"మగపిల్లలైతే తల్లిదండ్రులకు చాలా సమస్యలు తెస్తారు. అదే ఆడపిల్లయితే ఒక సమస్యే తెస్తుంది. అదేమిటంటే ప్రేమలో పడడం అది జరక్కుండా వుండాలంటే దాన్ని స్కూలుకు పంపకూడదు" అని నాగరాజు చెప్పడంతో ప్రవీణ తల్లి కూడా తల ఊపింది. అలా ప్రవీణ చదువు అటకెక్కింది.
ఇక అప్పట్నుంచీ ఇంట్లోనే కాలక్షేపం.
ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళాలన్నా తల్లిదండ్రులు వెళ్ళనిచ్చే వాళ్ళుకారు.
"అలా బయట తిరగడంవల్ల అనర్ధంతప్ప పరమార్ధం ఏమీరాదు. ఈ ఐహిక ప్రపంచమంతా ఓ మాయ. ఆ మాయను జయించాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇది సాధించామంటే ఈ మాయ ఎండకు మంచు కరిగిపోయినట్టు కరిగిపోయి అసలు సత్యం బయటపడుతుంది. ఆ సత్యమే భగవంతుడు ఆయన సాన్నిధ్యంకన్నా మించిందీ, కోరదగిందీ ఈ ప్రపంచంలో ఏమీ లేదు" అని వూదరగొట్టేవాళ్ళు.
ఒంటిపూట భోజనమే అయినా ప్రవీణ మాత్రం బొద్దుగా తయారైంది. అలా వుండీ ఒంపుసొంపులు చక్కగా ఎదగడం అరుదు. అయితే ఆమె అదృష్టమో., తల్లిదండ్రుల దురదృష్టమో తెలియదుగానీ ఆమె చాలా ఆకర్షణీయంగా తయారైంది.
ఇక మగపిల్లాడు కనిపిస్తేచాలు ఠక్కున ఆటోమాటిక్ గా తల కిందకి వాల్చేసేది ప్రవీణ. ఇక మాట్లాడడమంటే ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయ్యేది. అందుకే ఎప్పుడోగానీ, మరీ అవసరమైతే తప్ప మగాళ్ళముందు నోరు విప్పేదికాదు. అందులోనూ ఆమె మగవాళ్ళకి కనపడడం మహా అరుదు.
"మగపిల్లలతో మాట్లాడడమంటే మహాపాతకం చేస్తున్నామన్నమాట. వాళ్ళతో క్లోజ్ గా వుండడమంటే దేవుడికే ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఎలాంటి పాపపు ఆలోచనల్ని నీ మనసులో దూరనివ్వకు. ఎప్పుడైతే నీకు కోరిక కలిగిందో ఆ క్షణం నిన్ను దేవుడు అసహ్యించుకుంటున్నాడని గుర్తుంచుకో" అని తల్లి రోజుకోసారి హితోపదేశం చేసేది.
ఇదిగో......ఇలాంటి వాతావరణంలో పెరిగింది ప్రవీణ. మరి ఆమెకు ఈ సమస్య ఎందుకొచ్చింది? దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చంద్రరేఖ. క్లోజ్ గా మాట్లాడుతూ తనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నించిందిగానీ ప్రవీణ ఏమీ చెప్పడంలేదు. తన మనసుని విప్పడంలేదు.
ఇక ఏం చేయాలి? ఏమడిగినా ముక్తసరిగా సమాధానం చెబుతోంది మరీ బలవంతం చేస్తే అబద్దాలు గుప్పిస్తోంది. మరి అసలు విషయం రాబట్టడం ఎలా? ఈ లెక్కల పిచ్చి ఎందుకు పట్టిందో ఎలా తెలుసుకోవడం? ఇక లాభంలేదని ప్రవీణను హిప్నటైజ్ చేయాలని నిర్ణయించుకుంది. ఎప్పుడో కన్యాకుమారిలో డాక్టర్ దగ్గర నేర్చుకున్న టెక్నిక్ అది. ఇంతకాలం దీన్ని ఉపయోగించాల్సిన అవసరం కలగలేదు.
ఇప్పుడు వచ్చింది హిప్నటైజ్ చేయడానికి ఉపక్రమించింది చంద్రరేఖ.
ప్రవీణను మంచంమీద పడుకోబెట్టి కణతలమీద వేళ్ళతో నొక్కి పట్టి మెల్లగా ఆమెను ట్రాన్స్ లోకి నెట్టడానికి ప్రయత్నించింది. మరోపది నిముషాలకు ప్రవీణకు ట్రాన్స్ కమ్మేసింది.
మెల్లగా ఆమెను మాటల్లో పెట్టింది. ఒక పద్దతి ప్రకారం ప్రశ్నించడం మొదలు పెట్టింది. ప్రవీణ అన్నింటికీ చక్కగా జవాబులు చెబుతోంది.
మానసిక జబ్బులున్న వారిని ముఖ్యంగా జ్ఞాపకాలు వేధిస్తుంటాయి. కాబట్టి ఆ జ్ఞాపకం తొట్టిని కదిలించాలి. ఆమె ఎందుకు కలత చెందిందో, దేన్ని మనసులో అణగదొక్కడంవల్ల ఈ స్థితి వచ్చిందో తెలుసుకోవాలి.
ప్రవీణ గతంలోకి వెళ్ళిపోయింది. ఒక్కో సంఘటన చెబుతోంది. అవన్నీ వింటూ వుంటే విచిత్రంగా అనిపిస్తోంది చంద్రరేఖకి. ప్రవీణను బాగా కలవరపెట్టిన సంఘటన ఆరు నెలల క్రితం జరిగిందది.
ఉదయం ఇంటిముందు కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టడానికి ముగ్గుపిండి వాడతారు. ఆ ముగ్గుపిండి అక్కణ్నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న అగ్రహారంవద్ద దొరుకుతుంది.
ఆ ఊరు తూర్పున వున్నవన్నీ బీడు భూములే. ఆ చౌడునంతా గోక్కుని, ఆ తరువాత జల్లిస్తారు పిండి అంతా కిందకి వచ్చేస్తుంది. రాళ్ళు పైన నిలిచిపోతాయి. ఆ పిండినే ముగ్గులు పెట్టడానికి ఉపయోగిస్తారు.
ఓ రోజు ఊర్లోని ఆడవాళ్ళు బుట్టలు, పెద్ద పెద్ద అల్యూమినియం గిన్నెలు ఎత్తుకుని ముగ్గుపిండికి బయల్దేరారు. మొత్తం ఆరుగురు. వాళ్ళు వీధిలో పోతూంటే ప్రవీణ తల్లి అడిగింది "ఎక్కడికి?" అని.
"ముగ్గు పిండికి అత్తా" ఓ అమ్మాయి చెప్పింది.
"మా ఇంట్లో కూడా అయిపోయింది. ప్రవీణను పంపిస్తాను" అని ప్రవీణను వాళ్ళతో పంపింది.
ఏడుగురూ బయలుదేరారు ముగ్గుపిండి కారణంగానైనా చానాళ్ళ తర్వాత అలా బయటికి వెళఅళే అవకాశం కలిగిందని ఆనందపడిపోయింది ప్రవీణ.