువ్వు 'లీక్' చేశావని నేననడం లేదు. కానీ అతని దగ్గర కెందుకు వెళ్ళాల్సి వచ్చింది.... అతన్ని ప్రేమిస్తున్నావా..." తండ్రి నోటివెంట ఆ మాట రావడంతో ఆశ్చర్యపోయింది.
అది తనని కవ్విస్తున్నట్టుగా, వెక్కిరిస్తున్నట్టుగా, అవహేళన చేస్తున్నట్టుగా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నట్టుగా ఉంది లిఖితకు.
"అవును... ప్రేమిస్తున్నాను..."
స్థిరంగా, నిశ్చయంగా లిఖిత గొంతులోంచి ఆ మాట వచ్చింది.
"నువ్వు... అతన్ని ప్రేమిస్తున్నావా?!!! ముందు షాక్.... ఆపైన క్షణాల్లో తేరుకొని పెద్దగా నవ్వాడు. ఏ.సి. గదిలో ప్రతిధ్వనించిన ఆ నవ్వు వికృతంగా ఉంది. కృతకంగా ఉంది.
మూడు నిమిషాలసేపు భానోజీరావు అలా నవ్వుతూనే వున్నాడు. ఆపుకోలేని నవ్వుతో ఉక్కిరిబిక్కిరైన అతని కళ్ళల్లో చిన్న తడి తుడుచుకున్నాడు.
మనుషుల్ని 'ఇరిటేట్' చెయ్యడం భానోజీరావుకి సరదా. అలా ఎందర్నో 'ఇరిటేట్' చేశాడు- రీసెంట్ గా వికాస్ ని. ఇప్పుడు మళ్ళీ స్వంత కూతుర్ని!
"ఎస్... డాడీ.... ఐ లవ్ హిమ్..."
"ఓ.కె.... పెళ్ళి చేసుకుందామనా... ఐ వాంట్ స్ట్రయిట్ ఆన్సర్ టు దిస్...."
ఒకదానిమీద ఒకటి అక్కడ సంగతులు అనూహ్యంగా జరిగి పోతున్నాయి.
వ్యాపారవేత్తగా భానోజీరావు కూతురితో 'బ్రైస్ గేమ్' ఆడుతున్నాడు.
లిఖిత కనిపించని ఉచ్చుల్లో ఇరుక్కుపోతోంది.
భవిష్యత్తులో-
వికాస్ తో చెప్పాల్సిన విషయాలు, అనుకోని పరిస్థితుల్లో తండ్రి ముందు... తను అతన్ని ప్రేమిస్తున్నట్లుగా వికాస్ కి తెలీదు...
వికాస్ ఆమె ప్రేమను స్వీకరిస్తాడో, తృణీకరిస్తాడో తెలీదు.
వెనక నుంచి ముందుకు నడుస్తున్న విచిత్రమైన ప్రేమ కథ!
ఈ ప్రేమ కథ విలాసాంతమా?
విషాదాంతమా?
తండ్రి అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేకపోయింది లిఖిత.
భానోజీరావు ఆలోచనలో పడ్డాడు.
"అతనిమీద ఏ నమ్మకంతో నువ్వు సమర్ధిస్తున్నావో నాకర్ధం కావడం లేదు. ఏ విశ్వాసంతో నువ్వు ప్రేమిస్తున్నావో నాకర్ధం కావడం లేదు. స్టాక్ మార్కెట్లో పెడితే ఎర్రని ఏగాణీ క్కూడా పనికిరాడు. అందుకే లవ్ ఈజ్ బ్లయిండ్ అంటారు..." అన్నాడు భానోజీరావు.
"ఒక వ్యక్తిని తీసి పారెయ్యడం... మీకైతే చాలా ఈజీ.... కానీ ఏ వ్యక్తినైతే మీరీవేళ అవమానంగా మాట్లాడుతున్నారో.... అదే వ్యక్తి మీ బిజినెస్ కు అడ్డంగా నిలబడతడు... చూస్తుండండి...." ఆమెలో అహం బయటకొచ్చింది.
