గుప్తా వినయంగా తలూపుతూ బయటకు వెళ్ళిపోయాడు.
* * * *
రాత్రి రెండు గంటలవుతోంది.
సుదర్శన్ రావు పర్సనల్ రూమ్ లో లైట్ వెలుగుతోంది.
అప్పటివరకు నిద్రపట్టక త్రినాధ్ ఆలోచనలతో కలల హర్మ్యాలు నిర్మిస్తున్న ప్రియాంక అనుమానంగా తండ్రి గదికేసి కదిలింది.
భవంతి నిశ్శబ్దంలో స్నానం చేస్తున్నట్టుంది.
చెప్పల్స్ వదిలేసి అడుగులో అడుగు వేసుకుంటూ తండ్రి పర్సనల్ రూమ్ కి ప్రక్కనున్న రూమ్ లోకి వెళ్ళి తలుపు దగ్గరగా నుంచుంది.
అస్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు.
పావుగంట అలాగే, అక్కడే నుంచుండిపోయింది.
ఒక్కమాటా స్పష్టంగా అర్ధం కాలేదు. కాని ఆ గదిలో నలుగురైదుగురు వున్నట్టు మాత్రం పసిగట్టింది.
మాటలు అర్ధంకాకపోయినా ఏదో గూడుపుఠాణి జరుగుతున్నట్లుగా వూహించింది.
కనీసం ఆ వ్యక్తులెవరయిందన్న విషయమైనా తెలుసుకోవాలనే ఆసక్తితో వెలుగుతున్న డిమ్ లైట్ ని ఆఫ్ చేసి తలుపు వారగా వుండి చీకట్లో నిలబడి పోయింది.
దాదాపు అరగంటకు తండ్రి గది తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించి అలర్టు అయిపోయింది ప్రియాంక.
ముందుగా తండ్రి, వెనుకే అన్న, ఆ వెనుకే మరో వ్యక్తి- ఎవరా వ్యక్తి? ఎక్కడో- ఎప్పుడో చూసిన జ్ఞాపకం- ఆ వెనుకే మరో ఇద్దరు వ్యక్తులు- వార్ని గుర్తుపట్టింది. ఒకరు కంపెనీ సెక్రటరీ, మరొకరు కంపెనీ లీగల్ అడ్వైజర్... కాగా మూడో వ్యక్తి ఎవరు? వాళ్ళు వెళ్ళిపోయారు.
ప్రియాంక చటుక్కున ఆ గదిలోంచి బయటకొచ్చి తన రూమ్ కేసి వేగంగా సాగిపోయింది.
రూమ్ లోకి వెళ్ళి ఆమె నిద్రపోలేదు. అతని ఆనవాళ్ళను, జ్ఞాపకాల్ని స్పురణకు తెచ్చుకుంటోంది.
సరీగ్గా పదినిమిషాలకు అతనెవరయిందీ ప్రియాంక గుర్తుపట్టగలిగింది.
అతనే... ది గ్రేట్ ఇంజనీర్...!
త్రినాధ్ కుడిభుజంగా వుంటూ వీలుచూసి వెన్నుపోటు పొడవాలనుకుంటున్న విశ్వాసఘాతకుడు.
* * * *
ఉదయం ఆరుగంటల సమయం-
వసుంధరా పారిశ్రామిక సామ్రాజ్యపు కేంద్ర సౌధం... సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. ఎదురుగా వున్న ఖాళీ స్థలంలో పెద్ద షామియానా వేసి వుంది. ఆ షామియానా క్రింద కొన్నివేల కుర్చీలు వరుసగా వేసి వున్నాయి.
కొన్ని వందలమంది కంపెనీ సిబ్బంది మెరిసిపోతున్న కంపెనీ యూనిఫామ్ తో హడావుడిగా ఆ ప్రాంతాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో మునిగి వున్నారు.
బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర పెద్ద స్టేజీ నిర్మించబడింది. దారినే వెడుతున్న వాళ్ళు ఆ హడావిడిని ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు సాగిపోతున్నారు.
మెయిన్ గేట్ పై, స్టేజీపై ఏవో బ్యానర్లు నైలాన్ రోప్స్ తో కట్టేస్తున్నారు కంపెనీ కార్మికులు.
కొన్ని వందలమంది నిర్విరామంగా, యంత్రాల్లా పనిచేసుకుపోతున్నా అక్కడ చడీచప్పుడు లేదు.
