"థాంక్స్ సుబ్బారావ్."
"రేయ్ నాన్నా.....యిప్పుడు అసలు కార్యక్రమంలోకి వద్దాం. రెడీనా?"
"కార్యక్రమమా?"
"అసలిది భోజనం ముందు జరగవలసింది. పాడు చేసింది నువ్వు. అయినా మించి పోయిందేమి లేదనుకో. మరి మందు సిద్డ్డం చేసేదా?"
"మందా?"
"మందేరా , మందు మరిచిపోయేవూ?"
"ఓహ్.....అదా......వద్దురా! నేను తాగను."
ఫరవాలేదు. ఇవాళ తాగు. కొన్నేళ్ళ తరవాత కలుసుకున్నాం. మందు సేవించి మన మీటింగ్ ని కళాత్మకం చేసుకుందాం."
"నాటకాల డైలాగు పాతపళ్ళేదు."
సుబ్బారావు ఉత్సాహంగా మంచం దిగి సీసా తెచ్చేడు. అంతకుముందే తెచ్చి పెట్టుకున్న సోడాల్ని , తినుబండారాలనీ ఒకచోట చేర్చాడు. వాటిన్నిటి వేపూ ఆనందంగా చూస్తూ అన్నాడు.
"ఎన్నేళ్ళకి ? గుర్తిందిరా రావ్! బి.ఏ పైనలియర్ లో దేవుడు నాటకం పూర్తీ అయిన తరవాత నీ గదిలో ముకుందం గారు మనందరికీ పార్టీ యిచ్చేడు."
"గుర్తు చేయకు. ముందు కొంచెం ఈ గ్లాసులో పోయి సుబ్బారావ్. నీ ఆరోగ్యం కోసం నేనివాళ తాగేస్తాను."
సుబ్బారావు రెండు గ్లాసుల్లోను వంచేడు. ఇద్దరూ గ్లాసుల్ని ఒకదానికొకటి అంటించేరు. అందుమూలంగా పుట్టిన చిన్న తమాషా షక్ శభ్దాన్ని వినగలిగేరు. ఆ సుతిమెత్తని శబ్దం శ్రీనివాసరావుని - నాటకం పూర్తీ అయిన రోజు రాత్రి, ఉత్సాహం తాండవించిన గదిలోకి తీసుకు వెళ్ళి పోయింది.
ఇవాళిక్కడ యిద్దరు మిత్రులే సీసాని నీరసంగా పూర్తీ చేస్తున్నారు. సుబ్బారావు వూరుకోలేదు. అతనే అన్నాడు.
"ఆ రోజు ముకుందంగాడు తప్పతాగి ఏడ్చేడు . ఎందుకురా రావ్?"
"నా గొప్పతనం చూచి ఓర్వలేక"
"మరి, ఇవాళ నువ్వు ఎడవ్వెం రా?"
"ఎందుకు?"
"నా గొప్పతనం చూచి."
"పోరా పురుగా. నువ్వు నాకు చెప్పకు. నీ గొప్పతనం! మనుషులి నెత్తురు తాగే రాక్షసుడురా నీ మామ. వాడి నీడని బతుకుతూన్న పక్షివి. నీకు గొప్పతనం ఎక్కడిదింక? నే నొప్పుకోన్రా ఒప్పుకోను."
"నా మామ సంగతి నీకేం తెలుసో చెప్పరా , రావ్!"
"మా నాన్నని చంపేడు రాస్కెల్!"
"మామ. చాలామందిని చంపెడోయ్. తనకి యెదురు నిల్చిన మహా మహా మహామేధవుల్ని - ఏమిటి - మట్టిలో కలిపేడు. అది మామ డ్యూటీరా బడుద్దాయ్. మామ మాట కేదుర్లేదు. మామ, మనుషుల్ని ఏలేందుకు పుట్టాడ్రా. ఇవాళ మినిస్టరయ్యేడంటే వుత్త పుణ్యానికే అయిపోయేడా? దాని వెనుక మామ కెంత సపోర్టుందో ఊహించావా? మరంత దుర్మార్గపు మనిషికి యింత సపోర్టేవరిచ్చేరు? మీ నాన్న లాటి మనుషులే గదా? రేయ్ . ఇదంతా రాజకీయంరా సన్నాసీ! ఇవాళ మామ మండిపోతున్నాడు . బతకనేర్చిన ప్రతి ఒక్కడూ మామ నీడనే కోరుకుంటాడు. వెధవా, మడి గట్టుకు కూచోమాకు. నాతొ ఒక్క మాట. మాట మాత్రంగా అనగా, "రేయ్ సుబ్బారావ్ , నాకోదారి చూపించారా బాబు!" అను, ఆ తరవాత నా తడాఖా చూడు నీ ఆఫీసరు సీట్లో నువ్వు కూర్చుంటావు. ఏమిటి? నీకా సీటు కావాలా?"
"నాకు వద్దు?"
"పో, నీ ఖర్మ. ఒరేయ్. బాగుపడదలచినవాడు మార్గాలు వెతకాలిరా! నీకంటే చచ్చువేధవలు, నీకున్న అర్హతలతో యజమానులై పోయేరు , తెలుసా."
"తెలుసు. అదంతా యింద్రజాలం."
"కావాలనుకుంటే నువ్వు 'జాదూ ' కావచ్చు. కోరుకో నరుడా!:
శ్రీనివాసరావు కొంచెం తటపటాయించి , అనక లేచి నించుని అన్నాడు.
