Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 33

    ఇవన్నీ డైరీ ద్వారా తెలుసుకున్న విషయాలు.

    ముఖ్య విషయం ఒకటి వుంది అది......

    "రోజా! ఈ మధ్య నన్ను ఎవరో వెంటాడుతున్నట్లు అనుమానంగా వుంది. నేను ఎవరికీ అపకారం చేయలేదు." అని ప్రభాకర్ అంటే రోజా "నాన్నగారితో చెప్పి నీ వెంట మనుషులని నియమిస్తానని అంది. దానికి ప్రభాకర్ ఒప్పుకోలేదు. నిన్ను తమాషా చేయటానికి అన్నానోయ్" అన్నాడుట. ఈ మధ్య ఇలాంటి చిలిపి వేషాలతో ప్రభా అల్లరి చేస్తున్నాడు. నన్ను బెదిరిస్తున్నారు. నిన్ను పెళ్ళి చేసుకోకుండా దూరంగా వెళితే లక్షలు యిస్తారుట." ఇలా అని ఫోన్ వచ్చింది. అంటూ ప్రభా ఏడిపించడం, తను పిరికిదేం కాదు అల్లరి ప్రభా మాటలు నమ్మి భయపడటానికి......

    ప్రభాకర్ యాక్సిడెంట్ లో పోయేముందు రోజా డైరీలో ఇలాంటి మాటలు కొన్ని రాసుకుంది.

    ప్రభాకర్ జోక్ చేస్తున్నాడనుకుంది సరోజ.

    ఇది జోక్ కాదు నిజం అని సరోజకి బొత్తిగా తెలియదు.

    ప్రభాకర్ చనిపోంగానే రోజా పిచ్చిదయింది.

    ఈ నగ్న సత్యం సమాధి విదితం అయింది అమలకి.

    "ఇది లవ్ మర్డర్" అనుకుంది అమల.

    డైరీలు యధాస్థానంలోపెట్టి ఇవతలికి వచ్చింది.

    భుజంగరావు డైరీలు చదివివుండరు. ఓ వేళ ఓ రెండు పేజీలు చదివినా మూడోడైరీ చివర పేజీల్లో తప్ప అసలు రహస్యం అంతట రాసి లేదు కాబట్టి తెలుసుకుని వుండరు. లేక తెలిసి చేసేదేం లేక ఖర్మ అనుకుని మిన్నకుండిపోయారేమో! సరోజ పిచ్చిలో ఇంట్లోంచి వెళ్ళిపోయిందా లేక భగవాన్ లాంటివాళ్ళు మాయం చేసారా? సరోజ బ్రతికి వుందా! నరరూప రాక్షసుల పాలిటపడి దారుణంగా మరణించిందా!

    అమల ఆలోచిస్తూ పక్క గదిలో అడుగుపెట్టబోయింది కాస్తా తన పేరు వినరావటంతో చటుక్కున అక్కడే ఆగిపోయింది.

    అది గెస్ట్ రూము. దానిలో గంగారత్నం త్రయంబకరావు వుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అమల నెమ్మదిగా గదిలో ప్రవేశించి బీరువా చాటుచేసుకు నుంచుంది.

    "ఈ మామయ్యగాడికి నా మీద సదభిప్రాయం లేదు. పిచ్చిదయినా ఫరవాలేదు సరోజని పెళ్లాడుతానని చెప్పాననుకో అప్పుడేమంటాడో తెలుసా కోట్ల ఆస్తికి ఎరవేస్తావురా వెధవా అంటాడు" త్రయంబకరావు అన్నాడు.

    "మరి ఎలాగురా! ఇంత ఆస్తీ పరులపాలు కావాల్సిందేనా! మాయదారి వెధవ ఆ కిష్టిగాడు వచ్చాడటగా! వాడు పిచ్చి డాక్టరు కాబోలు చదివి చచ్చాడు. దీని పిచ్చి వాడు కుదిర్చి దీన్ని పెళ్ళాడాడనుకో మననోట్లో కరక్కాయే ఆ కొంపలో నెల ఈ కొంపలో నెల మనగతి ఇంతే ఉపాయం ఆలోచించాలి" అంది గంగారత్నం.

    "అందినంతవరకూ అందుకొని పోవటమే. మనకంతే దక్కుడు."

    "ఉహూ, ఈ తఫా గట్టిగా చూసుకోవాలి."

    "ఏం చూసుకోవాలిట? పిచ్చిముండలా మాట్లాడుతావు. చెట్టంత మగవాడిని నాకేం ఏం చేయాలో తెలియక తికమకపడి చస్తున్నాను, నోరుమూసుకు ఆలోచించవెంటే వకటే వాగుడు."

    "ఏం వాగానురా నాయనా!"

    ఆ పిచ్చిదాన్ని పట్టుకుని పిచ్చిది పిచ్చిది అంటావేమిటి

    "పిచ్చిముండని పిచ్చిది అనక ఏమనాలిరా!"

    "అదే అనకూడదు. అలాంటివాళ్ళని దువ్వాలి అది చూసి నా పిల్ల అంటే ఎంత ప్రేమో అనుకుంటాడు మామగాడు."

    "ఆ సంబడమూ అయింది కదరా" చేతులు తిప్పుతూ అంది గంగారత్నం.

    వీళ్ళమాటలు వింటున్న అమల "ఓరి మీదుంపలు తెగా మీరో రకం గోతికింద నక్కలు అన్నమాట" అనుకుంది.

 Previous Page Next Page