Previous Page Next Page 
మొగలిబాకు పేజి 33

   

      షక్తికపూర్ ఆదిమానవుడిలా అరిచాడు. ఆ అరుపుకి ఆటో ఆగింది.
   
    "దిగు దిగు" పక్కనున్న నారాయణరావుని కంగారు పెట్టేసి ఆటో వాడికి డబ్బులిచ్చేసి దూరంగా వున్న సినిమా థియేటర్ వేపు పరుగెత్తడం ప్రారంభించాడు షక్తికపూర్.
   
    అతడి వెనక నారాయణరావు పరుగెత్తాడు.
   
    ఆ థియేటర్ ముందు ఎటుచూస్తే అటు కాలేజీ స్టూడెంట్స్ వున్నారు.
   
    "చూసావా......మంచిమళయాళ మూవీ.....నెలరోజుల్నుంచీ హౌస్ ఫుల్స్ తో నడుస్తుంది. నువ్విక్కడే వుండు.....నేను టిక్కెట్టు తెస్తాను" చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు షక్తికపూర్.
   
    పది నిముషాల తర్వాత చేతిలో టిక్కెట్లతో వచ్చాడు షక్తి కపూర్.
   
    "ఒక్క టిక్కట్టే దొరికింది బాస్.....నాకు ప్రాప్తం లేదనుకుంటాను నువ్వెళ్ళు......నేను తర్వాత చూస్తాలే"
   
    "నేను ఒక్కడ్నీనా"
   
    "ఏం భయంలేదులే....ధియేటరంతా హౌస్ ఫుల్ అయిపోయింది వెళ్ళు.....ఫస్టు ఫస్టున హీరో లోయలోకి దూకేసి, ఆత్మహత్య చేసుకునే సీన్ అద్భుతంగా తీసాడట.....వెళ్ళు ఆలస్యం చేయక"
   
    నారాయణరావు చేతిలో టిక్కెట్ పెట్టాడు షక్తికపూర్, నారాయణరావ్ ముందుకు నడిచాడు.
   
    అందరూ తెల్సిన కాలేజీ స్టూడెంట్సే__వాళ్ళందరూ తనవేపే విచిత్రంగా ఎందుకు చూస్తున్నారో అర్ధంకాక బుర్ర గోక్కుంటూ నడిచాడు నారాయణరావు.
   
    పావుగంట క్రితం అలాంటి పరిస్థితుల్లోనే సంధ్యనుకూడా థియేటర్ లోకి లీల దగ్గరుండి మరీ పంపించింది.
   
    నారాయణరావు సినిమా థియేటర్ లోనకెళ్ళిన ఐదు నిమిషాలకు చెట్లచాటునుంచి, మెట్లచాటునుంచి వాసుదేవ్, మోతీలక్ష్మి తదితరులందరూ బయటికి వచ్చి, ధియేటర్ ముందుకొచ్చి సినిమా చూడడానికొచ్చిన ప్రేక్షకుల్లా టిక్కెట్ దొరకని ప్రేక్షకుల్లా నటించిన ఆడ స్టూడెంట్స్, మగ స్టూడెంట్స్ కు కృతజ్ఞతలు చెప్పారు.
   
    మరో పది నిమిషాలకు ధియేటర్ బయట ఉన్న ప్రేక్షక జనమంతా ఇళ్ళకు వెళ్ళిపోయాక వాసుదేవ్ ధియేటర్ మేనేజర్ దగ్గర కెళ్ళి__
   
    "థాంక్స్" చెప్పాడు.
   
    "ఇందులో నాకెందుకూ థాంక్స్.....ధియేటర్ హౌస్ ఫుల్ అయితే ఎంత కలక్షన్ వస్తుందో అంత కలక్షన్ యిచ్చేసారుకదా.....ఒక ప్రేమ జంటకోసం మా ధియేటర్ ను ఉపయోగించడం నాకు చాలా ఆనందంగా వుంది" అని పద్నాభం లెవెల్లో కిక్కిక్కిమని నవ్వాడు ధియేటర్ మేనేజర్.
   
    "నేను చెప్పింది జ్ఞాపకముందికదా.....ఇంట్రవెల్ ఇవ్వగూడదు. వాళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా తలుపులు తీయకూడదు"

    "అలాగే__మా స్టాఫ్ కి  నేను స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాను......డోన్ట్ వర్రీ"
   
    ఆ తర్వాత__
   
    ప్రేమ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులందరూ ఆ ధియేటర్ ఆవరణలోంచి బయటకు వెళ్ళారు.
   
                                                                    *    *    *    *
   
    "ఎ బాక్స్, సీట్ నెం టు....." గేట్ కీపర్ చెప్పడంతో లోనికి అడుగు వేశాడు నారాయణరావు.
   
    అప్పటికే సినిమా స్టార్టయ్యింది- హీరో హీరోయిన్ ని దగ్గరగా లాక్కొంటున్న దృశ్యం.
   
