Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 33


    
    ఓ దెబ్బకి జనకరాజ్ భూమ్మీద పడిపోయి బల్లిలా కరుచుకుని వుండిపోయాడు.
    
    ఇంకోదెబ్బకి జనకరాజ్ అనుచరుడు ఒకడు ఎగిరి చెట్టు అందుకుని అక్కడే సెటిలయిపోయాడు.
    
    ఈలోగా జెయ్ అనుచరులు వచ్చేశారు.
    
    ఇంక బాహాబాహీ, ముష్టాముష్టి యుద్ధం మొదలయింది.
    
    పావుగంటలో జనకరాజ్ బృందం అంతా మట్టికరిచింది.
    
    జెయ్ చిరుమందహాసం చేస్తూ, జేబులోనుంచి బ్యాండ్ ఎయిడ్ పట్టీలు తీశాడు. పట్టీలు వాళ్ళకి వరసగా పంచిపెట్టి తర్వాత చెట్ల వెనక్కి పరిగెత్తాడు జెయ్ చంద్ర.
    
    అక్కడ...ఓ పొద వెనక సగం బట్టలేసుకుని యిబ్బందిగా నిలబడి వుంది రచన.
    
    సరిగ్గా అదే క్షణంలో లైట్లు వచ్చాయి.
    
    రచన మొహంలో సిగ్గూ, లజ్జా రెండూ వంతులు వేసుకు కనబడుతున్నాయి.
    
    వెంటనే తన షర్టు విప్పి రచన మీదకి విసిరేశాడు జెయ్ చంద్ర.
    
    "అది తొడుక్కుని బయటికిరా!" అన్నాడు ఉదారంగా.
    
    ఇంకో నిమిషం తర్వాత షర్టు తొడుక్కుని పొద చాటునుంచి బయటికి వచ్చింది రచన.
    
    "నీ ఋణం ఎలా తీర్చుకోనూ?" అంది కృతజ్ఞతా భారంతో కుంగిపోతూ.
    
    "ఇట్లా థాంక్స్ చెప్పకపోవడం ద్వారా!" అన్నాడు జెయ్. అని -
    
    "అట్లా ఒరిగిపోకు! సరిగ్గా నిలబడు!" అన్నాడు కూడా.
    
    "టైం రానీ! నీ ఋణం లక్షరెట్లు నీకు ఉపకారం చేసి తీర్చుకుంటా!" అంది రచన.
    
    "ఇక చాల్లెద్దూ!" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "నీకు తెలీదు జెయ్! ఆడపిల్లలకు శీలమెంతముఖ్యమో! ప్రాణంతో సమానమన్న మాట. నా శీలాన్ని నువ్వు కాపాడావు. నేను నూరుఆరయినా, ఆరు నూరయినా నీ ఋణం తీర్చుకుని తీరుతా."
    
    "సర్లే చూద్దాం పద! నృత్యనాటకం కంప్లీట్ చేద్దాం."
    
    "ఇంక నృత్యం, నాటకం ఏం చేసినా యిక్కడే చెయ్యాలి. జనాలు అందరూ ఈపాటికి వెళ్ళిపోయి వుంటారు" అంది రచన అర్ధవంతంగా.
    
    "ఎక్కడికి?"
    
    "ఇంటికి!"
    
    "అయితే వద్దులే! వెళ్ళు."
    
    "నువ్వు నన్ను మా యింటిదగ్గర దిగబెట్టవూ?"
    
    "శేషుగాడ్ని తోడు పంపిస్తా!"    

    "వాడు నాకు తోడా? నేనే వాడికితోడు"
    
    "ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు తోడుపోయినవాళ్ళే."
    
    "అయితే ఏం వద్దులే" అంది రచన కోపంగా.
    
    "అబ్బ! నన్ను వదిలెయ్ రచనా! మళ్ళీ యిక్కడో ఫైటింగు వుండొచ్చు. నేను వుండిపోవాలి" అన్నాడు జెయ్.
    
    "ఫైటింగా? నేనూ ఫైటింగు చూస్తా! ఆ తర్వాతే వెళ్దాం!" అంది రచన వుత్సాహంగా.
    
    "నువ్వు మొండివి" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "నువ్వు జగమొండివి" అంది రచన.
    
    "ఎందుకు?" అన్నాడు అతను.
    
