Previous Page Next Page 
మొగలిబాకు పేజి 34

 

     క్షణ క్షణం గడిచేసరికి బాత్రూమ్ కు వెళ్ళాలనే బాధ ఎక్కువయి పోతోంది.
   
    ఎవరేమనుకున్నా సరే ఈ క్షణంలో తను బాత్రూమ్ కి వెళ్ళాల్సిందే- తప్పదు గాక తప్పదు. అని అనుకున్నాడు.
   
    "ఒరేయ్ గేట్ కీపరూ.... తలుపు తీయరా....." అని అరిచాడు.
   
    అయినా తలుపు తెరచుకోలేదు.
   
    తలుపుల్ని దబ దబ బాదాడు__ అయినా తలుపు తెరుచుకోలేదు.
   
    ఆ పక్కనే గోడ మీద ఏవో స్విచ్చులు కనబడడంతో గబ గబా టప్ టపామని వరసగా నొక్కేసాడు.
   
    బాక్స్ లో బల్బులు వరసగా వెలగడం.....చుట్టూ చూసిన నారాయణరావు నిర్ఘాంతపోవడం- అంతలోనే__
   
    తన సీటు పక్కన కూర్చున్న వ్యక్తిని చూసి, శోష వచ్చినట్టుగా అయిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
   
    మొత్తం థియేటర్లో ఒక్క ప్రేక్షకుడూ లేడు.
   
    సీటు పక్కనున్న వ్యక్తి సంధ్య!
   
    డ్రీమో, రియల్ సీనో అర్ధం కాలేదు నారాయణరావుకి.
   
    సంధ్య పరిస్థితి కూడా అలాగే వుంది.
   
    నారాయణరావుని చూడగానే స్నాధ్య పరిస్థితి కూడా అలాగే వుంది. ఆమెకు పీకల వరకూ కోపం వచ్చింది.
   
    గబ గబా సీట్లోంచి ఉగ్రంగా లేచి__
   
    "నీలాంటివాడ్ని నేనెక్కడా చూడలేదు. నువ్వింత కుట్ర చేస్తావని నేననుకోలేదు" అంది కోపంగా.
   
    "డిటో" అన్నాడు నారాయణరావు.
   
    "నువ్వు ఆడ యూనియన్ లీడర్లందర్నీ మానేజ్ చేసి నన్నొక్కదాన్నే సినిమాకి పంపించే ఎరేంజ్ మెంట్స్ చేస్తావా...."
   
    "నువ్వు మగ యూనియన్ లీడర్లను మేనేజ్ చేసి నన్నిలా ఇరుకున పెట్టించలేదా...." అని అరిచాడు. అతనికి బాత్రూమ్ బాధ మరీ ఎక్కువగా వుంది.
   
    "అయినా నేన్నిన్ను ప్రేమిస్తాననుకున్నావా.....చచ్చినా ప్రేమించను గాక ప్రేమించాను....అండర్ స్టాండ్"
   
    అంది సంధ్య లేచి బయటకు వెళ్లేందుకు నడుస్తూ.
   
    "డిటో" అన్నాడు నారాయణరావు.
   
    తెరమీద సినిమాలో చీకట్లోంచి ఒక వ్యక్తి వెలుగులోకొచ్చి నడవడం ప్రారంభించాడు.
   
    "ఇది రొమాంటిక్ సినిమా కాదా? సస్పెన్స్ సినిమానా?" తెలుగు సినీ విమర్శకుడిలా అనుకున్నాడు నారాయణరావు అంత బాధలోనూ.
   
    "హవ్వ..... హవ్వ..... ఇంత సినిమా థియేటర్ తో మనం ఇద్దరం ఉండేటట్లు ప్లాన్ చేసి ణ అవ్యక్త్య్త్వాన్ని దెబ్బ తీస్తావా? నేనేం కమలాక్షి ననుకున్నావా?"
   
    కమలాక్షి పేరెత్తగానే నారాయణరావు ముఖం మరీ వివర్ణమై పోయింది.
   
    "నన్ను ఏమయినా అను.....కమలాక్షిని ఏమయినా అన్నావంటే మర్యాద దక్కదు."
   
    కమలాక్షి అంటే యిష్టం లేకపోయినా సంధ్యతో తగవు పెట్టుకోవాలంటే అంతకన్నా ఆ సమయంలో మార్గం దొరకలేదు నారాయణరావుకి.
   
    "కమలాక్షినంటే, ఎందుకలా ఇదైపోతున్నావ్.....ఆవిడేం నీ బెటరాఫా......" దీర్ఘంతీస్తూ కోపంగా అక్కడ కుర్చీ కుషన్ ని బయటకు లాగి విసిరికొట్టింది.
   
    "బెటరాఫో....ఆఫో.....ఆఫున్నరో.... నీకెందుకు...." అంటూ మరో కుర్చీలోంచి కుషన్ లాగి విసిరికొట్టాడు నారాయణరావు.
   
    పావుగంట గడిచింది.
   
    పది సీట్లలో కుషన్ లన్నీ రాలి కిందకు పడిపోయాయి. ఒక పక్క నారాయణరావుకి బాత్రూమ్ బాధ ఎక్కువైపోతోంది.
   
    ధియేటర్ లోపల గొడవ జరుగుతోందని, రంధ్రంలోంచి చూసిన ఫిల్మ్ ఆపరేటర్ మేనేజర్ తో చెప్పడం, అతగాడు బెంబేలెత్తి పోయి-
   
    "కాన్సిల్ ద షో.....ఓపెన్ ద డోర్" అంటూ అరుస్తూ తన చాంబర్ లోంచి బయటికొచ్చాడు.
   
