Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 34

 

    అలా కూర్చోకుండా నుంచుంటే ఆఫీసరే కూర్చోవలసిందిగా కోరుతున్నారు.
    రోజుకి నాలుగైదు తడవలు శ్రీనివాసరావు ఆరోగ్య విషయాన్ని అయన అతి శ్రద్దగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకి తెలిసిన కొందరు డాక్టర్లు పేర్లు చెప్పి , వాళ్ళంతటి ఘనులో గూడా అయన మనవి చేస్తున్నారు.
    ఇంత అదరం  ఒలకబోస్తున్న ఆఫీసరు పట్ల శ్రీనివాసరావుకి జాలి మాత్రమే కలిగింది. ఎంత కాదనుకున్నా అయన ఆదరాన్ని భరించక తప్పడం లేదు.
    దీనికి  తగ్గట్టు ఆఫీసులో వాతావరణం కొంచెం కొంచెంగా ఆఫీసులో మారుతుంది. ఆఫీసంతా ఒక్కటై, ఆఫీసరూ ఒక్కటయ్యారు. ఆఫీసు స్టాపంతటకీ ఆంజనేయులు నాయకుడుగా చలామణి అవుతున్నాడు. అతను యిప్పుడు మన్ను తిన్న పాము కాదు. ప్రళయ రుద్రుడిలా భావిస్తూ ప్రతి విషయంలోనూ ఆఫీసర్ని ఎదుర్కొనే దిట్టగా మారేడు.
    అంజనేయులకి శ్రీనివాసరావుమీద గూడా గురి తప్పడం ఒక విషయమై పోయింది.
    "అవును గురూగారూ! నువ్వేమో మాలాటి సమాన్యుడివి కావు. నీ వెనక నీ బలగం మహా గొప్పది. ఇది తెలిసి అయితేనేమో నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు. మేమూ నీలాగా పది మంది వెనక ఉన్నవాళ్ళమైతే మేమూ అయన నెత్తి ఎక్కేవాళ్ళం . గురుడి తల నేల కోరిగేది."
    శ్రీనివాసరావుకీ మధ్య ఆత్మ విమర్శన పట్ల ఆసక్తి ఎక్కువైంది.
    (ఏమో , నేనేమైనా పొరపాట్లు చేస్తున్నానేమో! కాని పక్షంలో గంగిగోవు లాటి ఆంజనేయులు నన్నెందుకు యెత్తిపొడుస్తాడు. బ్రదర్ , ఆఫీసరు ఎదుట కుర్చీలో కూర్చునే క్వాలిఫికేషన్ కి నేను మురిసిపోవడం లేదు. ఆ కుర్చీ నాకు ముళ్ళ కంపలా వుంది. తెలుసా. అలా అని ఆయనతో చెప్పేందుకు నా నోరు రావడం లేదు. నా నోటిని సుబ్బారావు కట్టి పారేసాడు. యస్.....నేను పతనమై పోతున్నానేమో! ఈ సుబ్బారావు నాకు అత్మీయుడైనంతమాత్రాన తప్పు లేదు గాని, అతను బిగ్ షాట్ కావడం నా దురదృష్టం)
    ఒకరోజు ప్రసాదం అన్నాడు.
    "ఆంజనేయులు అల్లరి ప్రారంభించేడు , సార్!"
    "ఏమిటది?"
    "మీ వాళ్ళ ఆఫీసరు కేదో సాయం కావలసి వచ్చిందటగా?"
    "ప్రసాదం! నాకీ మధ్య సుఖం బొత్తిగా దూరమైపోయిందయ్యా! నేను సుఖపడుతున్నానుకుంటున్నాడు ఆంజనేయులు. నన్ను ముద్దాయిగా నిలబెట్టే స్థితికి వచ్చేడు గదా. ఏ న్యాయస్థానమైన సరే, నే నక్కడ నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను. ప్రసాదం , ఇవాళ నీతో యింకో థియరీ కూడా చెప్పగలను. మనిషి 'పొజిషన్ కావాలనుకొడం ఎంత సహజమో, ఆ పొజిషన్ అకస్మాత్తుగా వచ్చినప్పుడు అతను కొన్ని నిందలు భరించడమూ అంత సహజమే. అందుచేత నేను పూర్వం బీవన్ లాగా ఉండలనుకుంటున్నాను. ఇదేప్పటికి సాధ్యపడుతుందో మరి. అయితే ఆ మాటు అంజనేయులి ప్రచారానికి భయపడి అనడం లేదు. నాకు నేను భయపడుతున్నట్టు పరాయి వాడికి భయపడను.
