Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 34


    
    తను చేసిన తప్పు బయటకు రాకుండా ఇంజినీర్ నాటకం ఆడటంతో కార్మికుల దురుసుతనమేనని మిడిల్ మేనేజ్ మెంట్ అపోహ పడింది.
    మాటకు మాట, దెబ్బకు దెబ్బ, హింసకు హింస నెలకొందక్కడు.
    అదంతా ఎవరో కావాలని ఆడిన నాటకంగా సామంత్ గ్రహించగలిగాడు. అయినా అప్పడిక చేయగలిగిందేమీ లేదని గ్రహించాడు.
    పోలీసులు మరో నిమిషంలో ఆకేంపస్ లోకి ఎంటర్ అవుతారనగా  హఠాత్తుగా లాల్ సింగ్ బిర్క్, హంసీ ఖాన్ ఆ గుంపులోకి జొరబడి పోయి సమయం చూసి ఆజ్యం పోయటానికి సిద్ధంగా ఉన్నారు.
     సామంత్, అతనిలాగే శాంతిని, అభివృద్ధికి కోరుకొనే మరికొందరు, ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చకముందే సర్దుబాటు చేయాలని ఆఖరి ప్రయత్నంలో ఉన్నారు.
    ఎస్టేట్ లో ఓ హాల్లో భూపతిరావు తన ఇద్దరు కొడుకులతోసమావేశమయి ఉన్నాడు పెద్దకొడుకు విషయం ఆ రోజు ఆటో, ఇటో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న భూపతిరావు ఆ గదిలోవున్న ఫోటో డిస్ట్రబెన్స్ అని డిస్కనెక్టు చేశాడు.
    ఫ్యాక్టరీలో హఠాత్తుగా కమ్ముకుపోయిన కారు మేఘాల గురించి భూపతిరావుకు తెలియపర్చి, తీసుకోవాల్సిన చర్య గురించి తెల్సుకోవాలని నలుగురైదుగురు ఆఫీసర్స్  ఫోన్ మీద ఫోన్ చేస్తున్నా ఎంగేజ్ సౌండ్ వచ్చి వారికేం చేయాలో దిక్కు తోచకుండాపోయింది.
    పోలీసుల్ని రంగంలోకి దింపితేగాని గొడవ సర్దుబాటుకాదు. అలా  చేస్తే కార్మికులు రెచ్చిపోతే దీర్ఘకలిక సమస్యగా అది పరిణమించవచ్చు ఎలా....? ఏం చేయాలని ఆలోచిస్తున్న  వారి చెవుల్లో పోలీస్ సైరన్స్ పడ్డాయి.
    అధికారులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఎలా వచ్చారు? ఎవరు తెలియపర్చారు? ఇంతలోనే ఇది పోలీసులదాకా ఎలా వెళ్ళిందన్నది అర్థం కాక ఆందోళన చెందుతూ గదుల్లోంచి బయటకు పరుగెత్తుకు వచ్చేసరికి పోలీసులు వ్యాన్స్ దిగి పరిగెత్తుతూ కనిపించారు.
    పోలీసుల రంగ ప్రేవేశం దూకుడుగా జరక్కుండా సదాశివ్ అడ్డుకున్నాడు. సమస్య చిన్నదైతే పోలీసులు పెద్దదిగా చేసిన చాలా సందర్భాలు తెలిసి ఉండటంతో ఆ జాగ్రత్త ముందే తీసుకున్నాడు.
    కాని కొందరు యువ కార్మికులు పోలీసుల్ని చూసి ఆవేశపడ్డారు.
    సదాశివ్ చొరవగా గుంపు మధ్యకు వెళ్ళిపోయి హెండ్ మైక్ చేతిలోకి తీసుకున్నాడు.
    "మైడియర్ ఫ్రెండ్స్___ముందుగా ఒక మనవి __మమ్మల్ని చూసి అవమానంగా ఫీలయి రెచ్చిపోకండి, సమస్య అసలెక్కడ ప్రారంభమయిందో కనుక్కొని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. దయచేసి  కాసేపు ప్రశాంతంగా ఉండండి...." సదాశివ్ గొంతెత్తి సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ మూల నుంచి రాయి వచ్చి సదాశివ్ నుదుటిని బలంగా తాకింది.
    తాకిన మరుక్షణం దాని గురించి కంగారుపడలేదు అది వచ్చిన వైపుకి గిరుక్కున తిరిగి చూశాడు. అక్కడో  వ్యక్తి సదాశివ్ దృష్టిలో పడ్డాడు. పోలీసాఫీసర్ ఇటే చూస్తున్నట్లు గమనించగానే అతడు  చప్పున అక్కడినుండి తప్పుకున్నాడు.
    సదాశివ్ అతని వృత్తిలో అంతమంచి పేరు రావటానికి అతని గురి తప్పని జ్ఞాపకశక్తి కూడా ఒకటి.
    సదాశివ్ కనుబొమ్మలు పైకి లేచాయి ప్రశ్నార్థకంగా 'లాల్సింగ్ బిర్క్' అన్న మాటలు అస్పష్టంగా, స్వగతంలో ఉచ్చరించాడు.
    సదాశివ్ అనుమానం నిజమైంది.
    సందర్భన్ని తమకు అనుకూలంగా మార్చుకొనే మూకల చేరి పోయాయన్నమాట.
    ఈ లోపు పరిస్థితి మరో మలుపు తిరిగింది.
    ఎంతో మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న తమ  బాస్ దెబ్బతినడంతో పోలీసులో ఉగ్రులైపోయారు.
    కల్లోలం ఉధృతమైంది. అందిన వాళ్ళను అందినట్లే లాఠీలతో  చావబాదటం మొదలెట్టారు పోలీసులు. కొందరు  చేతికందిన వస్తువుల్ని ధ్వంసం చేసి పారేస్తున్నారు.
    పిచ్చిగా  అరుస్తున్నారు పోలీసులు. భయంతో కొందరు కాకవికలమైపోతుంటే మరికొందరు పరుగులు లంకించుకున్నారు. ఇంకొందరు ఎదురు తిరిగి పోలీసుల్ని చాటునుంచి దెబ్బ వేస్తున్నారు.
    కొద్ది నిమిషాల్లో ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా తయారయింది.
    కోట్ల ఖరీదు చేసే యంత్రాలు నాశనమైపోయాయి. లక్షలు ఖరీదు చేసే ఫినిష్ గూడ్స్ చెల్లాచెదురైపోయాయి.
    పొడవైన ఆ ఫ్యాక్టరీ హాలు అరగంట క్రితం మానవ శ్రమకు, దీక్షకు ప్రతీకగా, దేశ ఉత్పాదనకు ఓ మైలురాయిలా, మానవ నిర్మిత సంపదకు మధురస్మృతిగా ఉంది.
    మరిప్పుడు....? మనిషిలోని స్వార్థ రాక్షస ప్రవృత్తికిపరాకాష్టగా, మేన్ మేడ్ డిజాస్టర్ కి సమాధి గుర్తుగా మిగిలివుంది.
    కొన్ని కోట్ల రూపాయలు.....కొన్ని మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ, కొన్ని లక్షల గంటల మానవ శ్రమ.....కొందరు మేధావుల, శాస్త్రజ్ఞుల అంకుఠిత దీక్ష.....అపార దేశ సంపద.....లక్షల సాధారణ ప్రజల మూలధనం....చూస్తుండగానే సర్వనాశనమైపోయింది.
    నిర్మించటానికి నిర్మూలించటానికి మధ్య సన్నని సరిహద్దు రేఖ ఈ రేఖ ఈ దేశంలో ఏదో  ఓ చోట.....ఎప్పుడో ఒకప్పుడు కాక ఎప్పుడూ చెదిరిపోతూనే  ఉంటుంది.
    కేవలం వ్యక్తిగత కక్ష.....చైర్ మెన్ పోస్ట్ ల్  ఉన్న వ్యక్తి. బోర్డాఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ పదవుల్లో ఉన్న ఏడెనిమిది మంది వ్యక్తులు ఆస్తులుగా భావించి, కోట్లాది దేశ జనావళికి మేలు చేసే కలియుగ దైవ మందిరం__కిరాతకుల కరాళ నృత్యం ముందు తలవంచక తప్పలేదు.
    వ్యవస్త ఇలా ముందుకు సాగితే___ఈ దేశ గడ్డపై పుట్టిన సగటు మనిషి కోరుకునే సోషలిజమో.....కమ్యూనిజమో.....ఏదో ఒక ఇజంవచ్చేనాటికి అనుభవించటానికి ఆస్తులుండవు___రాసుకొనేందుకు బూడిదే ఉండేది.


