"ఇప్పుడెలా వుంది గురూగారూ!" అన్నాడు ప్రసాదం.
"థాంక్స్ , నిన్ను గాభరా పెట్టేను గాబోలు."
"ఇదేమిటి ? ఫిట్టా?"
"అదో రకమైన వ్యాధి. పేరింకా తెలీదు. కాని మనిషిని పడిపోవడం యిది మొదటిసారి.
"డాక్టరు -"
"ఇంతలో అతని అవసరం రాదు. కొన్నాళ్ళు గడిస్తే ఫై.యఫ్ లోన్ వస్తుంది. ఆ డబ్బుస్తే ఈ జబ్బేమిటో అడిగి తెలుసుకుంటాను."
"డబ్బు కావాలంటే నేనిస్తాను!"
"వద్దొద్దు. నీ డబ్బు తిన్న తరవాత కన్ను మూస్తే నువ్వు చాలా యిబ్బంది పడవలసి వస్తుంది."
"ఏమిటండి మాటలు?"
"వద్దు , ప్రసాదం."
"మీకింత అభిమానం పనికి రాదు."
"అవును, అదే నేనూ అంటున్నాను. మరో విషయం నువ్విక్కడ చూచిన తమాషా గురించి ఎవ్వరితోనూ చెప్పకు తెలిసిందా?"
'అలాగే"
"ప్రామిస్అను"
"ప్రామిస్.....మీరింత మంచివాళ్ళ! అవతల ఆంజనేయులు మీ మీద నిందలు వేస్తున్నాడు. నేనే వాడికోరోజు బుద్ది చెబుతాను."
"ఆ చాన్స్ నువ్వు తీసుకోవద్దు. నాకు వదిలేయ్. ఆంజనేయులు నాకు మెతగ్గా కనిపించిననాడు, అతను కరుకుగా వుండాలని నేనే కోరుకున్నాను. ఆ కరుకుతనం నామీదనే ప్రయోగిస్తున్నాడు. ఇటీజ్ జస్ట్ ఏ పనిష్ మెంట్ టు మై డిజైర్! చీకటి పడింది. ప్రసాదం వెళ్ళింక. బై ది వే , నేను రేపటి నుంచి పదిహేను రోజులు సెలవు పెట్టెను. మళ్ళీ ఎన్నేళ్ళకో నా స్నేహితులతో కలిసి నాటకం వేస్తున్నాను. ఇదే ఆఖరి నాటకం కావచ్చు! రేపే వెడుతున్నాను. అక్కడికి రేపంతా వస్తారు."
"గుడ్ లక్!"
"థాంక్యు ....మళ్ళా నిన్ను చూడగలనో లేనో!"
"గురూ గారూ!"
"ఏమిటో ప్రసాదం! జరగబోయేదంతా తెలుసున్నట్టె ఉంది నాకు. ఈ సెలవు పొడిగించే అవసరమున్నట్లనిపిస్తుంది . ఆ పొడగించిన సెలవుల్లోనే .....దేవుడు దయామయుడు , ప్రసాదం! నాకు అన్న ఉన్నాడు. వాడికి నేనేంటే వత్సల్యమో, ఏవగింపో తెలీదు. తెలుసుకునే అవకాశం సరైన కాలంలో దొరకలేదు. నువ్వున్నావు నీ పేరు ప్రసాదం. నిన్నెవరో కని పెంచి పెద్ద చేసేరు. మా ఆఫీసులో చేరేవు. నాకు ఆత్మీయుడి వయ్యేవు. తమ్ముడిగా మారేవు. నీ పలకరింపులో, నీ స్నేహంలో నేను అలరింపబడ్డాను. తమ్ముడూ! అందుకు నేను దేముడికి సర్వదా కృతజ్ఞుడను" అన్నాడు శ్రీనివాసరావు సగద్గాదంగా.
"గురూగారూ! నన్నేడిపిస్తున్నారు. నా కేడుపు వస్తుంది. నేను చెబుతున్నాను గదా, మీకేం కీడు జరగదు. మీరు అతి మంచి వాళ్ళు. మంచివాళ్ళకి కీడు లేదు. అంతే" అన్నాడు ప్రసాదం వెక్కుతూ.
ప్రసాదు భుజాన్ని తట్టి నుంచున్నాడు. శ్రీనివాసరావు. ఇద్దరూ మౌనంగా ఆ పార్కు నించి వచ్చేసేరు.
* * *
ఏడేళ్ళ తరవాత ఆ కాలేజి లో మళ్ళీ "దేవుడు" నాటకం ప్రదర్శింప బడుతుందనే వార్త ఊరంతటికి తెలిసింది.
ఏడేళ్ళ క్రితం లేని కొన్ని ప్రత్యేకతలు ఇప్పుడీ రోజు చోటు చేసుకున్న వైనం అందర్నీ ఆకర్షించింది.
ఆనాడు ఆ కాలేజిలో స్టూడెంట్ గా వుండి అదే నాటకంలో తగు మాత్రంగా నటించిన కుర్రాడు, ఈనాడు ప్రముఖ సినీకళాకారుడై కీర్తిని ఆకర్షించిన ముకుందం మొట్టమొదటి ఆకర్షణ !