తను ప్రేమించిన వాడిని ఎవరైనా, తండ్రితో సహా ఎవరైనా ఎగతాళి చేస్తే ఏ స్త్రీ అయినా 'రియాక్ట్' అయ్యే పద్ధతి అదే! అలా 'రియాక్ట్' కాకపోతే ఆ స్త్రీ ఆ పురుషున్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదనే విషయానికి స్పష్టమైన ఉదాహరణ!
"నా బిజినెస్ ని పడగొట్టేస్తాడంటావా... ఆ.... పాతికేళ్ళ ఈ జింఖానా సామ్రాజ్యం... అలా కూలిపోతుంది. వాడెవడో అల్లాటప్పాగాడు ఒక 'ఎంఫైర్ క్రియేట్' చేస్తాడు! నేను చూస్తూ ఊరుకుంటాను...." కసిగా అన్నాడు భానోజీరావు.
"చూడండి భానోజీరావుగారు.... ఒక్కో 'డికేడ్' ఒక్కొక్కడిది.... తన మీద తను అపారమైన నమ్మకంతో కష్టపడిన ప్రతీవాడూ తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.... చరిత్రను ఎవ్వడూ తాళ్ళతో కట్టి వెనక్కి లాగలేడు. అలాగ లాగడానికి ప్రయత్నించే ప్రతివాడూ...." తండ్రి ముఖం వేపు చూసి ఆగిపోయింది లిఖిత.
తండ్రిని 'భానోజీరావుగారూ' అని సంబోధించడం ఆయనకు కోపాన్ని తెప్పించింది.
ఆయన కూడా ఉద్రేకంతో విలవిల్లాడిపోతున్నాడు.
అయినా ఆయన నిగ్రహించుకున్నాడు.
ఒక సంఘటన వెనక జరిగే పది సంఘటనల్ని ఊహించగలిగే నేర్పరి. ముందు చూపూ, అనుభవంగల వ్యక్తి ఆయన.
తొందరలో తనేం తప్పు చేసిందో అర్ధమవడానికి అయిదు నిమిషాలు పట్టింది లిఖితకు.
ఈ సంఘటనను మరింకా పొడిగించదలుచుకోలేదు భానోజీరావు.
ఫోనెత్తి-
"రెండు కాఫీలు పంపించండి.... అలాగే మధుకుమార్ ని రమ్మన్నానని చెప్పండి...." అన్నాడాయన.
గదంతా మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది.
ఎంత సర్కస్ లో పులుల్తోనూ, సింహాల్తోనూ ఆటలాడేవాడైనా అడవిలో భయపడతాడు.
వ్యాపారం ఒక అడవి...
మనుషుల్లా నవ్వే హైనాలున్న అపురూపమైన ఆధునికమైన అడవి వ్యాపారం...
యూనిఫారంలో వున్న బోయ్ వినయంగా తలుపుతీసి, రెండు కాఫీల్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు.
కాఫీ కప్పుని తన చేతిలోకి తీసుకుంటూ...
"కాఫీ తీసుకో... చల్లబడతావ్-" అన్నాడాయన నవ్వడానికి ప్రయత్నిస్తూ.
మాట్లాడకుండా కాఫీ కప్పునందుకుంది లిఖిత.
అదే సమయంలో-
డోర్ చప్పుడైంది-
తలుపు తెరుచుకొని, ఠీవిగా వచ్చాడు మధుకుమార్.
అతనివేపు ఓరకంట చూసింది లిఖిత.
అలా చూడడం గమనించాడు భానోజీరావు.
మల్లయోధుడు కుస్తీకి భయపడడు. అలాంటివాడే భానోజీరావు కూతురు విషయంలో కూడా.
"ఎస్.... చెప్పు...?" మధుకుమార్ వేపు తలతిప్పి అడిగాడు భానోజీరావు.
"ఆ- వెస్ట్ జర్మనీ.... డైమ్ లర్ బెంజ్ కంపెనీనుంచి లెటరొచ్చింది. ఇద్దరు ఇంజనీర్లను పంపుతున్నార్ట... రేపు మార్నింగ్ పదిగంటలకు ఫోన్ వస్తుంది" చెప్పాడు మధుకుమార్.
"జపాన్ నుంచి ఎమ్.డి. ఫోన్ చేశాడా...?" అడిగాడు భానోజీరావు.