Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 34


    ఇప్పుడా గదిలో ముగ్గురే వున్నారు.

    త్రినాధ్... ప్రియాంక... బోస్...

    అంతటా నిశ్శబ్దం పరుచుకుంది.

    ముగ్గురిలోనూ అనంతమైన ఆలోచనలు...

    ఉరకలు వేసే భావోద్వేగం....

    అయినా ఎవరూ నోరు విప్పటం లేదు.

    బోస్ ఆకలి తీరని చిరుతపులిలా గుర్రుగా చూస్తున్నాడు. త్రినాధ్ అవకాశం ఇస్తే అతని తదుపరి విధ్వంసక కార్యక్రమానికి కర్త ఇంజనీరే.

    "మైడియర్ బోస్- నాకన్నీ తెలుసు. నీ చేతిలో ఇంజనీర్ మసి కావటానికి నీకు నిముషం చాలనీ తెలుసు. కాని- ఇంజనీర్ మనవాడు.... శత్రువుల్ని సయితం క్షమించే స్థితికి చేరుకోవల్సిన మనం, చెడు దారి పట్టిన హితుణ్ణి శత్రువును చేసి హతమార్చటం వీరుల లక్షణం కాదు. ధీరుల పద్ధతి కాదు. ఒకప్పుడు మనల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న మన శత్రువైన ప్రియాంక ఇప్పుడు మనకు హితురాలు- కాలం కాఠిన్యాన్ని కరిగించి వేస్తుంది. కాని జరిగిన వినాశనాన్ని కాలం సరిచేయలేదు. నామీద నీకే మాత్రం గౌరవం వున్నా నువ్వు ఇంజనీర్ జోలికి వెళ్ళరాదు. అంతేకాదు, నా రాత్రి జీవితం బయటకు పొక్కరాదు. నిన్న జరిగిన సంఘటన మనలోనే సమాధి కావాలి. యూ-టూ- ప్రియాంక" సీలింగ్ కేసి చూస్తూ నెమ్మదిగా అన్నాడు త్రినాధ్.

    బోస్ తనలో ప్రజ్వరిల్లుతున్న ఆవేశాన్ని అలవంతంగా అణుచుకుంటుంటే, ప్రియాంక దిగ్భ్రమగా త్రినాధ్ కేసి చూసింది.

    కొద్ది క్షణాలుండి బోస్ లేచాడు. బ్రద్దలవ్వబోయే అగ్నిపర్వతంపై హిమవర్షం- కురిస్తే ఎలా వుంటుందో అలా వున్నాడు బోస్ అప్పుడు.

    "వెళ్ళి కొత్త మెషిన్స్ ఎరక్ట్ చేసే విషయం ఎంతవరకొచ్చిందో చూడు. ఆ తరువాత హాస్పిటల్ కన్ స్ట్రక్షన్ వైపు ఓసారి వెళ్ళు- కూల్ డౌన్... మై డియర్... బోస్... కూల్ డౌన్."

    బోస్ బయటకెళ్ళిపోయాడు.

    పదినిమిషాల వరకు ఆ ఛాంబర్ నిశ్శబ్దంగా వుంది. ఎయిర్ కండిషనర్స్ శబ్దాన్ని కూడా భరించలేనట్లున్నారిద్దరూ. ఎన్నో చెప్పాలని, ఏవో వూసులాడాలని ప్రియాంక మనస్సు ఆరాటపడుతోంది. కాని అంతలోనే గుండె గొంతుకలో కొట్టాడుతున్న భావన.

    ఎంతో ఎదిగిపోయి కనిపిస్తున్న త్రినాధ్ ముందు- త్రినాధ్ వ్యక్తిత్వము ముందు తాను అల్పురాలినేమోనన్న న్యూనతాభావన....

    మౌనంగా త్రినాధ్ కేసే చూస్తోంది.

    ఎందుకో మరొక్కసారి త్రినాధ్ ని పరీక్షించాలనుకుంది. నిన్ను ఓడించి నేను గెలవాలనుకున్నాను. కానిప్పుడు ఓడిపోయాను. ఓడినా గెలిచాను. శత్రువులోని ఔన్నత్యాన్ని చూశాక, ఓడినా, అది ఓటమి కాదు..." ప్రియాంక కొద్ది క్షణాలు ఆగిపోయింది.

