Previous Page Next Page 
సంకల్పం పేజి 33

   

   జయ్ హిందీ సైకీ లిమిటెడ్ కి వెళ్ళాడు.
   
    ఉదయం నుంచీ సాయంత్రం వరకూ అక్కడే గడిచిపోయింది.
   
    మర్నాడు ఎమ్.ఆర్.ఎఫ్. కంపెనీకి.....
   
    "ఏదైనా కొత్తది ప్రారంభించేముందు  కన్ ఫ్యూజవడం మానవ సహజం. నీదా చిన్న ప్రయత్నం.... ఏ వ్యాపారమైనా బిందువులాగే ప్రారంభమౌతుంది. రిస్క్ తప్పదు...." ఆరోజు నైట్ డిన్నర్ టైమ్ లో చెప్పాడు నాయర్.
   
    "నీ కస్టమర్స్ కి నీ ప్రొడక్ట్ ద్వారా నీవేం అదించాలనుకుంటున్నావో- ముందుగా ఒక కస్టమర్ లా నీవే రిహార్సల్స్ వేసుకొని సంతృప్తి చెందాక, అందుకు సంబంధించి భవిష్యత్ లో ఏం చేయాలనుకుంటున్నావో నిర్ధారించుకున్నాకే కస్టమర్స్ ముందుకు వెళ్ళు- విజయం సాధిస్తావు..." అంటూ నిండు మనసుతో ఆశీర్వదించాడు నాయర్.
   
    కొండంత తృప్తితో తిరిగొచ్చాడు వికాస్.
   
    ఒకేసారి వందకార్లను మార్కెట్లోకి విడుదల చెయ్యడానికి అవసరమైన మనోధైర్యం వచ్చింది వికాస్ కు.
   
    కానీ-
   
    ఫైనాన్స్... ఫైనాన్స్... ఎలా...
   
    కనీసం ప్రస్తుతానికి పదిహేను లక్షలైనా సమకూర్చగలడా తను?
   
    ఇవ్వాళ ఇంధనం బంగారం కంటే విలువైనది.
   
    ఇవ్వాళ ఇంధనం మనిషి ప్రాణం కన్నా విలువైనది.
       
    ఇవ్వాళ ఇంధనం మొత్తం మానవ ప్రపంచాన్నే శాసిస్తున్న అద్భుత శక్తి.
   
    ఒక్కరోజు-
   
    ప్రపంచంలోని వాహనాల కన్నిటికీ ఇంధన కొరత వస్తే-
   
    విశ్వవ్యాప్తంగా 'చలనం' స్తంభించిపోతుంది.
   
    ఆ ఒక్కక్షణం ఎన్ని ఘోరాలు జరుగుతాయో, ఎన్ని క్రూరనేరాలు జరుగుతాయో ఊహించలేం!
   
    అయితే-
   
    మనిషి ఇంధనం మీద ఆధారపడని రోజు ఒకటి వస్తుందా?
   
    అదో కల- అదో భ్రాంతి- ప్రస్తుతానికి.
   
    కానీ మనిషి సాధించలేనిది ఏమీలేదు ఈ విశ్వంలో.
   
    ఆయిల్ పెత్తనం చెలాయిస్తున్న ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ నుంచి మార్పు ఇప్పుడు ఆరంభం కావాల్సి ఉంది.
   
    ఆయిల్ కు ప్రత్యామ్నాయం రావడానికి ఇంకా పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు.
   
    ఆయిల్ ఇసుకలు, హెవీ ఆయిల్, ఆయిల్ షేక్ వంటి ఇతర శిలాజ ఇంధనాల నిక్షేపాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. కానీ 2000 సంవత్సరం నాటికి ఇవి కొద్దిపాటి పరిణామాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. జలవిద్యుచ్చక్తి కాక విరంతరం తిరిగి, తిరిగి వినియోగించుకునే అవకాశం గల శక్తి వనరులు సోలార్ శక్తి, గాలి శక్తి, సముద్రపు అలల శక్తి, భూమిలోని ఉష్ణతశక్తి (జియో ధర్మల్) వంటివి ఉన్నాయి.
       