ఏడేళ్ళ క్రితం సుబ్బారావుగా పిలువబడి , ఈనాడు గౌరవ మంత్రి వర్యులకు అల్లుడే కాకుండా ఒక గౌరవమైన హోదాలో అలవరుతున్న వ్యక్తీ రెండో ఆకర్షణ.
ఏడేళ్ళ క్రితం యితరత్రా ఏ హంగులూ లేకుండా వీళ్ళంతా కలిసి నటించిన నాటకానికి ముకుందం ద్వారా మదరాసు నుంచి వచ్చిన ప్రతేకమైన హంగులు చివరి ఆకర్షణ.
ఏ ఆకర్షణ లేనిది ఒక్క శ్రీనివాసరావుకే!
(నేను ఏడేళ్ళ నుంచీ ఎదగలేదు. ఈ ఏడేళ్ళ జీవితంలో నన్ను పెద్ద చేసిన సన్నివేశం గానీ, సంఘటన గానీ ఏదీ లేదు. ఏడేళ్ళ తరవాత , సార్! పెద్దవాళ్ళయిన నా మిత్రులతో పాటు, నా శిష్యులతో పాటు నేనిక్కడ నటించడం ఒక్కటే గొప్ప నాకు. ఇదే నాకు సంబంధించిన ఆకర్షణ. నేను మరెవరికీ ఆకర్షణ కలగజేయలేను గానీ, నేను మాత్రం ఒక గొప్ప అనుభూతిని నిక్కడ పొందుతున్నాను. ఇంతమంది గొప్పవాళ్ళలో గూడా నేను గొప్ప వేషాన్నే వేస్తున్నాను. జీవితంలో సాధ్యపడని తీపి కలని నేనిక్కడ నటిస్తున్నాను. అంతకంటే నాకేం కావాలి? సెల్ఫ్ సిటీ వుంది. జెలసి లేదు గానీ వున్నదేమోనని నా భయం)
ప్రత్యేకంగా ఆహుతులు ఆ రోజు చాలా ఎక్కువ మంది వచ్చేరు. అందరూ పుర ప్రముఖులే.
మొట్ట మొదట ముకుందానికి సన్మానం జరిగింది. ఎవరో వక్త ముకుందం గురించి, నాటకం గురించి మాటాడుతున్నారు.
"......మొదటినుంచి ఈ కళాశాలకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ చదివిన కుర్రాళ్ళు జిల్లా అధికారులు కావడం నేనెరుగుదును. ఇక్కడ చ్యదివిన ముకుందంగారు సినీనటులుగా మనకందరికీ సుపరిచితులే. ఇక్కడ చదివిన సుబ్బారావు గారిని గురించి నేను వేరే మనవి చెయ్యనక్కర్లేదు. ఈనాడు జరగబోయే నాటకాలలో వీళ్ళందరూ వున్నారు - పూర్వ విద్యార్ధులు, ఇంతటి ప్రముఖులు , ఏడేళ్ళ క్రితం యింతటి ప్రముఖులు కేవలం విద్యార్ధులే. అందుకే అంటాను , ఇక్కడచదివే ప్రతి విద్యార్ధినీ మనం జాగ్రత్తగా గమనించాలని , చెప్పలేం గదా, ఏ పుట్టలో ఏ పాముందో...."
ఆడిటోరియంలో చప్పట్లు, గ్రీన్ రూంలోకి వెళ్ళబోతున్న శ్రీనివాసరావుకి ఈ చివరి మాటలు వినిపించాయి.
(అయ్యా తమరెవరో తెలీదు నాకు, కాని సార్ నేను పాముని కాదు. కనీసం వానపామునైనా కాదు. అందుచేతనే కాబోలు తమరు నా గురించి యిక్కడ అక్షరం చెప్పలేదు. నేను గుమాస్తానని , ఏడేళ్ళ క్రితం కలలో కూడా వూహించని ఉద్యోగిని నేను, కనక సార్..... అదీ నా పరిచయం)
ముకుందం లేచి నుంచుని తనకి జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు చెబుతుండగా శ్రీనివాసరావుని సుబ్బారావు పిలిచేడు.
"నువ్వు త్వరగా తెమల్రా , బాబూ! టైం లేదు. రెండో సీనులో గాని ముకుందం రాడు. వాడి మేకప్ ఆలస్యమైన ఫరవాలేదు. నువ్వు త్వరగా డ్రస్సవు.క్విక్ .....ఈ శోభనాచలంగాడేక్కడ? రేయ్ .....రారా ....అబ్బబ్బ, చంపేస్తున్నార్రా. బాబూ సర్లే రావోయ్. వాడేదో గెస్ చెబుతాడు గానీ నీకెందుకు మధ్య? వెధవాయన వీడూను. ఛాన్సు దొరికితే చాలు, ముకుందాన్ని ముంచేసే సినీనటుడై పోదామనే యావతప్ప మరొకటి లేదు. నువ్వు నడవరా రావ్!"
శ్రీనివాసరావు సుబ్బారావుని ఎగాదిగా చూచి , అన్నాడు.