    త్రినాధ్ అరమోడ్పు కన్నులతో సీలింగ్ కేసి చూస్తున్నాడు.

    "మీ నాన్నను మోసం చేసి మా నాన్న దోచుకున్న ఆస్థితో ఇంతకాలం మేం సుఖాలనుభవిస్తే నువ్వు, మీ అమ్మగారూ..."

    ప్రియాంక మాటలు పూర్తికాలేదు.

    కఠినమైన ఆ అనుభవాలను కొనలేం కదా?"

    త్రినాధ్ మాటలు అర్ధం కాలేదు ప్రియాంకకు.

    "మీ ఆస్థి మీకు తిరిగి ఇచ్చేయాలని నేనూ, మా అమ్మ నిర్ణయించుకున్నాం..."

    త్రినాధ్ ఒక్కసారి నవ్వుతూ ప్రియాంక వైపు తిరిగాడు.

    "డబ్బుతో ప్రపంచంలో దేన్నైనా కొనవచ్చేమో కాని, నిజజీవితంలో నిగ్గు తేల్చగల నిజాల అనుభవాల్ని కొనలేం. నాలుగు సంవత్సరాల క్రితం నువ్వీ విషయం చెప్పి వుంటే వెంటనే అంగీకరించేవాణ్ణేమో. ఇప్పుడు నాకు కష్టార్జితంలోని ఆనందం తెలిసింది... నిజాలు తెలిసి, మారి, మనిషివనిపించుకునే స్థాయికి ఎదిగినందుకు నా అభినందనలు..."

    ప్రియాంక ఆశించిందే జరిగింది.

    "ఎందుకు నన్ను వెంటాడావు?" త్రినాధ్ చిరునవ్వుతో మెల్లగా అడిగాడు.

    ప్రియాంక క్షణకాలం బిత్తరపోయింది.

    "ఇంటి తాళం పగులగొట్టి వున్నప్పుడు లోపలి వస్తువులు పోతే అది దొంగతనం అవుతుంది. ఎక్కడివక్కడ వుంటే నిఘా అవుతుంది."

    అప్పుడిక ఎలా తెలుసుకోగలిగావని త్రినాధ్ ని అడగడం అవివేకమే...

    "నేను ఓడిపోయానని చెప్పాను... గుర్తుందా?" ప్రియాంక ఉక్రోషాన్ని బలవంతాన దాచుకుంటూ అంది.

    త్రినాధ్ వాచీవైపు ఓసారి చూసుకున్నాడు. "నువ్వంగీకరించినా, అప్పుడు దక్కే విజయంలో నాకు తృప్తి లేదు. నీ ఓటమిని నీవు అంగీకరించినా- నా విజయాన్ని నేను అంగీకరించడం లేదు. అప్పుడు నీ ఓటమి ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుంది..."

    "అంటే-? విజయాన్ని దక్కించుకోవా? నన్ను దక్కించుకోవా?" అన్న భావన ప్రియాంక మాటలలో తొంగిచూసింది.

    "మరొక్క నెల వుంది గడువు..." త్రినాధ్ పొడిగా అన్నాడు.

    "మా నాన్న ఆస్థి ఇప్పుడు పాతిక కోట్లు... అంటే నీ ఆస్థి యాభైకోట్లుండాలి. గుర్తుందా?" పోట్లాడుతున్నట్లుగా వుంది ప్రియాంక ధోరణి.

    త్రినాధ్ తమాషాగా భుజాలు కదిలించాడు.

    "ఇప్పుడు నీ ఆస్థి ఎంత?" మొండిగా ప్రశ్నించింది ప్రియాంక.

    "సుమారు పది పదిహేనుంటుంది..."

    "మరెలా? ఎలా గెలుస్తావు?" ఆమెలోని ఉక్రోషం కళ్ళలో కసిగా మారింది.

    "గెలుస్తాను" స్థిరంగా అన్నాడు త్రినాధ్.

    ఆమెకో క్షణం పిచ్చెత్తినట్టుగా అనిపించింది.

    "ఒక్క నెలలో అంత ఎలా సంపాదించగలవు...?" ఆమె ఉన్మాదిగా మారిపోయింది.