                                                            *    *    *

    తండ్రితో తీవ్రంగా ఘర్షించి దూకుడుగా బయటకు వచ్చాడు నాగ్.
    అప్పటికే తలుపు దగ్గర ఆఫివు సిబ్బంది ఆందోళనగా భూపతిరావు కోసం ఎదురు చూస్తున్నారు.
    నాగ్ విసురుగా కారులో కూర్చుని ఇగ్నిషన్ కి తిప్పాడు. క్షణాల్లో కారు 60 కిలోమీటర్ల స్పీడందుకుంది. నాగ్ మనసంతా గజిబిజిగా అయిపోయింది. తనకిష్టంలేని విషయాల్ని బ్రెయిన్ వాష్ చేసి  ఎక్కించాలనుకొనే తండ్రి, తమ్ముడంటే అయిష్టత బలంగా ఏర్పడిపోతోంది.
    కారు పదినిమిషాల్లో ఓబరాయ్ ఫైవ్ స్టార్ హొటల్ ముందాగింది.
    కారు పార్కుచేసి వచ్చి స్విమ్మింగ్ ఫుల్ లోని నీలిరంగు నీళ్ళపై బడి వింత శోభను ఎగజిమ్ముతున్నాయి.
    కొందరు ముద్దు గుమ్మలు అర్థ నగ్నంగా, ముప్పాతిక నగ్నంగా తన  ముందునుంచే నడిచి వెళ్తూన్న పట్టించుకొనే స్థితిలో లేదు నాగ్.
    అలా ఐదు  నిమిషాలు గడిచాయి.
    సాయం చీకట్లు ముసురుకుంటున్నాయి. బేరరు రెండుసార్లు దగ్గరకు వచ్చి ఆర్డరు ప్లేస్ చేసుకొనేందుకు ప్రయత్నించబోయి మౌనముద్రలోవున్న నాగ్ ని చూసి తిరిగి వెళ్ళిపోయాడు. అతనెవరో తెలుసుగనుకే ఆ స్పెషల్ ట్రీట్ మెంట్.

 Previous Page Next Page