    "నాకు తెలుసు, గురూ గారూ!"
    "నేనిలా అన్నానని అతనితో చెప్పు. ఏమిటలా తెల్లబోయి చూస్తావేం? నువ్వు మాటలు చేరవేసేవాడివని నా ఉద్దేశం కాదు."
    ప్రసాదం మాటాడకుండానే వెళ్ళిపోయాడు.
    లంచవరులో కేంటిన్ లో ఆంజనేయులు తన చుట్టుతా నించున్న మనుషులతో ప్రభుత్వాలు పడిపోవడం గురించి చాలా ఉద్రేకంగా చెబుతున్నాడు.
    "రోజుకో ప్రభుత్వం పడిపోతుంది - బెంగాల్లో , పంజాబ్ లో , హరియానాలో ఇవాళ నువ్వు గట్టిగా వుంటుందని నమ్మే ప్రభుత్వం రేపు నీ కళ్ళల్లో దుమ్ము కొట్టి ఉష్ కాకి అంటుంది! ఎక్కడా దేనికీ సెక్యురిటీ లేదు. సామాన్యుడి జీవితంలో గూడా ఈ రాజకీయం ముఖ్యమైన పాత్ర తీసుకుంటుంది. ఆ జెండా ఎటువేపు వూగితే అటు ఆ మనిషి ఊగుతున్నాడు. మనిషి బతికే బతుకులో ఒక క్రమమైన పద్దతి లేదు. రాజులిప్పుడు లేరు గానీ, వాళ్ళ బాబుల్లాంటి బాబులు మన మధ్య చోటు చేసుకున్నారు. ఇవాళ నువ్వు నమ్మిన సిద్దాంతం తప్పని చెప్పే మొనగాళ్ళు మళ్ళీ ఆ తరవాత రోజు అదీ తప్పేనని చెప్పే పవర్ గాళ్ళకి దాసోహమంటున్నారు. కనక నువ్వు దేన్నీ ఏ పరిస్థితుల్లోనూ నమ్మేందుకు వీల్లేదంటున్నాను. క్రమశిక్షణ గానీ, స్వార్ధం గానీ కాగడా పెట్టి వెతికినా ఈ నాయకుల్లో కనిపించదు. వాళ్ళే క్రమశిక్షణ గురించి నిస్వార్ధం గురించి నీకు ఉపన్యాసాలు చస్తున్నారు. నువ్వు వాళ్ళకి దండలు వేసి జై కొడుతున్నావు. ఇదంతా గారడీ. అసెంబ్లీలు ఎలిమెంటరీ స్కూళ్ళకన్నా హీనంగా తయారయ్యేయి. రాళ్ళూ విసురుకును, చొక్కాలు చిమ్పుకునే పరిస్థితి నేను నొక్కి చెప్పదలుచుకోలేదు. ఇవాళ నా మనిషి రాజ్యం చేస్తే రేపు నీ మనిషి సింహాసనం ఎక్కేస్తున్నాడు. ఇవాళ నావాడున్నాడనే అహానికి గ్యారంటీ లేదు. అక్కడ నాయకులకే అభిప్రాయ భేదాలు వచ్చి తగూలాడుకుంటే , వాళ్ళని నమ్ముకున్న ప్రజలకి ఊపిరెక్కడిది? మిడిసిపడే నాయక శిఖామణుల వారసులందరికీ నాదో హెచ్చరిక. మీ బ్రతుకుల్లో ఈ రాజకీయాలకి చోటివ్వండి. చాటిచ్చారో , మీరు లారటీ గాళ్ళయిపోయేది నిజం . బెంగాల్   పంజాబ్ లే కాదు , రేపు మరో చోట గూడా ప్రభుత్వం పడిపోతే మీరేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ గాంబ్లింగ్ మనిషి బతికే బతుకులో నిప్పులు పోస్తుందే తప్ప మరే సహాయమూ చేయదు. రోజు గడవడం అతిశయోక్తి అయిపోయిందిప్పుడు . రేపు మన మనమాళ్ళు, 'పంచదారంటే ఏమిటి తాతా? అది మీ కాలంలో పండే బంగారమా? అని చెప్పి అడగ్గలరు. ధరలంత వేగంగా పెరిగి ఇక పెరిగేందుకు వీల్లేని ఆ శాల్తీలనే మాయం చేస్తాయి. నిజం. నా నాయకుడి వల్ల నాకివాళ ప్రమోషన్ వస్తే, రేపు నీ నాయకుడి వల్ల నా ప్రమోషన్ గల్లంతైపోవడమే కాకుండా అండమాన్ లో ఉద్యోగం చేయవలసిన ఖర్మ నాకు తప్పదు. డర్టీ పాలిటిక్స్ . ఐ హెట్ దెమ్."
