సరిగ్గా అదే టైములో రెస్టారెంట్ లోంచి బయటికొచ్చిన ఆ ముగ్గురూ ఆటో ఎక్కారు ఠీవిగా సూట్ కేసుతో.
౦ ౦ ౦
వెండి గిన్నెలో వెన్న కలిపిన అన్నం....
తేజను ఎత్తుకొని అన్నం తినిపిస్తోంది సుదేష్ణాదేవి. హాల్లో గోడ పైభాగంలో వరసగా కాళేశ్వర ప్రసాద్ పూర్వుల పెయింటింగ్స్ వున్నాయి. ఆ పెయింటింగ్స్ మధ్యన 'తామరకొలను-పున్నమి చంద్రుడు' పెయింటింగ్ కూడా ఉంది.
తల్లి చేతుల్తో ఆ పెయింటింగ్ ను చూపిస్తుంటే, అటువేపే చూస్తున్నాడు తేజ.
"చందమామ రావేఁ
జాబిల్లిరావే
కొండెక్కిరావే
కోటిపూలు తేవే. అన్నిటినీ తెచ్చి
మా అబ్బాయి కివ్వవే..."
ఆ పాటపాడుతూనే ఒక గోరుముద్దను తినిపించేసింది సుదేష్ణాదేవి. రెండు చేతుల్తో, తల్లి చేతిని తోసేసి, చంకలోంచి దిగిపోవాలని తెగ ఆరాటపడిపోతున్నాడు తేజ.
"ఎక్కడికమ్మా?" నవ్వుతూ అడిగింది తల్లి.
"ఉ....ఆఁ" అన్నాడు వాడు.
వాడ్ని మరిపించడానికి, ఏనుగుబొమ్మ చూపించి పాటపాడుతోందామె.
"ఏనుగమ్మా...ఏనుగు....
అంబారీ ఏనుగు
ఏనుగెక్కిన వీరుడు
వీరుడు కళ్ళల్లో వెలుగులు
వెలుగులమ్మ వెలుగులు
హరివింటి విలువలు
హరివంటి వెలుగులు
మా అబ్బాయి వెలుగులు" అని కిలకిల నవ్వి, "మా తేజ వేలుగులు" అని కలిపి పొగుడుతూ, అప్పుడే మేడ మెట్లు దిగుతున్న కాళేస్వర ప్రసాద్ ని చూసి ఆ పాటను ఆపేసింది సుదేష్ణాదేవి.
"ఏవిటీ ఈ మధ్య అమ్మగారు పాటలు నేర్చుకున్నట్టున్నారే...నేనెప్పుడయినా పాడమంటే, అత్తలేనీ కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు అని బి.సి, నాటి పాత ఒక్కటే పాడతావ్, ఇప్పుడీ పాటలన్నీ ఎక్కడ నుంచొచ్చాయో?"
"అన్నీ దొంగచాటుగా వింటున్నారా" సిగ్గుపడుతూ అంది ఆమె సిగ్గుపడినప్పుడు బుగ్గమీద లొత్త అందంగా వుంది.
"స్పీకర్లో విన్పించేనట్టుగా మేడమీదక్కూడా వినిపిస్తుంటే" అంటూ తేజ బుగ్గమీద ముద్దు పెట్టుకుని, అటూ ఇటూ చూసి సుదేష్ణాదేవి బుగ్గను గిల్లి, గబగబా ముందుకెళ్ళిపోయాడు.
ఆ చేష్టను ఒక్క క్షణం కంగారు పడింది సుదేష్ణాదేవి. కాళేశ్వరప్రసాద్ కారు అటు వెళ్ళిపోగానే, ఇంకో కారు అక్కడకొచ్చి ఆగింది. అందులోంచి సుదేష్ణాదేవి ఫ్రెండ్ కళ్యాణి దిగింది.
"ఎలా వున్నాడు మా అల్లుడు వీడు నన్ను యెప్పుడు అత్తా అని అంటాడో" అంటూ తేజను గుండెలకదుముకుంది.
"వీడు నిన్ను అత్తా అని పిలుస్తాడనుకో ఇవ్వడానికి కూతురేదీ"
"ఇవ్వడానికి కూతురే వుండాలా మాది రాదామాధవుల అనుబంధం అన్నది కళ్యాణి నవ్వుతూ.
"బాగానే వుంది" అంటూ పడీపడీ నవ్వింది సుదేష్ణాదేవి. కాసేపు కబుర్లయ్యాక-
"అవునుగానీ సుదేష్ణా. ఈ హాల్లో ఇన్ని పెయింటింగ్స్ ఉన్నాయి గదా? బాబు పెయింటింగ్ కూడా పెట్టకూడదూ. చాలా బావుంటుంది"
"బాబు పెయింటింగా?"
"ఏం. మెట్లకుపైన, పెట్టించావనుకో. ఎంతందంగా వుంటుందో తెలుసా. అదీకాకుండా రేపు పెద్దయ్యాక ఇప్పటి ముద్దూ, మురిపాలు మనకు కావాలన్నారావు. అన్నయ్యగారితో కూడా ఒకసారి చెప్పిచూడు"
"చెప్పడ మెందుకులే. ఆ మధ్య ఏదో సందర్భంలో ఆయనే అన్నారు. లైఫ్ సైజ్ ఫోటో తీయిద్దామని"
"ఫోటో రెండు మూడేళ్ళ తర్వాత పాడైపోతుంది. అదే పెయింటింగ్ అనుకో- ఈ పెయింటింగ్స్ లాగే కలకాలం వుండిపోతుంది."
కళ్యాణి వెళ్ళిపోయాక బాబు పెయింటింగ్ గురించే ఆలోచించింది కొద్దిసేపు.
౦ ౦ ౦
ఆ రోజు రాత్రి కాళేశ్వర ప్రసాద్ ఇంటికి రాగానే తన మనసులోని ఉద్దేశాన్ని చెప్పిందామె.
"పెయింటింగా! లైఫ్ సైజ్ ఫోటో అని అనుకున్నాంగా"
"హాల్లో పెట్టడానికి పెయింటింగు బావుంటుంది. వేయిద్దాం"
"నువ్వో నిర్ణయానికొచ్చేశాక, నేనొద్దన్నా ఆగుతావా. ఇంతకీ పెయింటర్ని ఎప్పుడు పిలిపిస్తున్నావ్" బాబు ముక్కుని వేలితో రాస్తూ అన్నాడతను.
"అదే ఆలోచిస్తున్నాను" అంటూ దీర్ఘాలోచనలో పడిందామె.
రెండు నిమిషాల తర్వాత-
"ఆ మధ్య కళాభవన్లో పెయింగ్ ఎగ్జిబిషను కెళ్ళాం గదా. ఆ అమ్మాయి గుర్తుందా మీకు?"
"ఆ అమ్మాయి నాకు గుర్తులేదు. ఆ అమ్మాయి పెయింటింగ్సు గుర్తున్నాయి"
"ఆ అమ్మాయి యిచ్చిన విజిటింగ్ కార్డు ఎక్కడో వుండాలండీ. వుండండి. ఇప్పుడే వస్తా" అంటూ లోనికెళ్ళి, ఐదు నిమిషాల్లో హాల్లో కొచ్చింది విజిటింగ్ కార్డుతో.
ఆ పెయింటర్ పేరు హిమకుంద. ఇదిగో అడ్రస్" ఆ కార్డుని కాళేశ్వర ప్రసాద్ కిచ్చిందామె.