Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 33


    ప్రియాంకకు పిచ్చెక్కినట్టుగా వుంది.

    రోడ్ వైపు చూసింది.

    త్రినాధ్ అరివీర భయంకరంగా పోరాడుతున్నాడు. అప్పటికే ఇద్దరు నేలకూలారు మరో ముగ్గురికి అదే గతి పట్టించే ప్రయత్నంలో వున్నాడు. ఆమె కళ్ళవెంట అప్రయత్నంగా తడి....

    బహుశా అవతల వ్యక్తి గురించి ఆమె బాధపడిన తొలి క్షణం అదేనేమో ఆమె జీవితం మొత్తంమీద.

    వెంటనే తిరిగి వసుంధరా ఆఫీసుకి ఫోన్ చేసింది.

    "హలో... విల్ యూ ప్లీజ్ గివ్ ఇంజనీర్ రెసిడెన్స్ నెంబర్?" ప్రియాంక గొంతు మారిపోయింది.

    "64126 ప్లీజ్" ఆ వైపు నుంచి సమాధానం వచ్చింది.

    ప్రియాంక వెంటనే ఇంజనీర్ రెసిడెన్స్ కి రింగ్ చేసింది....

    "కుడ్ ఐ స్పీక్ విత్ మిస్టర్ ఇంజనీర్?" ప్రియాంక ఆ టెన్షన్ భరించలేకపోతోంది.

    "జస్ట్ ఎ మినిట్"

    ప్రియాంక రోడ్ కేసి చూస్తోంది.

    "హలో... ఇంజనీర్ దిస్ సైడ్"

    ప్రియాంక ఉలిక్కిపడి "హలో మిస్టర్ ఇంజనీర్... త్రినాధ్ పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు... వెంటనే రాగలవా? ప్లీజ్?" 

    ముందుగా ఆ వైపునుంచి ఇంజనీర్ నవ్వు వినిపించింది. "నాకు తెలుసు... అతను ప్రమాదాల్లో తప్పక పడతాడని. ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నాను. స్థాయికి తగ్గ పనులే చేయమని... సుదర్శన్ రావులాంటి దుర్మార్గులతో పెట్టుకోవద్దని... వుంటాను..." ప్రియాంక చెప్పేది వినకుండానే ఆ వైపు ఇంజనీర్ ఫోన్ పెట్టేశాడు.

    ప్రియాంక షాక్ తింది ఇంజనీర్ మాటలకు.

    ఆమె కెందుకో ఆ మాటలు అంది ఇంజనీర్ కాదేమోననిపించింది.

    తిరిగి బోస్ కి ఫోన్ ట్రై చేయసాగింది. ఆమె వేళ్ళు వణుకుతున్నాయి. అతిబలవంతంమీద తనలో కలుగుతున్న వణుకును కంట్రోల్ చేసుకుంటోంది.

    గోవింద్ యాదవ్ చటుక్కున వెనక్కు తిరిగి కొద్ది దూరంలో వున్న ఒ షాప్ కేసి పరుగెత్తసాగాడు.

    అతనికి ఎప్పటినుంచో త్రినాధ్ ను మట్టుబెట్టాలని వుంది... తనుంటున్న బిల్డింగ్ ను ఖాళీ చేయించి, తన అహాన్ని దెబ్బతీసి, వ్యాపారాన్ని సర్వనాశనం చేయించినందుకు త్రినాధ్ ని చంపాలి. అందుకే ఇదే తగిన సమయం.

    అతను తన అడ్డాకి రింగ్ చేశాడు. మరొకడు నేల కూలాడు త్రినాధ్ చేతిలో.

    బోస్ ఇంట్లో ఫోన్ రింగ్ అవుతోందని తెలుస్తోంది.

    వెంటనే ఎవరూ ఫోన్ ని ఎత్తలేదు.

    ప్రియాంకకు తన చేతివేళ్ళ పట్టు సడలిపోతున్నట్టుగా అనిపించింది...

    ఎన్నో వందలమంది అక్కడున్నా ఏ ఒక్కరూ త్రినాధ్ కి సాయంగా రావటం లేదు. ఆ రౌడీల్ని ఎన్నో సంవత్సరాలుగా భరించలేకపోతున్నా ముందుకు రావటంలేదు.

    "హలో... ఎవరు...?

    ఫోన్ కి ఆవేపు నుంచి వినిపించింది.

    ప్రియాంకకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.

    "బోస్ వున్నారా?"

    "ఉన్నారు. మీరెవరు మాట్లాడేది?"

