దానికి సదరు ఇంతి తేలు కుట్టింది నాక్కాదు సార్ మా అత్తకి అందట."
ఆ జోక్ కి పెద్దగా నవ్వింది లిపి. అలా నవ్వుతున్న ఆమె వైపు కన్నార్పకుండా చూశాడు రమణ.
"ఇంకోటి చెప్పానా?"
"చెప్పు" అంది లిపి తాత్కాలికంగా తన సమస్యని మర్చిపోతూ.
"ఒకసారి రేడియోలో ప్రశ్న జవాబులు కార్యక్రమానికి పక ఉత్తరం వచ్చిందట. ఆ ఉత్తరంలో అయ్యా నా పేరు ఫలానా నేను సంవత్సరం క్రితం ఫ్యామిలీ ఫ్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను. కానీ ఈ ఏడాది నా భార్య గర్భవతి అయింది. ఇదెలా జరిగిందో నాకేం తెలీడం లేదు. దయచేసి సందేహాన్ని తీర్చాల్సిందిగా కోరుతున్నాను అని ఆ ఉత్తరంలో వుందట.
దానికి జవాబు ఏంటంటే-
బాబూ నీ అజాగ్రత్తే నీ కొంప ముంచింది నాయనా- ఫ్యామిలీ ఫ్లానింగ్ ఆపరేషన్ నువ్వొక్కడివే చేయించుకోవడం తప్పు బాబూ! నీ ఇంటి చుట్టుపక్కల మగవాళ్ళకు కూడా చేయిస్తే నీకీ ప్రాబ్లమ్ ఉండకపోను. అందుచేత నువ్వు ఈసారి ఆ పని చెయ్యి అని సమాధానం చెప్పేసరికి సదరు వ్యక్తి గొల్లుమన్నాడట-
చూశారా పక్కింటి ఆవిడ ఎలా గొప్పలు చెప్పుకుంటుందో ఆవిడ పక్కన లేకపోతే వాళ్ళాయన అసలు నిద్రపోడట తెలుసా అన్నదట భార్య.
అదృష్టమంటే అలా వుండాలి. నాకు నువ్వు పక్కనుంటే అసలు నిద్రపట్టదు గదా అని వాపోయాడు భర్త."
ఆ జోక్ కి తుళ్లుతూ నవ్వింది లిపి.
"నీ నవ్వు బాగుటుంది లిపి. అలా నవ్వుతుంటే అలా అలా చూడాలని నా కోరిక" సడన్ గా అన్నాడు రమణ.
`
` "ఏం ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావా?" తనూ జోక్ వేసింది లిపి.
"ఇదీ అసలైన జోక్ అం,టే" కిక్రి క్కిక్కి....మని రాజేంద్రప్రసాద్ అదేదో సినిమాలో నవ్వినట్టుగా నవ్వాడు రమణ.
ఒకింత యిబ్బంది ఫీలయింది లిపి అతని నవ్వు చూసి.
"ఇంకో జోకు. ఒక అమ్మాయి అదేపనిగా ఏడుస్తోందట. ఇంటి కొచ్చేసరికి కూతురు ఏడవడం చూసిన తండ్రి చిరాకుపడి భార్యతో అమ్మాయి పరీక్ష తప్పినంత మాత్రాన అంతలా ఏడ్వాలంటే వెర్రిముఖమా అని అన్నాడంట ఆ తండ్రి.
పరీక్ష ఒక్కటే తప్పలేదట, నెల కూడా తప్పిందటండి అని ఆవిడ చెప్పింది అదీకథ."
నవ్వి నవ్వి అలిసిపోయింది లిపి.
ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు అడిగింది లిపి.
"రమణా! నాకో చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. అందుకే వచ్చాను."
ఆశ్చర్యంగా చూశాడు రమణ లిపి వైపు.
"హెల్పా? నేనా? నీకా? ఎందుకు చేయనూ.... చేస్తాను గానీ... హెల్ప్ చేస్తే నాకేంటిస్తావు?" ఏదో రకంగా కమిట చేయించడానికి అడిగాడు రమణ .
