Previous Page Next Page 
శుభోదయం పేజి 33


    రాజారాం చిన్నగా నవ్వాడు.
    "భర్తస్థానం యివ్వనన్నాక ఆడదానికి ఆ మగాడు సోదరుడే అవుతాడు. మా మధ్య బంధుత్వంలేదు స్నేహం వుంది. మమత వుంది. సౌహార్దం..... రాధ నాకు యిప్పుడు తోడబుట్టినదానితో సమానం. ఏ మంచి చెడ్డయినా నన్నడగకుండా చెయ్యదు రాధ" రాజారాం గర్వంగా అన్నాడు.
    "మరయితే... నాకోసం మిమ్మల్ని ఎందుకు కాదనడం అంకుల్..."
    "శ్యాం! మీ అమ్మ దగాపడిన ఆడది. లట్టుకున్న భర్త ప్రేమించి పెళ్ళిచేసుకున్న రెండేళ్ళ అనుబంధాన్ని తృణప్రాయంగా తెంచుకోగలిగినప్పుడు, యింకో మగాడు మాత్రం శీలంకోల్పోయిన స్త్రీని పెళ్ళాడి ఆదరించి ప్రేమించగలడా అని అనుమానం. ఏ మగాడు కాని, ఆడదికాని తమ రక్తం పంచుకుని పుట్టని బిడ్డని తన బిడ్డగా స్వీకరించి ప్రేమించలేడని దానివల్ల కట్టుకున్నవాడికి, తనకు సుఖం వుండదని, తనబిడ్డ మధ్య నలుగుతాడని, తనకింక వివాహేచ్చలేదని నన్ను తిరస్కరించింది. అప్పటినించి నీవే లోకంగా, నీతోడిదే ప్రపంచంగా వంటరిగా బతుకుతూంది."
    "నాకోసం తన సుఖాలన్నిటిని బలిపెట్టి యింత త్యాగం చేసిందన్నమాట" చమర్చిన కళ్ళతో అన్నాడు శ్యాం.
    "త్యాగం అని ఆమె అనుకోలేదు. బాద్యత అనుకుంది. అసలామెకి మాధవ్ ప్రవర్తనతో పురుషులపట్ల అదోరకం విముఖత కలిగింది. ఆమె ప్రేమని, నమ్మకాన్ని మాధవ్ దెబ్బతీసాక ఆమెలో అదోరకం విరక్తి, నిర్లిప్తత బయలుదేరాయి."
    "అంకుల్, అమ్మకి మీకూ ఎలా పరిచయం?" కుతూహలంగా అడిగాడు శ్యాం.
    "మీ అమ్మ యీ కాలేజీలో పనిచేసేముందు ఆరునెలలు మా కాలేజీలో పనిచేసింది. అప్పుడే మా పరిచయం. ఎంతో దిగులుగా, ఈ ప్రపంచ భారాన్నంతా మోస్తున్నట్లు క్రుంగిపోతూ, బిక్కుబిక్కుమంటూ ఓ మూల ఎవరితో మాట్లాడకుండా కూర్చునే రాదని చూసి నాకెందుకో తెలియని కుతూహలం కలిగింది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. ఆమె వివరాలు కూపీలాగాను. వివాహితురాలని, బిడ్డతల్లని తెలిశాక నీళ్ళుగారిపోయాను. అయినా ఆమెపట్ల మానం చావలేదు. కావాలని పలకరిస్తూ ఆమెతో చనువు పెంచుకున్నాను. ఓసారి నీకు మూడేళ్ళప్పుడు చాలా జబ్బు చేసింది. ఆ వంటరితనంలో తోచక బెంబేలుపడిన రాధ నా సహాయం కోరింది. అప్పటినించి యిద్దరం హితులమయ్యాం. ఆ స్నేహం పెపొందాక పెళ్ళిచేసుకుందామా అంటే వప్పుకోలేదు. ఎంతగానో అడిగితే అప్పుడీ సంగతంతా చెప్పింది. విని షాకయ్యాను. అయినా ఫరవాలేదన్నాను ఆఖరికి. ఫరవాలేదన్న ఆ మాట విన్నాక గొంతులో దృఢత్వం తగ్గిపోవడం మీ అమ్మ గుర్తించింది గాబోలు. ససేమిరా వద్దంది. మనం స్నేహితులుగానే వుందాం అంది. నాకు ఎవరూ లేని లోటు తీర్చమంది. లోకులు అనుమానపడకుండా నన్ను పెళ్ళిచేసుకునేవరకూ ప్రాణం తీసింది. ఆనాటినుండి మేం ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా కష్టానికి సుఖానికి కలిసిమెలిసి వుంటాం. "రాజారాం, నీకు ఆడపిల్లలుంటే నా కోడల్ని చేసుకునేదాన్ని గదా" అని విచారించేది మీ అమ్మ..."
    "అంకుల్! యింత నల్లగా, యింత అసహ్యంగా ఎందుకు పుట్టానా అని మధనపడేవాడ్ని. ఆ ప్రశ్నకి జవాబు యిన్నాళ్ళకి దొరికింది. ఎంత దురదృష్టవంతుడ్ని! ఎవడో... తెలియని అనామకుడు, రౌడి నా తండ్రి కావడం... ఎంత దౌర్భాగ్యం."
