అమల చాటుగా నుంచుని వింటుందని తెలియని గంగారత్నం త్రయంబకరావు ఇంకా చాలా మాట్లాడుకున్నారు.
అమల పనికొచ్చేటంత వరకూ విని చల్లగా ఇవతలకి వచ్చేసింది.
20
గంగారత్నం ప్రేమతో అమలకి చేరువ కావాలని చూస్తున్నది. అలాగే భుజంగరావుతో కూడా చాలా చక్కగా మెలుగుతున్నది.
త్రయంబకరావు అమలకి చేరువయి వేయరాని చోట్ల చేయి వేయాలని విఫల ప్రయత్నం చేస్తున్నాడు.
శంకరానికి కుదిర్చినట్లు వీళ్ళ రోగం కుదర్చదల్చుకోలేదు అమల. ఎందుకంటే ఈ యింట్లో కొందరు భగవాన్ మనుషులు వున్నారు. అవసరానికి అప్పుడప్పుడు వాళ్ళకి కాస్త దూరంగా వుండాలంటే భగవాన్ తాలూకా కాని ఈ తల్లీ కొడుకు ఈ ఇంట్లో వుండటం తనకే మంచిది అనుకుంది. తన జాగ్రత్తలో తను వుంది.
రోజా పిచ్చిది కాబట్టి మాటలు అర్ధం కావనుకుని తల్లీ కొడుకు అప్పుడప్పుడు రోజా ముందే అంటే అమల ముందే మాట్లాడుకునేవారు.
గంగారత్నం త్రయంబకరావు అమల హాలులో సోఫాలో కూర్చుని వుండటం చూసి అక్కడకు వచ్చారు.
సరీగ అప్పుడే అక్కడికి వచ్చాడు శంకరం.
అమల ఆ రోజు శంకరం జుట్టు పని పట్టిం తరువాత శంకరం ఎగుడుదిగుడు జుట్టుతో వుండలేక నున్నగా బుర్ర గీయించుకున్నాడు. బుగ్గకయిన కత్తెర గాయం ఇంకా మానలేదు. పట్టీ వేశాడు. ఇప్పుడిప్పుడే బుర్ర మీదగాట్లు నయం అయి, అరంగుళం జుట్టు పెరిగింది.
అమల అంత దూరాన వుంటే చాలు. పిచ్చిది మళ్ళీ ఏం చేస్తుందోనని వణుకుతున్నాడు. ఐనా మోహం పోలేదు, భుజంగరావు ఇంట్లో లేనప్పుడు రోజా నిద్రపోతున్నప్పుడు కాళ్ళూ, చేతులూ మంచానికి బంధించి నోట్లో గుడ్డలు కుక్కి కసితీర అనుభవించాలన్న దుష్ట ఆలోచన నరనరాన జీర్ణించుకుంది.
కసితో ఆ సమయం కోసమే చూస్తున్నాడు.
శంకరం దుష్ట చూపులు ఈ విషయం తెలియకనే తెలియజేసినట్లయింది అమలకి.
అమల శంకరాన్ని చూసి వేళ్ళు కత్తెరలా పెట్టి "కటక్ కటక్" అంది.
శంకరం పై ప్రాణం పైనే పోయింది. పిచ్చిదాని కళ్ళల్లో పడ్డానా అనుకుని వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.