"చెప్పు ముందు చేయి తర్వాత నువ్వు ఏది అడిగితే అది యిస్తాను అసంకల్పితంగానే అంది లిపి.
"కాదనకుండా యిస్తావా? ప్రామిస్" చెయ్యి ముందుకు చాస్తూ అడిగాడు రమణ.
"నిజంగా ప్రామిస్" మరో ఆలోచన లేకుండా అతనిచేతిలో చేయి వేసింది లిపి.
లిపి అరచేతి మెత్తదనం రమణకు హాయిగా, వెచ్చగా వుంది.
"అయితే చెప్పు" అన్నాడు రమణ వుషారుగా.
జరిగింది చెప్పి తనకు అర్జంటుగా వుద్యోగం కావాలని చెప్పింది లిపి.
"ఇంతేనా? నువ్వు ఎవర్నో ప్రేమిస్తున్నావేమోనని ఆ ప్రేమ సందేశాన్ని నన్ను తీసికెళ్ళి ఇమ్మంటావేమోనని భయపడ్డాను. రెండు రోజుల్లో నీకు జాబ్ ఖాయం."
"నిజమా?"
"నా మీద నమ్మకం లేదా. చూడూ సరిగ్గా ఎల్లుండి సాయంత్రం సరిగ్గా అయిదు గంటలకు ఇక్కడే కలుస్తున్నాం. నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఆ తర్వాత మనిద్దరం సిన్మాకెళ్దాం. అక్కడ నుంచి...."
అక్కడ నుంచి యింటికెళ్తాం" తను లేస్తూ చెప్పింది లిపి.
మరో అయిదు నిమిషాల తర్వాత మౌంట్ రోడ్ లో వున్నారు వారిద్దరూ రమణ స్కూటరు వెనక కూర్చుంది లిపి.
"జాగ్రత్త! భయమేస్తే నా షర్ట్ ని పట్టుకో."
అలాగే పట్టుకుంది లిపి.
"జాగ్రత్త! భయమేస్తే నా షర్ట్ ని పట్టుకో."
అలాగే పట్టుకుంది లిపి.
దానికే మనసులో ఎంతో ఆనందపడిపోయాడు రమణ.
తన చేతిమీద చెయ్యి వేసి లిపి చేసిన ప్రామిస్ గుర్తుకొచ్చి పులకించి పోతున్నాడతను.
వెల్లివాకంకి వెళ్ళే దారిలో రోడ్డు పక్కనుంచి తలవంచుకోని వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది.
తనకు ఆ వ్యక్తి ఎన్నిసార్లు కనిపించాడో గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించింది.
ఆ వ్యక్తి అభినవ్!
* * *
సృజ యాడ్ ఏజెన్సీ హెడ్డాఫీసు- థౌజెండ్ లైట్స్ ఏరియాలో పోష్ బిల్డింగ్ లో వుందది.
మెట్లెక్కి లోనకి వస్తున్న అభినవ్ ని చూసి తన ఛాంబర్లో వున్న కావ్య ఆశ్చర్యంగా లేచి డోరు తీసుకుని బయటకు వచ్చింది.
"ఇవాళ మద్రాసుకి భూకంపం ఖాయం" నవ్వుతూ అంది కావ్య.
"ఏం?" అడిగాడు అర్థంగాక అభినవ్.
"ఏం లేదు. మీరేమిటి? ఇక్కడికి రావడం ఏమిటి బాసూ..... దారితప్పి వచ్చారా?"
"లేదు. మీరు ఇక్కడకు ట్రాన్స్ ఫరై వచ్చారని నాకు తెలుసు. మీరు అసలు నాకు కనిపించడం లేదుగా అందుకని......"
"ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశారన్నమాట. రండి" తన ఛాంబర్లోకి తీసికెళ్ళింది అభినవ్ ని....."
కూల్ డ్రింక్ తెమ్మని ఇంటర్ కమ్ లో ప్యూన్ కి చెప్పి-