నిరుద్యోగ యువతీ యువకులకు మా ఆహ్వానం... పలుకుతూ వ్రాసిన పెద్ద పెద్ద అక్షరాలు- వాటికి తోడుగా మామిడి తోరణాలు... అరటి బోదెలు... లోక కళ్యాణం జరగబోతోందక్కడ అన్నంత ఘనంగా వున్నాయి ఏర్పాట్లు.
ఆరోజు చైర్మెన్ బోనస్ ప్రకటించబోతున్నారని ముందే తెలిసిపోయింది వారికి. బోనస్ ఎన్ని నెలలనేది ఎవరికీ తెలీదు. ఈ కారణాలన్నీ అక్కడ పనిచేసే సిబ్బంది ముఖాలలోని వెలుగుకు కారణమైతే... ఆరోజే చైర్మన్ ని ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న థ్రిల్ వారి కళ్ళలోని కాంతికి కారణం అయింది. వందలమైళ్ళ దూరం నుంచి బయలుదేరిన వేలాది నిరుద్యోగ యువతీ యువకులు ఆశల విహంగాల్లా రైల్వేస్టేషన్స్, బస్ స్టాండ్స్ లో దిగిపోతున్నారు.
వారికి రాను, పోను ఛార్జీలు, లాడ్జింగ్ ఏర్పాట్ల ఖర్చును వసుంధరా ఇండస్ట్రీస్ భరిస్తుందని వారం రోజుల క్రితం పేపర్స్ లో వచ్చిన ప్రకటనలకు ప్రతి స్పందించిన వేలాది యువత ఆ తరహా సమావేశానికి ఆశ్చర్యపోతూ ఆఘమేఘాల మీద వచ్చేస్తున్నారు.
ఆ సంచలనం వారిలోనే ఆగిపోలేదు. మేధావి వర్గాలలో సయితం ఆ కాన్ఫరెన్స్ చర్చనీయాంశమై పోయింది. అటు ప్రభుత్వ వర్గాలలో కూడా అది హాట్ న్యూసయి పోయింది. 'ఎవరతను... మన పార్టీలకు సమాధి చేసి యువతకు పెత్తనం అప్పగిస్తాడా?
ఇక వ్యాపార వర్గాలలో అయితే- 'ఎవరీ పిచ్చివాడు...? ఎందుకిలా లక్షలాది రూపాయల్ని తగలేస్తున్నాడని' జాలిపడుతున్నారు.
మొత్తానికి ఏ వర్గం ఎలా స్పందించినా ఆ సమావేశం ఒక సంచలనం, చర్చనీయాంశమైపోయింది దేశవ్యాప్తంగా.
మహామహా ఆర్ధికశాస్త్ర నిపుణులు... ప్రణాళికా సంఘ సభ్యులు- ప్రొఫెసర్స్... స్కాలర్స్... శాస్త్రవేత్తలు- రీడర్స్... రీసర్చ్ స్టూడెంట్స్ అంతా తర్జన భర్జనలు చేస్తున్నారు. అక్షరం ముక్క చదువులేని వసుంధరా చైర్మన్ ఏ సాహసంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు...? మహామహా ఉద్గ్రంథాన్ని ఔపోసన పట్టిన ఆర్ధిక శస్త్ర నిపుణులకే భారతదేశపు నిరుద్యోగ పెనుభూతాన్ని ఎలా వదిలించాలో తెలీక జుట్టు పీక్కుంటుంటే ఇతనేం పరిష్కారం చూపించగలడు-?
సమావేశం సరీగ్గా ఒంటిగంటకు ప్రారంభం....
త్రినాధ్ ఆరోజే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడానికి ప్రపంచానికి తెలీని కారణమొకటుంది. సెలవుమీద ఎక్కడికో వెళ్ళిపోయిన మాలినీ దేవి క్రితం రోజే నగరానికి వస్తున్న వర్తమానం వచ్చింది త్రినాధ్ కి. ఆ విషయాన్ని తనలోనే దాచుకున్నాడు.
త్రినాధ్ క్రితం రాత్రి నిద్రపోలేదు.
కళ్ళు ఎర్రగా మండిపోతున్నట్టు వున్నాయి.
