"ఏమిటొదినా! రహస్యం చెప్పాలన్నావ్. ఇంతకీ ప్రవీణ ఏదీ?" అని అడిగింది చంద్రరేఖ.
"గుడిలో భజనవుంటే నేనే వెళ్ళి రమ్మన్నాను. సమస్య ఆ పిల్లదే" అంది ఆమె.
"సమస్యా!"
"ఆఁ. అదేం విచిత్రమోగానీ ఆ పిల్ల లెక్క పెడుతుంటుంది."
ఇది మరి జబ్బుకాదో తెలియదుగానీ నాకు మాత్రం ఆందోళనగానే వుంది.
"పెళ్ళి కావాల్సిన పిల్ల. ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే కుదురుతుందా. ఇప్పుడంటే అమ్మగారింట్లో వుంది కాబట్టి సరిపోయింది.
రేపు పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళుతుంది.
అక్కడ కూడా ఇలా ప్రతిదాన్నీ లెక్కలు వేస్తుంటే వాళ్ళేం అనుకుంటారు? పిచ్చి పట్టిందని తరిమేస్తే మా గతేంగాను?" ఆమె అలా చెబుతుంటే బాధతో గొంతు పూడుకుపోతోంది.
"అంతగా భయపడాల్సిన సమస్య కాదుగానీ -ఇలా లెక్కలు వేయడం ఎప్పట్నుంచీ?"
"ఈ మధ్యనే - బహుశా ఆరునెలల నుంచీ అనుకుంటాను. అది జబ్బేమోనండీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటే మీ అన్నయ్య వినడాయె.
అది జబ్బూకాదూ, పాడూగాదూ. దానంతటదే సర్దుకుంటుందిలే అని అంటారాయన. నాకేమో దిగులుగా వుంది. అందుకే నీకు చెబుతున్నాను"
"అన్నయ్య చెప్పింది నిజమే. ఇది జబ్బుగాదు మానసిక రుగ్మత"
"దాన్ని ఏమంటారో తెలియదుగానీ నాకు మాత్రం కంగారుగా వుంది. అది చివరికి తినే అన్నం ముద్దల్ని కూడా లెక్క పెడుతుంటుంది. ఇదంతా గమనిస్తున్న కన్నతల్లికి ఎలా వుంటుందో నువ్వే చెప్పు. ఈ రోజు చిన్న సమస్య అని వదిలేస్తే రేపు తలకు చుట్టుకుంటే దాని గతేం గాను. అందుకే నువ్వు బాగుచెయ్యాలి దాన్ని" అని ప్రార్ధిస్తున్నట్లు చంద్రరేఖ రెండు చేతులూ పట్టుకుంది ప్రవీణ తల్లి.
"అలాగేలే వదినా. నువ్వు ఇంత ఇదిగా చెప్పాలా. ముందు ఈ రుగ్మతకు మూలకారణం ఏమిటో తెలుసుకోనీ. రేపు ఫ్యాక్టరీకి సెలవు. తీరిగ్గా వుంటాను. కనుక ప్రవీణతో వచ్చి మాట్లాడతాను" అని భరోసా ఇచ్చి వచ్చేసింది చంద్రరేఖ.
చెప్పిన ప్రకారం మరుసటిరోజు వెళ్ళింది ఆమె. ఆ సమయంలో ప్రవీణ దేవుడి బొమ్మల్ని కడిగి పూజకు సిద్దం చేస్తోంది.
నాగరాజు దంపతులిద్దరికీ భక్తి ఎక్కువ.
నిద్రలేచింది మొదలు తిరిగి నిద్ర పోయేవరకు దైవచింతన తప్ప మరేమీ పట్టదు. వాళ్ళు శాపవశాత్తు భూలోకంలోపుట్టి, గత జన్మ స్ఫురణ వుంది, ఈ జన్మలోనైనా కైవల్యాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు.
భార్యాభర్తలిద్దరూ ఉదయాన్నే నిద్ర లేస్తారు. తలారా స్నానం చేస్తారు. వాళ్లతోపాటు టేప్ రికార్డర్ కూడా మేల్కొని సుప్రభాతాన్ని పాడుతుంటుంది.
వాళ్ళ ఇంట్లో అన్ని గదులకన్నా దేవుడి గదే పెద్దదిగానూ, శుభ్రంగానూ వుంటుంది.
స్నానం చేశాక పూజగదిని శుభ్రం చేస్తారు. దేవుడి బొమ్మలను కడుగుతారు. తరువాత వాటికి చందనం, కుంకుమ, పసుపులను రాస్తారు.
ఇక పూజ ప్రారంభమవుతుంది.
ఆరుగంటలకి మొదలైన పూజ ముగిసేటప్పటికి దాదాపు పది గంటలవుతుంది. ఉదయం టిఫిన్ లాంటిది తినరు. వారంలో ప్రతి రోజూనూ ఏదో దేవుడికి కేటాయిస్తారు. దాంతో ఉపవాసం.
ఆయన భార్య వంటచేస్తూ మధ్య మధ్యలో పురాణం వింటూవుంటుంది.
భోజనాలయ్యాక కాసేపు విశ్రమిస్తారు. అప్పుడు కూడా కళ్ళు మూసుకున్నా వాళ్ళ మనసులు మాత్రం దేవుడిముందు మేల్కొనే వుంటాయి. సాయంకాలం మళ్ళీ పూజ మొదలై రాత్రితో ముగుస్తుంది.
కేవలం పిల్లలకి జన్మనివ్వడానికే కోరిక అనేదాన్ని మనుషులకి ప్రసాదించాడు దేవుడు అని భావించే ఆ దంపతులు పడకటింట్లో కూడా ఆ మేరకే ప్రవర్తించేవాళ్ళు. ఇలాంటి వాతావరణంలో పెరిగింది ప్రవీణ. చిన్నప్పట్నుంచీ భక్తిని ఆమెలో ఇంజెక్టు చేయడానికి ప్రయత్నించారు తల్లిదండ్రులు. అందుకే ఆమె చదువుకంటే భక్తిలోనే ఎక్కువ మార్కులు సంపాదించింది. ఆమె యుక్తవయసుకు వచ్చింది. అప్పుడామె ఎనిమిదో తరగతి రెండోసారి చదువుతోంది.