    ఇవాళ ప్రపంచ శాస్త్రజ్ఞులు ముందున్న ఏకైన సమస్య రవాణా వాహనాలకు ఇంధనానికి బదులు, ప్రత్యామ్నాయం కనుక్కోవడం.....
   
                                       *    *    *    *    *   
   
    గదిలో ఏ.సీ. చల్లగా ఉంది. తదేక దీక్షతో ఫైల్ చూసుకుంటున్న భానోజీరావు, తలుపు చప్పుడికి తలెత్తి మళ్ళీ తలదించుకున్నాడు.
   
    గదిలో కొచ్చిన లిఖిత కుర్చీలో కూర్చుంది.
   
    పావుగంటసేపు భానోజీరావు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత నెమ్మదిగా 'వైజాగ్ నువ్వెందుకెళ్ళావో.... ఆ పని మరిచిపోయినట్టున్నావ్...."
   
    తండ్రి తనతో ఎప్పుడూ సీరియస్ గా మాట్లాడలేదు.
   
    ఆ విషయం తెలుసు లిఖితకు.
   
    అంటే మధుకుమార్ తననక్కడ చూసిన విషయం చెప్పుంటాడు.
   
    వెంటనే అర్ధమైంది లిఖితకు.
   
    లిఖిత సమాధానం ఇవ్వలేదు.
   
    "మనాఫీసులోంచి వెళ్ళిపోయిన ఆ కుర్రాడితో తిరుగుతున్నావట.... నిజమేనా..."
   
    మళ్ళీ మరొక బాంబు...
   
    అంటే మధుకుమార్ అన్ని వివరాలు సేకరించాడన్న మాట.
   
    మాట్లాడలేదు లిఖిత.
   
    "మౌనానికి అర్ధం తెలుసా... నిజాన్ని ఒప్పుకోవడం.... అతి వాల్యుబుల్ టైమ్ నాది. వేస్ట్ చెయ్యకు."
   
    "ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ మీద ఇంకో ఇంటలిజెన్స్ డిపార్టు మెంట్ ని వేశారా?" తలెత్తి అంది లిఖిత.
   
    ఆ సమయంలో భానోజీరావు తలెత్తాడు.
   
    "మాటకు మాట సమాధానం కాదు. ప్రశ్నకి జవాబు కావాలి...." ఆయన గొంతు కరుగ్గా ధ్వనించింది.
   
    "వికాస్ ని కలిశాను" నెమ్మదిగా అంది లిఖిత.
   
    ఆ జవాబు కావాలి భానోజీరావుకు.
   
    "కలిసి ఓదార్చాల్సిన అవసరం నీకు లేదనుకుంటాను...."
   
    ఆ మాటకు కోపం వచ్చింది ఆమెకు. సీరియస్ గా అంది-
   
    "ఓదార్చడానికి వెళ్ళలేదు"
   
    "మరి..." తలెత్తి చూసిన భానోజీరావు కళ్ళల్లో ఏదో కనబడని వ్యంగ్యం.
   
    ఆయనకు కోపమొస్తే వేసే జోకులు చాలా క్రూరంగా ఉంటాయి.
   
    వ్యక్తిత్వమున్నవారికి ఆ మాటలు శూలాల్లా పొడుస్తాయి.
   
    "అన్ని రకాలుగా ఆలోచించే దానివనుకున్నాను. జింఖానాలోంచి తగిలేసిన వాడ్ని నువ్వు కలిశావు... లంచ్ తీసుకునే వరకూ వచ్చింది వ్యవహారం... మనకో ప్రిస్టేజుందని మర్చిపోవడం క్షేమదాయకం కాదు" చెప్పడం ఆపాడు భానోజీరావు.
   
    అంతలో ఫోన్ మోగింది.
   
    "ఎస్..." ఫోనెత్తాడు భానోజీరావు.
   
    "ఏం మధూ"
   
    ఆ మాట వినగానే వళ్ళు మండిపోయింది ఆమెకు.   
   