    శ్రీనివాసరావుకి ఆరాత్రంతా ఈ ఉపన్యాసం వినిపిస్తూనే ఉంది.
    (అతనెంత ఆవేశంగా మాటాడేడు! ఇంత ఆవేశాన్ని అతనింతకాలం ఎలా దాచుకున్నాడో? శాంతాదేవి అంజనేయుల్ని మనిషిగా చేసింది. ఇప్పుడతను పెరిగిపోయాడు. అంగుష్ఠమాత్రుడు ఆకాశాన్ని అందుకున్నాడే తప్ప , దురుసుతనాన్ని అదుపులో పేట్టుకోలేదు. ఏదో అర్జెంటుగా పెరిగిపోయిన బాపతు మనిషిలా కనిపిస్తున్నాడే గాని, ఆ ఎదగడంలో క్రమపద్దతి లోపించింది.)
    ఆ రాత్రే శ్రీనివాసరావుకి ఒక కల గూడా వచ్చింది.
    లోకనాధం పార్టీ కూలిపోయింది. అతనికి స్థాన బలం పూర్తిగా తొలగిపోయింది. అతనెన్నాళ్ళగానో శ్రమించి కట్టుకున్న అ కోట కూలిపోయినప్పుడు సుబ్బారావు విలవిల్లాడిపోయేడు. హైద్రాబాద్ లో సుఖంగా కాలం వెళ్ళబుచ్చుతున్న అతన్ని ఎక్కడో మారుమూల ఊరికి బదిలీ చేసేరు. అక్కడతనికి నీళ్ళు కూడా పుట్టలేదు. సరిగ్గా అదే సమయానికి శ్రీనివాసరావుకి ఒక కుర్చీ కేటాయించిన ఆఫీసరు పదవి నుంచి దిగిపోయేరు. మరెక్కడో ముగ్గురు కొత్త ఆఫీసర్లు గుండెలు బాదుకు ఏడుస్తున్నారు. ఇలాగ నీళ్ళు ఎండిన చెరువులో దిక్కుతోచక కొట్టుకుంటున్న చేపల్లా వాళ్ళంతా కలలో కనిపించేరు. ఇంకా కెలామిటీని  శ్రీనివాసరావు భరించలేకపోయాడు.
    ఉలిక్కిపడి లేచి నించున్నాడు.
    తరవాత రోజు శ్రీనివాసరావు ఆఫీసుకి వెళ్ళేడు. ఆ సాయంత్రం ప్రసాదంతో పార్కులో కూచుని మాటాడుతూనే ఒళ్ళు తూలీనట్టవ్వగా అలాగే బల్ల మీద ఒరిగిపోయేడు.
    ప్రసాదం కంగారు పడిపోయేడు. శ్రీనివాసరావు ని చేత్తో తట్టెడు. ఒళ్ళంతా చల్లబడి ఉన్నట్లు గమనించేడు. గాభరా ఎక్కువయింది. గబుక్కున లేచి ఓ సోడా తెచ్చి శ్రీనివాసరావు మొహం మీద చల్లాడు. శ్రీనివాసరావు కళ్ళు విప్పి చూసేడు.

 Previous Page Next Page