    "నా పోరాట విధానం నాకు ట్రేడ్ సీక్రెట్ లాంటిది."

    ఆమె సివంగిలా లేచింది.

    తనేం చేస్తున్నదో తనకే తెలీని ఉన్మాదస్థితిలో ఒక్క అంగలో త్రినాధ్ ని చేరి తన సుకుమారమైన చేతులతో త్రినాధ్ గుండెలపై పిచ్చిగా కొట్టడం మొదలు పెట్టింది. త్రినాధ్ అంగుళమైనా కదలలేదు. ఆమెను నిరోధించలేదు. ఆమె హిస్టీరిక్ గా మారిపోయింది.

    "నన్ను గెలుచుకోవా? నన్ను దక్కించుకోవా? యాక్సెప్ట్ మై డిఫీట్- నీకు పౌరుషం లేదా? గెలిచే ప్రయత్నం చేయవా?" ఆమె అరుస్తోంది, రక్కుతోంది, అల్లరి చేస్తోంది.

    కొద్ది క్షణాలు గడిచిపోయాయి.

    ఆమె అలసిపోయింది.

    ఆమె సౌకుమార్యం, మొరటుతనపు జత కోసం ఆరాటపడుతోంది.

    అప్పుడు త్రినాధ్ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సున్నితంగా.

    "నాకు నీ ఉద్రోషం అంటే ఇష్టం... నీ చిలిపితనం ఇష్టం."

    త్రినాధ్ మాటలకు ఆమె చటుక్కున తలెత్తి చూసింది.

    అతని కళ్ళు నవ్వుతూ వున్నాయి.

    "నా ఓటమిని అంగీకరించవా?" ఆమె తిరిగి బేలగా అడిగింది.

    ఆమెను మరికాస్త దగ్గరకు తీసుకున్నాడు. "నా రాతి హృదయానికి కొన్ని కఠినమైన నిబంధనలున్నాయి. నువ్వు నువ్వుగా నిలబడాలి."

    ఆమెకు అప్పటికి కాని అతని మనో ప్రపంచపు అగాధపు లోతు అంతుబట్టలేదు.

    మరికొద్ది క్షణాలకు ఆవేశం ఆమెలోంచి క్రమంగా దూరమైపోయింది.


                                           *    *    *    *


    ప్రియాంక ఇంటికి వచ్చేసరికి వాతావరణం సీరియస్ గా వున్నట్లనిపించింది.

    ఇంటిముందు జనరేటర్ అరేంజ్ చేసుంది.

    అది రొదపెడుతూ పనిచేస్తుంది.

    కారు పార్క్ చేసి మెయిన్ హాల్లోకి వచ్చేసరికి తండ్రి కంపెనీ స్టాఫ్ తో సీరియస్ గా మాట్లాడుతూ కనిపించాడు. అక్కడ ఆగాలా వద్దా అని మీమాంసలో వుండగానే కంపెనీ సెక్రటరీ ఆమె దగ్గరకు వచ్చాడు.

    "వారం రోజుల నుంచి ఫైల్స్ మూలబడ్డాయి మేడమ్" అన్నాడు వినయంగా.

    ఆమె తలూపుతూ తండ్రివైపు చూసింది.

    "మీరంతా బయట హాల్లో వుండండి కొద్దిసేపు..." అన్నాడు సుదర్శన్ రావు కంపెనీ స్టాఫ్ ని వుద్దేశించి.

    వాళ్ళు వెళ్ళిపోయారు.

    ఇప్పుడా హాల్లో ముగ్గురే వున్నారు.

    సుదర్శన్ రావు, ప్రియాంక, యోగేష్.

    "ఎక్కడినుంచొస్తున్నావ్ చెల్లెమ్మా?" అన్న నోటినుంచి చిత్రమైన సంబోధన.

    ప్రియాంక ఏదో ముంచుకు రాబోతున్నదని పసిగట్టి మౌనంగా వుండిపోయింది.

    "అయిదు పైసల ఆస్థి, అవసరమైన చదువు లేనివాడి దగ్గర్నుంచేనా?" యోగేష్ తిరిగి ప్రశ్నించాడు.