    ప్రియాంక వూపిరి తీసుకుంది.

    "నేను ప్రియాంకను..."

    ఫర్వాలేదు, కనీసం మర్యాద తెల్సింది. నేనే బోస్ ను. ఏమిటిలా ప్రొద్దుటే ఫోన్ చేశావు?" ఆవైపునుంచి బోస్ ప్రశ్నించాడు.

    ఆమె తన సంబోధన ద్వారా బోస్ పట్ల చూపించిన గౌరవానికి ఆమే ఆశ్చర్యపోయింది.

    "యూ ఆర్ రైట్ మిస్ ప్రియాంక! స్వశక్తి మీద నిలబడలేని యువకుడు దేనికీ కొరగాడు. ప్రేమకు అంతకంటే అనర్హుడు. బట్... ప్రేమకు స్పందనే నిజమైన హేతువైనప్పుడు మాత్రం ఆ స్పందనకు స్వశక్తి గురించి తెలీదు. స్పందనకు హృదయమే తప్ప లౌక్యం వుండదు. లాజిక్ వుండదు. అందుకే అప్పట్లో నేనలా ప్రవర్తించాను. ఏది ఏమైనా నన్ను అవమానించి నేనో మనిషినయ్యేందుకు సహకరించావు. నా జీవితంలో నేను మర్చిపోలేని వ్యక్తులు ముగ్గురు. ఒకరు త్రినాధ్, రెండు హిందూ, మూడు నువ్వు. త్రినాధ్ పెట్టిన గడువు ఈ నెలతో ముగుస్తుంది. ఓడిపోవడానికి సిద్దంగా వున్నారా నువ్వూ, మీ నాన్న, మీ అన్నా...?"

    "ఓడిపోయేందుకు సిద్ధంగా వున్నాను. ఆ విషయాలు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు త్రినాధ్ ప్రమాదంలో వున్నాడు. నువ్వు వెంటనే రావాలి. భాగ్యలక్ష్మి నగర్... లోయర్ టాంక్ బండ్... ప్లీజ్... హర్రీయప్-" ఆమె మాటలు పూర్తికాకముందే బోస్ పెద్దగా నవ్వాడు.

    ప్రియాంక ఉలిక్కిపడింది.

    "అంటే తను చెప్పేది బోస్ నమ్మటంలేదా?

    ఇదిలా వుండగా అక్కడ త్రినాధ్ చేతిలో మరొకడు నేలకూలాడు. ఇంకొక్కడే వున్నాడు. కానీ మరికొంతమంది వస్తే-?

    "ఓ మైగాడ్- సేవ్ హిమ్.... ప్లీజ్ మిస్టర్ బోస్, ఐయామ్ నాట్ లైయింగ్..."

    ప్రియాంక గొంతులో జీరను గుర్తించాడు బోస్.

    "నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు భగవంతుడ్ని తలుచుకున్నావ్ కాబట్టి. కాని ఒకటి గుర్తుంచుకో. బోస్ తో ప్రాక్టికల్ జోక్ ప్లే చేస్తే అది దారుణంగా పరిణమిస్తుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను ఆంజనేయుడ్ని. నా గుండె చీల్చినా అందులో త్రినాధే వుంటాడు. ఈ బోస్ బ్రతికుండగా త్రినాధ్ కి ఎవ్వరూ హాని చేయలేరు..." ఆ వేపు ఫోన్ పెట్టేసిన శబ్దం విని ప్రియాంక కొంత ఊరట చెందింది.

    సరిగ్గా ఆఖరు మనిషి త్రినాధ్ చేతిలో నేలకూలుతుండగా ఒక్కసారిగా యాదవ్ మనుషులు అరడజనుమంది పెద్దగా పెడబొబ్బలు పెడుతూ పరిగెత్తుకు రావటం కనిపించింది ప్రియాంకకు.

    త్రినాధ్ ఎంతటి బలవంతుడైనా, తిమ్మడి మొరటుతనం అతనిలో ఇంకా దాగున్నా, స్వతహాగా అతనిలో నిక్షిప్తమై వుండే మొండితనం, ధైర్యం ఇప్పటికీ మిగిలివున్నా అప్పటికే ఆరుగురు దృఢకాయుల్ని నేలగరిపించిన అలసటలో వున్నాడు. ఇప్పుడు మరో ఆరుగురు అంటే.... చాలా కష్టమైనా విషయం... బోస్ రావటానికి ఎంతసేపు పడుతుందో తెలీదు. ఇప్పుడేదైనా అద్భుతం జరగాలి, తప్పదు.

