"ఓ.కే మీరెళ్ళి మీ పని చూసుకోండి" అంటూ ఫైల్లో తల దూర్చింది.
సెక్రటరీ నిస్సహాయంగా తల విదిలించాడు. చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. తానా విషయాన్ని గుర్తుచేసి ఉండావల్సిందికాదు. తనని తానే తిట్టుకుంటూ బయటకు నడిచాడు. లెక్క ప్రకారం ఇద్దరూ తప్పక ప్రేమలో పడితీరతారు.
ఇద్దరూ వయసులో ఉన్నారు. మంచి ఈడు, జోడు, ఆస్తుల పరంగా సమ ఉజ్జీ కాకపోయినా మేడమ్ కి తక్కువేం లేదు.
వీటన్నింటిని మించి ఇద్దరి భావాలు ఒక్కటే. ఇద్దరు ఒంటరివాళ్ళే వారి మనస్సులో ఇంతవరకూ ఎవరూ వుండి వుండకపోవచ్చు.
90 శాతం వారి జీవితాల్లో మొదలు కానున్న ఫేమిలీ డ్రామాను తను చేతిలోకి తీసుకుంటే అటు భాగ్యరాజు ని, ఇటు భూపతిరావును గుప్పిట్లో పెట్టుకోవచ్చు.
నాగబాబుకి తన కూతుర్ని ఇవ్వాలనుకొంటున్న సత్యరాజ్ దీంలో చెలరేగిపోవటం ఖాయం. ఆ చెలరేగటాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటే చాలు.....వండర్స్ చేయవచ్చు.
హఠాత్తుగా తనో లీడర్ అయిన భావన అతన్ని ఆనందంలో ముంచెత్తి వేసింది.
* * *
9 గంటలతల్లా డ్యూటీ ఎక్కాడు సామంత్.
యధావిధిగా స్పన్, పాలియస్టర్ చీరలకు డిజైన్ ప్రింటు చేసే డైయింగ్ మెషిన్ ని అన్ చేశాడు.
పెద్ద రోలర్ కి చుట్టివున్న చీర డైయింగ్ మెషిన్ ప్రింటింగ్ రోలర్స్ మధ్యనుంచి వచ్చేస్తోంది. సామంత్ రోలర్సు మధ్యనుంచి రంగులు ముద్రించుకుని రిలేజ్ అవుతున్న క్లాత్ ని చేతిలోకి తీసుకుని రంగుల్ని చెక్ చేసుకుంటున్నాడు.
పది నిముషాలు బాగానే నడిచిన మెషిన్ హఠాత్తుగాపదకొండో నిముషంలో ఓ జర్కు ఇచ్చి ఆగిపోయింది.
మెషిన్ ఎందుకు ఆగిపోయిందో తెలియని సామంత్ ఓ సారి రోలర్సు మధ్యకు వెళ్ళిచెక్ చేశాడు. ట్రబుల్ ఏమిటో తెలియలేదు. మెషిన్ వైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు.
అంతలో అటుగా, ముందుగా అనుకున్న ప్లాను ప్రకారం డైయింగ్ సెక్షన్ ఇంజనీరు వచ్చాడు.
"ఏమిటి వర్కు ఆపేసావ్......బుద్ధిలేదూ? ఒక నిమిషం ఆగితే ఎంత ప్రొడక్షన్ దెబ్బతింటుంది."
సామంత్ ఓసారి ఇంజనీరు వైపు చూసి సౌమ్యంగానే ఏదో చెప్పబోతుండగానే ఇంజనీరు మరలా కల్పించుకున్నాడు.
"జీతాలు ఇచ్చి మేపితే, కళ్ళు నెత్తికెక్కి మెషిన్ ఆపేసి బాతాఖానీ కొట్టడం- లేదంటే బీడీలు తాగుతూ కూర్చోవడం....." ఇంజనీరు రెచ్చిపోతున్నాడు.