    మధుని చాలారోజుల్నుంచి 'అబ్జర్వ్' చేస్తోంది లిఖిత.   
   
    అతను ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనుమానం...
   
    ఎందుకా ప్లాన్? ఏమిటా ప్లాన్?
   
    బావంటే వున్నా గౌరవం ఒక్కో మెట్టూ తగ్గుతూ వస్తోంది.

    మధు ఒక సీరియస్ పధకంతో ఉన్నాడన్న విషయం తెలీదు లిఖితకు.
   
    అది వూహించలేదు కూడా!
   
    తాత్కాలిక ప్రయోజనాల్నే వూహిస్తోంది ఆమె.
   
    ఆ సమయంలో అక్కడ లిఖిత ఉందని తెలిసే ఫోన్ చేశాడు మధు.
   
    అతను కేరమ్స్ ఆటను ఇష్టపడతాడు.
   
    'కూల్' గా అవతలి వాడిని పక్కకు నెట్టెయ్యడం అతడికున్న సరదాల్లో ఒకటి.
   
    అందుకే కేరమ్స్ ని ఇష్టపడతాడతను.
   
    ఫోన్ పెట్టేశాడు భానోజీరావ్.
   
    "ఆ వైజాగ్ కుర్రాడు.... శివానీ మోటార్స్ కంపెనీని తీసుకున్నాట్ట నిజమేనా?"
   
    అప్పుడే తన తండ్రికి ఆ వార్తెలా తెలిసింది?
   
    అందుకే భానోజీరావు గ్రేట్ బిజినెస్ మాన్ అయ్యాడు.
   
    తండ్రిని మనసులోనే మెచ్చుకుంది.
       
    సమాధానం చెప్పలేదు.
   
    "నిన్నే- వీటన్నిటి వెనకా నీ ప్రోత్సాహం ఉందా?" ఆ ప్రశ్నకూ జవాబు లేదు.
   
    "ఎంకరేజ్ చెయ్యడంలో తప్పేం లేదు. ఎవర్ని ఎవరైనా ఎంకరేజ్ చెయ్యొచ్చు.... కానీ భానోజీరావ్ కూతురిగా నువ్వు అతన్ని ఎంకరేజ్ చెయ్యటం నాకిష్టంలేదు."
   
    మళ్ళీ ఇంకో ఫోన్.
   
    "కాస్సేపాగి చెయ్యమను" పి.ఏ.తో చెప్పి-
   
    "చూడు బేబీ... ఒక ఎంప్లాయిని కొడుకులా చూస్తాను. ఒక లిఖితను కూతురులాగే చూస్తాను. కానీ చిన్నవాడైనా, పెద్దవాడయినా శత్రువుని నిద్రలోనైనా శత్రువులానే చూస్తాను.... అర్ధమైందా..."
   
    "తెల్సిన వ్యక్తిని విష్ చేయడం తప్పా" నెమ్మదిగా అన్నది లిఖిత.
   
    "ఎక్కడ తెల్సు.... ఎలా తెల్సు.... చెప్తావా..."
   
    ఆ మాట అని తన పొరబాటు చేసిందన్న విషయం తండ్రన్న మాటతో అర్ధమైంది లిఖితకు.       
   
    "నాతో ఛాలెంజ్ చేసినపుడు, పట్టుదలకు పోయాడని పట్టించుకోలేదు.....రోడ్డుమీద ఉమ్తాడనుకున్నాను.... నువ్వేదో తెలివైన వాడన్నావాని... మళ్ళీ కంపెనీలోకి తీసుకుందామనుకున్నాను.... రాలేదు... అంటే.... నాతో నిజంగా సీరియాస్ గా ఛాలెంజ్ చేస్తున్నట్టే కదా.... అంచేత.... అతనితో నువ్వు.... తిరగటం నాకిష్టం లేదు... ఆఫీసు పనిమీద వైజాగెళ్తున్నావనుకున్నాను... జరుగుతున్నదిదని నాకు తెలీదు....

 Previous Page Next Page