Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 33

 

    "నిన్న నన్ను నిరాకరించింది నా భార్య" అన్నాడు శశికాంత్, ఆ విషయాన్ని మరిచిపోలేనట్లు!

 

    "ఐ కెన్ నెవర్ టెక్ నో ఫర్ యాన్ అన్సర్!

 

    అందుకని వెంటనే ఆమెకి ఒక పాఠం చెప్పదలచుకున్నాను. నీతో కలిసిపోయాను నిన్న. అది సౌమ్యకి తెలిసిపోయింది కదా! దానితో వానపాములా మెత్తబడిపోయింది. జన్మలో నోరెత్తదు ఇంక.

 

    అతను అలా అంటుండగానే ఫోన్ మోగింది.

 

    ఎవరో డీలర్ దగ్గర నుంచి కాల్.

 

    తక్షణం శశికాంత్ గొంతు మారింది. మామూలు పదాలే ఉపయోగిస్తున్నాడు అతను. కానీ బూతులు

 

మాట్లాడుతున్నంత మొరటుగా పెట్టాడు గొంతు.

 

    "నక్కో భాయ్! నాకొద్దు సరకు!" అన్నాడు విసురుగా.

 

    లైనులో అవతల వున్న వ్యక్తీ ఏదో చెప్పాడు.

 

    వెంటనే కరుస్తున్నట్లు అన్నాడు శశికాంత్.

 

    "ఏం! నిన్న నాకు సరుకు కావాలంటే ఏవేవో సాకులు చెప్పి ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అని మతలబు మాటలు చెబుతావా? నిన్న నీ గోడవున్లో సరుకు వుంది. అది నాకు తెలుసు! కల్ తుమ్ హరా పాస్ మాల్ థా! ఓ మేరేకూ అచ్చీ తరఫ్ సే మాలూమ్ హై. అడగ్గానే సరుకు డెలవరి ఎందుకు ఇవ్వలేదు?"

 

    లైనులో గురగురమంటూ ఏదో సంజాయిషీ.

 

    "ఎందుకు భయ్ ఈ దొంగమాటలు! ఇప్పుడు నిన్ను తిప్పటం నా వంతు! రేపు కాదు! ఎల్లుండి కలు చూద్దాం! అన్నాడు శశికాంత్ రిసీవర్ ని పెద్ద చప్పుడతో క్రెడిల్ మీద వుంచేస్తూ . ఆ శబ్దానికి అవతలి వాడి కర్ణభేరి పగిలిపోయి వుండాలి.

 

    ఫోన్ పెట్టేశాక, బుల్లెట్ వదిలినట్లు ఒక అశ్లీల పదాన్ని ఉచ్చరించాడు శశికాంత్. తన ప్రక్కన ఒక స్త్రీ వుందన్న స్పృహ కూడా లేకుండా.

 

    "బ్లడీ బగర్!" నిన్న నన్ను కాదన్నాడు వీడు. వీడు మళ్ళీ పదిరోజుల పాటు నా కాళ్ళ చుట్టూ తిరిగితే గానీ వీడి మీద దయతలచేది లేదు. ఏం? మజాకా అనుకుంటున్నాడా ఈ అఖల్ కా దుష్మన్?

 

    సైలెంట్ గా వింటోంది ఉజ్వల.

 

    రూడ్ క్రూడ్ ఎస్. ఓ. బీ. ఈ శశికాంత్. అది పదే పదే ఋజువవుతోంది. కానీ ఈ రోజుల్లో లోకంలో నెగ్గుకు రావాలంటే ఆ క్యాలిటి తప్పదేమో!

 

     ఇతన్ని లొంగదీసుకుని కొంగుకి ముడేసుకోవడంలోనే తన తెలివి తేటలు బయటపడతాయి.

 

    ప్రస్తుతం రోరింగ్ లయన్ గా ఉన్నాడు ఇతను.

 

    గర్జిస్తున్న కొదమసింహం!