"మెషిన్ ఉన్నట్టుండి ఆగిపోయింది. అదే చూస్తున్నాను. నేనే మీకు కంప్లెయింట్ చేద్దామనుకుంటుండగా మీరే వచ్చారు. విషయం తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకోకండి....." నెమ్మదిగానే అన్నాడు సామంత్.
"అమ్మనా కొడకా.....ఎంతమాటన్నావురా? నేను నోరు పారేసుకుంటున్నానా? లంజాకొడకా ఎంత పోగరురా నీకు? బంగారంలాంటి మెషిన్ ని పట్టుకొని ఆగిపోయిందని, చెడిపోయిందని కుంటిసాకులు చెబుతావా?" కావాలనే ఇంజనీరు తనను రెచ్చగొడుతున్నాడని గ్రహించని సామంత్ ఆ తిట్లను భరించలేక దూకుడుగా ఒకడుగు ముందుకేశాడు.
"ఏంటిరా? మీద మీదకొస్తున్నావ్? కొడతావా? తిండిపెట్టే యజమానంటే గౌరవంలేదు ఆయన ఉప్పు, కారంతింటూ ఆయనకే ద్రోహం తలపెడతావా?" అంతకంతకు ఇంజనీర్ కంఠం కరుకుగామారిపోతోంది.
"మాటలు మర్యాదగా రానివ్వండి. ఎందుకలా అనవసరంగా రెచ్చిపోతారు? ఇది బంగారంలాంటిమెషీన్ అంటున్నారు. ఎప్పటిమోడల్ ఇది.....? అయినా ఆ తప్పుడు మాటలేంటి? ఉప్పు కారం ఏమిటి....? నేనెప్పుడు ఎవరి ఉప్పు కారం తినలేదు, నా కష్టానికి ఫలితంగా వచ్చిన జీతాన్ని తింటున్నాను. కేపిటలిస్టులు, కేపిటలిస్టులుగానే మిగలిపోయేందుకు ప్రత్యేకంగా రాసుకున్న పదకోశంలోని మాటలు___ఆ ఉప్పు, కారం," సామంత్ ఎప్పుడూ ఎవరితో మాటపడి ఎరగడు. మోస్ట్ సెన్సిటివ్.
అలాంటి అభిమానం, అభిజాత్యంకల సామంత్ ఇంజనీర్ తిట్టే సరికి ఆవేశపడ్డాడు.
(అతి చిన్న కారణం కూడా లేదిక్కడ. ఎక్కడికి దారితీస్తుందో చూడండి. బొంబాయిలో 1983 లో ఓ బట్టల మిల్లులో (పేరు చెప్పలేను) ఇలాగే చిన్న విషయం దగ్గర మొదలైన ఘర్షణ ఓ పెద్ద పారిశ్రామిక, కార్మిక వివాదంగా మారిపోయింది. దాని మూలంగా కేవలం 724 కోట్లే నష్టపోయింది దేశం.)
"ఎంటిరో కేపిటలిస్టులు, పదకోశాలు అంటున్నావ్__ సమ్మె చేయిస్తావా? ఎలా చేయిస్తావో చూస్తాను" కావాలనే చొక్కా చేతుల్ని పైకి మడిచాడు ఇంజినీర్.
ఆ ప్రయత్నం తనని కొట్టేందుకే అని అపోహపడ్డాడు సామంత్ ఆ అపోహ సామంత్ కి కలగాలనే చొక్క చేతుల్ని విసురుగా మడిచింది.
"చాలా చిన్న సిశయం ఎందుకంత రభస చేస్తారు? నా సంగతి మీకు తెలుసు. తెలుసుండీ ఇలా అసభ్యంగా ప్రవర్తించడం___అనవసరమయిన ఆవేశకావేశాలు పెంచుకోవటం అంత మంచిదికాదు. ఎందుకు అనవసరంగా దీనికి వేరేరంగు పూస్తావు....." తనను తాను నిగ్రహించుకుంటూ కాస్త గట్టిగా అన్నాడు సామంత్.