    "నా హృదయాన్ని అర్ధం చేసుకోకుండా....." అని అంటుండగానే శేషు అక్కడికి వచ్చాడు.
    
    వెంటనే మెటికలు విరిచింది రచన.
    
    శేషుకివన్నీ అలవాటే.
    
    అతను ఏం బాధపడకుండా "పద! పోదాం!" అన్నాడు రచనతో.
    
    "మహాబయల్దేరాడోయ్ మగాడు! నీలాంటివాళ్ళని పదిమందికి నేనే బాడీగార్డుగా వుండగలను" అంది రచన కోపంగా.
    
    అంటూనే వెళ్ళి, తన కెనెటిక్ హోండా ఎక్కి బుర్రుమని స్టార్ట్ చేసి, తుర్రుమని వెళ్ళిపోయింది.
    
    ఇదంతా చూస్తున్న శేషు ఆశ్చర్యపడి "ప్రేమ అనగానేమి?" అని తనని తాను ప్రశ్నించుకున్నాడు.
    
    మళ్ళీ తన ప్రశ్నకు తనే సమాధానంగా "ప్రేమ అనగా అదొక దోమకాటు వంటిది. ఎప్పుడు ఎవరిని ఈ ప్రేమ దోమకట్టునో తెలియదు. ఈ విషయముపై మరింత తీవ్రముగా పరిశోధన జరగవలసి వున్నది" అనుకున్నాడు కూడా.
    
    అది సరే......
    
    ఆ రోజు అలా గడిచిపోయిందా?
    
    మర్నాడు.....మిట్టమధ్యాహ్నంవేళ.....బ్యాటనీక్లాసు దగ్గర మొదలెట్టి మిగతా క్లాసులన్నీ చెక్కేసి సంజీవయ్య పార్కుకి వెళ్ళిపోయాడు జెయ్ చంద్ర.    
    
    సంజీవయ్య పార్కు గురించి యిక్కడ మీక్కొంచెం చెప్పాలి.
    
    (హైదరాబాద్ వాస్తవ్యులకి ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకోండి. కానీ హైదరాబాద్ లో కూడా సంజీవయ్యపార్కు మహత్యం గురించి తెలీనివాళ్ళు కొంతమంది వుండివుండవచ్చు కదా! అందుకని ఎవరు ఈ సమాచారం చదివినా జనరల్ నాలెడ్జి పెరుగుతుందేగానీ తరగదు)
    
    పాపం సంజీవయ్యగారు!
    
    దామోదరం సంజీవయ్యగారు ఆంధ్రప్రదేశ్ కి ఒకప్పటి ముఖ్యమంత్రి. ఆయన మేథావి. బాగా చదువుకున్నవాడు. (యూనివర్శిటీ డిగ్రీల లెక్కలో కాదు) సరస సంభాషణా చతురుడు, మృదుస్వభావి, స్నేహశీలి.
    
    ఆయన పుట్టడమే కర్నూలు దగ్గర పెదపాడు అనే పల్లెలో నిరుపేద కుటుంబంలో  పుట్టాడు. హరిజనుడు కావడంవల్ల అప్పట్లో ఆయన పంక్తి బాహ్యుడు. ఆ తర్వాత ఆయన చీఫ్ మినిస్టరయ్యాడు. చీఫ్ మినిస్టరు కాగానే ఆయన సరసన కూర్చుని భోజనం చేసే అదృష్టం కోసం ఒకప్పుడు ఆయన్ని పంక్తిబాహ్యున్ని చేసిన పెద్దలంతా వంతుకి గంతేశారు.
    
    పదవినుంచి దిగిపోగానే మర్నాటి నుంచే ఆయన సాధారణ పౌరుడిలాగా టాంకుబండు మీదనడిచి వెళ్తూ వుండడం చూసినవాళ్ళు అనేకమంది వున్నారు.
    
    (ఏంటిసార్! ఏడు తరాలకి సరిపడా ఆస్తులు అవీ అంటారా? అచ్చెచ్చు! ఈ విద్దెలన్నీ వీళ్ళకి వంటబట్టింది ఈ మధ్యనే కదాసార్! సంజీవయ్యగారు పాత ఫ్యాషను మనిషి ఇలాంటివి తెలీదు)
    
    ఆయన చనిపోయిన తర్వాత ఓ పార్కుకి సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు.    

    ఆయన జ్ఞాపకార్ధం!

 Previous Page Next Page