అతను దాదాపు 20 గంటలనుంచి మౌనాన్ని ఆశ్రయించాడు... ఒంటరిగా తన గదిలో ధ్యానంలో వుండిపోయాడు. ఇప్పుడతనికి భౌతికపరమైన విషయాలేవీ గుర్తుకులేవు... నిశ్శబ్దంగా వున్న తన గది నాలుగు గోడల మధ్య సమాధి అయినట్టున్నాడు.
సరీగ్గా ఇదే సమయంలో అక్కడ సుదర్శన్ రావు ఇంట్లో ప్రియాంకకు బలవంతపు పెళ్ళిచూపులు ఏర్పాటు చేయబడ్డాయి పటిష్టమైన కట్టుదిట్టాల మధ్య.
పెళ్ళికొడుకు మరికొద్దిసేపట్లో పెళ్ళిచూపులకు రాబోతున్నాడు.
ప్రియాంక ఆ పరిస్థితికి భయపడలేదు. బాధపడడం లేదు. అప్పటికే ఆమె ఓ నిర్ణయం తీసుకుని వుండడంతో స్థిమితంగా వుంది.
రాబోతున్న పెళ్ళికొడుకు ఓ కోటీశ్వరుడి పెంపుడు కొడుకు- ఉత్తర భారతదేశపు ధనవంతుడికి దక్షిణ భారతదేశపు దత్తపుత్రుడు....
ప్రియాంక గది బయట సంభాషణ జరుగుతోంది.
"కన్నతల్లిగా అడుగుతున్నాను- నువ్వయినా చెప్పు బాబు... ఎవరా పెళ్ళికొడుకు?" తల్లి అన్న యోగేష్ ను అడిగింది.
ప్రియాంకకు ఆ సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది.
"ఆయనకు కోట్లకు కోట్లు ఆస్థి వుంది. పిల్లలు లేరు. అందుకే దత్తత తీసుకున్నాడు. ఆయన కోట్లాది సిరిసంపదలు ఈ దత్తపుత్రుడికే సంక్రమిస్తాయి..." యోగేష్ నెమ్మదిగా అన్నాడు.
"ఆ అబ్బాయేం చదివాడు? ఏం చేస్తుంటాడు? పేరేంటి?" ఆమె తిరిగి అడిగింది ప్రాధేయపూర్వకంగా.
"అతను ఎం.బి.ఎ. చదివాడు. తనకు సంక్రమించిన కోట్లాది రూపాయల్ని పెంచుకునే పని చేస్తుంటాడు. మనిషి బావుంటాడు. పేరు సిద్దప్ప!"
అన్న వెళ్ళిపోయిన పాదాల చప్పుడు ప్రియాంకకు వినిపించింది.
'అంటే... తల్లిప్పుడు తన గదిలోకి వస్తుంది. తన మనస్సులో వున్నది చెప్పకపోతే తల్లి బాధపడుతుంది-' ప్రియాంక ఇక్కడిలా ఆలోచిస్తుండగా అక్కడ సి.ఐ. రాఘవ జీప్ సుదర్శన్ రావు ఇంటికేసి బయలుదేరింది.
తల్లి గదిలోకి వచ్చింది. కొద్ది క్షణాలు మౌనంగా వుంది.
మరో అరగంటలో పెళ్ళికొడుకు పెళ్ళిచూపులకు రానున్నాడు.
ఆ విషయం తల్లీకూతుర్లిద్దరకూ తెలుసు.
ఇద్దరికీ ఆ సంబంధం ఇష్టం లేదని తెలుసు.
ఆమె ఏదో చెప్పేందుకు తలెత్తి కూతురివైపు చూసింది.
"నాకు తెలుసమ్మా... నువ్వేం కంగారుపడకు- చూస్తుండు విచిత్రమైన డ్రామా ఒకటి జరుగుతుంది" అంది ప్రియాంక.
* * * *
సిద్దప్ప ఎక్కిన మెర్సిడెస్ సుదర్శన్ రావు బంగ్లాకేసి దూసుకు వస్తోంది.
ఆ కారులో సిద్దప్ప, అతన్ని దత్తత తీసుకున్న మిలీనీర్ అగర్ వాల్, అతని సెక్రటరీ వున్నారు.
