Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 33

 

    మంచం మీద కూర్చుని కూనిరాగం తీస్తూ కొత్త చీరలకి "ఫాల్' కుట్టుకుంటోంది ఝాన్సీ . లోపల కొచ్చిన పానకాలు ఆమెనీ, చీరలని మార్చి మార్చి చూసి 'ఎక్కడివీ ఇవన్నీ?" అన్నాడు.
    "ఎక్కణ్ణుంచొస్తాయి? కొన్నాను" అంది ఝాన్సీ. "ఒక్కసారి ఇన్ని చీరలు కొనాలంటే ఎంత డబ్బవుతుంది? సంసారమా ఇది సానికొంపా? అయినా రోజుకో కొత్త చీర కట్టుకొందే బ్యాంక్ కెళ్ళకూడదా?" అన్నాడు భర్త హోదాలో దబాయిస్తూ.
    ఝాన్సీ ఒకసారి అతని కేసి చూసి, తలదించుకుని మళ్ళీ కుట్టుకుంటూ కూర్చుంది.
    "ఏమిటా నిర్లక్ష్యం? ఏం చూసుకుని? మింగడానికి మేతుకులేని కొంపలో నుంచోచ్చావ్! ఇక్కడ నాలుగు మెతుకులు మూడు పూట్లా వొంటబట్టేసరికి పొగరెక్కి కళ్ళు నెత్తిమీదికొచ్చాయ్........దొంగము...."
    చివరి మాట పూర్తీ చేసేలోగానే శివమెక్కినదానిలా , రోషంతో ఒక్క అరుపు అరిచింది ఝాన్సీ.
    "మాటలు జాగ్రత్తగా రానీయండి! నేను తినే నాలుగు మెతుకులూ నా సంపాదనలో తింటున్నాను. నాకు కావలసిన బట్టలూ నా సంపాదనతోనేకొనుక్కుంటున్నాను. ఇందులో మీరు చేసిందేమీలేదు. ఎక్కువ మాట్లాడితే నేను పెట్టె తిండే మీరు తింటున్నారు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరికే తిరుగుతూ, అక్కడా ఇక్కడా గతుకుతూ బతికే బతుకు కాదు నాది! నాకు పొగరేక్కినామ్ నగరేక్కినా నా ఆత్మస్థైర్యం వల్లే, నా ఆత్మ గౌరవం వల్లే! మరోసారి బూతుమాటలూ, తిట్లూ నా ముందర వాడారో నేనూ తిప్పి అనవలసి వస్తుంది జాగ్రత్త!' అంది కోపంతో వణికిపోతూ కుట్టడం ఆపి ఝాన్సీ.
    "నిన్ను చంపినా పాపం లేదు. మొగుడనే గౌరవం లేకుండా నీ ఇష్టం వొచ్చినట్టు వాగుతున్నావ్! అంటూ పట్టలేని కోపంతో పీక పట్టుకున్నాడు.
    "వోదలండీ!" అని అరుస్తూ పట్టు విడిపించుకున్న ఝాన్సీ , చేతిలో కుడుతున్న చీర నొదిలేసి జింకలా దూకింది మంచం మించి.
    పట్టలేని ఆవేశంతో, రెచ్చిపోయిన ఆగ్రహంతో, అతని కేసి కాలికాదేవిలా చూసింది.
    "చూడండీ! నేను తలుచుకుంటే నువ్వుత్త కిరాతకుడవనీ, శాడిస్టువనీ , నీ మీద కేసు పెట్టి నీకు విడాకులివ్వడమే కాదు జన్మలో మరే ఆడపిల్ల నీ వైపు కన్నెత్తి చూడకుండా చెయ్యగలను. నిన్ను తోత్తుకింద చూపించగలను. అలా జరిగిననాడు నువ్వు బజార్లో పిచ్చి కుక్కలాగా తిరగవలసి వస్తుంది. నీ మొహం చూసే వారుండరు. ఆఖరి సారిగా చెబుతున్నాను. నా జోలికి రాకుండా నా మానాన నన్ను బతకనిస్తే కనీసం లోకం దృష్టిలోనైనా మనం, భార్య భార్తల్లా వుండొచ్చును. లేదా నీ దారి నీది, నా దారి నాది. అంతేకాదు మరో కండిషన్ కూడా వుంది. నేను సంపాదించి తీసుకొచ్చి నిన్ను పోషించేది లేదు. నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చెయ్యి, లేదా ఊగిడిగం చెయ్యి- ఏదో ఒకటి చెయ్యి. నీ వంతు సంపాదన కూడా కలుపుతేనే ఇద్దరం కలిసి వుండేది. అంతేకాదు న సంపాదన నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాను. అడిగే హక్కు నీకు  లేదు. కానీ నువ్వు సంపాదించిన దాన్లో మూడొంతులు నాకివ్వాలి ఇంటి ఖర్చులకి " అంది ప్రతి అక్షరాన్ని నొక్కి పలుకుతూ ,ఆమె అవతారాన్నీ , ఆమె చేస్తున్న ఏకవచన ప్రయోగాన్ని భరించలేకపోయినా , చేసెది లేక నోరు మూసుకున్నాడు పానకాలు. అతనిలో ఆమె అన్నంత పనీ చేస్తుందన్న భయం కూడా కలిగింది. కిక్కురుమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
    చీరలన్నీ తీసి బీరువాలో పెట్టింది ఝాన్సీ. వంట ఇంట్లో కెళ్ళి పదార్ధాలన్నీ వేడి చేసి తెచ్చి టేబిల్ మీద పెట్టింది.
    "రండి భోజనానికి" అంది.
    పిలిచినదే తడవుగా పిల్లిలా వచ్చి కూర్చున్నాడు టేబిల్ ముందు మౌనంగానే ఇద్దరూ భోజనాలు పూర్తీ చేశారు.
    
                                                    *    *    *    *

    పైకి పిల్లిలా తిరుగుతూ అమెనేమీ అనకపోయినా , ఒక రకమైన కక్ష అతనిలో చోటు చేసుకుంది. ఆమె కన్నా ఎక్కువే సంపాదించాలని ఆమె కన్నా ఎక్కువ హోదాలో వుండాలనీ , అప్పటికి గానీ తను ఆమెను ఎదిరించలేననీ అనుకున్నాడు పానకాలు. అతడి బుఱ్ఱలో ఆలోచన మెరుపులా మెరిసింది. పొద్దుటే లేచి జగన్నాధరావుగారింటికి వెళ్ళాడు.
    వరండాలో కూర్చుని పేపరు చదువుకుంటున్న జగన్నాధరావుగారి కాళ్ళ మీద దబీమని పడ్డాడు.
    "ఏమోయ్! ఏమైంది ? లే! ఏమిటిదంతా? ఏదో ఆ అమ్మాయి ఫిర్యాదు చేస్తే నీ మీద కేకలేశాను అంతే. బాధపడకు - లే! లే!" అంటూ కాళ్ళ మీంచి లేవనెత్తారు జగన్నాధరావుగారు.

 Previous Page Next Page