తను నేరస్థురాలు కాదు. నిరపరాధి. అలాంటప్పుడు తనకెందుకు భయం? అవును ఎందుకు భయం?
వెళ్ళి అంతా పోలీసులతో చెప్పెస్తే.?
తను హత్య చేయాలేదనడాని కంటే, చేశాననడానికే ఎక్కువ సాక్ష్యాలున్నాయి. హత్యకు ముందు తను రోసితో దేబ్బలాడ్డం , హత్యాప్రదేశంలో రోసి శవం పక్కన తను ఉండడం.
నిరపరాధిత్వాన్ని నిరుపించుకోగలదా తను. దేశంలో కెళ్ళా పెద్ద లాయర్లని పిలిపిస్తారు నాన్నగారు.
అయినా కూడా సాక్ష్యాలని బట్టి తనే హంతకురాలిగా నిర్ణయించబడితే
ఉరి-
కనీసం అజన్మంత ఖైదు, దాదాపు పద్నాలుగేళ్ళు.
తిరిగి వచ్చేసరికి తనకి ముప్పైఎనిమిదో, నలభయ్యో, ఉంటుంది వయసు. జైలు జీవితం ఇంకా వయసు పెంచేస్తుంది తనకు. అప్పుడింక కొత్త జీవితం మొదలెట్టాలి.
జైలు నించి తిరిగొచ్చిన హంతకిగా!
గుండెలు గుబగుబలాడాయి.
వళ్ళు వేడెక్కిపోయింది.
* * *
"అమ్మాయిగారికి చాలా జ్వరంగా ఉంది బాబూ" అంటూ వచ్చాడు నర్సయ్య.
"అరరే! నేనే ఇప్పుడోద్దామను కుంటున్నాను" అంటూ గబగబ బట్టలేసుకుని బయలు దేరాడు శ్రీహర్ష. :ఇంతకీ ఎప్పట్నుంచి జ్వరం?"
"పొద్దుట్నించి నండి ఒకటే కలవరిస్తున్నాడు. ఆ కలవరింతలు కూడా అర్ధం కావటం లేదండి."
:నేనూ వస్తాను". అంది రేవతి.
"నేనూ రానా?" అంది స్నేహ.
అందరూ జీపు ఎక్కారు.
లావణ్య కళ్ళు మూసుకునే పడుకుని ఉంది. మొహం జ్వర తీవ్రతతో ఎర్రబడి పోయింది.
వస్తూ వస్తూ డాక్టర్ ని తీసుకొచ్చాడు నర్సయ్య.
అయన ఇంజెక్షనిచ్చి బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాడు.
ప్రశ్నార్ధకంగా ఆయనవైపు చూస్తూ, పక్కనే నడిచాడు శ్రీహర్ష.
"ఏమిటి డాక్టర్! మామూలు ఫివరేనా?"
అవునన్నట్లు తలపంకించి "కాస్త షాకయి నట్లుంది. ఎందుకో తెలియడం లేదు." అన్నాడు డాక్టర్.
"భయమేం లేదు కదా?"
"అలాంటిదేమీ లేదు. డోంట్ వర్రీ. మళ్ళీ పొద్దునే వస్తాను" అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్.
నిన్నటి గొడవ గుర్తొచ్చింది శ్రీహర్షకి. అదే మనసులో పెట్టుకుని జ్వరం తెచ్చుకుందా! ఎంత సున్నితమైన మనసు! లావణ్యకి కోపం తెప్పించి నందుకు తనమీద తనకే కోపం వచ్చింది.
స్నేహ తదేకంగా లావణ్యని చూస్తోంది.
లావణ్య మొహం జ్వరంతో కందిపొయినా, అందం చెడలేదు. జుట్టు చెదిరి పోయి మొహం మీద పడుతోంది.
పక్కనే కూర్చుని లావణ్య చెయ్యి పట్టుకుంది ఆప్యాయంగా.
* * *
"మళ్ళీ బ్రాకెట్ కట్టి చూడండి సార్" అన్నాడు షాపతను ముకుందరావుతో.
ముకుందరావు హుషారుగా వందరుపాయలు కట్టాడిసారి.
తెల్లారి తెల్లారకముందే షాపుకెళ్ళాడు రిజల్టు కనుక్కోవడానికి.
"తగిలిందా?" అన్నాడు ముకుందరావు.
"మీకు సంఖ్యా శాస్త్రంగా వచ్చునా?" అన్నాడు షాపతను ఆశ్చర్యంలోంచి తెరుకోకుండా.
"సంగతి చెప్పవయ్యా"
"మళ్ళీ రాస్కో ఈసారి వెయ్యి రూపాయలు మళ్ళీ డబుల్ జీరోనే. " షాపతను ఆ నెంబరు చీటి రాసి, కాస్త తటాపటాయించి, తను కూడా ఆ నెంబరు మీద పాతికరూపాయలు కట్టాడు.
"అదేమిటి? నా నెంబరు కాపి కొడతావెం?"
"మీ అదృష్టం నాక్కూడా తగుల్తుందేమో చూద్దాం సార్"
"సర్లే నీ అదృష్టంనాకు తగిలితే?"
"నా అదృష్టం తగిలితే మీరూ షాపే పెట్టుకుంటారు."
నవ్వుతూ పక్కకోచ్చేశాడు ముకుందరావు.
ప్రతివాళ్ళు తనని ఆశ్చర్యంగా, అసూయగా చూస్తున్నారు.
డబ్బు! వేలు! ఏం చేయాలి?
చకచక నడిచి మౌంట్ రోడ్ లో బట్టల షాపుకి వెళ్ళాడు. డబుల్ బారెల్ ప్యాంటు, లిబర్టి షర్టు రెండు జతలు కొన్నాడు. ఆరొందలయింది. కొత్త బట్టలు షాపులోనే వేసేసుకుని పూల రంగడిలా బయటికొచ్చి పక్కనే ఉన్న వాచీల షాపులో ప్రవేశించాడు.