"కన్నతల్లిని రక్షించుకోలేక పిరికివాడిలా పారిపోయి, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ధైర్యంలేని స్థితిలో వున్న నన్ను, ఏదో మీకు నెలరోజులు మీరెవరో తెలియకుండా సహాయం చేసినంత మాత్రాన ఇంత ఆస్థి కట్టబెట్టారు. దత్తత తీసుకున్నారు. ఇప్పుడు పెళ్ళి కూడా చేయబోతున్నారు. కన్నతల్లి లేని లోటును కన్నతండ్రిలా తీర్చారు. నన్నింకా పెద్దవాడ్ని చేసేందుకేగదా మీకు శత్రువైన సుదర్శన్ రావుతో సయితం వియ్యం అందుకోవాలనుకుంటున్నారు?" సిద్దప్ప నెమ్మదిగా అన్నాడు కృతజ్ఞత నిండిన కంఠంతో.
అగర్ వాల్ మౌనంగా వున్నాడు.
కారు సర్రున దూసుకుపోతోంది.
"నా కోసం మీరు మీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టటం నాకిష్టం లేదు నాన్నగారు..." సిద్దప్ప తిరిగి అన్నాడు.
అప్పుడు అగర్ వాల్ సిద్దప్పవైపు తిరిగాడు. ఆప్యాయంగా సిద్దప్ప తల నిమిరాడు.
"చూడు నాయనా సిద్దప్ప- శత్రువును చేతనైనంతవరకూ శతృత్వంతోనే దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడు ఆత్మాభిమానం వున్న మనిషి. అది ఇక సాధ్యం కాదని తెలిసినప్పుడు జవసత్వాలు ఉడిగిపోయే ఆఖరి దశకు చేరుకున్నప్పుడు ఓడిపోయినట్టు నటించి, తెల్లజెండా ఎత్తేసి మిత్రత్వం, లేదా బంధుత్వాన్ని సంపాదించుకుని అప్పుడు దెబ్బకొడతాడు."
సిద్దప్పకి అగర్ వాల్ అన్నది ఓ క్షణం అర్ధంకాలేదు.
"నా స్ట్రాటజీ అర్ధమయిందనుకుంటాను. ఇకపోతే అలా అని నీ సంసారిక జీవితాన్ని నాశనం కానివ్వను. నువ్వు సుదర్శన్ రావు కూతుర్ని పెళ్ళి చేసుకుంటావు. అక్కడినుంచి సుదర్శన్ రావుని ముళ్ళకంచెల మధ్య ఇరికిస్తాను-"
"మీరొక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే నేనే అతన్ని లేపేసేవాడ్ని గదా?" సిద్దప్ప ఆవేశపడ్డాడు.
"నిన్ను పోగొట్టుకోవటం ఇష్టంలేకే ఇలా సంధికి వచ్చి సంబంధం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాను" అన్నాడు అగర్ వాల్ ప్రేమగా సిద్దప్పవేపే చూస్తూ.
సిద్దప్ప చటుక్కున వంగి అగర్ వాల్ కాళ్ళకు నమస్కరించాడు.
కారు సుదర్శన్ రావు ఇంటి కాంపౌండ్ లోకి తిరిగింది.
కారును చూస్తూనే సుదర్శన్ రావు హడావిడిగా ఎదురొచ్చి సాదరంగా గెస్ట్స్ లోపలకు తీసుకెళ్ళాడు.
అందరూ సరదాగా మాట్లాడుకుంటుండగా సుదర్శన్ రావు ఒక్కక్షణం పక్కకు తప్పుకుని ముందు హాల్లోకి వచ్చాడు.
అక్కడ యోగేష్ సిద్ధంగా వున్నాడు.
"ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మెరికల్లాంటి పాతికమంది మన ఫ్యాక్టరీ గూండాలిప్పుడు మన ఇంటికి కాపలాగా వున్నారు. వాళ్ళిప్పుడు తోటపనివాళ్ళలా, స్విమ్మింగ్ ఫూల్ ని కడుతున్నవారిలా మన ఇంటిచుట్టూ తిరుగాడుతున్నారు. మీరు చెప్పినట్లు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేసి పదిమంది పోలీసుల్ని కూడా పంపించ మన్నాను. వాళ్ళీపాటికి మన వీధిలోకి ప్రవేశించి వుండవచ్చు. ఇప్పుడు ఈ సంగతి త్రినాధ్ గ్రూప్ కి తెల్సినా చేయగలిగిందేమీ లేదు. మీరు నిశ్చింతగా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవచ్చు" అన్నాడు యోగేష్ యుద్ధానికి సిద్ధపడుతున్నవాడిలా.