    "హుష్, స్టాపిట్ - నీవిలా అంటే మీ అమ్మ చెప్పినందుకు నన్ను తిడ్తుంది. పరెగెట్ దట్ స్టోరి.... యిన్నాళ్ళ తరువాత ఆ మాధవ్ కూతురు యిలా మిమ్మల్ని కలవడం, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగడం, దానికి రాధని కారణం చెయ్యడం.... ఎంత విచిత్రం.... ఆ మాధవ్.... హౌ స్టుపిడ్ హీ యీజ్.... రాధని యిలా ఊహించాడంటే... వాడు ఆమెని ప్రేమించడం అంతా అబద్దం అన్నమాట అనుకోవాలి. ఆమె మనసెలాంటిదో గుర్తించలేని వాడు. వాడు ప్రేమించింది ఆమె అందాన్ని అన్నమాట" కోపంగా అన్నాడు.
    "అంకుల్.... ఆయన అమ్మని ఎన్నిమాటలు అన్నాడు? నాకు వళ్ళు మండుతుంది. రేఖ అంటే అమ్మకి ఎంత అభిమానం! ఎలాంటి నెపం వేశాడు? ఆవేశంగా అన్నాడు. రాధ నెమ్మదిగా గదిలోంచి వచ్చింది. భయంగా శ్యామ్ మొహం చూసింది. ఆరాటంగా అతనిమొహంలో భావం వెదకాలని ప్రయత్నించింది. తల్లి కలవరపాటు గుర్తించి శ్యామ్ చిన్నగా నవ్వాడు.
    "భయపడకు అమ్మా! నాకేం అవలేదు, నిక్షేపంలా వున్నాను ఆ సంగతివిని. నా రంగులాగే నా చర్మం దళసరి. ఏమీ అవదులే" అన్నాడు కులాసాగా. రాధ నిట్టూర్చింది.
    "రాధా.... నీ నిట్టూర్పులు యింక మానేయి. జరగవలసిందంతా జరిగింది. ఇప్పుడింక దేనికి భయం! ఆ మాధవ్ కూతురికలా జరిగింది. తనకి జరిగిన అవమానం, శిక్ష నీకు తెల్సిందన్న దుగ్ధతో అలా అన్నాడు. యిన్నేళ్ళ తరువాత నిన్ను చూడడం, ఆ చూడటం అలాంటి సమయంలో జరిగింది కనక ఉక్రోషం కొద్దీ ఏదో అన్నాడు. ఆ మాటలు పట్టించుకుని నీవు సిల్లీగా బాధపడడం చాలా బావుంది." రాజారాం మందలిస్తున్నట్టన్నాడు.
    రాధ విషాదంగా నవ్వింది. "నీకు తెలీదు రాజారాం, అతనెంత నీచంగా నన్ను అవమానించాడో తల్చుకుంటే, బాధగా వుంది. ఆడదాన్నయి వుండి, తోటిస్త్రీని, అందులో అభంశుభం తెలియని చిన్నపిల్లమీద అతనిమీద కోపం తీర్చుకోవడానికింత నీచానికి ఎలా వడిగట్టగలనని అసలు ఎలా ఆలోచించాడు. రెండేళ్ళు కాపురంచేశాడు. నన్ను అంత తక్కువ అంచనా ఎలా వేయగలిగాడు?"
    "లీవిట్ రాధా... కోపంతో, అసూయతో అన్నాడు కాని సీరియస్ గా అనలేదని నా ఉద్దేశం."
    అతని మాటలు అతని నోట్లో వుండగానే, మాధవ్ సీరియస్ గా కాదు అతి సీరియస్ గా అన్నాడని నిరూపిస్తున్నట్టు పోలీస్ యిన్ స్పెక్టర్ వచ్చాడు.
    "రండి యిన్ స్పెక్టర్.... ఆ రౌడీల సంగతి ఏమన్నా తెల్సిందా, వాళ్ళేమన్నా చెప్పారా" ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాడని ఆరాటంగా అడిగింది రాధ.
    ఇన్ స్పెక్టర్ యిబ్బందిగా మొహంపెట్టి "ఆ విషయం యింకా ఏమీ తెలియలేదు. కాని కేసు కొత్తమలుపు తిరిగింది... సారీ మేడమ్. ఈ కేసులో అనుమానితులుగా మిమ్మల్ని, మీ అబ్బాయిని ప్రశ్నించడానికి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టమని మాకు ఆర్డర్స్ వచ్చాయి" అతనేదో తప్పుపని చేస్తున్నట్టు రాధమొహం చూడలేక రాజారాం వంక చూస్తూ అన్నాడు.... రాధ, శ్యామ్, రాజారాం ముగ్గురూ ఒక్కసారి నిశ్చేష్టులైపోయారు. "వ్వాట్" రాజారాం నోరు పెగల్చుకుని అన్నాడు. వీళ్ళు అనుమానితులా... ఏ ఆధారంతో ఆ మాట అంటున్నారు" ఆశ్చర్యంగా అన్నాడు.

 Previous Page Next Page