"నేనే ఏదో వక ఉపాయం ఆలోచిస్తాను. ఈ తఫా ఈ ఆస్తీ చేజిక్కించుకోకుండా మన బిచాణా ఎత్తేస్తే మనగతి ఇంతే" అన్నాడు త్రయంబకరావు.
"త్రయం! నాకో ఉపాయం తట్టిందిరా దానికింక అప్పీలు లేదు."
"ఏమిటది మళ్ళి పనికిమాలినదేనా!"
"కొన్ని పనికిరాకుండా పోయాయని అన్నిటి గతీ అంతేననకు."
"సరే అదేదో చెప్పి అఘోరించు."
"పిచ్చిముండ వాగుడు. వెధవ తెలివి చచ్చుసలహా అని తిట్టకు."
"అలాగే కానియ్యి"
"ఈ దేశాచారము. ఈ దేశ సాంప్రదాయము. పరపురుషుల వల్ల పిల్లలని కనకూడదని కదా!"
"అని ఏ గాడ్దెకొడుకు కూశాడు! భారతకధ తీసుకుంటే అందరూ పరపురుషుల వల్లనే కదా పిల్లలని కంది?"
"అబ్బ, ఏం తెలివిరా నీది? ఏమాటన్నా చెప్పు దానికేదో కధ చెప్పేస్తావు. నీ తెలివే వేరు."
"కాలం కలిసి రాలేదుగాని నాకేమిటే అమ్మా! దేశాన్ని ఏరిపారేయనూ?" అన్నాడు మేలేద్దామంటే మీసాలులేని పేడిమూతి త్రయంబకరావు.
"ఓ తుగ్లక్ చచ్చాడు. మరో తుగ్లక్ దిగాడు ఇంక నువ్వే మిగిలావు" అనుకుంది అమల.
"మానాయనే మాతండ్రే" అని మెటికలు విరిచింది గంగారత్నం.
"ఇందాక ఏదో చెపుతానన్నావు అదేమిటో చెప్పు!"
"కోప్పడకూడదు."
"కోప్పడను సరేనా!"
"కదుపు చేస్తే....."
"కదుపు చేయటమా! ఏంటీ, ఆ చెప్పేదేదో సరీగ చెప్పి తగలడు."
"అదిగో కోప్పడుతున్నావు!"
లేదులే."
"ఎట్టాగో అట్టా ఆ పిచ్చిదాన్ని లొంగదీసుకుని కదుపు చేశావనుకో, అప్పుడు చచ్చినట్లు మీ మామయ్య ఆ పిచ్చిముండని నీకే యిచ్చి పెళ్ళి చేస్తాడు." అంది గంగారత్నం.
ఆమాట విన్న అమల నిర్ఘాంతపోయింది.
త్రయంబకరావు ఆలోచనలో పడ్డాడు.
కొడుకు ఆలోచిస్తున్నాడంటే తనమాట నచ్చే వుంటుంది అనుకుంది గంగారత్నం. లేకపోతే పిచ్చిముండ పిచ్చి ఆలోచనలు అని విసుక్కుంటాడు ఆ విషయం బాగా తెలుసు.
"ఈ కొత్తాలోచన కొంతవరకూ బాగానే వుంది, కాని - "
"కాని ఏమిటిరా త్రయం?"
"ఎలా అని?"
"ఆడదానికి కడుపుచేయటం ఎలాగో మగాడికి చెప్పాలిటరా నాయనా!"
"అదికాదే" విసుక్కున్నాడు త్రయంబకరావు.
"మరి అదేదో చెప్పు!"
"అదసలే పిచ్చిది లొంగాలి కదా."
"ఇలాంటి చిన్న విషయాలే తెలియవురా త్రయం! పిచ్చివాళ్ళకి మదపిచ్చి కూడా ఎక్కువే వుంటుంది. ఈ రోజు నుంచీ దాన్ని కాస్త దువ్వు సమయం చూసి ఆచోట ఈ చోట చెయ్యివెయ్యి దానికి మోహం పుడుతుంది అంతే ఇంక నిన్ను వదలదు."
"కడుపు వస్తుందన్న గ్యారంటీ ఏమిటి?"
"నీ పని నీవు చేయి. అది రావటం ఎంతసేపు. అరక్షణం పట్టదు."
రోజా స్థానంలో తను వున్నది కాబట్టి సరిపోయింది. అదే మతి చలించిన రోజా ఇక్కడ వున్నట్లయితే ఓ ఓపక్క శంకరం మరో పక్క ఈ త్రయంగాడు. రోజాకి ఎంత అన్యాయం చేసేవాళ్ళో. ఎప్పుడో నిజం బయటపడితే, చూడరాని దృశ్యం కంటపడితే భుజంగరావుగారి గుండె పగిలి చెరువు అయేది. భగవాన్ గాడు తనని మంచికే చేర్చాడో చెడుకే చేర్చాడో ఈ ఇంట్లో రోజా స్థానంలో చేర్చాడు. ఒకందుకు ఇదీ మంచిదే అయింది. ఉపాయంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వీళ్ళ రోగం కుదర్చాలి." అనుకుంది అమల.