    పిచ్చి ప్రేక్షకులు- ఊపిరి బిగపట్టి చూస్తున్నారల్లే వుంది......ఇలాంటి సినిమాలు తనెన్ని చూడలేదు. విచిత్రంగా నవ్వుకొని చిన్న పిల్లాడిలా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు నారాయణరావు.
   
    అస్సలు..... చప్పుడు చెయ్యకుండా సినిమా చూస్తున్నారేమిటబ్బా అని అంతలోనే డౌటొచ్చినా, మన దేశం తిండికీ, సెక్స్ కీ బాగా వాచిపోయిన దేశం..... అందుకే వాల్ పోస్టర్ల బొమ్మల వేపు దేభ్యం మొహాలేసుకుని చూస్తారు..... ఆకలితో కడుపు మాడిపోతున్నా సెక్సాకలితో కళ్ళు విప్పారేది అందుకే.... అనుకుంటూ ఓ సీటులో కూర్చున్నాడు__
   
    తెర మీద జోక్ కి పక్క సీట్లోంచి నవ్వు వినిపించడంతో - హాల్లో ఆడ ప్రేక్షకులు కూడా వున్నారన్నమాట అని అనుకుంటూ సీరియస్ గా సినిమా చూసేస్తున్నాడు నారాయణరావు.
   
    లవ్ సీన్ వచ్చినప్పుడు గొప్ప రొమాంటిక్ సినిమా అని, ట్రాజెడీ సీన్ వచ్చినప్పుడు గొప్ప ట్రాజెడీ సినిమా నై మన తెలుగు సినిమా విమర్శకుడిలా అనుకుంటూ చూసేస్తున్నాడు.
   
    అరగంట దాటింది. బాత్రూమ్ కి వెళ్ళాలనిపించింది నారాయణరావుకి.
   
    ఇంటర్వెల్ లో వెళదామని ఊరుకున్నాడు. ఎంతకీ ఇంటర్వెల్ రావడంలేదు.
   
    సినిమాల్లో చాలా సీన్లు కట్ అయినట్టుగానే ఇంటర్వెల్ కూడా కట్ అయిపోయిందేమోనని అనుమానం వచ్చిందతనికి.
   
    ఏవీ దొరక్క ఒక్కొక్కప్పుడు అలాంటి తమాషాలు చేస్తారని అనుకున్నాడు కూడాను.
   
    తల పక్కకు తిప్పాడు- ఏదో ఆకారం తీక్షణంగా సినిమా చూస్తూ కనబడింది.
   
    "సారీ ఫర్ ది డిస్ట్రబింగ్ యూ.... ఈ సినిమాకు ఇంటర్వల్ లేదా" అనడిగాడు నారాయణరావు.
   
    రిప్లయ్ రాలేదు. మళ్ళీ అడిగాడు.
   
    "పోనీ టాయిలెట్స్ కు వెళ్ళడానికి దారి ఎటో చెపుతారా....." అడిగాడు.
   
    "టాయిలెట్ కా..... నాకేం తెలుసు..... అయ్ డోంట్ నో...." ఆడగొంతు వినబడేసరికి డంగ్ మని నెత్తి మీద ఎవరో మొత్తినట్టు అయింది.
   
    తన పక్కన కూర్చున్నది..... లేడీ ప్రేక్షకురాలా..... హతవిధీ.....
   
    మనసులోనే తీవ్రంగా చికాకు పడిపోయాడు__ సిగ్గుపడిపోయాడు_ ఇంకెలాగో అయిపోయాడు__ అవమాన భారంతో కృంగిపోయాడు.
   
    సినిమా నడుస్తూనే వుంది.
   
    కాసేపటికి నారాయణరావుకి తెరమీద మనుషులు, నీడల్లాగానూ, నల్లనల్లటి మచ్చల్లాగానూ కన్పించా సాగారు___ దాని క్కారణం అతను__
   
    అర్జంటుగా బాత్ రూమ్ కి వెళ్ళాల్సిన అవసరం తీవ్రంగా అయిపోవడమే__
   
    గబుక్కున లేచి చీకటిలోనే 'టాయిలెట్స్ కు దారెటు....దారెటు- బాత్రూమ్స్ కు దారెటు..... దారెటు' అనుకొంటూ ముందుకు నడుస్తున్నాడతను.
   
    కానీ ఏ ఒక్కరూ జవాబు చెప్పకపోవడం, ఏ మాత్రం శబ్దం వినిపించకపోవడం అతనికి ఆశ్చర్యంగా వుంది.
   
    డోర్ దగ్గరికి వెళ్ళి తలుపుని లాగాడు. రాలేదు-మళ్ళీ లాగాడు. మళ్ళీ కూడా రాలేదు.
   
    థియేటర్ మెయింటెనెన్స్ అస్సలు పాడయిపోయింది. రాష్ట్రం లోని ప్రతి సితీలోనూ, ఉన్న ధియేటర్ తలుపులకు గ్రీజులవీ తప్పకుండా రాయించాలని, కలెక్టర్ కి కంప్లయింట్ చేయాలని, అప్పటికప్పుడు కంప్లయింట్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాడతను.

 Previous Page Next Page