మాటలు పూర్తికాలేదు విసురుగా ఓ దెబ్బ వేసాడు సామంత్ ని.
ఏమరుపాటుగా ఉన్న సామంత్ కి అది బలంగా తగిలినుదుటిమీద గాయమై నెత్తురు చిమ్మింది.
ఆ అదనుకోసమే దూరంగా, చాటుగా ఉండి ఎదురు చూస్తున్న సత్తెయ్య, ఓ ఇద్దరు కార్మికుల్ని ముందుకు తోసాడు! వాళ్ళిద్దరూ సివంగుల్లా ఇంజినీర్ మీదకు దూకటం, వాడిని నాలుగు పంజా దెబ్బలు వేయటం, ఇంజినీర్ నిలువునా కూలిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
నుదుటి నుంచి కారుతున్న రక్తాన్ని ఓ చేత్తో గట్టిగా అదిమిపట్టుకొని ఆ ఇద్దర్ని నిరోధించేందుకు వారి మధ్యకు వచ్చాడు సామంత్.
కాని అప్పటికే ఆలస్యమయింది.
ఇంజినీర్ దూకుడుగా లేచి వారితో కలబడ్డాడు. చూస్తుండగానే పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపించింది.
సామంత్ వెంటనే డేంజరస్ అలారం స్వీచ్ ఆఫ్ చేసి అక్కడకక్కడే సమస్యను పరిష్కరిద్డామనుకున్నాడు.
సామంత్ కి అలాంటి ఆలోచనవస్తే తమ పధకం పారదని , ముందే సత్తెయ్య ఆ ఇద్దరికీ చెప్పివుండటంతో ఒకడు అటుదూకి స్వీచ్ ని బలంగా నొక్కాడు.
పరిస్థిలి పూర్తిగా చేయి దాటిపోయిందని సామంత్ గ్రహించాడు.
కనురెప్పపాటుకాలంలో ఎక్కడి యంత్రాలక్కడే ఆగిపోయాయి.
ఆందోళనగా , గుంపులుగా, కార్మికులంతా డైయింగ్ సెక్షన్ వైపు పరిగెత్తుకు వస్తున్నారు.
క్షణాల్లో ఈ వార్తా సత్యరాజ్ కి అందించబడింది. ఆ వార్త ఆ క్షణమే ఎదురుగా వున్న దీపక్ రాజ్ కి అందింది.
దీపక్ రాజ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి రింగ్ చేసి నేషనల్ ఇండస్ట్రిస్ డైయింగ్ సెక్షన్ లో హింసాకాండ చెలరేగుతోందని_ వెంటనే వచ్చి పరిస్థితిని అదుపులోనికి తేవాలని, తాను ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ని అని నమ్మబలికి ఫోన్ పెట్టేశాడు.
ఆ స్టేషన్ సదాశివ్ ఇన్ చార్జి. పోలీస్ శాఖలో అప్రమత్తతపై పోటీ పెడితే దేశం మొత్తానికి మొదటివాడిగా వస్తాడు సదాశివ్.
ఐ.పి.యస్. పూర్తి చేసుకొని ప్రమోషన్ పై ఆ సర్కిల్ కి ఇటీవలే వచ్చాడు సదాశివ. అతనిలోని చురుకును, నేరపరిశోధనా శక్తిని గమనించిన ఎస్ పి. చాలా కేసులు, పనులు సదాశివ్ కే అప్పగించి చేతులు దులుపుకున్నాడు.
సదాశివ్ జీప్ ముందు, వెనుక రెండు వ్యానులు, పోలీసుల్ని ఎక్కించుకుని ఆఘమేఘాల మీద బయలుదేరాయ్.
సరీగ్గా ఇదే సమయంలో డైయింగ్ సెక్షన్ నానా భీభత్సంగా తయారయింది.
ఎంతో మంచివాడయిన సామంత్ ని దూషించటాన్ని, గాయపర్చటాన్ని సోదర కార్మికవర్గం భరించలేకపోయింది.