"రాస్కెల్ ! నన్ను మింగాలని ప్లాన్ చేసేవుట్రా? చంపేస్తాను జాగ్రత్త. మత్తులో వున్నా నాలో నిజాయితీ వెళ్ళి పోలేదోరేయ్! నీ ప్రతాపం కట్టిపెట్టు . నేను నీకు గాని, నీ ద్వారా నా మమగాడికి గాని తలంచను. నన్నేమను కుంటున్నార్రా మీరు? దగుల్భాజీనా నేను! కానురా , చీమూ నెత్తురూ వున్న మనిషిని . ఏ ఫేరఫేక్టు జంటిల్మన్ ఆఫ్ ది ఏజ్ ని, గో యూ స్కౌండ్రల్."
సుబ్బారావు పకపకా నవ్వేసేడు. శ్రీనివాసరావు చేతుల్ని కళ్ళకు అద్దుకుని , అతన్ని కూచోబెట్టి అన్నాడు.
"ప్రియమైన స్నేహితుడా , నీకు జేజేలు. వర్ధిల్లు. నీ యిల్లు నిత్యదరిద్రంతో, నీ మనసు నిత్య దరిద్రంతో వర్ధిల్లే మాట నిజం. ఎంత కోపంరా నీకు పీనుగా. నీలాగా నేనుండలేనురా రావ్! హేట్సాఫ్ , అందుకేరా , నువ్వు నన్ను ప్రతీ తడవ గెలిచి పారేస్తున్నావ్. నా పెళ్ళిక రాలేదురా నువ్వు! నేను పాపాత్ముడికి అల్లుడి నౌతున్నననే కోపం గదరా నీకు! సేహభాష్. మామని చూచి తోకాడించే కుక్కని నేను. చెప్పు కింద మల్లెపువ్వులా నలిగే దౌర్బాగ్యం నాది. నాకు పేరు లేరురా. నేను ఫలానా మినిస్టరు గారి అల్లుణ్ణి. అదే నా పేరు. ప్రతివాడూ తద్వారా మామకి నమస్కారం చేసేవాడే. నాకేవ్వడూ చెయ్యెత్తి నమస్కారం చేయడం కాని ఒరేయ్ నేను ఒక అనామకుణ్ణి . ఒక అప్రయోజకుడిని. ఒక అగ్రస్త్యభ్రతని- సందర్భం తప్పైతే మన్నించు - దేవుళ్ళాటి నీకు రెండు చేతులూ జోడిస్తున్నాను. ఈ హీనుణ్ణి క్షమించరా రావ్!"
కాసేపటికి సుబ్బారావు కి ఏడుపు ముంచుకు వచ్చింది. ఆ ఏడుపుతోనే చెప్పుకున్నాడు స్వీయ కధ-
"దేశంలో వున్న మనుషులంతా నీలాటి దేవుళ్ళే అయితే, నాలాటి దయ్యాలకి చోటులేక రోడ్డు మీద కుక్కల్లా బ్రతికేస్తార్రా! ఆ ప్రమాదం ఈ యుగంలో జరగదు గాక జరగదు. నేను క్లాస్ వన్ దయ్యాన్ని కాదురా రావ్, నాలో యింకా మానవుడు బతికే ఉన్నాడు. వాడు గుర్తుకు వచ్చినప్పుడు నేను హీనాతి హీనంగా బతుకుతున్న మాట గుర్తుకి వచ్చి ఆ వెంటనే నీలాటి జెంటిల్మెన్ జ్ఞాపకానికి వచ్చి గుండెలవిసేలా ఏడుస్తాను నేను. నన్ను మార్చేందుకు నువ్వేం చేయలేవు. నేను నీ చేయి దాటి పోయెను. నువ్వు వద్దంటున్నా లోకనాధం గారి అమ్మాయిని కావాలని చేసుకున్నప్పుడే నీకు నేనెన్నో యోజనాల దూరం వెళ్లి పోయేనురా గురూ! క్షమించు . నన్నింక బాధ పెట్టను. ఈ రాత్రి అంతా నువ్విక్కడే వుండిపో. మళ్ళీ మనం ఇక్కడీ గదిలో దేవుడు నాటకంలోని మన వేషాల్ని చదువుకుందాం. నువ్వేమో టైగర్ బ్రాండ్ ఆఫీసరువి......నేనేమో ఉత్త వరదరాజులు గాణ్ణి. నేను డైలాగు చెప్పేదా. అల్ రైట్ ....."సార్ , మీరు దేవుళ్ళు సార్! మిమ్మల్నీ ప్రపంచం గానీ, ఇక్కడ బతికే జనాభా గానీ అర్ధం చేసుకోలేదు. సార్! మీరు ప్రేమని ద్వేషించినా ప్రేమమూర్తులు. మనుషుల్ని హింసింస్తున్నారనే అపవాదుని భరించిన శాంతమూర్తులు. లౌక్యం తెలీని పసివారు. మిమ్మల్నా సార్ , నేను చెయ్యెత్తి కొట్టింది. క్షమించండి - క్షమించరా రావ్!"
"తరవాత సుబ్బారావ్ మాటాడింది కొంచెమే కాని, శ్రీనివాసరావు అతన్ని చాలాసేపు సముదాయించేడు.
10
ఆఫీసులో శ్రీనివాసరావు హోదా మరికొంత పెరిగింది. ఆఫీసరు గదిలో అయన ముందున్న కుర్చీల్లో ఒక కుర్చీని శ్రీనివాసరావుకి కేటాయించారు. శ్రీనివాసరావు ఎప్పుడే సమయాన్న ఆ గదిలోకి వెళ్ళినా , అతనా కుర్చీలో కూర్చోవచ్చు.