 

    ఇతన్ని పిల్లిపిల్లలా మార్చేసి, సాసర్ ముందు కూర్చుని తను పోసే పాలకోసం ఎదురు చూస్తూ మ్యావ్ మ్యావ్ అంటూ దీనంగా అరిచేలా చేస్తుంది.

 

    అలా చెయ్యలేకపోతే,

 

    తన పేరు ఉజ్వలే కాదు.

 

    "నీ కోసం ప్లయిట్ టికెట్ బుక్ చేస్తున్నాను" అన్నాడు శశికాంత్.

 

    "మరి నువ్వో?" అంది ఉజ్వల.

 

    కన్నుగీటి నవ్వాడు శశికాంత్.

 

    "నేనూ, నా మిసెస్ కలిసి నా కేరవాన్ లో వస్తాం."

 

    కేరవాన్ ఒకటి ఉంది శశికాంత్ దగ్గర. చిన్న గదిలా ఉంటుంది అది. అందులోనే ఒక చిన్న టేబిల్ సోఫా, ఒక బెడ్ , వాష్ బేసిన్ టాయిలెట్ -

   
    దానికింద చక్రాలు వుంటాయి. దాన్ని కారుకి వెనకాల తగిలించి , ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళి పోవచ్చు. ఎక్కడపడితే అక్కడ ఆపవచ్చు. అది వుంటే, పోర్టబుల్ హొటల్ రూంని కూడా తీసుకు వెళ్ళుతున్నట్లే.

 

    సౌమ్య కూడా తమతో బాటు వస్తోందని తెలియగానే ఉజ్వల మొహంలో కాంతి తగ్గింది.

 

    నవ్వుతూ అన్నాడు శశికాంత్ "కారవాన్ లో ఫస్ట్ నైట్! నావెల్టి కదూ?"

 

    అపనమ్మకంగా అతనివైపు చూసింది ఉజ్వల.

 

    రియల్ బీస్ట్ ఇతను! మొరటు మృగం!

 

    ఎంతసేపటికి తన సంగతి చూచుకోవడమే! తన మాటలు, చేతలు ఎదుటి వాళ్ళకి కష్టం కలిగిస్తాయోమోనని ఆలోచించడు అస్సలు!

 

    అప్పుడు లోపలికి వచ్చాడు కార్తిక్. అతని వైపు యధాలాపంగా , తరువాత ఇంట్రెస్టు తో చూసింది ఉజ్వల. అతి పల్చగా వున్న నల్లషర్టు వేసుకుని వున్నాడు కార్తిక్. పల్చటి షర్టులోంచి పచ్చగా కనబడుతోంది అతని వళ్ళు. విశాలంగా బలిష్టంగా ఉన్న భుజాలు, సన్నటి నడుము, కాంక్రీట్ అచ్చులా వుంది ఛాతి.

 

    లోపలికి వస్తూనే కుర్చీలో కూర్చుని కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు కార్తిక్.

 

    "నువ్వు నాకు థాంక్స్ చెప్పాలి కజిన్?" అన్నాడు చిరునవ్వుతో. "నిన్నరాత్రి మీ మిసెస్ ఒక చీకటి సందులో తేజస్వి అనే రిప్రేజేంటేటివ్ చేతుల్లో వాలిపోయి వళ్ళు తెలియని స్థితిలో ఉంటె నేను ఆటోలో వెళుతూ చూచి, లిప్ట్ ఇచ్చి ఇంటి దగ్గర దింపాను. పాపం. ఆమె మైకంలో ఉన్నారనుకుంటాను. ఆమె పమిటని తేజస్వి సరిచేస్తున్నాడు నేనే వెళ్ళే సమయానికి."

 

    ఇంకా ఏదేదో చెబుతున్నాడు కార్తిక్.

 

    అతని మాటలు వింటున్న శశికాంత్ పెదిమలు బిగుసుకుపోయాయి. మంచు ముక్కల్లా అయిపోయాయి. అతని కళ్ళు, ఉచ్చ్వాస నిశ్వాసాలు తీవ్రమయ్యాయి.

 Previous Page Next Page