Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 34

    "ఇప్పుడేం చెయ్యమంటావ్. నీ కొడుకు పెయింటింగ్ అయ్యేంత వరకూ ప్రపంచంలో ఎవరూ బతకటానికి వీల్లేదంతే" నవ్వుతూ అన్నాడతను.

    "మీ పి.ఏ చేత, ఆ హిమకుందకు కబురు చేయించండీ"

    "తప్పుతుందా మరి" అంటూ ఫోను రిసీవర్ అందుకున్నాడు కాళేస్వరప్రసాద్ పి.ఏ రమాకాంత్ కి విషయం చెపుతుండగా-

    సరిగ్గా అదే సమయంలో అక్కడకొచ్చాడు సత్తిపండు-

    "నువ్వేం చేస్తావో, నాకనవసరం. రేపు పదింటికల్లా ఆ హిమకుంద మేడమ్ గారి ముందుండాలి. లేకపోతే యింట్లో మహాభారతం. అర్ధమైందా నవ్వుతూ ఫోను పెట్టేశాడు కాళేశ్వరప్రసాద్.

    లోనికొచ్చిన సత్తిపండును చూస్తూనే అంది సుదేష్ణాదేవి__

    "రావయ్య సత్యం రా. బాబు పెయింటింగ్ ని వేయించి హాల్లో పెట్టించాలనుకుంటున్నాను"

    "గుడ్ ఐడియా వదినా. ఐడియా నీదేనా అన్నయ్యదా? వెరీగుడ్ నాక్కూడా ఐడియా వచ్చిందనుకో"

    కొయ్. మా ఐడియాలను, మీవని చెప్పుకోవడం, నీకూ మీ అన్నగారికి అలవాటేగా- ఆ హిమకుందను ఇంతకీ తీసుకొస్తానన్నాడా మీ పి.ఎ." అడిగింది భర్తవేపు చూస్తూ సుదేష్ణాదేవి.

    "సరిగ్గా రేపుదయం పదిగంటలకు అమ్మగారి యెదుట ఆ పెయింటరు గారుంటారు. హోమ్ మినిస్టర్ శాసనం చేశాక" పెద్దగా నవ్వాడతను.

    తేజ పెయింటింగ్, ఏ ఏంగిల్ లో వేయిస్తే బావుంటుంధో భర్తతో డిస్ కస్ చేస్తోంది సుదేష్ణాదేవి.

    మరొకపక్క సీరియస్ గా ఆలోచిస్తున్నాడు సత్తిపండు. బాబు పెయింటర్ ఎక్కడో ఏదో కీలకం దొరికినట్టయింది.

    భార్యాభర్తలు సీరియస్ గా మాట్లాడుకుంటున్న సమయంలో, టీపాయ్ మీద మ్యాగజైన్ పక్కనున్న హిమకుంద విజిటింగ్ కార్డుని యధాలాపంగా చేతిలోకి తీసుకుని, ఆ అడ్రస్ ను ఒకసారిచూసి మళ్ళీ అదే స్థానంలో ఉంచేసి, బయటికెళ్ళిపోయాడు.
   
                                                                          ౦    ౦    ౦

    పోలీస్ కంట్రోల్ రూమ్ చెట్టుకిందకొచ్చి నిలబడ్డాడు సత్తిపండు.

    కంట్రోల్ రూమ్ వరండామీద అటూ ఇటూ యూనిఫారాల్లో తిరుగుతున్న పోలీసులు.

    "హలో" పిలుపు విన్పించిన దిశగా చూసాడతను. అంతవరకూ చూడలేదు సత్తిపండు.

    చెట్టుకింద ముగ్గురూ పులిజూదం ఆడతారా?

    "అర్జంటుగా లేచి నాతోరండి" సత్తిపండుని, ముగ్గురూ అనుసరించారు.

    బషీర్ బాగ్ చౌరస్తాలోని రెస్టారెంట్లో కూర్చున్నాక చెప్పాడు సత్తిపండు__

    ప్లానంతా బాగానేవుంది కానీ, ఆ బొమ్మలేసే అమ్మాయిని ఇప్పటికిప్పుడు మచ్చిక చేసుకోవాలంటే కుదురుద్దా అని" సందేహం వ్యక్తం చేశాడు వీర్రాజు.

    "అయితే నా యాభైవేలూ నాకిచ్చెయ్యండి" సీరియస్ గా అన్నాడు సత్తిపండు.

    "యాభై వేలేంటి" అయోమయంగా ముఖంపెట్టి ప్రశ్నించాడు పోతురాజు.

    "ఒక్కటిచ్చానంటే మొహం పచ్చడైపోద్ది. యాభైవేలు ఫిఫ్టీ థౌజెండ్ అడ్వాన్సు"

    "ఓ....ఆ ఎమౌంటా? అలా అడ్వాన్సులుగా చాలా ఎమౌంట్ ని తీసుకుంటుంటాంగదా! మర్చిపోయాను" కోసాడు సేతురాజు.

    "రక్షించావు, మీరెలా ఆపరేట్ చేస్తారో నాకనవసరం. ఆ అమ్మాయిని ఎలా మచ్చిక చేసుకుంటారో నాకనవసరం. ఆ హిమకుందతోపాటు ఆ బిల్డింగ్ లో కొస్తున్నారు. కిడ్నాపు జరిగితీరుతుంది."

    ముగ్గురూ దీర్ఘాలోచనలో పడ్డారు.

    "ఈ ఆర్టిస్టులు వేసే పెయింటింగులు ఎక్కడ దొరుకుతాయి?" అడిగాడు వీర్రాజు.

    "అబిడ్స్ లో."

    "అవి పెయింటింగ్సు కాదు, పోస్టర్లు చిరాగ్గా చెప్పాడు సత్తిపండు.

    "పెయింటింగ్స్ అంటే రంగులతో వేస్తారు అవ్వా?" ప్రశ్నించాడు సేతురాజు.

    "అవును."

    "రంగుల వార్నీష్ డబ్బాలు కొనుక్కుని, ఆ పెయింటింగ్స్ మనమే వేస్తే పోలా? అన్నాడు పోతురాజు.

    "ఏడ్చినట్టే ఉంది తెలివి, వార్నీష్ కలర్స్ ని ఇళ్ళకు వేస్తారు.....ఈ పెయింటింగ్స్ ని వాటర్ కలర్స్ తోనూ, ఆయిల్ కలర్స్ తోనూ వేస్తారు. అంచేత నేనో ఐడియా చెప్తాను, చెయ్యండి."

    సత్తిపండు ఐడియా చెప్పాడు.

    "వెరీగుడ్ ఐడియా! ఆ పెయింటర్ ఎడ్రస్ ఎక్కడన్నావ్" ప్రశ్నించాడు వీర్రాజు.

    హిమకుంద ఎడ్రస్ చెప్పాడు సత్తిపండు.

    చెప్పి__

    "చూడండీ- నేనా బిల్డింగ్ లో మీకు కన్పించినా మీరు నాతో మాట్లాడడం కానీ, కనీసం తెలిసినట్టుగా ప్రవర్తించడంకానీ చెయ్యకూడదు. అలాగే మరెవరికయినా దొరికిపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నాపేరు బయటికి రాకూడదు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి, నాపేరు లీక్ చేసారో మర్డర్లు జరిగిపోతాయి గుర్తుంచుకోండి" హెచ్చరించి వెళ్ళిపోయాడు సత్తిపండు.

 Previous Page Next Page