    త్రినాధ్ కి అండగా ఎవరన్నా రావాలి.

    లేదా త్రినాధ్ లో రెట్టింపు బలం చేరిపోవాలి. క్షణాలు గడిచిపోతున్నాయి. ఎక్కువసేపు తాత్సారం చేసే సమయం కాదిది. కనీసం కొంతసేపయినా కొత్తగా వస్తున్న రౌడీల్ని నిరోధించగలిగితే ఈలోపు బోస్ వచ్చేయవచ్చు.

    అంతే.... ఆమె చెంగున షాప్ లోంచి రోడ్ మీదకు ఉరికి క్షణాల్లో త్రినాధ్ ని చేరుకుంది.

    అప్పటికే ఆమెను అక్కడ చూసిన త్రినాధ్ ఆశ్చర్యపోయాడు. అందరూ క్షతగాత్రుడై వున్న త్రినాధ్ కేసి ఆశ్చర్యంగా చూస్తుండగా అంతలో అతని ముందు ఓ మెరుపు తీగలాంటి అమ్మాయి ప్రత్యక్షమవటం- వాళ్ళిద్దరూ ఒకరికేసి ఒకరు చూసుకోవటం చూసి సంభ్రమంలో మునిగిపోయారు. మరో ఆరుగురు గూండాలు వస్తున్న కలకలం క్రమంగా దగ్గరవుతోంది.

    "నేను నీ యెడల తీర్చుకోవలసిన బాకీ నువ్వు కనుక్కున్నావో లేదో తెలీదు. కానీ... అంతకాలం బాకీ తీర్చుకోకుండా వుండలేకపోతున్నాను. ఒక్క బాకీయే కాదు, నువ్వు చేసిన అవమానానికి ప్రతీకారం కూడా ఇప్పుడే, ఇక్కడే తీర్చుకుంటాను..."

    ప్రియాంక హఠాత్తుగా అక్కడ తన ముందు ప్రత్యక్షమవటమే త్రినాధ్ కి సంభ్రమంగా వుంటే, సరిగ్గా ఆ టైమ్ లోనే ఆమె అలా పేచీకి దిగటం అతనికి చిరాకు తెప్పించింది.

    కలకలం బాగా దగ్గరయింది.

    ఆమె నలువైపులకు ఓసారి చూసింది.

    కొన్ని వందల కనురెప్పలు వాల్చటం మర్చిపోయి ఫ్రీజ్ అయివుండగా ఆమె చటుక్కున త్రినాధ్ మీదకు వంగింది. ఏం జరుగుతుందో గ్రహించేలోపే అతని పెదవుల్ని తన పెదవులతో...

    అక్కడ గుమికూడిన ప్రజలు షాక్ తిన్నాడు ప్రియాంక చర్యకు.

    "దీన్నిబట్టి చాలా విషయాల్ని నువ్వు గ్రహించగలవు. ఇకపోతే కొత్తగా రాబోతున్న మరో శత్రుబలగాన్ని ఎదుర్కొనేందుకు నా బాకీని ఇక్కడ, ఈ సందర్భంలో తీర్చుకోవల్సి వచ్చింది. నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అలాగే నీకు తెలుసు. నిన్ను నేను ప్రేమిస్తున్నానని. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది వుంటుందో లేదో నాకు తెలీదు.

    కాని... అపజయం నీ దరి చేరకుండా మాత్రం నేను నీలో స్థయిర్యాన్ని అవుతాను. నీలో ఆవేశాన్నవుతాను. నీలో చైతన్యాన్ని అవుతాను. అవన్నీ నీవవటానికి నేను ఓడి నీ దరి చేరుతున్నాను. నేను ఓడిన క్షణం- నీవు గెలిచే క్షణమవ్వాలి. కమాన్... రాబోతున్న నీ శత్రుబలాన్ని చిత్తుచెయ్-" అంటూనే చెంగున షాప్ వేపు దూకింది.

    సరిగ్గా అప్పటికి మరో ఆరుగురు త్రినాధ్ కి పదడుగుల దూరంలో నిలిచారు. వారి ముందు యాదవ్... చూస్తున్న జనం ఒక్కసారి హడలిపోయారు. ఆ ప్రాంతానికేదో వినాశనం దాపురించబోతోందని బెంబేలెత్తి పోతున్నారు.