    ప్రియాంక తండ్రివేపు చూసింది- అన్న అలా తనను నిలదీయడానికి తండ్రికి అంగీకారమేనా అని, ఆయన మౌనంగా వున్నాడు. ఆయన చూపులు ప్రశ్నిస్తున్నట్టున్నాయి. అంటే తనలోని మార్పును తండ్రి పసిగట్టాడన్నమాట!

    ఇక నమ్మించటం వృధా అనిపించిందామెకు.

    "పాతిక కోట్ల ఆస్తులకు నువ్వు చైర్ పర్సన్ వి అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావ్. నేను చైర్మెన్ ని కాలేక కాదు నిన్ను చేసింది. వారం రోజులుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ అన్నీ పెండింగ్ లో పడిపోయాయి మీ మూలంగా. రైట్ టైమ్ లో రైట్ డెసిషన్స్ తీసుకోకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసు నీకు. అయినా..." పళ్ళు పటపటా కొరుకుతూ గుప్పిళ్ళతో సోఫాను బాదాడు తన కోపాన్నంతా వెళ్ళగ్రక్కుతూ యోగేష్. 

    ప్రియాంక ఇంకా మొనంగానే వుంది.

    "అయినా ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపక పదవి అప్పచెప్పారు డాడీ అనవసరంగా. ఇవ్వాళే నువ్వు ఆ పదవి నుంచి తప్పుకోవాలి. వెంటనే రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చేయ్. రేపే దాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీకి పంపాలి" అన్నాడు యోగేష్ నిర్మొహమాటంగా.

    తండ్రి ఒక్కమాట కూడా తన తరపున అనకపోవడం బాధ కలిగించింది ప్రియాంకకు. ఆ బాధ కాస్తా అన్నమీద కోపంగా మారిపోయింది.

    "నాకై నేను రిజైన్ చేయను. చేతనైతే బోర్డులో పెట్టి తొలగించండి" అంటూ కోపంగా పైకెళ్ళిపోయింది.

    తండ్రీ, కొడుకులు ప్రియాంక ధోరణికి మ్రాన్పడిపోయారు.


                   *    *    *    *


    గుప్తా లోపలకు వస్తూనే ఫైల్ త్రినాధ్ ముందుంచాడు.

    త్రినాధ్ ఫైల్ ఓపెన్ చేశాడు.

    లేబర్ యూనియన్ ఆఫీసు నుంచి వచ్చిన లెటర్ అది.

    వెంటనే జీతాలు పెంచకపోతే సమ్మె నోటీస్ ఇవ్వవలసి వస్తుందన్న వార్నింగ్ అందులో అతి మర్యాదగా పొందుపరచి వుంది.

    త్రినాధ్ వెంటనే పెన్ స్టాండ్ లోంచి గ్రీన్ పెన్ తీసి లెఫ్ట్ సైడ్ న కామెంట్ రాశాడు. "ప్రొడక్షన్ దెబ్బ తింటుంది కనుక వెంటనే కార్మికుల డిమాండ్స్ ని అంగీకరిస్తున్నాను" అని ఇంగ్లీషులో వ్రాసి సంతకం పెట్టేశాడు.

    హమ్మయ్య... సైన్ అయిపోయింది- ఇక తిరుగు లేదనుకున్నాడు గుప్తా.

    సరీగ్గా మూడురోజుల క్రితమే జీతాలు పెంచడం న్యాయం. వాళ్ళ కష్టాన్ని మనం దోచుకోకూడదు. బోర్డులో ఆ విషయం పెడితే ఇంజనీర్ తన తల్లి అపోజ్ చేస్తే సమ్మెకు నోటీస్ వస్తుంది అని చైర్మెన్ అన్నాడు. సరిగ్గా అదే జరిగిందిప్పుడు.

    గుప్తా ఫైల్ తీసుకుని బయటకు వెళుతుండగా- "అన్ ఎంప్లాయిడ్ యూత్ కాన్ఫరెన్స్ వెంటనే ఏర్పాటు చేయండి. మూడు సంవత్సరాల క్రితమే అనుకున్నాం ఆ పని చేద్దామని. కాని, అప్పటి కంటే ఇప్పుడే దానికి తగిన సమయమని నాకనిపిస్తోంది. ఫైల్ పుటప్ చేసి వెంటనే పంపించండి" అన్నాడు త్రినాధ్ గంభీరంగా.

 Previous Page Next Page