    "చూడు రావూ.....నువ్వెన్ని వెధవ్వేషాలు వేసినా, వేయించినా, నేన్నిన్ను ప్రేమించనుగాక ప్రేమించను....ఈ సిన్మా సాక్షిగా చెపుతున్నాను" అని అందామె భీకరంగా.
   
    "డిటో...." అంత భీకరమైన పరిస్తితుల్లోనూ తమిళ సిన్మా డైరెక్టర్ లా హ్యూమర్ కి స్థానమిచ్చాడు నారాయణరావు.
   
    సరిగ్గా అదే సమయంలో, డోర్స్ తెరచుకోవడం, నారాయణరావు ఒలింపిక్ రన్నింగ్స్లో పాల్గొంటున్నవాడిలా బాత్రూమ్స్ వైపు పరిగెత్తడం జరిగిపోయింది.
   
    "కబడ్దార్....జాగ్రత్త...." పరిగెడుతున అతనివేపు చూస్తూ అరిచింది. అంతలోనే అక్కడకు మేనేజర్ వచ్చాడు.
   
    "వాట్ బేబీ....ఏమైంది?"
   
    "ఏంకాలే.....చిన్న రేప్.....అంతే" అని, సీట్లవేపు చూపించి, తను బయటకు పరిగెత్తింది సంధ్య.
   
    సరిగ్గా అదే సమయంలో తెరమీద హీరో, విలన్ దగ్గరున్న రౌడీ అసిస్టెంట్ అంటే వాంప్ కేరక్టర్ ని రేప్ చేసే ప్రోగ్రామ్ లో వున్నాడు.
   
    మేనేజర్ ఆ సీన్ ని ఆబగా చూడసాగాడు మిగతావన్నీ మర్చిపోయి.
   
                                                                     *    *    *    *
   
    కెమిస్ట్రీ లాబ్ హాలు స్టూడెంట్స్ తో నిండిపోయింది.
   
    ల్యాబ్ లోంచి వస్తున్న ఘాటు ఘాటు పొగలకు దగ్గులు, తుమ్ములతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతోంది.
   
    ప్రొఫెసర్ పరమానందం అప్పుడే లోనికి అడుగుపెట్టాడు.
   
    "ఏమిటీ....అర్జంటుగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు..... ఎనీ ప్రాబ్లమ్?" మోతీలక్ష్మీని అడిగాడు.
   
     మోతీలక్ష్మీ వాసుదేవ్ వేపు చూసింది.
   
    "అదికాద్సార్..... మనం ఏ లక్ష్యంతో, ఏ ఆశయంతో, ఏ దీక్షతో, ఏ కర్తవ్యంతో...." ఆవేశంగా చెప్పబోతున్న వాసుదేవ్ కి అడ్డంగా వచ్చాడు జుత్తుల జిన్నా.
   
    "చూడు నాన్నా.....నువ్వు సినిమా టైటిల్స్ తర్వాత చెపుదువు గానీ..... ముందు పాయింట్ కిరా....." అన్నాడు చిరాగ్గా.
   
    "అవునయ్యా.....అదే బెటరూ....." సుత్తి వీరభద్రరావు మోడ్యులేషన్ తో అన్నాడు ప్రొఫెసర్ పరమానందం.
   
    సరిగ్గా అదే సమయంలో లోనికొచ్చారు వేర్వేరు దారుల్లో నారాయణరావు, సంధ్య, స్టూడెంట్స్ అందరూ వాళ్ళిద్దరివేపే చూడసాగారు.
   
    "చూడు నారాయణరావ్.....ఈ బెంచీ ఎక్కి నిలబడు....." వాసు దేవ్ అన్నాడు.
   
    "మన రూల్స్ కి వ్యతిరేకంగా తప్పు చేసినవాడు ఈ బెంచీఎక్కి నిలబడాల్సిందే.....నువ్వు కూడా నిలబడాలి తప్పదు సంధ్యా."
   
    "లవర్స్ ఇద్దరూ బెంచీ ఎక్కాలి.....స్టాండప్ ఆన్ ద బెంచ్.....బెంచ్....." స్టూడెంట్స్ అందరూ రక రకాల సౌండ్స్ తో అరవడంతో ఇద్దరూ ఒకరివేపు ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ బెంచీఎక్కి నిలబడ్డారు.
   
    "అభియోగాన్ని ఇప్పుడు మోతీలక్ష్మి చదువుతుంది" వాసుదేవ్ చెప్పగానే మోతీలక్ష్మి గొంతు సవరించుకుని, చేతిలోని పేపర్స్ వేపు చూస్తూ చదవడం ప్రారంభించింది.
   
    "విభిన్న మతాలకు, కులాలకు చెందిన ఈ ఇద్దరూ లాటరీద్వారా ప్రేమ జంటగా ఎంపికయిన విషయం మీకందరకూ తెలుసు.....రూల్స్ ప్రకారం వీరిద్దరూ బహిరంగంగా ప్రేమించుకోవాలి. ముచ్చట్లు జరుపుకోవాలి.... ముద్దులు పెట్టుకోవాలి.....ఎక్కడ చూసినా వీరిద్దరే ప్రేమ జంటగా ఎస్టాబ్లిష్ కావాలి వీరి ప్రేమ ద్వారా పెద్దలకు బుద్ది చెప్పాలనే, మన ఆశయాన్న వీరిద్దరూ నాశనం చేస్తున్నారని మా అభిప్రాయం దీనికి నారాయణరావు సంజాయిషీ ఏమిటి?"

 Previous Page Next Page