వీళ్ళ మాటల మధ్యలో నౌకరు సామానులు ఇంట్లో పెట్టాడు. నర్సమ్మ కాఫీ తెచ్చి యిచ్చింది.
ఆవురావురుమంటూ పెద్ద గ్లాసుడు కాఫీ తాగింది గంగారత్నం. అప్పుడు గుర్తుకు వచ్చింది ఈ యింట్లోవాళ్ళ క్షేమ సమాచారాలు అడగాలని.
"ఇదేంటిరా తమ్ముడూ! నువ్వు యింతగా చిక్కిపోయావ్! అన్నట్లు సరోజకి పిచ్చి తగ్గిందా!" అంది గంగారత్నం.
ఆవిడ మాట తీరే అంత అని తెలిసిన భుజంగరావు అదేమీ పట్టించుకోలేదు "ఉహూ" అన్నాడు.
అదిగో గుమ్మంలోనే వుంది చూడు అన్నట్లు సంజ్ఞ చేశాడు త్రయంబకరావు.
అప్పుడు అమలని చూసింది గంగారత్నం. "ఇక్కడే వున్నవుటే కోడలా! దా, యిలాదా," అంది మహా ప్రేమగా పిలుస్తూ.
పిచ్చిదానిలా నటించాలన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది అమలకి, సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ "ఇహి ఇహ్హి, ఇహ్హి," అంది నుంచున్న చోట నుంచి అంగుళం "కూడా కదలకుండ.
"మా కాలంలో ఆరేళ్ళు నిండేసరికి పెళ్ళి చేసేవారు. ఈ ప్రేమలు దోమలు ఎరుగం. పిల్లకి కన్ను వంకర కాలు వంకరా, నీకేం డబ్బు తక్కువ దస్కం తక్కువా, అన్నీ వుండి పెళ్ళిచేయకుండా ఇరవై ఏళ్లు పెంచితివి. అదేమో ప్రేమ దోమ అని చివరికి పిచ్చిదయిపోయింది. గత చరిత్ర వుంచి పిచ్చిదాన్ని పెళ్ళాడటానికి ఎవరు ముందుకు వస్తారురా భుజంగం?" అని వాపోయింది గంగారత్నం.
"పెళ్ళాడే ఆదర్శ యువకులు ఈ లోకంలో బొత్తిగా లేరంటావా అమ్మా!" త్రయంబకరావు అమలని ఆప్యాయంగా చూస్తూ అడిగాడు.
"అక్కయ్యా! దయచేసి యిలాంటి మాటలు అనవద్దని గతాన్ని తిరగదోడవద్దని ఎన్నోసార్లు చెప్పాను, మరోసారి చెపుతున్నాను." భుజంగరావు కోపాన్ని అణుచుకుంటూ గంభీర్యంగా అన్నాడు.
"మతిలేనిదాన్ని ఒకసారి చెప్పినా అర్ధమయి చావదు. ఇంక ఎప్పుడూ అనను లేరా తమ్ముడూ!" గంగారత్నం చెంపలు వాయించుకున్నట్లు అభినయం చేస్తూ అంది.
భుజంగరావు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు.
"నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధిలేదు." త్రయంబకరావు గొణిగాడు.
భుజంగరావుకి ఎప్పుడో తప్ప కోపం రాదు. పట్టరాని కోపమే వస్తే తన మన చూడడు బైటికి తన్ని తగలేస్తాడు. ఇంట్లోపడి తినటానికి వచ్చిన ఈ తల్లీ కొడుకు జాగ్రత్తగానే తమ పబ్బం గడుపుకుందామనుకుంటారు. కాని గంగారత్నం నోరు క్షణం వూరుకోదు. ఆ అలవాటుతో నోరు జారుతుంటుంది.
గంగారత్నంది పిచ్చిముఖం. త్రయంబకరావుది వెర్రిముఖం అనుకుంటున్న అమల ఆ నిమిషానే తను పొరబడ్డానని గ్రహించుకుంది. ఇదోజాతి అనుకుంది. జాగ్రత్తగా వుండాలేమో ఈ కొత్త శాల్తీలతో కూడా!
అమలకి వాళ్ళ సంగతి బొత్తిగా తెలియదు.
ముందుముందు వీళ్ళే తన మెడకి ఉచ్చు వేస్తారని.
19
అమల రెండురోజుల్లో సరోజ మూడు డైరీలు చదవగలిగింది. సరోజ మృదు స్వభావురాలు. తగాదా అన్నా ఇతరుల మనసు నొప్పించటం అన్నా భరించలేదు. ప్రేమికుడు ప్రభాకర్ చెప్పిం తరువాతే డైరీ రాయటం అలవాటు చేసుకుంది. ఇదే విషయం మొదటి డైరీలో రాసుకుంది.
సరోజ డైరీవల్ల అమల కొన్ని విషయాలు తెలుసుకోగలిగింది.
సరోజ ప్రభాకర్ ల ప్రేమ రోజురోజుకీ ఎంత గాఢంగా పెరిగిందీ, భుజంగరావు వెంటనే వాళ్ళ ప్రేమ ఆమోదించి పెళ్ళికి ఒప్పుకోటం కృష్ణ విశాలహృదయం ప్రకటించటం.