    "ఓహో... నువ్వా...! ఆ వ్యాపారం ఎత్తేసి ఈ వ్యాపారం మొదలెట్టావా...?" త్రినాధ్ లో ఇప్పుడు నూతనోత్సాహం కనిపిస్తోంది.

    "నన్ను ఇల్లు ఖాళీ చేయించి నాశనం చేశావు. రోడ్లపాలు చేశావు. ఈ రోజు నా అడ్డాకొచ్చి చిక్కిపోయావు. ఇది కురుక్షేత్రం. రావటమే నీకు తెలుసు. పోనీకుండా చేయటం మాకు తెలుసు. ఈరోజు నీ చావు నా చేతిలో వ్రాసిపెట్టి వుంది...." గోవింద యాదవ్ ఉద్రేకపడిపోతున్నాడు.

    సరిగ్గా అదే సమయంలో బోస్ జీప్ త్రినాధ్ కారు వెనుక ఆగింది.

    ప్రియాంక బోస్ కోసం చూస్తోంది.

    "ఆ రోజు బలం లేని నేను జన బలాన్ని చూపించి దెబ్బకొట్టాను. ఈ రోజు ఈ శరీరం వజ్రాయుధం. అందుకే ఒంటరిగా వచ్చాను. నువ్వనుకొంటున్నట్టు అభిమన్యుడిలా కాదు, అర్జునుడిలా వచ్చాను. శ్రమజీవుల్ని దోచుకుతింటున్న నీ అరాచకం ఈరోజు ఇక్కడే సమాధి చేస్తాను... కమాన్..."

    అంతే.... గోవింద్ యాదవ్ తన వెనుక వున్న ఆరుగురికి సైగ చేశాడు.

    నిజానికి త్రినాధ్ కి అప్పటికే నిస్త్రాణగా వుంది. కాని తప్పదు- సమస్యకూ, కష్టానికీ వెన్ను చూపడం తన పోరాట విధానం కాదు.

    ఒంట్లోని సర్వశక్తుల్ని కేంద్రీకరించుకొని ఒక్కసారి వారిమీదకు ఉరికాడు.

    సంకుల సమరం తిరిగి మొదలయింది.

    బోస్ కోసం ఎదురుచూస్తూ ప్రియాంక క్షణాల్ని లెక్కిస్తోంది.

    ఒళ్ళంతా రక్తసిక్తమయి వున్న త్రినాధ్ ని చూస్తూనే వాళ్ళు ఉత్సాహ పడిపోయారు. దెబ్బతిని వున్న శత్రువును నేలకూల్చటం పెద్ద కష్టం కాదని ముందుకు దూకినా, త్రినాధ్ ముందు నిలువలేకపోతున్నారు.

    దొంగదెబ్బ తప్పదనే నిర్ణయానికి వాళ్ళు వస్తుండగానే బోస్ ఆకలిగొన్న పులిలా అక్కడకు దూసుకువచ్చి దెబ్బతిన్న త్రినాధ్ ని చూస్తూనే పొలికేక పెట్టి ఎగిరి దూకాడు.

    బోస్ అక్కడకు అలా హఠాత్తుగా రావటం త్రినాధ్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తే శత్రువర్గానికి భయాన్ని కలిగించింది.

    హఠాత్తుగా విరుచుకుపడ్డ ఈ చిరుతపులి ఎవరా అని జనాలు ఖంగుతిన్నారు.

    త్రినాధ్ క్షణాల్లో జరిగింది ఊహించగలిగాడు. ఆ కొద్ది క్షణాల ఆలోచనలనుంచి త్రినాధ్ తేరుకొనేలోపే బోస్ ఇద్దరి చేతుల్ని నిర్ధాక్షిణ్యంగా విరగదీసేసాడు.

    వాళ్ళను భయపెట్టి కంపెనీవైపు రాకుండా చేయాలన్నదే త్రినాధ్ అభిమతం. అందుకే అంతకుముందు తను నేలకూల్చిన వాళ్ళను సయితం అవిటివాళ్ళను చేయలేదు త్రినాధ్.

    కానిప్పుడు... బోస్ రంగంలోకొచ్చాడు.

    చిచ్చరపిడుగులాంటి బోస్ ని ఆపటం ఎవరితరం కాదు. చివరకు తన తరం కూడా కాదు. తన ఒంటిమీద రక్తపు మరకలే బోస్ కి నిప్పంటించాయి.

    త్రినాధ్ నిట్టూరుస్తూ ప్రియాంకవైపు రాసాగాడు.


                    *    *    *    *

 Previous Page Next Page